close

రామయ తండ్రీ... ఓ రామయ తండ్రీ...

ఆధ్యాత్మికతకు మూలం ధర్మం. ఆ ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు. ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’... అంటూ భక్తజనం ఆయన దివ్యమోహనరూపాన్ని గుండెల్లో నింపుకుంటారు. ‘రామా కనవేమిరా...’ అని కీర్తిస్తూ గుడి కట్టి పూజిస్తుంటారు. అందుకే పల్లెపల్లెకో రామాలయం కనిపిస్తుంది. ఇంటింటా రామచంద్రుడి చిత్రపటం దర్శనమిస్తుంది. సీతాదేవితో ఆ జగదభిరాముడి కళ్యాణం జరిగిన శుభదినం ‘శ్రీరామ నవమి’ సందర్భంగా సీతారాములు కొలువైన విశిష్ట పుణ్యక్షేత్రాల్లో కొన్ని...


అదిగో భద్రాద్రి..!

‘రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే...’ అంటూ భక్తులు కొలిచే సీతారామచంద్రస్వామి కొలువైన ఆలయమే తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి రామాలయం. వనవాసంలో ఓ శిల మీద సీతారాములు సేదతీరగా అది హంసతూలికా తల్పాన్ని మరిపించేంత సౌఖ్యాన్ని ప్రసాదించిందట. దాంతో రాముడు ఆనందభరితుడై ‘ద్వాపరయుగంలో మేరుపర్వత కుమారుడివై జన్మించి, కలియుగంలో నన్ను శిరస్సున ధరిస్తావు’ అని వరమిచ్చాడట. అదే గోదావరీ నది ఒడ్డున ఉన్న భద్రాచలం. ఆ కొండమీద గుడి కట్టించమని కలలో కనిపించి రామయ్య చెప్పగా కంచర్ల గోపన్న కట్టించినదే భద్రాద్రి ఈ ఆలయం. శ్రీరామదాసుగా పేరొందిన గోపన్న 17వ శతాబ్దంలో కట్టించిన ఈ ఆలయానికి అరుదైన చరిత్ర ఉంది. భద్రాచలం తహశీల్దార్‌గా ఉన్న గోపన్న ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ ఖజానాని ఉపయోగించాడన్న కారణంతో కారాగారంలో పెట్టిస్తాడు తానీషా నవాబు. ఆయన భక్తికి మెచ్చిన ఆ రామచంద్రుడు ఆ సుల్తాన్‌కు కలలో కనిపించి గోపన్నను విడిపించాడనీ, రామలక్ష్మణులే మారురూపాల్లో వచ్చి సొమ్మును కట్టి విడిపించారనే కథలు ప్రచారంలో ఉన్నాయి. విష్ణుమూర్తిలా చతుర్భుజాలతోనూ ఒడిలో సీతమ్మతల్లితోనూ ఎడమవైపున లక్ష్మణుడితోనూ కొలువుదీరిన రామభద్రుడు ఇక్కడ మాత్రమే కనిపిస్తాడు. అరుదైన ఆ రూపాన్ని దర్శించుకునేందుకు నిత్యం ఎందరో భక్తులు వస్తుంటారు. ఇక, శ్రీరామనవమి రోజున జరిగే ఆ జగద్రక్షకుడి కల్యాణానికి ఇదే అతి పెద్ద వేదిక. ఇక్కడ జరిగే కల్యాణం త్రేతాయుగంలో సీతారాముల మనువును కళ్లముందు నిలుపుతుంది. మంగళవాద్యాలు మార్మోగుతుండగా వేదమంత్రాల మధ్య అభిజిత్‌ లగ్నం సమీపించగానే జీలకర్రాబెల్లాన్ని వధూవరుల తలమీద ఉంచుతారు. అత్తింటి, పుట్టింటి వాళ్లతోబాటు పితృవాత్సల్యంతో భక్తరామదాసు చేయించినదీ కలిపి మూడు మంగళసూత్రాలను సీతమ్మకు ధరింపజేయడం ఈ క్షేత్ర ప్రత్యేకత.


