close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మునిమాపు

- వలివేటి నాగ చంద్రావతి

‘‘ఎలా ఉంది జీవితం?’’ చిరుమంద హాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రంగారు- చేతిలోని గునపం పక్కన పెడుతూ.
‘‘ఊ... బాగానే ఉంది. మీరు చెప్పినట్టు ప్రశాంతంగా-’’ కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రంగారు మొక్కలకు గొప్పులు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్లు సరిచేస్తూ ఉంది సీతమ్మ.
మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్లి ఐరన్‌ బెంచీమీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రంగారు. పొన్నచెట్టు కింద వేసిన ఆ బెంచీ అంటే ఆయనకు చాలా ఇష్టం.
‘‘బాగానే ఉంది. అని నువ్వు సాగదియ్యడం లోనే తెలుస్తోంది నీ సందిగ్ధం.’’
‘‘అవును మీరు చెప్పిందీ, అమలు చేసిందీ సరైనదో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేక పోతున్నాను. కాకపోతే నాధర్మం మీ వెంటే ఉండడం కనక వచ్చేశాను, అంతే.’’
‘కల్లాకపటం లేదు సీతమ్మకి. ఉన్నదున్నట్టు చెప్పేస్తుంది’ నిట్టూర్చారు రామచంద్రంగారు.
చేతులు బకెట్లో ముంచి కడుక్కుని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళుతోన్న సీతమ్మని చూస్తూ, ‘తొందర పడ్డానా!’ అనుకున్నారు రామచంద్రంగారు సాలోచనగా భ్రుకుటి ముడిచి.

* * *

రామచంద్రంగారు ఉద్యోగ విరమణ చేసేవేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారు. ‘‘రిటైరయ్యారుకదా, ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్నా’’ అన్నారు అభిమానంగా. ‘‘పెద్దదిక్కుగా ఉంటారు రండి అత్తయ్యా’’ అన్నారు కోడళ్లు కూడా.
దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్లు కోరుకున్నది అదే.
తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తామూ, పిల్లలూ వాళ్ల చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం పడనేలేదు. ఇప్పుడా బాదర బందీలూ బాధ్యతలూ తీరిపోయాయి. గడియారంతోపాటూ పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్లు వండిపెడుతోంటే మనుమలూ మనవరాళ్లతో ఆడుకుంటూ, కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ, మఠానికో ఆలయానికో వెళ్లి ప్రవచనాలు వింటూ ఆరాముగా కాలక్షేపం చెయ్యొచ్చుననుకుంటూ... సంతోషంగా ఆమోదించింది సీతమ్మ.
‘సరే ఇది ఇంకో మజిలీ’’ వస్తామన్నారు రామచంద్రంగారు.

