close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వర్షానికి వేద్దాం ఓ కోటు..!

‘చిటపట చినుకులు పడుతూ ఉంటే... చెలికాడే సరసన ఉంటే...’ అని పాడుకుంటూ వర్షంలో తడవడం ఎంత ఇష్టమైనా, ఆ తరవాత వచ్చే జలుబూ దగ్గూ జ్వరాల వల్ల రెయిన్‌కోటు అనేది నేటి తరానికి తప్పనిసరి యాక్సెసరీగా మారింది. అందుకే అది కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్లనీ సరికొత్త ఫీచర్లనీ సంతరించుకుని మరీ అందరినీ ఆకట్టుకుంటోంది.

రోజూ వేసుకునే డ్రెస్సులూ యాక్సెసరీలే కాదు, వానాకాలంలో వేసుకునే రెయిన్‌కోటయినా ఫ్యాషన్‌గానూ ట్రెండీగానూ ఉండాలనుకుంటోంది ఈతరం. వాళ్ల మనసుని గ్రహించే కాబోలు, ఆయా కంపెనీలూ రకరకాల రెయిన్‌కోట్లను రూపొందిస్తున్నాయి. అప్పట్లో మాదిరిగా ఏక రంగుల్లో సాదాసీదాగా కాకుండా భిన్న మోడల్స్‌లో వస్తూ అసలివి రెయిన్‌కోట్లేనా అనిపించేంత అందంగా ఉంటున్నాయి. అచ్చం కాటన్‌, శాటిన్‌, నైలాన్‌ ఫ్యాబ్రిక్కులతో కుట్టినట్లే పాంచోస్‌, ఫ్రాక్‌, లాంగ్‌ గౌను, షర్టు, ప్యాంటు, టాప్‌... ఇలా రకరకాలుగా కుట్టేస్తున్నారు.

ఆకాశంలో విరిసిన హరివిల్లు రంగుల్లోనూ; గడులు, పోల్కా చుక్కల డిజైన్లలోనూ రెయిన్‌ డ్రెస్సులు ఉంటున్నాయి. వానకోటు వేసుకుంటే లోపల డ్రెస్సు కనిపించడం లేదే అని బాధపడకుండా పూర్తి పారదర్శకంగా ఉండేవీ ఉంటున్నాయి. పైగా వీటిని వినూత్నమైన అవుట్‌ఫిట్‌లా కుట్టడంతో ఈ తరానికి తెగ నచ్చేస్తున్నాయి. పిల్లలకయితే చెప్పనే అక్కర్లేదు, అటు పెద్దవాళ్ల ఫ్యాషన్‌ డిజైన్లతోబాటు ఇటు డిస్నీ, కామిక్‌ కార్టూన్ల డిజైన్లతోనూ ఉంటూ రోజువారీ దుస్తులనే మరిపిస్తున్నాయి.

నిజానికి రెయిన్‌ కోటు అనేది పొలం పనులు చేసుకునేవాళ్ల నుంచే పుట్టిందని చెప్పాలి. అప్పట్లో గోనె సంచినో ప్లాస్టిక్‌ సంచినో లోపలకు మడిచి దాన్ని తలమీదుగా కప్పుకుని పొలం పనులకి వెళ్లేవారు. అయితే పంతొమ్మిదో శతాబ్దం తొలినాళ్లలో బ్రిటన్‌కు చెందిన చార్లెస్‌ మెకింతోష్‌ తొలిసారిగా విభిన్న పదార్థాలను మేళవించి నీటిని పీల్చని టార్పాలిన్‌ క్లాత్‌ను కనిపెట్టి, దానికి ఇండియన్‌ రబ్బర్‌ క్లాత్‌ అని పేరు పెట్టాడట. దాంతోనే తలమీదుగా కప్పుకునే రెయిన్‌కోట్లను డిజైన్‌ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చాడట. ఆ తరవాత చాలా కాలానికి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో- థామస్‌ బర్‌బెర్రీ రసాయన ప్రక్రియకు గురిచేసిన కాటన్‌ దారాలతోనే నీటిని పీల్చని గాబర్డీన్‌ అనే ఫ్యాబ్రిక్‌ రూపొందించాడు. క్రమంగా వస్త్ర ప్రపంచంలో వచ్చిన సాంకేతిక విజ్ఞానానికి ప్లాస్టిక్‌ ప్రభంజనం కూడా తోడై రంగురంగుల్లో రకరకాల ఫీచర్లతో ఉన్న రెయిన్‌ కోటు క్లాత్‌లు నేడు అందుబాటులోకి వచ్చి చిన్నా పెద్దా అందరినీ అలరిస్తున్నాయి..!


బంతిలో వానకోటు!

బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ రెయిన్‌కోటు వెంట ఉంచుకోవడం కుదరకపోవచ్చు. ఎంత తేలికపాటిది పెట్టుకున్నా అది ఎంతో కొంత స్థలం ఆక్రమిస్తుంది. కాబట్టి బ్యాగులో అదో అడ్డమని తీసేస్తుంటాం. కానీ వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికి తెలుసు... అందుకే ఈ బాల్‌ రెయిన్‌కోటు ఉంటే దీన్ని కీచెయిన్‌లా బ్యాగుకి తగిలించేసుకోవచ్చు. అత్యంత పలుచని చౌక రకం ప్లాస్టిక్‌తో తయారయ్యే ఈ కోటుల్ని ఒకసారి వాడిన తరవాత బయట పారేయడమే. అందుకే వీటి ధర కూడా చాలా తక్కువ. కాబట్టి ఇలాంటి ఓ నాలుగు బంతుల్ని బ్యాగుల్లో వేసుకుంటే, ఎప్పుడు వానొస్తుందోనని భయపడాల్సిన పనిలేకుండా బిందాస్‌గా ఉండొచ్చన్నమాట.


