close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అమెరికా వెళ్తుంటే... అమ్మ రూ.250 ఇచ్చింది!

ప్రభుత్వాలు చేయాల్సిన పనిని తానొక్కడే చేశారు ఎన్నారై పారిశ్రామికవేత్త రవి పులి! కరోనా లాక్‌డౌన్‌ తర్వాత అటు అమెరికాలోనూ ఉండలేక ఇటు ఇండియాకీ రాలేక అలమటిస్తున్న 250 మంది భారతీయుల్ని ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కి పంపించారాయన. రవి పుట్టిపెరిగింది తెలంగాణలోని ఓ అడవి అంచు పల్లెలో. అలాంటి వ్యక్తి అమెరికాలో ఇంతటి పరపతిగల ప్రముఖుడిగా మారిన క్రమం... యువతకి ఓ స్ఫూర్తిపాఠం. అది ఆయన మాటల్లోనే...

తెలంగాణ ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్‌ అనే గ్రామం మాది. అదో రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం. ఇప్పటికీ అక్కడికి 3జీ నెట్‌వర్క్‌ అందదు కాబట్టి... స్మార్ట్‌ఫోన్‌లు సరిగ్గా పనిచేయవు. అమెరికాలో నా దగ్గర ఎంత అత్యాధునిక ఫోన్‌లున్నా మా అమ్మతో వీడియో కాల్‌ మాట్లాడటానికి వీల్లేదు. మామూలు ఫోన్‌లతో మాట్లాడటమే. అలా ఏప్రిల్‌ 3న అమ్మ నుంచి నాకు కాల్‌ వచ్చింది. ఫోన్‌ తీయగానే అటు వైపు నుంచి ఏడుపు... ‘నువ్విక్కడికి వచ్చెయ్‌ బిడ్డా..!’ అని. మా అమ్మ బుచ్చమ్మకి ఎనభయ్యేళ్లు. అప్పటికే అమెరికాలో కరోనా మరణాలు పెరుగుతున్న వార్తలు విని భయపడి ఆమె అలా ఫోన్‌ చేసింది. మాకే సమస్యా లేదన్నా విన్లేదు. పైగా మా పట్ల ఆందోళనతో ఆమె బీపీ పెరిగిపోయి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అమ్మ ఆరోగ్యం ఎలా ఉందోననే దిగులుతో ఉండగానే దినకర్‌ అనే అబ్బాయి బంధువులు ఫోన్‌ చేశారు. తను ఇక్కడ ఏదో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసమని వచ్చాడు... కానీ అతని వీసా పేపర్లలో ఏదో సమస్య ఉండటంతో అధికారులు వెనక్కి పంపించాలనుకున్నారు. ఈలోపు లాక్‌డౌన్‌ వచ్చింది. దాంతో అతణ్ణి నిర్బంధ కేంద్రం (డిటెన్షన్‌ సెంటర్‌)లో ఉంచారు. నా గురించి విని బంధువులు సాయం చేయమని అడిగారు. సరిగ్గా అప్పుడే ఎవరెస్టు ఎక్కిన తెలుగమ్మాయి మలావత్‌ పూర్ణ ఇక్కడ స్టూడెంట్‌ ఎక్స్ఛేంజి ప్రోగ్రామ్‌ కింద వచ్చి చిక్కుకుపోయింది. వాళ్ల పరిస్థితి విన్నాక నాకు ఒక్కటే అనిపించింది... అమెరికాలో పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డ నా విషయంలోనే మా అమ్మ అంత కంగారు పడితే, కాలం చెల్లిన వీసాతో ఇక్కడుంటున్న ఈ పిల్లల తల్లుల ఆందోళన ఎంతగా ఉంటుందీ అని! వెంటనే నాకున్న పరిచయాల ద్వారా వాళ్లతోపాటూ ఎలాగోలా భారత్‌ ఫ్లైట్‌ ఎక్కించాను. ఈ విషయం తెలిసి ఎంతోమంది నన్ను సంప్రదించడం మొదలుపెట్టారు. అలాంటివాళ్ల కోసమే యూఎస్‌-ఇండియా సాలిడారిటీ మిషన్‌(యూఎస్‌ఐఎస్‌ఎం) అనే సంస్థని ఏర్పాటుచేశాను. భారత్‌కి వెళ్లాలనుకునే వాళ్లందరూ ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదుచేసుకోవాలని చెప్పాను. వాళ్లలో చట్టరీత్యా పెద్దగా సమస్యలు లేనివాళ్లని ఎంపిక చేసి... అందులో నుంచి 250 మందిని భారత్‌కి పంపించే ఏర్పాట్లలో దిగాను. ఆ పని నేను అనుకున్నదానికంటే క్లిష్టంగా అనిపించింది. అమెరికా, భారతదేశాలకి చెందిన రాయబార కార్యాలయాలూ, విదేశీ వ్యవహారాల శాఖ, విమానయాన శాఖలతో సంప్రదిస్తూ ప్రతి ప్రయాణికుడికీ అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. పైగా, ఈ ప్రయాణికుల కోసం ఖతార్‌ ఎయిర్‌వేస్‌ని బుక్‌ చేశాను కాబట్టి... అక్కడి రాయబార కార్యాలయం సాయంతో ప్రభుత్వం దగ్గరా అనుమతులు తీసుకున్నాము. ఈ పనులన్నింటికీ ఇరవై రోజులు పట్టింది. ఇందుకోసం నేనూ, నా సంస్థ ఉద్యోగులూ, నా భార్య మమతా, నా పిల్లలూ అందరం కలిసి రోజూ 18 గంటలు పనిచేయాల్సి వచ్చింది. 21వ రోజు 250 మంది మూడు ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కి ప్రయాణమయ్యారు.