ఒంటిమిట్ట కోదండరామస్వామి..!

ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా ఒంటిమిట్టలో ఉన్న ఈ రామాలయం పురాతనమైనది. ఒకప్పుడు ఈ క్షేత్రాన్ని ఏకశిలా నగరంగా పిలిచేవారట. 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చోళ, విజయనగర శిల్పరీతుల్ని ప్రతిబింబిస్తూ సందర్శకుల్ని ఆకర్షిస్తుంటుంది.   అంగరంగ వైభవంగా జనకమహారాజు తలపించిన సీతారాముల కల్యాణానికి ముక్కోటి దేవతలూ బ్రహ్మరుద్రాదులూ హాజరైనా చంద్రుడెందుకో వెళ్లలేకపోతాడట. ఆ తరవాత ఆ కొత్త పెళ్లికొడుకుని కలిసి నేనెంత దురదృష్టవంతుడిని అని కన్నీళ్లు పెట్టుకోగా, చంద్రుడి కోరికను మన్నించి ఒంటిమిట్ట వేదికగా పండు వెన్నెల్లో మళ్లీ పెళ్లాడేందుకు అంగీకరించాడట ఆ భక్తవత్సలుడు. అందుకే అయోధ్యలో తప్ప మిగిలిన అన్ని క్షేత్రాల్లోనూ సీతారాముల కళ్యాణం పగలే జరుగుతుంది. కానీ ఒంటిమిట్టలో చంద్రుడి సాక్షిగా రాత్రివేళ నిర్వహిస్తుంటారు. ఉదయగిరిని పాలిస్తున్న కంపరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు- ఇక్కడ సీతారాములు సంచరించిన విషయం తెలుసుకుని ఈ ఆలయ నిర్మాణాన్ని సంకల్పించగా, తరవాత బుక్కరాయలు అక్కడున్న ఏకశిలలో సీతారామలక్ష్మణులను మలిచాడనేది చారిత్రక కథనం.


కుంభకోణం రామస్వామి!

ఘుకులసోముడిని సకుటుంబసమేతంగా చూడాలంటే తమిళనాడు, కుంభకోణంలోని రామస్వామి ఆలయానికి వెళ్లాల్సిందే. లక్ష్మణ, భరత, శతృఘ్న సోదరులూ, వీరభక్త హనుమతోనూ కొలువుదీరిన సీతారాములు దర్శనమిస్తారక్కడ. వేర్వేరుగా కాకుండా సీతారాములు ఒకే వేదికమీద కనిపించడం ఈ ఆలయ ప్రత్యేకత. మండపంలోని 64 స్తంభాలపైనా మూడు అంతస్తుల గోపురంమీదా రామాయణ ఘట్టాల్ని అత్యద్భుతంగా చెక్కడం ఈ ఆలయానికున్న మరో విశిష్టత. 16వ శతాబ్దంలో తంజావూరుని పాలించిన రఘునాథ నాయకర్‌ రామభక్తుడు. ఒకసారి ఆయన ధరాసురంలో చెరువును తవ్విస్తుండగా సీతారాముల విగ్రహాలు దొరకడంతో గుడిని కట్టించాడట. వనవాసం ముగించి అయోధ్యకు తిరిగివచ్చిన సందర్భంలో జరిగిన పట్టాభిషేక దృశ్యాన్ని తలపించేలా ప్రధాన ఆలయంలో సీతారాములు ఆసీనముద్రలోనూ, సోదరులు ముగ్గురూ నిలబడీ రామాయణ కావ్యాన్ని ఆలపిస్తున్న భంగిమలో హనుమా దర్శనమిస్తారు. కాబోయే వధూవరులు ఈ ఆలయాన్ని సందర్శించి తమ శుభలేఖను ఆ జానకీరాములకి సమర్పించి దీవించమని ప్రార్థిస్తారు. ఏకశిలా సాలగ్రామంతో చెక్కిన దేవతామూర్తుల్ని ఇక్కడ చూడొచ్చు.