* * *

పెద్దవాడు చైతన్య ఇంజనీరు. కోడలు కౌముది కూడా సాప్ట్‌వేరే. వాళ్లిద్దరూ వాళ్లకిద్దరూ, ముచ్చటయిన ఫ్యామిలీ.
వెళ్లిన మొదటిరోజే డైనింగ్‌టేబుల్‌ దగ్గర చైతన్య, ‘‘అమ్మయ్యా, ఇవ్వాళతో నీ చప్పిడి వంటకీ, చద్ది కూరలకీ గుడ్‌బై. రేపట్నుంచీ మా అమ్మ చేతి అమృతం తినొచ్చు’’ కొంటెగా భార్యవైపు చూసి అన్నాడు.
‘‘మీరే ఏమిటీ, మేమూనూ’’, భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది.
‘వచ్చీరాగానే చార్జి అప్పగింతలా...’ తెల్లమొహం వేసి భర్తవంక చూసింది సీతమ్మ.
‘సంబాళించుకో’ అన్నట్లు తల పంకించారు రామచంద్రం. ఆ తర్వాత చాటుగా భార్యకి నచ్చచెప్పారు...
‘‘ఇరవై నాలుగ్గంటలూ ఏపనీ లేకుండా కూర్చోగలవా-
నీకు మాత్రం విసుగెత్తదూ. పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి. కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది.
ఆ మాత్రపు వంట నీకు కొత్తకాదుగా. ఆ తర్వాతంతా ఖాళీయే.
ఏం చేసుకున్నా నీ ఇష్టం’’ అని.
అయిష్టంగానే తలూపింది సీతమ్మ.
మర్నాడు అత్తగారికి షెడ్యూలు చెప్పేసింది కౌముది. ఇప్పటిదాకా బ్రేక్‌ఫాస్ట్‌ బ్రెడ్డూ, బటరూనట. ‘‘మీకోసమెలాగూ టిఫిన్‌ చేస్తారుగా అదే మాకూ పెట్టేయండి పరవాలేదు’’ అంది ఉదారంగా. తొమ్మిదింటికల్లా పిల్లలకు కాలేజీ, ఆ వేళకి బాక్సులు సర్దాలి. పన్నెండింటికి తమ ఇద్దరికీ క్యారియరు.
‘‘మీరేం కంగారు పడకండత్తయ్యా, మేము వెళ్లేటప్పుడు క్యారియరు అందించటం మీకు కష్టమవుతుందని క్యారియరు తీసుకురావటానికొక కుర్రాడిని మాట్లాడారు. పన్నెండింటికి వస్తాడతను. ఇక సాయంత్రం అందరికీ టీ, స్నాక్స్‌. మీకు తెలిసిందే కదా. రాత్రి వంటకి నేనుకూడా సాయం చేస్తాలెండి’’ అని లిస్టంతా చెప్పేసి, ‘‘మీకు చేయాలనిపిస్తేనే సుమండీ, బలవంతంలేదు, నాకలవాటే’’ చివర్లో ముక్తాయింపు.
‘‘పరవాలేదమ్మా, చేయగలను’’ అని పైకని, ‘చేయక చస్తానా’ అనుకుంది లోపల సీతమ్మ.
రాత్రి వంటకి సాయం చేస్తానని చెప్పిందేకానీ వారంలో నాలుగురోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీసునుంచి ఫోన్‌ చేసేది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యమవుతుందని రాత్రి వంటపని కూడా తనమీదే వేసుకుంది సీతమ్మ.
పదిరోజులు గడిచాయి. ఇంటికి పాతబడ్డారు. చైతన్య దగ్గర్లో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌కీ, గణపతి దేవాలయానికీ అమ్మానాన్నల్ని తీసుకెళ్లి చూపించాడు.
‘‘మనకి దగ్గర్లో ఉన్న గుళ్లు ఇవే. రోజూ ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయ్‌. సాయంత్రం మీరిక్కడికొచ్చి కాలక్షేపం చెయ్యొచ్చును’’ అని చెప్పాడు. ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు. రెండురోజులు అలా వెళ్లి వచ్చారు కూడా.
మూడోరోజు ఆఫీసుకు వెళుతూ, ‘‘రోజూ బిస్కట్లూ కారప్పూసేనా అని పిల్లలు గొడవచేస్తున్నారత్తయ్యా’’ కాస్త వేడిగా వాళ్లకి ఏదైనా చేసిపెట్టి వెళుతుండండి. సాయంత్రం అలిసిపోయొచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటోంది. మీకు వీలయితే మాకు టీ, వాళ్లకి పాలూ ప్లాస్కులో పోసి ఉంచండి ప్లీజ్‌’’ అని చెప్పింది కౌముది.
వినేవాళ్లకి సౌమ్యంగానే అనిపించినా సీతమ్మకి అధికారంగానో నిష్టూరంగానో వినిపించి కంగుతిన్నది. సాయంత్రాలు టిఫిన్లూ, రాత్రి వంట... ఈ మధ్యలో మిగిలే టైమెంతని?
ఆరోజు నుంచి భర్తతోపాటు గుడికి వెళ్లడం మానేసింది సీతమ్మ. ‘‘నాకు పని అవలేదు మీరు వెళ్లిరండి’’ అంది ఉదాసీనంగా.
రామచంద్రంగారికి అర్థమయింది- కిందటిరోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడ్డంకంటే ఈజీ చెయిర్లో వాలి చూడ్డమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామానుల్తోపాటూ స్టోర్‌రూమ్‌లో పడేసిన తమ పాత పడక్కుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు. తన మనుమడు సార్వభౌమ కాలేజీకి వెళుతూ, ‘‘ఈ కాస్ట్‌లీ సోఫాసెట్‌ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటీ దిష్టిబొమ్మలా’’ అంటున్నాడు ముఖం చిట్లించి, ‘‘ఉష్షు, ఉష్షు’’ అంటోంది కౌముది. ‘‘తాతగారిదా? సారీ సారీ’’ అంటూ వెళ్లిపోయాడు వాడు. ఆ సారీ అనటంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రంగారికి. కామ్‌గా పడక్కుర్చీ తీసుకెళ్లి స్టోర్‌రూములో పడేసి వచ్చారు.
‘అలాంటి అనుభవమే భార్యకీ కలిగి ఉండొచ్చును’ అనుకుంటూ నిట్టూర్చారు.
వచ్చిన కొత్తలో ‘‘తెలుగు పేపరు తెప్పించు చైతూ అది నాకు అలవాటు’’ అన్నారు చైతన్యతో. ‘‘రెండు పేపర్లా? వేస్ట్‌ కదా నాన్నా. అయినా ఇంగ్లీషురాని వాళ్లలా తెలుగు పేపరేమిటీ!’’ అన్నాడు వేళాకోళంగా. ఆ సంగతి మళ్లీ ఎత్తలేదు.
ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు. వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి.

