నేను నల్లగా ఉంటే బాగుణ్ణేమో - Sunday Magazine
close

నేను నల్లగా ఉంటే బాగుణ్ణేమో

- గంటి వేంకట రమేష్‌

‘‘ఏమిటే, మగాడికి మొగుడిలా ఆ మాటలు. ఈమధ్య నీ కళ్ళు నెత్తికెక్కాయ్‌’’ మా అత్తగారి అరుపులు వినిపిస్తున్నాయి.

‘‘తమ్ముణ్ణి కూడా అదుపులో ఉండమని చెప్పండి. నామీద వాడి పెత్తనమేంటి?’’ నా కూతురు జాహ్నవి కూడా సమానంగా అరుస్తోంది.

‘‘ఆడదానివి అంత పొగరేమిటే..?’’ మా మామగారి హూంకరింపు. ‘‘ఏం... పొగరు మగాడికే ఉండాలా?’’ గోడక్కొట్టిన బంతిలా జానూ సమాధానం.

‘‘ఈమధ్య దీనికి నోరు లేస్తోంది.  అదిగో ఆ బరితెగించిన దానింటికి వెళ్ళి వచ్చిందగ్గర్నుంచీ ఇలా తయారైంది’’  మా అత్తగారు అందుకున్నారు.

ఈ గొడవ అటూ ఇటూ తిరిగి మా అక్క దగ్గరకే వస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడటం మొదలుపెడితే గొడవ మరింత పెద్దదవుతుంది. అందుకే మౌనంగా నా పని నేను చేసుకుంటున్నాను.

‘‘దానింటికి పంపించొద్దని నెత్తీ నోరూ బాదుకున్నాను. వింటేనా? ఇవాళ గుంటముండ ఇంతలా నోరు పారేసుకుంటోందంటే దాని సహవాసం కాదూ?’’ ఆవిడ గొంతు పెద్దదవుతోంది.

‘‘ముండ, గిండ అన్నావంటే ఊరుకునేది లేదు. జాగ్రత్తగా మాట్లాడు’’ జానూ గొంతు కూడా లేస్తోంది.

‘‘ఏయ్‌ జానూ, ఏంటా మాటలు  నానమ్మతో, పెద్దా చిన్నా లేకుండా’’ గట్టిగా కసిరాను.

‘‘చేసిందంతా చేసి, ఇప్పుడెందుకా నంగనాచి కబుర్లు. వారం రోజులు నీ అక్క ఇంటికి వెళ్ళి వచ్చిందిగా నీ కూతురు... ఆ ప్రభావమే ఇదంతా. మీ వంశం పరువుతీసింది చాలక, మా వంశం మీద కూడా పడ్డట్లున్నాయ్‌ మీ అక్క కళ్ళు. దీన్ని కూడా ఏ జాతి తక్కువ వాడికో ఇచ్చి పెళ్ళిచేసి, వర్ణ సంకరం చేస్తేగానీ దానికి మనశ్శాంతి ఉండదేమో’’ మా అత్తగారు తోకతెగిన మేకలా అరుస్తోంది.

జానూ ఏదో అనబోయింది. నేను కళ్ళెర్ర చేయడంతో ఆగిపోయి విసురుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది. ఆ వెనుకే నేనూ వెళ్ళాను. ‘‘ఏంటి జానూ, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆ మాటలు. నానమ్మను అలా అనవచ్చా’’ మందలించాను.

‘‘ఆవిడ మాత్రం ఇష్టంవచ్చినట్లు మాట్లాడొచ్చా? దొడ్డ (పెద్దమ్మ) గురించి ఈవిడకు ఏం తెలుసని? ఏమైనా అంటే ఆడదానివి అణిగిమణిగి ఉండాలి అంటుంది. ఈ మాట దొడ్డ దగ్గర అని చూడమను. ఈ ముసల్దాన్ని గొయ్యి తీసి నిలువునా పాతరేస్తుంది.’’

‘‘ఏయ్‌, మాటలు మీరుతున్నావ్‌’’ నా గొంతు కఠినంగా మారింది.