అప్పటికి ఇండియాలోని అమ్మ కూడా కోలుకోవడంతో నేనూ ఉత్సాహంగానే ఉన్నాను. ఫ్లైట్‌ ఎక్కిన యువతీయువకులందరూ ‘ప్రభుత్వాలు చేయాల్సిన పనిని మీరొక్కరే ఎంతో పట్టుదలతో చేయగలిగారు... మీరో గో-గెటర్‌!’ అంటుంటే అలసటంతా మాయమై కొత్త ఉత్సాహం వచ్చింది. ‘గో-గెటర్‌’ అన్న పదం ఎన్నో జ్ఞాపకాలని నా కళ్లముందు పరిచింది...

నేనూ అలా కాకూడదని...
అప్పుడు నాకు తొమ్మిదేళ్లుంటాయి. ఆ రోజు మా రెండో అన్నయ్యకి పెళ్ళి జరుగుతోంది. ఆయన బోరుమని ఏడుస్తున్నాడు. తొమ్మిదో తరగతి చదువుతున్నవాడికి బలవంతంగా పెళ్ళి చేస్తున్నారు. ఆయన ‘నాకు పెళ్లొద్దు, చదువుకుంటా...’ అంటున్నా వినకుండా నాన్న ఆయన్ని పెళ్ళిపీటలు ఎక్కిస్తున్నాడు. మా అన్నయ్య ఏడుపు చాలా రోజులుదాకా నాకు గుర్తుండిపోయింది. బహుశా- నేను అన్నయ్యలా కాకుండా ఎలాగైనా చదువుకుని తీరాలనే పట్టుదలకి ఆ సంఘటనే కారణమై ఉండొచ్చు. మా అమ్మానాన్నలకి మేం 13 మంది సంతానం. వారిలో నేను పదోవాణ్ణి. నాన్న కల్లుగీత కార్మికుడు. కానీ దాంతోపాటూ ఆయన పదిహేను ఎకరాలకు సొంతదారు కూడా. వ్యవసాయమంటే ఎనలేని ప్రీతి ఆయనకి. మగపిల్లలమంతా ఇంటిపట్టునే ఉండి వ్యవసాయం చూసుకోవాలన్నది ఆయన ఆశ! అంతేకాదు పైచదువులు మమ్మల్ని చెడుదార్లు తొక్కిస్తాయని బలంగా నమ్మేవాడు. దాని ఫలితమే మా రెండో అన్నయ్య బాల్య వివాహం! నాకూ అన్నయ్యలాగే బాగా చదువుకోవాలని ఉండేది. మా ఊర్లో ఏడో తరగతి వరకే ఉండేది. ఎనిమిదో తరగతికి వరంగల్‌లో ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదివాను. అప్పటి నుంచే ఖాళీ సమయంలో వరంగల్‌లోని షాపుల్లో పనిచేసి నా ఖర్చులకి సంపాదించుకునేవాణ్ణి. అలా చేస్తున్నా... ఎనిమిదో తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించి కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రైజు తీసుకున్నాను! మా రెండో అన్నయ్యని తొమ్మిదో తరగతి దాకా చదివించిన నాన్న నేను పదో తరగతి పరీక్ష రాసేదాకా ఏమీ అనలేదు. కానీ రిజల్ట్‌ వచ్చీరాగానే ‘చదివిందిక చాలు, రేపట్నుంచి పొలంలోకి  వచ్చెయ్‌!’ అన్నాడు. కాదంటే నాకూ ఎక్కడ పెళ్ళి చేస్తారోనని పొలం బాట పట్టాను. కాయకష్టం నాకేమీ కొత్త కాదు కానీ మనసంతా చదువుపైనే ఉండేది. నాలుగు నెలల తర్వాత జూనియర్‌ కాలేజీలు తెరిచారు. మిత్రులందరూ ‘నువ్వు చదువుకోవట్లేదా!’ అని ఉత్తరాలు రాస్తుంటే బాధతో గుండె బరువెక్కేది. నా బాధని ఎవరూ అర్థంచేసుకోలేదు... ఒక్క అమ్మ తప్ప. అమ్మ ఓ రోజు సాయంత్రం నన్ను పిలిచి, తను దాచుకున్న డబ్బులిచ్చి ‘నువ్వెళ్లి చదువుకోరా... నాన్నతో నేను చెప్పుకుంటాలే!’ అంది. ఆ రోజు వేకువనే సర్టిఫికెట్లు తీసుకుని బస్సెక్కాను.