* * *

మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటకు వెళ్లడం ప్రారంభించారు. ‘‘ఫ్రెండు ఇంట్లో ఫంక్షను, మేము వెళితే మీరు ఉండగలరా నాన్నా?’’ అడిగాడు చైతన్య మొదటిసారి. ‘‘ఆహా’’ అన్నారు రామచంద్రంగారు. కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్లేవారు. కొన్ని పార్టీలకి భార్యా భర్తలిద్దరే వెళ్లేవారు.
నలుగురూ వెళ్లిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కుబిక్కుమనిపించేది. అది ఓ పెద్ద గేటెడ్‌ కమ్యూనిటీ. సిక్త్సుఫ్లోరు వీళ్లది. కలగూరగంపలా మనరాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలవాళ్లూ కాపురమున్నారు. ఎవరిదారి వాళ్లది. ఏదో ఒక టైములో తప్ప మనిషి మొహం కనిపించడమే అరుదు. ఇక పొద్దుగూకితే కారిడారులో వేసే లైట్ల వెలుతురు తప్ప, మిగతా అంతా జీబురు మంటూ ఉండేది. వెళ్లినవాళ్లు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్లు.
పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్లు చేసే అల్లరికి అంతు ఉండేదికాదు. ఫ్రెండ్స్‌ని పిలిచే వాళ్లు. ఇక వాళ్లంతా కలిసి, మ్యూజిక్‌ స్టెప్పులూ,  పెద్దపెద్దగా నవ్వులూ. మధ్య మధ్య ఎనర్జీ కోసం, ‘నానీ మాకవి వేయించిపెట్టూ’’ లేదా ‘‘ఫలానా ఐటమ్‌ చేసి పెట్టవూ’’ అంటూ అర్థిస్తున్నట్టే ఆర్డర్లు. ఒక్కోరోజు డిన్నరు కూడా.
హైరానా పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురుచూసేది.
స్టీరియో మోతకి తలనొప్పి వస్తున్నా, చెవుల్లో దూది పెట్టుకుని కూర్చునిగూడా, ‘‘సందడిగా ఉంది కదూ’’ అనేవారు రామచంద్రంగారు చిరునవ్వుతో.
‘‘ఆ దూది తీసి వినండి అది సందడో గోలో తెలుస్తుంది’’ విసుక్కునేది సీతమ్మ.
‘‘ఏరుకి వరదొచ్చినప్పుడే ఉరవళ్లూ పరవళ్లూ. ఆ వయసుకి ఆ ఉత్సాహం, తుళ్లింతలూ సహజం అదే అందం.’’
‘‘మరి ఆ వయసుకి మనమలాగే ఉన్నామా?’’ మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ.
‘‘ఆ రోజులు వేరు కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి’’
‘‘హ్హు, మీరెప్పుడూ నాకే చెబుతారులెండి ధర్మపన్నాలు’’ మొహం ముడిచింది సీతమ్మ.