‘‘అసలు నువ్వు దొడ్డకు సొంత  చెల్లెలివేనా? మీ ఇద్దరికీ ఎంత తేడా  ఉందో!’’ నావైపు చూస్తూ అంది. ఆ చూపులో నా మీద జాలీ కోపమూ అసహనమూ అన్నీ కనిపిస్తున్నాయి.

జానూకే కాదు నామీద నాకే చాలాసార్లు చెప్పలేనంత కోపం వస్తూ ఉంటుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత నన్ను ఆక్రమిస్తూ ఉంటుంది. ఈ విషయం చెబితే మా అక్క నవ్వుతుంది. అది నిస్సహాయత కాదు, భయం అంటుంది తను. ‘అయినా నువ్వో కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నావు. దాన్నుంచి బయటకు రావడం నీకు చాలా కష్టం. ఇలాగే బతికెయ్‌’ అనే అక్క మాటలు వాస్తవమని నాకూ తెలుసు.

అక్కా నేనూ మా అమ్మానాన్నలకు ఇద్దరం ఆడపిల్లలం. అక్క పేరు సీత. రైమింగ్‌ బాగుంటుందని నాకు గీత అని పేరు పెట్టారు. మా ఇద్దరికీ మధ్య మూడేళ్ళ తేడా ఉంది. అక్క రంగు కొంచెం తక్కువ, చామనఛాయ. నేను తెల్లగా బుట్టబొమ్మలా ఉండేదాన్ని. ఇంటికి వచ్చినవాళ్ళంతా గీత ఎంత బావుంటుందో అనేవారు. ఈ మాటలకు అక్క చిన్నబుచ్చుకోవడం నేను చాలాసార్లు గమనించాను. నా రంగు చూసి నేను చాలా గర్వపడేదాన్ని. రంగురంగుల గౌన్లు వేసినప్పుడు సీతాకోకచిలుకలా ఉండేదాన్ని. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళివస్తే మా నానమ్మ నన్ను వీధిలో నిల్చోబెట్టి దిష్టి తీసి కానీ ఇంట్లోకి రానిచ్చేది కాదు. అక్క ముఖం చిన్నబుచ్చుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేది. ‘ఒరేయ్‌, గీత నా కోడలు... ముందే చెబుతున్నా’ మా మేనత్త నన్ను ముద్దులాడుతూ అంటుండేది. అప్పుడు మా అక్క కళ్ళల్లో అసూయ కనిపించేది.
మా బంధువులంతా నా శరీరం రంగుని అక్క రంగుతో పోలుస్తూ ఉండేవారు. దీంతో అక్క ఎప్పుడూ అసహనంగా ఉండేది. తన ఒంటి రంగు గురించి అక్క ఎప్పుడూ దిగులుపడుతూ ఉండేది. తనని ఎవరైనా ‘నల్లమ్మాయ్‌’ అని పిలిస్తే అసలు ఒప్పుకునేది కాదు. ఏడ్చి గోల చేసేది. ఏడ్చేవాళ్ళను చూస్తే ఎవరికైనా ఏడిపించాలనిపిస్తుందేమో కానీ, క్లాసులో రంగు తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నా, అక్కనే అందరూ ఆటపట్టించేవారు. ‘చింతకాయ పులుపు, సీత రంగు నలుపు’ అంటూ పాటలు పాడుతూ అక్కను వాళ్ళు ఏడిపించడం, అక్క వాళ్ళతో గొడవపడటం స్కూల్లో నిత్యకృత్యం.

అక్క ఏడో తరగతి చదువుతుండగా అనుకుంటా... మా స్కూల్లో జరిగిన ఓ సంఘటన తన ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేసింది. సోషల్‌ మాస్టారిగా రంగారావుగారు వచ్చారు. పోలియో వల్ల ఆయన ఎడమకాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. ఓ కర్ర సాయంతో నడిచేవారు. పాఠం బాగా చెప్పేవారు. దాంతోపాటు స్త్రీ స్వేచ్ఛ గురించీ పురుషాధిక్యం గురించీ, దేశాన్ని నిలువునా విభజిస్తున్న కుల, మతాల జాఢ్యం గురించీ మాట్లాడుతుండేవారు. ఆయన మాటలు వినడానికి బాగా ఉన్నా మాకు అర్థమయ్యేవి కాదు.