కొత్త ప్రపంచం...
మాకు దగ్గరగా ఉన్న గోవిందరావుపేట కాలేజీలో ఇంటర్‌ సీఈసీ గ్రూపులో చేరాను. అప్పటి నుంచి జీవితాన్ని పూర్తిగా నా చేతుల్లోకి తీసుకోవాలనుకున్నాను. చిన్న తరగతుల వాళ్లకి ఉదయం ఇంగ్లిషు ట్యూషన్‌లు చెప్పడం మొదలుపెట్టాను. దాంతో చేతిలో డబ్బులాడటం మొదలైంది. ఇంటర్‌ ముగించేనాటికి నా ట్యూషన్‌లకి మంచి పేరొచ్చింది. ఈ ట్యూషన్‌లకి అంతరాయం కాకూడదనే వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ ఈవెనింగ్‌ కాలేజీలోనే డిగ్రీలో చేరాను. ఆ డిగ్రీ చేతిలోకి వచ్చే సరికే పూర్తిస్థాయి ఎంట్రప్రెన్యూర్‌ని అయిపోయాను! వరంగల్‌, కరీంనగర్‌లలో కూడా ట్యుటోరియల్స్‌ ఏర్పాటుచేశాను. అలాగే కొనసాగి ఉంటే జీవితం ఎటుపోయేదో తెలియదుకానీ... అప్పుడప్పుడే వస్తున్న కంప్యూటర్లు నా దృష్టిని ఆకర్షించాయి. 1991 ప్రాంతం అది. అప్పుడప్పుడే మన దేశంలో ఐటీ రంగం మొగ్గతొడుగుతోంది. అక్కడ ఏ కొంత శ్రమించినా అద్భుతమైన ఫలితాలొస్తాయని ఊహించాను. హైదరాబాద్‌లో కంప్యూటర్‌ డిప్లొమా కోర్సులో జాయిన్‌ అయ్యాను. నెలకి 20 వేల అద్దెకు కంప్యూటర్‌ తీసుకున్నాను! రెండేళ్లలోనే మంచి ప్రోగ్రామర్‌ని అయ్యాను. అదయ్యాక... నా దృష్టి అమెరికా వైపు మళ్లింది. అప్పట్లో అగ్రదేశానికి సాఫ్ట్‌వేర్‌ నిపుణుల అవసరం బాగా ఉండేది కాబట్టి వర్కింగ్‌ వీసా దొరకడం పెద్ద కష్టం కాదు. డిగ్రీల కన్నా పని తెలిస్తే చాలనుకునేవారు. అలా నన్నో అమెరికన్‌ టెలికమ్యూనికేషన్స్‌ సంస్థ ఉద్యోగానికి రమ్మంది. నేను అమెరికాకి ఫ్లైట్‌ ఎక్కేటప్పుడు నా దగ్గర రెండు వందల డాలర్లూ... 250 రూపాయలూ ఉన్నాయి. ఆ రెండొందల డాలర్లు నా స్నేహితుడి దగ్గర అప్పుగా తీసుకున్నవైతే రూ. 250 అమ్మ ఇచ్చినవి. ‘అమెరికా చాలా దూరమంట కదా... ఖర్చులకి ఇది ఉంచు’ అంటూ ఆ డబ్బులిచ్చింది అమ్మ అమాయకంగా!