ఓర్చా రాజారామ్‌!

రాముడు ఏలే రాజ్యం నేటికీ ఏదయినా ఉందీ అంటే అది మధ్యప్రదేశ్‌లోని ఓర్చా ప్రాంతమే. బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో బేత్వానది వంపు తిరిగినచోట ఏర్పడిన దీవిలోని చిన్న ఊరే ఓర్చా. ఇక్కడ ప్రధాన కోట పక్కనే ఉన్న రామరాజ మందిరంలోని దర్బారులో సీతా లక్ష్మణ సమేతంగా రాముడు కొలువుదీరతాడు. గుడిలో కాకుండా రాణీమహల్‌లో కొలువైన రాముడిని ఈ ప్రాంతానికి రాజుగా పూజిస్తారు. కుడిచేతిలో కత్తి, ఎడమచేతిలో డాలుతో పద్మాసనం వేసుకున్న భంగిమలో కొలువైన రాముడికి ఎడమవైపున సీతామాతా కుడివైపున లక్ష్మణుడూ పాదాలచెంత హనుమంతుడూ జాంబవంతుడూ కనిపిస్తారు. నిత్యం ఆయనకి భారత ప్రభుత్వం తరఫున మిలటరీ శాల్యూట్‌ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజా మధుకర్‌ షా కృష్ణ భక్తుడైతే, రాణి రామభక్తురాలు. ఒకసారి వాళ్లిద్దరి మధ్యా వాదోపవాదనలు జరిగి ‘రాముడే గొప్పవాడైతే బాలరాముడిని తీసుకురమ్మ’న్న భర్త సవాలుని స్వీకరించి అయోధ్యకు బయలుదేరి రాముడికోసం నిద్రాహారాలు మాని తపస్సు చేసిందట. ఎంతకీ దర్శనం కలగకపోవడంతో నదిలో దూకబోతుండగా బాలుడి రూపంలో రాముడు ప్రత్యక్షమైతే, ఓర్చాకు రమ్మని కోరిందట.‘వస్తాను కానీ వచ్చాక నేనే చక్రవర్తిని, ముందుగా నన్ను కూర్చోబెట్టిన స్థలం నుంచే పాలిస్తా’ అన్న షరతు విధించడంతో సరేనని వెంట తీసుకొచ్చిందట. అప్పటికే రాజు, రాముడికోసం చతుర్భుజ ఆలయం కట్టించాడు. అయితే ఉదయాన్నే రాముడిని అందులోకి తీసుకెళదామని విశ్రమించేందుకు తన మందిరంలోకి వెళ్లి, బాలరాముడిని అక్కడ కూర్చోబెట్టిందట రాణి. ముందు కూర్చున్న స్థలంలోనే రాముడు విగ్రహంగా మారిపోవడంతో ఎంత ప్రయత్నించినా కదల్చలేకపోయారట. అలా ఆ రాజ్యానికి రాముడే రాజయ్యాడు. అక్కడినుంచే రాజమర్యాదలు అందుకుంటున్నాడు. రాణీవాసమే రాజమందిరమైంది. ఇక్కడ రాజ్యమేలే రాముడి ఎడమకాలి బొటనవేలు దర్శనం అయితే కోరుకున్న కార్యం నెరవేరుతుందనేది భక్తుల విశ్వాసం.


నాసిక్‌ కాలారామ్‌!