ఒక రోజు అక్కను వాళ్ళ క్లాస్‌మేట్స్‌ ‘నల్ల సీత, నల్ల సీత’ అంటూ ఏడిపిస్తున్నారు. ఆ మాట నచ్చని అక్క వాళ్ళతో పెద్ద యుద్ధమే చేస్తోంది. కాసేపటి తర్వాత వెక్కివెక్కి ఏడుస్తూ కూర్చుండిపోయింది. ఈ విషయం రంగారావు మాస్టారికి తెలిసింది. వెంటనే ఆయన అక్కడకు వచ్చి ఏడుస్తున్న అక్కను తనతో తీసుకువెళ్లారు. తన తోటి విద్యార్ధులపై ఫిర్యాదు చేసిన అక్కతో మాస్టారు మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.

‘సీతా, నీ ఒంటి రంగు గురించి నువ్వెప్పుడూ పట్టించుకోకు. నువ్వు ఏడుస్తున్నావు కాబట్టే అందరూ నీ రంగు గురించి మాట్లాడుతున్నారు. అంటే అది నీ బలహీనత అయిపోయింది. నీకంటూ ఓ దృఢమైన వ్యక్తిత్వం ఉండాలి. అది మాత్రమే నీకు ఓ గుర్తింపు ఇస్తుంది. ఏ విషయంలోనూ ఎవరితోనూ నువ్వు పోల్చుకోకు. ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే. నీ శరీరపు రంగునే నీ ప్రత్యర్ధులు ఆయుధంగా చేసుకున్నారంటే, ఇతరత్రా విషయాల్లో నువ్వు గొప్పదానివే కదా. నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటే నీకేంటి? నీ గురించి నువ్వేమనుకున్నావ్‌ అనేదే ముఖ్యం. నీతో కలకాలం ఉండేది నువ్వే, నీ చుట్టూ ఉన్న మనుషులు కాదు. నువ్వు నీ జీవితాన్ని ఎంత సంతృప్తిగా సంతోషంగా స్వేచ్ఛగా బతికావన్నదే అన్నింటికంటే ముఖ్యమైన విషయం. మన జాతిపిత బాపూజీ... దశాబ్దాలుగా జైల్లోనే ఉండి, స్వాతంత్య్రం కోసం పోరాడిన నెల్సన్‌ మండేలా... ఇలా చెప్పుకుంటూపోతే చరిత్రను సృష్టించినవాళ్ళూ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయినవాళ్ళూ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ శరీరపు రంగు గురించి ఈరోజు ఎవరూ మాట్లాడటం లేదు. భూమిలో కలిసిపోయే శరీరం రంగు గురించి ఆలోచిస్తావో, అందమైన వ్యక్తిత్వంతో నీతోటి వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఉంటావో నీ ఇష్టం.’

మాస్టారి మాటలు విన్న తర్వాత అక్క మౌనంగా క్లాసుకు వచ్చేసింది. ఆ మౌనం వెనుక ఆలోచనల అగ్నిపర్వతం రగులుతోందని నాకు అర్థమైంది. ఆ తర్వాత నుంచీ అక్క రోజూ మాస్టారితో గంటో ఘడియో మాట్లాడుతూ ఉండేది. పదో తరగతి పూర్తయ్యే వరకూ మాస్టారే అక్కకు దిక్సూచిగా ఉన్నారు. తన క్లాసు పుస్తకాలతోపాటు వర్తమాన సాహిత్యం కూడా అక్కకు పరిచయమైంది. కథలూ కవితలూ చదవడం అలవాటైంది. తనలో క్రమంగా మార్పు వచ్చింది. తన రంగు గురించి ఎవరు ఎలాంటి కామెంట్‌ చేసినా పట్టించుకోవడం లేదు. కోపానికి బదులుగా అక్క ముఖంలో చిరునవ్వు దోబూచులాడేది. కబుర్లు చెబుతూ గలగలపారే సెలయేరు లాంటి అక్క కాస్తా... గంభీరమైన సంద్రంగా మారిపోయింది. ఆమె ఆలోచనల లోతు మాకు అంతుబట్టేది కాదు. ఆచితూచి మాట్లాడటం తనకు అలవాటైంది. సహజంగానే తన మాటకు విలువ పెరిగిపోయింది. మాటివ్వడం, దానికి కట్టుబడటం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయం తీసుకున్న తర్వాత మరో ఆలోచన లేకుండా ఆచరించడం... ఇలా నాకు రోజుకో కొత్త సీతక్క కనిపించేది. ‘సీతతో అంత ఈజీ కాదు’ అనే విషయం అందరికీ అర్ధమైపోయింది.