సంక్షోభంలోనూ ముందుకు...
ఈ డాలర్‌ దేశానికి వచ్చి ఉద్యోగంలో కుదురుకున్న మొదటి నెల నుంచే ఇక్కడ ఉద్యోగాలు రాక, వచ్చిన కొలువు పోగొట్టుకునీ అలమటిస్తున్న వాళ్లపైన దృష్టిపెట్టాను. వాళ్లకి ఇంటర్వ్యూలని ఫేస్‌ చేయడం, ప్రోగ్రామింగ్‌లో మరింతగా మెరుగులు దిద్దుకోవడం, ఆఫీస్‌ ఎటికెట్‌పైన ఉచితంగా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. ఐదేళ్లలో వందలమందిని అలా తీర్చిదిద్దాను. ఇది అమెరికావ్యాప్తంగా నాకు బలమైన నెట్‌ వర్క్‌ని పెంచింది. మరోవైపు ఉద్యోగంలోనూ ఎంత క్లిష్టమైన పనినైనా, పరిస్థితినైనా ఎదుర్కొనే తత్వం వల్ల ‘గో-గెటర్‌’గా పేరుతెచ్చుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసంతోనే 2002లో ‘ఇంటర్నేషనల్‌ సొల్యూషన్స్‌ గ్రూప్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ సంస్థని ఏర్పాటు చేశాను. కాకపోతే ఆ తర్వాతి ఏడాదే అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అందరూ ‘ఐటీ బెలూన్‌ పేలిపోయింది’ అనడం మొదలుపెట్టారు. అయినా నేనేమీ భయపడలేదు. భారత్‌, అమెరికాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలకి కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ల తయారీ మొదలు పెట్టాను. అలా మా సంస్థ నాలుగేళ్లు తిరిగేసరికే కోటి డాలర్ల టర్నోవర్‌ సాధించింది.

అమెరికాలో వేగంగా వృద్ధి చెందుతున్న 50 కంపెనీల్లో ఒకటిగా నిలిచి... నాస్డాక్‌(అక్కడి స్టాక్‌ ఎక్ఛేంజి) ద్వారా ప్రత్యేక గౌరవం అందుకుంది. అంతేకాదు వరసగా రెండేళ్లు ప్రతిష్ఠాత్మక ఇంక్‌ పత్రిక అవార్డూ సొంతం చేసుకుంది. మాజీ అధ్యక్షుడు క్లింటన్‌ నుంచి అందుకున్నా వాటిని!

ఇవాంకతో కలిసి ఇండియాకి...
2011లో అమెరికాలోని మేరీల్యాండ్‌ రాష్ట్ర గవర్నర్‌ మార్టిన్‌ ఒమాలి భారత్‌లో పెట్టుబడులకి సంబంధించి పర్యటిస్తూ తన ప్రతినిధుల బృందంలో(డెలిగేషన్‌) నన్నూ చేర్చుకున్నారు. ఆయనతోపాటూ ఇండియా వచ్చి నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొన్నాను. అప్పటి నుంచి అమెరికాలోని డెమోక్రాట్‌, రిపబ్లికన్‌ నేతలతో ప్రవాస భారతీయుల బిజినెస్‌ సమావేశాలు ఏర్పాటుచేస్తున్నాను. అలా నాటి అధ్యక్షులు బుష్‌, ఒబామాలతోనూ సమావేశమయ్యాను. 2018లో హైదరాబాద్‌లో జరిగిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సదుస్సుకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌ బృందంలో సభ్యుడిగా భారత్‌ వచ్చాను. అప్పుడే ఇక్కడి కేంద్ర, తెలుగు రాష్ట్రప్రభుత్వాల పెద్దలూ, ఉన్నతాధికారులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాలతోనే తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారులు ఎవరు అమెరికాకి వస్తున్నా నేను ఇక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ ఏర్పాటుచేస్తుంటాను. అమెరికాలో ఇబ్బందులు పడుతున్న 250 మందిని హైదరాబాద్‌కి పంపించడంలో ఈ పరిచయాలూ ఎంతో ఉపయోగపడ్డాయి!

ఆ మధ్య ఇండియా నుంచి ఓ కస్టమ్స్‌ ఆఫీసు నుంచి నాకు ఫోను వచ్చింది. అటువైపు ఓ అధికారి మాట్లాడుతున్నాడగానే నేను గౌరవంతో ‘చెప్పండి సార్‌...!’ అన్నాను. కానీ అతనేమో ‘రవి అన్నా! నాది నీ ఊరే. పేరు కరుణాకర్‌... నీకు నేను తెలియదుకానీ నా చిన్నప్పుడు నిన్ను చూస్తూ ఉండేవాణ్ని. నువ్వు చదువుకుని పెద్దవాడివై అమెరికా వెళ్లడం నాకు చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. సివిల్స్‌ రాసి ఇప్పుడు కస్టమ్స్‌ అధికారినయ్యాను!’ అని చెప్పుకుంటూ పోయాడు. అతనితో మాట్లాడి పెట్టేశాక నాకు ఆనందంతో కన్నీళ్లొచ్చేశాయి. నాన్నకి ఇష్టంలేకున్నా నేను వేసిన ఒక్క ముందడుగు ఎంత మందికి స్ఫూర్తినిచ్చిందో అని..! అంతేకాదు, నా తర్వాత మా అన్నయ్యా, అక్కయ్యల పిల్లలందరూ చక్కగా చదువుకున్నారు. అందరూ కలిసి పాతికమంది గ్రాడ్యుయేట్‌లయ్యారు. కచ్చితంగా ఇదంతా నా గొప్పతనం కాదు... చదువుల తల్లి మహత్తు అంతే!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.