* * *

ఆ రోజెందుకో లేచిన దగ్గర్నుంచీ, కాగే నూనెలో వేసిన ఆవగింజల్లాగ చిటపటలాడుతోంది కౌముది. తడి టవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడిమీద ధుమధుమలాడింది. ఖర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీకోసం బోర్డుమీదున్న స్విచ్‌ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కరు స్విచ్‌ నొక్కేసింది. గయ్యిమన్నది కౌముది. ‘‘మీకు వందసార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని. ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కరు పేలిపోయేది. మొన్న మేజాబల్ల తుడుస్తూ ‘వాటర్‌ ఫాల్స్‌ షోపీసు’ పగల గొట్టారు. నిన్న ఐరన్‌బాక్స్‌ ముట్టుకున్నారు- అది పనిచేయడం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేంటి? మీరు తెచ్చుకున్నారుగా - ఆ రోలూ రోకలిబండానూ’’ కోడలు కురిపించే వడగళ్ల వానకి బిత్తరపోయి నుంచుండి పోయింది సీతమ్మ.
ఆ తర్వాత చైతన్య వచ్చాడు. ‘‘అమ్మా, ఆఫీసులో ఏవో గొడవలు. ఆ చికాకులో ఏదో వాగేసింది. చూశావుగా పొద్దున్న పనిమనిషిని కూడా ఎలా తిట్టేసిందో. అది అంతే నువ్వేం మనసులో పెట్టుకోకు’’ అని తల్లికి సంజాయిషీ ఇచ్చాడు. ‘అంటే పనిమనిషీ తనూ సమానమా!’ సీతమ్మ మథన పడింది.
భర్త తరిమేడో తనకే అనిపించిందోకానీ, కౌముది కూడా వచ్చి, ‘‘సారీ అత్తయ్యా కోపం ఆపుకోలేకపోయాను’’ అని పాఠం ఒప్పజెప్పింది.
ఆ రాత్రి రామచంద్రంగారు నిద్రకుపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అన్నది సీతమ్మ.
‘‘మనం ప్రసన్న దగ్గరకు వెళదాం.’’ రామచంద్రంగారికి తెలుసు- చిన్నవాళ్లతో చివాట్లు తినటం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే.
మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వు చేయించారు.

* * *

తల్లినీ తండ్రినీ స్టేషన్లో రిసీవ్‌ చేసుకున్నాడు ప్రసన్న.
ఇంటికి వెళ్లగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగారి చేతిలో బేగ్‌ అందుకుంటూ, ‘‘చిక్కినట్టున్నారే’’ అంది.
‘మొదలు’ అనుకున్నది సీతమ్మ. కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమయింది. సువర్ణ పెద్దగా చదువుకోలేదుగానీ మాట చమత్కారం మాత్రం కావలసినంత.
ఉద్యోగస్తురాలయిన తోటికోడలు నానా చాకిరీ చేయించుకోవటం వల్లే అత్తగారలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం. ‘అబ్బో సెగ రగలకుండా వాతపెట్టగల సమర్ధురాలు సువర్ణ.
అది మొదలు ఏపని అందుకోబోయినా, ‘‘అబ్బెబ్బే వద్దత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకోండి. నేనున్నాగా- నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా’’ అని అడ్డం పడుతోంది.
పోనీ అదీ బాగానే ఉంది లెమ్మని మనవరాలు శర్వాణిని ఒళ్లో కూర్చోబెట్టుకుని, ఏ పుస్తకమో పట్టుక్కూర్చుందామంటే, ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ, పిల్లలమీదా పనివాళ్లమీదా మొగుడిమీదా అరిచేస్తూ, ‘‘పొద్దున్న ఆరింటికి లేచాను. వెధవ పని తెమిలి చావదు. నడుములు విరిగిపోతున్నాయ్‌’’ అంటూ ఆపసోపాలు.
అన్ని పనులకీ పనిమనుషులున్నారు. చివరికి వంటింట్లో తన చేతి కిందకి కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకంత ఆయాసమో!
‘‘దాని తరహా అంతేలేమ్మా నువ్వేం పట్టించుకోకు’’ అన్నాడోసారి ప్రసన్న.
రామచంద్రంగారు ఇంకో విషయం గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లాకాక బంధువుల్లా ట్రీట్‌ చేస్తోందని. అడక్కుండానే రెండుమూడుసార్లు కాఫీ అందిస్తోంది. రెండు రకాల టిఫిన్లు చేస్తోంది. ఏమరుపాటు లేకుండా బాత్‌రూమ్‌లో నాలుగురోజులకొక కొత్త సోపూ, మడత నలగని టవలూ పెడుతోంది. భోజనంలో రోజుకో స్పెషల్‌... ఎందుకలా?
దొరికింది సమాధానం. ఆరోజు ఫస్టుతారీకు. ఇంట్లో పనిచేసే వాళ్లందరికీ జీతాలు ఇస్తోంది సువర్ణ.
‘‘ఏమిటీ? చుట్టపుచూపుగా వచ్చిపోయేవాళ్లకుగూడా లెక్క కడుతున్నావా నువ్వు’’ గదమాయిస్తోంది సువర్ణ.
‘‘పెద్దమ్మగారూ పెద్దయ్యగారూ ఉండిపోరా?’’ తేల్చుకుంటోందా అమ్మాయి.
‘‘ఎందుకుంటారు? వాళ్లకేమీ ఇల్లూ వాకిళ్లూ లేవనుకుంటున్నావా? పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తుంటారు, వెళుతుంటారు అంతే. ఇదివరకు అంతేగదా’’ భరోసా ఇచ్చింది సువర్ణ.
కాఫీ కప్పులు సింకులో పడేద్దామని వస్తోన్న సీతమ్మ స్థాణువైపోయింది. ‘అదన్నమాట సంగతి’ సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రంగారు.
‘కిం కర్తవ్యం?’ అనుకునే లోపల తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చేసింది సువర్ణ తల్లి సుభద్రమ్మగారి రూపంలో.
సుభద్రమ్మగారు యాత్రలు చేసి తిరిగివస్తూ కూతురి దగ్గర దిగబోతున్నారట ఆ మర్నాడు.
సువర్ణ ఒక్కతే సంతానం సుభద్రమ్మగారికి, కూతురంటే పంచప్రాణాలు. తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి.
ఇక సువర్ణ హడావిడి ఇంతా అంతాకాదు. అత్తగారివీ మావగారివీ బట్టలన్నీ ఓ పాత సూట్‌కేస్‌లో పడేసి మంచం కిందికి తోసేసి వాళ్ల అమ్మ వచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మారా ఖాళీ చేసేసింది. మంచమూ పరుపూ దులిపి కొత్త దుప్పటి వేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలీక, కాందిశీకుల్లా హాల్లోనూ వీధి వరండా లోనూ కాలక్షేపం చేశారు రామచంద్రంగారు ఆరోజంతా. మామూలుగా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించింది సీతమ్మ.
ఆరాత్రి- స్టోర్‌ రూమ్‌లోంచి రెండు మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ. ‘‘ఏమీ అనుకోకండి. అమ్మకి ఆ గది అలవాటు. మీకేం ఇబ్బందుండదులెండి. నడవాలో కామన్‌ బాత్‌రూమ్‌ ఉంది’’ అంది.
‘అనుకోవడానికేముంది. సుభద్రమ్మగారు కూతురికి కట్టించి ఇచ్చిన ఇల్లిది. ఆమెకు లేని హక్కు తమకేముంది?’ వెళుతూ వెళుతూ వెనక్కితిరిగింది సువర్ణ. ‘‘అన్నట్టు నేనే అందరికీ వంటా అదీ చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మ ఉన్న పదిరోజులూ వంట మీరు చేసిపెట్టండి అత్తయ్యా సంతోషిస్తుంది అమ్మ.’’
అందరూ నిద్రపోయారనుకున్నాక, ‘‘ఈసారి ఎక్కడకు వెళదాం’’ అడిగారు రామచంద్రంగారు నెమ్మదిగా- సీతమ్మ నిద్రపోలేదని ఆయనకు తెలుసు.