పదో తరగతి పాసైన తర్వాత అక్కని నాన్న మ్యాథ్స్‌ చదవమన్నారు- కానీ తను ఆర్ట్స్‌ చదువుతానంది. ఇంటర్‌ తర్వాత పెళ్ళి చేస్తామంటే వద్దంది. డిగ్రీ చదివింది. పెళ్ళి చేసుకోమంటే- పీజీ చేస్తానంది. సిటీలోని యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంది. యూనివర్సిటీ హాస్టల్‌లో చేరింది. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఎం.ఫిల్‌.లో చేరింది. ఈలోగా నా డిగ్రీ పూర్తయింది. నన్ను తన కొడుక్కి చేసుకోవాలని మా మేనత్తకు ఒకటే తొందర. అక్క ఎం.ఫిల్‌. కూడా పూర్తి కావస్తుండటంతో నాన్న తనకి కూడా సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. వీలైతే ఇద్దరి పెళ్ళిళ్ళూ ఒకేసారి చేసేద్దామని ఆయన ఉద్దేశం.

ఈ విషయం తెలిసిన అక్క చెప్పిన విషయం విని ఇంట్లో బాంబు పేలినట్లయింది. తన తోటి విద్యార్ధి శరత్‌ని ప్రేమించాననీ అతన్నే పెళ్ళి చేసుకుంటాననీ ఎలాంటి శషభిషలు లేకుండా చెప్పింది. అమ్మానాన్నకి నోటమాట రాలేదు. కానీ మా నాన్నమ్మ మాత్రం
ఉండబట్టలేక అడిగింది ‘మనవాళ్లేనా’ అని. అక్క కాదంది. ‘వేరే కులంవాణ్ణి చేసుకుని వర్ణ సంకరం చేస్తావుటే’ అంటూ నాన్నమ్మ అరిచి గోల చేసింది.

అక్క మాత్రం ఎప్పట్లానే కూల్‌గా ‘నా పెళ్ళి విషయంలో నీ జోక్యం అసలు అవసరం లేదు. అమ్మానాన్నలకు ఇష్టమైతే పెళ్ళి ఇక్కడ జరుగుతుంది. లేదంటే రిజిస్టర్‌ ఆఫీసులో జరుగుతుంది’ అక్క గొంతులో గాంభీర్యానికి నేనే కాదు, అక్కడున్న అందరం భయపడ్డాం. అమ్మా, నాన్నా పెళ్ళికి అంగీకరించలేదు. దీనిపై ఇంట్లో ఎలాంటి రాద్ధాంతమూ జరగలేదు. గొడవ చేసినా అక్క నిర్ణయంలో మార్పు ఉండదని అందరికీ తెలుసు. తన పెళ్ళి రిజిస్టర్‌ ఆఫీసులో జరిగిపోయింది. ఆ తర్వాత నుంచి మామధ్య రాకపోకలు ఆగిపోయాయి.

అక్కా బావా ఇద్దరూ పట్నంలో లెక్చరర్లుగా పనిచేసేవారు. నా మేనత్త కొడుకుతో నా పెళ్ళయింది. పెళ్ళికి అక్కను పిలవలేదు. కానీ తను, భర్తతో వచ్చి నాకు కనిపించి వెళ్ళిపోయింది. అక్క లేకుండా నా పెళ్ళి జరుగుతోందన్న లోటు లేకుండా చూసింది. పీజీ చదవాలనీ ఉద్యోగం చేయాలనీ నా కోరిక. కానీ నా ఆశలపై మా అత్తామామలు నిర్ద్వంద్వంగా నీళ్ళు చల్లేశారు. ‘సీతను చూసైనా మనకు బుద్ధి రావాలి’ అంటూ అక్కసు వెళ్ళగక్కారు. ఆడదానికి మరీ అంత ‘స్వేచ్ఛ’ అవసరంలేదని మా కుటుంబం మొత్తం తీర్మానించుకుంది. అక్క నచ్చినట్లు ఎగిరే విహంగమైతే, నేను బంగారు పంజరంలో చిలకనైపోయాను.