రెయిన్‌కోటు గొడుగు!

కొన్నిసార్లు మనం రెయిన్‌కోటు వేసుకున్నా దానిమీద నుంచి నీళ్లు కారుతూ చికాగ్గా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు కోటు వేసుకుని గొడుగు కూడా ఉంటే తడవకుండా ఉంటాం. కానీ అన్నివేళలా గొడుగు చేత్తో పట్టుకుని నడవడం కుదరదు. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూపొందించినవే ఈ కోటు టోపీలు. చూడ్డానికి ఫ్లయింగ్‌ సాసర్‌లా తల నుంచి భుజాల వరకూ ఉండే వీటిని పిల్లలూ పెద్దలూ వేసుకుని వానలోనూ హాయిగా నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు.


రెండు రకాలుగా...

ఈ తరం అమ్మాయిలైనా అబ్బాయిలైనా తినకుండా అయినా ఉంటారేమోగానీ ఫ్యాషన్స్‌ లేకుండా ఉండలేరు. అందుకే జీన్స్‌, లెదర్‌ జాకెట్స్‌లా కాలేజీలకీ ఆఫీసులకీ వేసుకెళ్లేలా పాలీయెస్టర్‌, లిక్రా వంటి ఫ్యాబ్రిక్కులతోనూ రెయిన్‌కోటులు వస్తున్నాయి. సాదాగా ఉండే వీటిని వేసుకోవడం బోరు అని కొందరంటే, బ్యాగులో పెట్టుకుని వెళ్లడానికీ బరువుగా ఫీలవుతారు మరికొందరు. వాళ్లకోసం వస్తున్నవే ఈ లిండి రివర్సిబుల్‌ రెయిన్‌కోట్స్‌. పైన శాటిన్‌ మెటీరియల్‌ డిజైన్‌తోనూ లోపల వాటర్‌ఫ్రూఫ్‌ పాలీ స్పాండెక్స్‌ ప్లెయిన్‌ మెటీరియల్‌ ఏకరంగులోనూ ఉంటుంది. కాబట్టి వర్షం లేనప్పుడు డ్రెస్‌మీద ఫ్యాషన్‌కోటులా వేసుకుని, వర్షం వస్తుందనుకోగానే తిప్పి రెయిన్‌కోటులా వేసేసుకోవచ్చు.


మ్యాచింగ్‌...  మ్యాచింగ్‌..!

పిల్లలైనా పెద్దలైనా మ్యాచింగ్‌ లేకుండా బయటకు వెళ్లని రోజులివి. అందుకేనేమో వర్షంలో నడిచేప్పుడు వేసుకునేవే అయినా రెయిన్‌కోట్లూ మ్యాచింగ్‌ సెట్స్‌లానే వస్తున్నాయి. వీటికి వాడే బూట్లూ టోపీలతోబాటు వాళ్లకు సంబంధించిన చిన్న వస్తువులు ఏవైనా వేసుకునే బ్యాగూ అన్నీ కలిపి సెట్‌ మాదిరిగా వస్తున్నాయి. వీటిల్లోనే కొన్ని రెయిన్‌కోట్లు- పిల్లలకయితే స్కూలు బ్యాగూ పెద్దవాళ్లకి బ్యాక్‌ ప్యాకూ పెట్టుకునే కవరుతో సహా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి రెయిన్‌కోటు ఒక్కటి ఉంటే చాలు... మనతోబాటు వస్తువులేమీ తడవకుండానే వెంట తీసుకెళ్లొచ్చు.


చీకట్లో వెలుగుతాయ్‌!

వర్షం వచ్చేటప్పుడు కరెంటు ఉండకపోవచ్చు. అప్పుడూ భయం లేకుండా వెళ్లేలా రాత్రివేళల్లోనూ వెలిగే రెయిన్‌కోట్లూ వచ్చేశాయి. వీటిల్లోనూ రకరకాలు ఉన్నాయి. పారదర్శకంగా ఉండే ఫ్లర్రీస్‌ ఎడ్జ్‌ రిఫ్లెక్టివ్‌ హుడెడ్‌ రెయిన్‌ కోటులకి అయితే అంచులు మాత్రమే కాంతిమంతంగా మారతాయి. ఫొటో ల్యూమినెసెంట్‌ ఫ్యాబ్రిక్‌తో తయారైన మరో రకం రెయిన్‌కోట్లు అయితే మొత్తం ఆకుపచ్చ రంగులో మెరుస్తూ దారి చూపిస్తాయి. దగ్గరకొస్తే షాక్‌ కొడుతుందేమో అన్న భయంతో ఎవరూ దగ్గరకూ రారు. కాబట్టి ఇవి వేసుకుంటే నిశ్చింతగా వెళ్ళొచ్చన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు