close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తామరాకు మీద నీటి బొట్టు

- పద్మ చిల్లరిగే

పొ ద్దున్నే తీరిగ్గా గులాబీ మొక్క దగ్గర కూర్చుని, దాన్నే చూస్తున్న ‘ఉదయ్‌’తో ‘‘ఈ రోజు ఆఫీసు లేదా... నేను కొంచెం తొందరగా వెళ్లాలి’’ అన్నాను.
‘‘నువ్వు వెళ్లిపో...’’ అనేసి అక్కడ నుండి లేచి లోపలికి వెళ్లిపోయాడు.
‘‘ఓహ్‌, ఇదంతా అలకే’’ అనుకుని నేను ఆఫీసుకి వెళ్లిపోయాను.

* * * * *

ఆఫీస్‌కి వచ్చిన దగ్గర నుండి ఊపిరి సలపని మీటింగులు... ఒకదాని తరువాత మరొకటి. మధ్యలో అమ్మ ఫోన్‌... ‘‘అమ్మా, నీతో మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. కాస్త ఫ్రీ అవగానే నేనే చేస్తాను’’ అని చెప్పి, తన మాట పూర్తిగా వినకుండానే ఫోన్‌ కట్‌ చేశాను. యాంత్రికంగా పనులన్నీ పూర్తి చేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది. రోజులాగే ఉదయ్‌కి ఫోన్‌ చేశాను. సాధారణంగా ఇద్దరం కలిసే ఇంటికి వెళ్తాము. అప్పటికే ఇంటికి వెళ్లిపోయానని చెప్పాడు ఉదయ్‌. మళ్లీ కంప్యూటర్‌ ముందు కూలబడ్డాను.
నా వేళ్లు యాంత్రికంగా కీబోర్డు మీద కదులుతున్నా, నా మనసంతా నిన్న రాత్రి ఇంట్లో జరిగిన సంఘటన మీదే ఉంది. అనవసరంగా ఉదయ్‌ విషయాన్ని పెద్దది చేస్తున్నాడనిపించింది. నా మటుకు అది చాలా చిన్న విషయం...
కొద్ది రోజులుగా ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఏడాది క్రితం మా పోటీ కంపెనీ నుండి ఒక ఇంజినీర్‌ని బతిమాలి, బోలెడన్ని ఆశలు చూపించి, మా కంపెనీలో చేర్చుకున్నాం. అతనేమో ‘ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నాడు. సొంతంగా నిర్ణయాలని తీసుకోనివ్వడం లేదు. మిగిలిన వారి ముందు తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ నన్ను మానసికంగా కుంగదీస్తున్నాయి’ అంటూ తన బాస్‌ వైఖరిని కారణంగా చూపిస్తూ రెండు రోజుల క్రితం రాజీనామా చేశాడు.
‘రాజీనామా అంగీకరించవద్దు... అతను కంపెనీకి చాలా అవసరమైన వ్యక్తి. ఎలాగైనా ఒప్పించి ఇక్కడే కంటిన్యూ అయ్యేటట్టు చూడమని’ పై నుండి ఆర్డర్లు.
ఓ పెద్ద మల్టీనేషనల్‌ కంపెనీలో ‘మానవ వనరుల’ విభాగానికి అధిపతిగా ఆ బాస్‌తోనూ ఇతనితోనూ మాట్లాడి, అసలు సమస్య ఏమిటో అర్థం చేసుకొని, ఇద్దరికీ రాజీ చేసేటప్పటికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. పూర్తిగా అలసిపోయి... శరీరమూ, మనసూ రెండూ విశ్రాంతి కోరుతున్న సమయంలో నిన్న నేను ఇల్లు చేరాను.
ఉదయ్‌ వాళ్ల అక్క  ‘బిద్రీ వర్క్‌’ చేసిన ఒక ఫ్లవర్‌ వాజ్‌ పంపించారు. దాన్ని మా అత్తగారు డ్రాయింగ్‌ రూమ్‌లో షో కేసులో పెట్టారు. విడిగా చూస్తే చాలా అందంగా ఉన్న ఆ వాజ్‌, మా ఇంటీరియర్స్‌తో మ్యాచ్‌ అవలేదు. ‘మీకు నచ్చితే మీ రూమ్‌లో పెట్టుకోండి... ఇక్కడ మాత్రం దిష్టిబొమ్మలా ఉంది’ అంటూనే షో కేసు తలుపు తెరిచి, వాజ్‌ తీసేసి అత్తగారి చేతికి ఇచ్చాను.
‘‘ఇది గోడౌన్‌ కాదు, డ్రాయింగ్‌ రూమ్‌. నాకు నచ్చిన విధంగా డిజైన్‌ చేసుకున్నాను. నాకు తెలియకుండా దేనినీ ఇక్కడ పెట్టకండి. నాకు నచ్చని వస్తువు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను...’’ నా ప్రమేయం లేకుండా నా నోటి నుండి విసురుగా వచ్చాయా మాటలు.
అదిగో... అప్పటి నుండీ ఉదయ్‌, అత్తగారూ ఇద్దరూ మౌనవ్రతం... నిట్టూర్చాను.
ఇంతలో పొద్దున్న అమ్మ ఫోన్‌ చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. అమ్మతో మాట్లాడాను.
‘‘ఏమైంది? వరుణ్‌, వర్ష మళ్లీ గొడవ పడ్డారా...’’ నా గొంతులో చికాకు తొంగిచూసింది.
‘‘అదే... నిన్న నువ్వు వరుణ్‌కి... వాళ్ల మొదటి పెళ్లి పుట్టినరోజని ‘ఊటీ’కి టికెట్లు పంపించావట. దానిమీద మొదలై... అలా చిలికి చిలికి పెద్ద గాలివాన అయ్యింది. నువ్వు రా... చెబుతాను’’ అని అమ్మ ఫోన్‌ పెట్టేసింది.
‘ఇంటింటి రామాయణం...’ కానీ నాకిప్పటికిప్పుడు వరుణ్‌తోగానీ, వర్షతోగానీ మాట్లాడాలనిపించలేదు. కంప్యూటర్‌ ఆఫ్‌ చేసి, కారులో కూర్చున్నాను.
కళ్లు మూసుకొని వెనక్కి వాలాను. చాలా రోజుల తరువాత నా గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నాను.
నాన్నగారు సర్వీస్‌లో ఉండగా చనిపోవడం వల్ల అదే బ్యాంకులో ఉద్యోగంతోపాటూ ఇంటి బాధ్యతలూ నేను తీసుకున్నాను.
ఉద్యోగం చేస్తూనే ఎగ్జిక్యూటివ్‌ యమ్‌.బి.ఏ పూర్తి చేశాను. బ్యాంకు ఉద్యోగం నుండి తప్పుకొని, ప్రైవేట్‌ కంపెనీలో చేరి, అంచెలంచెలుగా పైకి ఎదిగాను. ప్రస్తుతం ఈ కంపెనీలో చేస్తున్నాను.
వరుణ్‌ ఇంజినీరింగ్‌ తరువాత ఐ.ఎస్‌.బి.లో చదవాలన్నది నా నిర్ణయమే. స్వతహాగా తెలివైన వాడవడం వల్ల సీట్‌ రావడం కష్టం కాలేదు. ముంబయిలో వచ్చిన జాబ్‌ వదులుకొని, అమ్మకోసం, నాకోసం హైదరాబాద్‌లోనే ఉండిపోయాడు.
వరుణ్‌ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అందుకే వాడికోసం వెతికి వెతికి మరో కంపెనీలో టీం లీడర్‌గా ఉన్న ‘వర్ష’ని సెలెక్ట్‌ చేశాను.
‘బాధ్యత కలిగిన ఉద్యోగం చేస్తూ చీటికీ మాటికీ ఈ చిర్రుబుర్రులేంటో... ఇద్దరితోనూ మాట్లాడాలి’ అనుకుని కారుని అమ్మవాళ్లింటికి పోనీయమని డ్రైవర్‌కి చెప్పాను.
అమ్మచేతి కాఫీ తాగుతుంటే హాయిగా అనిపించింది.
‘‘ఎప్పుడూ ఉండేదే. కొత్తగా చెప్పడానికి ఏముంది? మా అమ్మ చేసినట్టు లేదు అంటాడు వీడు. ‘మీ అమ్మగారు చేసినట్టు నాకెలా వస్తుంది? మా ఇంట్లో చేసినట్లు చేస్తున్నాను. మీ పద్ధతులూ, వంటలూ నేర్చుకోవడానికి నాకు టైం పడుతుంది’ అనేది మొదట్లో. ‘నా వంట బాగాలేకపోతే మీ అమ్మగారినే వంట చేయమనండి’ అనేసి తనకు మాత్రం చేసుకొని వెళ్లిపోతోంది ఇప్పుడు. దొండకాయ ఇప్పటికీ తను చక్రాలుగా తరుగుతుంది. మనం పొడుగ్గా తరుగుతాం. దాంతో వీడు కూర పక్కకు పెట్టేస్తాడు... అలాగే అన్నీ.
దానికి తోడు ఈ మధ్య ఆఫీసులో పని ఉంది అంటూ రోజూ లేట్‌గా వస్తోంది. కోడలొచ్చినా సుఖం లేదు. రాత్రి వంట కూడా నేనే చేస్తున్నాను. తను వచ్చేటప్పటికి మా ఇద్దరి భోజనాలు అయిపోతాయి. ఒక్కర్తీ తిని, అన్నీ సర్దేసి పడుకుంటుంది’’ గడగడా చెప్పింది అమ్మ.
ఛెళ్లున తగిలాయి అమ్మ మాటలు. నేనూ దాదాపు నెల రోజులుగా ఇంటికి లేటుగానే వస్తున్నాను. అన్ని పనులూ అత్తగారే చేస్తున్నారు. నా భోజనం అయ్యేవరకూ ఉదయ్‌, అత్తగారూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరే కూర్చుని, ఆరోజు జరిగిన విశేషాలు చెబుతూనే ఉంటారు. నిజానికి ఆవిడ వల్లే ‘బన్నీ’ గురించి నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. ఆఫీస్‌ పని పూర్తి అంకితభావంతో చేయగలుగుతున్నాను.
కిచెన్‌లో కాఫీ కప్‌ కడుగుతూ చుట్టూ చూశాను. గ్యాస్‌ స్టవ్‌, వాటర్‌ ఫిల్టర్‌, ఎలక్ట్రిక్‌ కుక్కర్‌, ప్రెషర్‌ కుక్కర్‌... అంతెందుకు, నేను తాగిన కాఫీ కప్‌ కూడా నా సెలక్షనే.
‘‘అసలు గొడవ ఎందుకొచ్చింది? అందులోనూ, అలిగి, పుట్టింటికి ఎందుకు వెళ్లింది?’’ అన్నాను అమ్మతో.
ఏదో చెప్పబోయి, అమ్మ ఆగింది.
‘‘చెప్పు, ఏమైంది?’’ రెట్టించాను.
‘‘మొన్న పూర్ణ పిన్నీ, సరూ పిన్నీ వచ్చారు. వాళ్లందరూ ఉన్నప్పుడే వర్ష ఆఫీసునుంచి వచ్చింది. ‘ఈ టేబుల్‌ క్లాత్‌ చాలా బాగుంది మన మంజూ పంపిందేనా. దాని సెలక్షన్‌ ఎప్పుడూ బెస్టే...’ అంది పూర్ణ. వెళుతూ వెళుతూ ‘అక్కా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నీకు కోడలొచ్చినా, నీ కూతురు నిన్ను కళ్లల్లో పెట్టుకు చూస్తుంది’ అంది. అంతే మేము మాట్లాడుకుంది.’’
‘‘అసలు గొడవెక్కడ వచ్చిందో చెప్పడం లేదు’’ విసుక్కున్నాను.
‘‘నిన్న నువ్వు పంపిన టికెట్లతో అసలు గొడవ మొదలైంది. తను ‘కూర్గ్‌’ వెళదామని ప్లాన్‌ చేసిందట. ‘నేను చెబుతాను వదినకి మన ప్లాన్‌ గురించి. ఆవిడ అర్థం చేసుకుంటారు’ అంది వర్ష.
దానికి వరుణ్‌ అసలు ఒప్పుకోలేదు. ‘అక్క మనకోసం ఇంత ఖర్చు పెట్టి, టిక్కెట్లు, హోటల్‌ అన్నీ బుక్‌ చేసింది. ఇప్పుడు కాదంటే బాధపడుతుంది. అందుకని, ప్రస్తుతానికి అక్కకోసం ‘ఊటీ’ వెళ్లొద్దాం. తరువాత నీ ఇష్టప్రకారం ‘కూర్గ్‌’ వెళదాం’ అన్నాడు. కానీ వర్ష తన పట్టు వదల్లేదు. ‘అంటే నేను మీ అక్కకోసం నా ఇష్టాలు వదిలేసుకోవాలా... హనీమూన్‌ అప్పుడూ అలాగే చేశారు వదిన... సిమ్లా టిక్కెట్లు తీసుకొచ్చి చేతిలో పెట్టారు, సర్‌ప్రైజ్‌ అని. ‘ఓహో, వదిన చాలా బాగా ప్లాన్‌ చేశారు’ అనుకున్నాను. మన ఫస్ట్‌ ఆనివెర్సరీకి మాత్రం మనం ఇద్దరం కలిసి ప్లాన్‌ చేసుకొని వెళ్లాలనుకున్నాను. మీతో చాలాసార్లు చెప్పానుకూడా. అంతెందుకు... ఈ ఇంట్లో ఏదైనా సరే మనిద్దరం కలిసి కొన్నామా? ఆఖరికి టేబుల్‌ క్లాత్‌ కూడా వదినదే సెలక్షన్‌... ఇంట్లో ప్రతిదీ వదిన ఇష్ట ప్రకారం జరగాల్సిందే. తాగే కప్పు, తినే కంచం, పడుకునే మంచం... అన్నీ ఆవిడ సెలక్షనే. ఇక్కడ ఏ పని చేసినా, వదినకి నచ్చుతుందా లేదాని ఆలోచించి చేయాలి తప్ప నాకు నచ్చినట్లుగా కాదు. ఇది నా ఇల్లు కానప్పుడు నేనెందుకు ఇక్కడ? మీరూ, అత్తగారూ ఉండండి. నేనేగా పరాయిదాన్ని... నేనే వెళతాను...’ అంది వర్ష విసురుగా.

‘అన్ని పెద్ద పెద్ద మాటలెందుకు? ఒక విధంగా నేను అక్క చెక్కిన శిల్పాన్ని. జాబ్‌ చేస్తూ నన్ను చదివించింది. ఎంతమంది ఒత్తిడి చేసినా నా చదువు పూర్తి అయ్యేంతవరకూ పెళ్లికూడా చేసుకోలేదు. నాకు ఉద్యోగం వచ్చాకే ఉదయ్‌ని పెళ్లి చేసుకుంది. ఎంత చేసినా అక్క రుణం తీర్చుకోలేను. చిన్న చిన్న విషయాలని పెద్దది చేయకు. అర్థం చేసుకో...’ అని బతిమాలాడు కూడా.
కానీ వర్ష వినిపించుకోలేదు. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలను అనుకున్నప్పుడు ఫోన్‌ చేయండి. అప్పుడు వస్తాను’ అంటూ వెళ్లిపోయింది. మాకు అర్థం కాలేదు... ఎందుకు అంతలా రియాక్ట్‌ అయిందో... వీడు చాలాసార్లు ఫోన్‌ చేశాడు. స్విచ్‌ ఆఫ్‌ వస్తోంది’’ అంది అమ్మ.
‘‘మంచి పిల్ల, మనతో బాగా కలిసి పోతుందని ఏరి కోరి చేశావు. చూడు... ఎలా చేసిందో. బయటకి తెలిస్తే పరువు పోతుంది...’’ అమ్మ మాటల్లో కోపం కనిపించింది.
‘‘వర్రీ అవ్వకు అమ్మా... నేను మాట్లాడతా ఇద్దరితో’’ అన్నాను.
వరుణ్‌ ఇంకా రాలేదు. నాకు లేట్‌ అవుతోందని బయలుదేరి వెళ్లిపోయాను. దారంతా ఆలోచిస్తూనే ఉన్నాను.
నేను ఇంటికి వెళ్లగానే చేసిన మొదటి పని, నిన్నటి నా ప్రవర్తనకి అత్తగారిని మనస్ఫూర్తిగా క్షమించమని అడగడం.
ఆవిడ అభిమానంగా నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఈ ఇల్లు ఆవిడది కూడా. నిన్న నేను ఆవేశంలో ఆ సంగతి మర్చిపోయాను.
ఉదయ్‌ మా రూమ్‌లో టీవీ చూస్తున్నాడు. వెళ్లి పక్కన కూర్చున్నాను. ఉదయ్‌ భుజం మీద తల వాల్చాను. ‘‘ఏమైంది’’ నా భుజం చుట్టూ తన చెయ్యి బిగుసుకుంది ఆప్యాయంగా.
ఆ స్పర్శతో చీకటిలో దారి తెలియక కొట్టుకుంటున్న చిన్న పిల్లకి వెలుగు కనిపించినట్లైంది. ఇంకా దగ్గరగా జరిగాను.
‘‘ఒకే. ఓకే... అసలు విషయం చెప్పు’’ అన్నాడు ఉదయ్‌.
గొడవ అంతా చెప్పేసిన తరవాత నా మనసెంతో తేలికగా అనిపించింది.
‘‘వర్ష అలా చేసి ఉండకూడదు. చిన్న చిన్న గొడవలకి కాపురాలు వద్దనుకుంటే ఎలా’’ అన్నాను.
‘‘అయితే తప్పంతా వర్షదే అంటావు’’
‘‘ముమ్మాటికీ...’’ ఉదయ్‌ నుండి దూరంగా జరిగాను.
‘‘అసలు ఈ గొడవలు రావడానికి మూలకారణం ఎవరో తెలుసా...’’ ఉదయ్‌ అడిగాడు.
‘‘ఇంకెవరు? వర్షే’’ నా గొంతు అదోలా పలికింది. ‘‘వాడు నా పెద్దకొడుకు. నేనేం చేసినా వాడి మంచి కోసమే చేస్తాను...’’
‘‘కాదు, ఈ గొడవలకు కారణం నువ్వే...’’ నా మాటకి అడ్డు వచ్చాడు ఉదయ్‌.
‘‘పొద్దున్న నువ్వు గులాబీ మొక్కని చూశావు కదా... మన ఎర్ర గులాబీ మొక్కకి, ఆరెంజ్‌ కలర్‌ గులాబీతో అంటు కట్టాను. ఇప్పటివరకూ వేరే చెట్టుగా పెరిగిన ఆ ఆరెంజ్‌ కొమ్మ మన ఎర్ర గులాబీతో కలిసి, ఇంకో రకం గులాబీ పువ్వు పూయాలంటే చీడ పీడలు పట్టకుండా, కొమ్మ వాడిపోకుండా అహర్నిశలూ జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా...
అడపిల్ల కూడా ఒక మొక్కలాంటిదే. అప్పటివరకూ పెరిగిన వాతావరణాన్నీ, తన వాళ్లనీ, ఆఖరికి పుట్టింటి పేరునీ కూడా వదిలేసి, కట్టుకున్నవాడే సర్వస్వం అనుకుని, అత్తవారింట కాలు పెడుతుంది. అలాగ వచ్చే అమ్మాయిని అత్తింటివారు ఎంత అపురూపంగా చూసుకోవాలి! వర్ష బయటి నుండి మీ కుటుంబంలోకి వచ్చిన అమ్మాయి. బాధ్యత తెలిసిన స్వతంత్ర భావాలున్న ఈ కాలం యువతి.
నువ్వూ, మీ అమ్మా, ఆఖరుకి వరుణ్‌ కూడా ఇప్పటికీ ఆ అమ్మాయిని పరాయిగానే చూస్తున్నారు. ‘మన అమ్మాయి’ అని అనుకుంటే... ‘మాకు ఈ కూర ఇలా అలవాటు... అమ్మావాళ్లు ఎలా చేస్తారు? ఈసారి చేసి చూపించు’ అనేవారు. పెళ్లై వచ్చిన వెంటనే, రాత్రికి రాత్రి ఆ అమ్మాయి మీకు నచ్చినట్లే మారిపోవాలనుకుంటే ఎలా... నిన్నటికి నిన్న, చిన్న వాజ్‌ మా అక్క ఇస్తే నిర్మొహమాటంగా చెప్పావు’ నా ఇల్లు, నా ఇష్టం’ అని. మరి వర్షకి ఉండవా అలాంటి ఇష్టాలు? నీ కోణం లోంచి చూస్తూ అన్నీ వరుణ్‌ మంచి కోసమే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ల పర్సనల్‌ విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నావని వర్ష అనుకుంటోంది. ఒక్కసారి వర్ష వైపు నుండి కూడా ఆలోచించు.