అక్క మా ఇంటికి రాకపోయినా, తన విషయాలు నాకు తెలుస్తూనే ఉన్నాయి. మా ఇద్దరిమధ్య ఉత్తరాలూ ఫోన్లూ నడిచేవి. తనకు ఓ కూతురు పుట్టింది. ఆడైనా మగైనా ఒక్కరు చాలు అనుకుని ఆపేసింది. నాకూ కూతురు పుట్టింది. నేనూ ఒక్కరితో ఆపేద్దామని మా ఆయనతో అన్నాను. ఆ విషయం మా అత్తామామల వరకూ వెళ్ళింది. ‘పున్నామ నరకాన్నితప్పించే కొడుకు లేకపోతే ఎలా?’ అంటూ వాళ్ళు ఇంతెత్తున లేచారు. ‘మీ అక్కలా పిచ్చిపిచ్చి వేషాలు వేయకు’ అంటూ నాకు వార్నింగ్‌ ఇచ్చారు. నా అదృష్టం బాగుండి ద్వితీయ సంతానం కొడుకు పుట్టాడు. లేదంటే నేనో పది మందిని కనాల్సి వచ్చేదేమో! ఈ విషయం చెబితే మా అక్క పగలబడి నవ్వింది.

అక్క పెళ్ళయిన ఓ పదేళ్ళ తర్వాత అనుకుంటా... తను భర్త నుంచి విడిపోయిందన్న పిడుగులాంటి వార్త విన్నాను. వెంటనే ఫోన్‌ చేశాను. ‘‘అవునే మొన్నే డైవోర్స్‌ తీసుకున్నాం’’ అదేదో సాధారణ విషయం అన్నట్లు చెప్పింది.

‘‘అదేంటే, ప్రేమించే పెళ్ళి చేసుకున్నారుగా?’’ నా గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది.

‘‘ప్రేమిస్తే మనస్పర్థలు రాకూడదా? ప్రేమ శాశ్వతమేం కాదు, అలాగే జీవితమంతా కలసి ఉండాలనే కమిట్మెంట్‌ కాదు. మేమిద్దరం కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాం. అందుకే విడిపోయాం. అంతే, వెరీ సింపుల్‌.’’

ఈ విషయాన్ని అక్క అంత సింపుల్‌గా చెప్పడమే నాకు ఆశ్చర్యమనిపించింది. ‘‘అతను మంచివాడేగా, ఏంటి సమస్య?’’ ఆపుకోలేక అడిగాను.

‘‘మంచివాడే కానీ అతనూ మగాడే. ఈ మగాళ్ళకి పెళ్ళికి ముందు వరకూ ఆడదానిలో కనిపించే వ్యక్తిత్వం, పెళ్ళయిన తర్వాత బరితెగింపుగా కనిపిస్తుంది. ముక్కుసూటితనం పొగరుగా అనిపిస్తుంది. సాయం చేసే గుణం లౌక్యంలేని విధంగా మారిపోతుంది. ఆయన కూడా దానికి మినహాయింపు కాదు.’’

‘‘ఈ చిన్న విషయాలకే విడిపోయారా?’’ ‘‘ఏది చిన్న విషయం... నీకంటూ నువ్వు లేకుండా ఉండటం, నిన్ను నువ్వు కోల్పోవడం చిన్న విషయం కాదు. ఉన్న ఒకే జీవితాన్ని ఆంక్షల మధ్య బతకడం చిన్న విషయం కాదు. నీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ఎప్పటికప్పుడు సర్దుకుపొమ్మంటూ బతకడం చిన్న విషయం కాదు. ఈ మాత్రానికి మనిషిగా పుట్టక్కర్లేదు. ఏ రాయిగానో రప్పగానో పుడితే చాలు’’ అక్క గొంతులో ఆవేశం వాస్తవాలను బట్టబయలు చేస్తోంది. ‘‘అసలేం జరిగిందక్కా?’’