* * *

వాళ్ల గూటికి వాళ్లు చేరుకున్నారు. రామచంద్రంగారు పుట్టిన ఊరని ఆయన తండ్రి రాయీ రాయీ కూడ్చి కట్టుకున్న గూడు అది.
వీళ్లని చూడగానే ‘‘నువ్వా రామం’’ అంటూ వచ్చారు సుందరంగారు. పక్క ఇల్లే వాళ్లది. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ‘రామం’ అన్న స్నేహితుడి పిలుపుతో పది ఏళ్లు వయసు తగ్గినట్టనిపించి పులకించిపోయారు రామచంద్రంగారు.
పది నిమిషాలు మాట్లాడి వెళుతూ, ‘‘ఏమి అవసరంపడినా ఒక్క కేకవేయి, నిమిషంలో నీముందుంటా’’ అని చెప్పి వెళ్లారు సుందరంగారు. చెప్పటమేకాక వాళ్ల పనిమనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా.
పది రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలూ పెరటివైపు కూరపాదులూ ఓపిగ్గా వేశారు. అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్నచెట్టు కింద బెంచీ ఇష్టంగా వేయించుకున్నారు.
ఇప్పుడాయన దినచర్య నీరసంగా, ‘లేచి చేసేదేముందిలే’ అన్నట్టు బద్ధకంగా మొదలవటంలేదు. పొద్దున్నే సుందరంగారితో కలిసి వాకింగ్‌కి వెళ్లిపోతారు. వస్తూనే కాఫీతాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు.
సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో బాతాఖానీ. రోజు మొత్తం హాయిగా గడిచిపోతోంది రామచంద్రంగారికీ సీతమ్మకూ. ఇబ్బందులేమీలేవు. పనికి తొందరపెట్టేవాళ్లూ లేరు. ఏ తప్పు దొర్లుతుందో ఏ చెయ్యి జారుతుందో అన్న బెదురు లేదు. ఈ చోటు నీదికాదు అని జ్ఞాపకం చేసేవాళ్లు లేరు. స్వాతంత్రం స్వర్ణలోకమన్నట్టుగానే ఉంది. కానీ ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే, ‘‘ఎలా వుంది జీవితం?’’ అని భర్త అడిగినప్పుడు సంతృప్తి అయిన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ.
‘‘నీకిక్కడ సౌకర్యంగా లేదా సీతా?’’ ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్లీ అడిగారు రామచంద్రంగారు.
‘‘ఎందుకు లేదు! ఇక్కడ ఏమి తక్కువని.’’
‘‘మరి నీ మొహంలో ఎందుకూ అంత ఉదాసీనత!’’
కాసేపు మాటలు వెతుకుతున్నట్లు ఉండిపోయింది సీతమ్మ.
‘‘చెప్పు సీతా! ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా’’ హెచ్చరించారు రామచంద్రంగారు.
‘‘అవును ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసామనది? ఇప్పుడు బాగానే ఉన్నాం. కానీ ఎన్నాళ్లిలా ఉండగలమంటారు?’’
‘‘ఉండగలిగినన్నాళ్లు’’
‘‘ఆ తర్వాత?’’
‘‘అది భగవంతుడికొదిలేద్దాం సీతా. నీకు తెలుసు- చివరకు చేరాల్సింది వాళ్లదగ్గరకేగదా అని పిల్లల ఇళ్లకే వెళ్లాం, కానీ ఇమడలేకపోయాం. వాళ్లనీ ఇబ్బంది పెట్టాం, ఇందుకు ఎవరినీ తప్పెంచలేము. వాళ్లకోసమే బతికాం. అందుకని ఇప్పుడు వాళ్లని మనకోసం బతకమనటం న్యాయం కాదు. నాకప్పుడనిపించింది- వస్తుందో రాదో తెలీని చివరిరోజుల గడ్డుకాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులూ ఆందోళనలూ కలతలూ లేకుండా గడపలేమా అని.
ఇక్కడికొచ్చాం. రాగానే అనిపించింది. ఇదే మనకు తగిన చోటని. విరిగిన రెక్కలు అతుకుతున్నట్టనిపించింది. సీతా, ఇద్దరమూ ఉండగలమా అనే కదా నీ బెంగ? ఊళ్లో మనకు తెలిసిన వాళ్లందరినీ మనవాళ్లే అనుకుందాం. ఇరుగుపొరుగువాళ్లతో సఖ్యతగా ఉందాం. నీ నా అన్న భేదం లేకుండా అవసరపడినవాళ్లకి సహాయపడదాం. మన మంచితనమే మనకు రక్ష. వాళ్లలో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు.
మన బిడ్డలయినా అంత కర్కోటకులు కారు. చివరిగా తులసి నీళ్లు పోయడానికయినా తప్పక వస్తారు. కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళతారు. నాకా నమ్మకముంది ఏమంటావు సీతా.’’
ఎండావానా కలగలిసినట్టు కళ్లనిండా నీళ్లతో, మొహంలో చిరునవ్వుతో సరేనన్నట్లు తల ఊపింది సీతమ్మ.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.