వాళ్ల విషయాల్లో నీ ప్రమేయం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి... అంటే దగ్గరగా ఉంటూనే దూరంగా ఉండడం... అలా ఉంటేనే అనుబంధాలూ అభిమానాలూ ఎప్పటికీ నిలచి ఉంటాయి. ప్రతి వారికీ తమకంటూ ఒక ‘స్పేస్‌’ కావాలి.
ఇప్పటి జంటలకి ఉద్యోగ బాధ్యతలు చాలా ఎక్కువ. వారికోసం అంటూ దొరికే టైం బాగా తక్కువ. ఆ కాస్త టైములో ఇద్దరూ కలిసి అన్ని పనులూ చేసుకుంటుంటే ఒకరి మీద మరొకరు ఆధారపడడం మొదలవుతుంది. అలా వారిద్దరి మధ్యా అనురాగం బలపడుతుంది. ‘ఈ ఇల్లు నాది, వీళ్లు నా వాళ్లు’ అనే అనుబంధం పెరుగుతుంది. ఇప్పటివరకూ వరుణ్‌ని ‘మంచి కొడుకు’లా పెంచావు. ‘మంచి భర్త’లా కూడా చూడాలనుకుంటే... ఏం చెయ్యాలో ఒక్కసారి ఆలోచించు’’ అంటూ బయటకు వెళ్లాడు.
ఉదయ్‌ మాటలే నా చుట్టూ తిరుగుతున్నాయి. సడెన్‌గా రెండు వారాల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

ఆ రోజు ఆఫీస్‌ నుండి అమ్మ దగ్గరకు వెళ్లాను. ఇంట్లో హాల్లో సోఫాలు ఇటువి అటూ అటువి ఇటూ మార్చివేశారు. నాకెందుకో అది నచ్చలేదు. నిర్మొహమాటంగా వరుణ్‌కి చెప్పాను. అప్పటికప్పుడు పాత సెట్టింగ్‌లా మార్చితేగానీ నేను స్థిమితంగా ఉండలేకపోయాను. అప్పుడు వర్ష ఎలా ఫీల్‌ అయి ఉండచ్చోనని నేను ఆలోచించనే లేదు. తన ఇంటిని తనకి నచ్చినట్లు వర్ష సర్దుకుంటే నేనేం చేశాను... ఈ ఇల్లు నాది, నీది కాదు సుమా... అన్న సంకేతాన్ని ఇచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తే... ఎంత అనాలోచితంగా చేశాను ఆ పని!
నిన్న ఆఫీసులో కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే. ఆ బాస్‌తో విడిగా మాట్లాడుతూ ‘ఎవరైనా ఆఫీస్‌ పనిని మొక్కుబడిగా కాక, సొంత పనిగా, అంకితభావంతో చేస్తే ఆ పని నూటికి నూరుశాతం విజయవంతం అవుతుంది. కొత్తవారిని సొంతంగా ఆలోచించేలా ప్రోత్సహించాలి, అటాచ్మెంట్‌లో డిటాచ్మెంట్‌... అంటే దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉండడం అలవాటు చేసుకుంటే బాగుంటుంది’ అని ఆ బాస్‌కి సలహా ఇచ్చాను. మరి...
ఆలోచనల సుడిగుండంలో గిరా గిరా కొట్టుకుంటున్న నాకు నా తప్పేమిటో తెలిసింది. కర్తవ్యం బోధపడింది. ‘రేపు తప్పకుండా వర్షతో మాట్లాడాలి’ అనుకున్నాను.
అప్పుడే అమ్మ దగ్గర్నుంచి ఫోన్‌ వచ్చింది... వరుణ్‌ వెళ్లి వర్షని ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పింది.
వర్ష దగ్గరకు వెళ్తున్నట్లు నాకు చెప్పలేదు వరుణ్‌.
చిత్రంగా... నాకు కోపం రాలేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.