గదానందకారకుడైన రాముడిది దివ్యమోహన రూపం. ఏ గుడిలో అయినా ఆయన విగ్రహం ఎంతో అందంగానే కనిపిస్తుంది. కానీ నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలోని కాలారామ్‌ ఆలయంలో సీతాలక్ష్మణ సమేతంగా కొలువైన రామచంద్రుడు నల్లని శిలతో దర్శనమిస్తాడు. అందుకే ఇక్కడి రాముణ్ణి కాలారామ్‌గా కొలుస్తారు. సర్దార్‌ రంగారావు ఒథేకర్‌ అనే వ్యక్తికి గోదావరి నదిలో రాముడి విగ్రహం ఉన్నట్లు కలలో కనిపించిందట. చిత్రంగా ఆయనకు కలలో ఎక్కడైతే కనిపించిందో అక్కడే ఆ విగ్రహం దొరకడంతో ఆయన దాన్ని ప్రతిష్ఠించి 1788 ప్రాంతంలో గుడి కట్టించాడట. ప్రధాన ద్వారం దగ్గర ఉన్న హనుమ కూడా ఇక్కడ కృష్ణవర్ణంలోనే కనిపిస్తాడు. ఇక్కడ ఉన్న పురాతన వృక్షం కింద దత్తాత్రేయుడు సంచరించాడనేందుకు ఆయన పాదాల గుర్తులు ఉంటాయి. సీతారాములు తమ పద్నాలుగేళ్ల వనవాసంలో భాగంగా రెండున్నర సంవత్సరాలపాటు గోదావరీ తీరంలోని నాసిక్‌ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్న అగస్త్యముని ఆశ్రమంలో నివసించారనీ ఆ సమయంలో సీతారామలక్ష్మణులు ఐదు చెట్లను నాటారనీ అదే నేటి పంచవటి అనీ చెబుతారు.


అయోధ్యా కనకభవన్‌

త్రేత, ద్వాపర, కలియుగాలతో కూడిన ముచ్చటైన ఇతిహాసం అయోధ్యా కనకభవన్‌ది. ఈ భవనాన్ని త్రేతాయుగంలో సీతాదేవి ముఖాన్ని చూసే సందర్భంలో పెళ్లికానుకగా కైకేయీ ఇచ్చిందట. అప్పటినుంచీ దీన్ని పునర్నిర్మించుకుంటూ వచ్చారనేది స్థలపురాణం. ద్వాపర యుగారంభానికి ముందు కుశుడూ ఆపై రిషభ దేవుడూ కట్టించారట. కృష్ణపరమాత్మ ఈ ఆలయాన్ని సందర్శించాడట. కలియుగంలో చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించగా, ఆ తరవాత సముద్రగుప్తుడు బాగు చేయించాడనీ; ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని ఓర్చా, టీకమ్‌గఢ్‌లను పాలించిన మహారాణి వృషభాను కున్వారీ కట్టించినట్లు తెలుస్తోంది. ఇందులో మూడు జోడీల సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి. పెద్ద విగ్రహాల్ని రాణీ కున్వారీ ప్రతిష్ఠించగా, మధ్యస్థ సైజువి విక్రమాదిత్యుడి కాలం నాటివనీ, చిన్నవి కృష్ణుడు ఈ స్థలంలోనే రామజపం చేసుకుంటున్న భక్తురాలికి సమర్పించినవనీ చెబుతారు. ఆమె మరణించేటప్పుడు వాటిని భూమిలో పాతగా, కలియుగారంభంలో విక్రమాదిత్యుడు గుడిని కట్టించేందుకు పునాదులు తవ్వుతుండగా అవి బయటపడ్డాయనీ అవి దొరికినచోటే ఈ మందిరాన్ని కట్టించి వాటితోబాటు మరో జంట విగ్రహాలనీ ప్రతిష్ఠించారనీ చెబుతారు. రాజస్థానీ కోటని పోలిన ఈ భవనం మీదా లోపలి ప్రాంగణంలోనూ తొలిసంధ్య కిరణాలూ, సాయంసంధ్యా కిరణాలూ పడుతూ అద్వితీయ శోభను చేకూర్చుతాయి. నిత్యం జరిగే పూజలూ నివేదనలతో సీతారాములకి ఇక్కడి నిత్యకల్యాణం పచ్చతోరణమే! ఇవేకాదు... వడువూరు శ్రీకోదండరామస్వామి, తీర్థహళ్లి కోదండరామ, రామేశ్వరం కోదండరామార్‌... ఇలా భారతావనిలో అడుగడుగునా రామాలయాలే... అందరినోటా ఆ శ్రీరామనామజపమే..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.