‘‘మామధ్య మనస్పర్థలు ఉన్న మాట వాస్తవం. ఎవరో ఒకరం సర్దుకుపోయేవాళ్ళం. మేం పని చేస్తున్న కాలేజీలో మీ బావ ఫ్రెండ్‌ వినోద్‌ - ఆయన కూడా లెక్చరరే - ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడాడు. ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో లేడీ స్టాఫ్‌తో ఓ కమిటీ వేశారు. ఆ కమిటీకి నేనే హెడ్‌. మా పరిశీలనలో వినోద్‌ తప్పుగా మాట్లాడినట్లు తేలింది. అతన్ని మూణ్ణెళ్ళు సస్పెండ్‌ చేయాలని నేను రికమెండ్‌ చేశాను. ఆ విషయంలోనే అసలు గొడవంతా. ‘ఓ చిన్న తప్పుకే అంత శిక్ష వేస్తారా?’ అంటూ శరత్‌ నాతో గొడవ పెట్టుకున్నాడు. అది చినికి చినికి గాలి వానైంది. నన్ను పెళ్ళి చేసుకోవడమే పెద్ద తప్పని అన్నాడు. నాలాంటి పొగరుమోతుతో కాపురం చేయలేనన్నాడు. అయితే విడిపోదామన్నాను, అంతే.’’

‘‘వేరేవాళ్ళ కోసం మీరు విడిపోవడమేంటి?’’ ‘‘వేరేవాళ్ళ కోసం కాదు గీతా. తన మాట వినలేదనే మగాడి అహంకారాన్ని తట్టుకోలేక విడిపోయాను. ఈరోజు ఓ పదహారేళ్ళ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన వ్యక్తి... రేపు అలాంటి మరో అమ్మాయి ఒంటిమీద చేయి వేయడనే గ్యారంటీ ఉంటుందా? అదే విషయం శరత్‌ను అడిగాను. ఓసారి శిక్షపడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారని చెప్పాను. నావైపు నుంచి ఆలోచిస్తే విషయం అర్థమయ్యేదేమో కానీ, అతను తనవైపు నుంచి ఆలోచించాడు. చాలా రోజుల్నుంచి అణచుకున్న ‘మగ’ ఆవేశాన్నీ అహంకారాన్నీ బయటకు కక్కేసి వెళ్ళిపోయాడు.

‘‘వేరే కులం అయితే ఇలాగే ఉంటుంది అక్కా. అమ్మానాన్న చెప్పిన సంబంధం చేసుకుంటే బాగుండేది కదా’’ నా అక్కసు వెలిబుచ్చినట్లు నాకే అనిపించింది.

‘‘ఈ భూమ్మీద రెండు కులాలే ఉన్నాయి గీతా... మగా ఆడా. ఏదో రూపంలో ఆడదాన్ని డామినేట్‌ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాడు మగాడు. ఆడది సర్దుకుపోతే అది అన్యోన్య దాంపత్యం... లేకపోతే బరితెగించడం. కూలీపని చేసినా, కలెక్టర్‌ గిరీ అయినా ఆడదే వంట వండాలి. మగాడి వెనుకనే నడవాలి... ఇదే రూల్‌. వందేళ్ళకిందటా ఇదే రూల్‌, ఇప్పుడూ ఇదే రూల్‌. ఇక నాన్న చెప్పిన, మన కులంవాణ్ణి చేసుకుంటే, మనకేమన్నా అగ్రాసనం దక్కుతోందా. ఆచారాలూ కట్టుబాట్లూ అంటూ ఆడదానికి గిరిగీసింది మనవాళ్లే కదా! కాదంటావా? చిన్నప్పట్నుంచీ ఉద్యోగం చేయాలని కలలు కన్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు?’’

ఈ సూటిప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. ‘‘అత్తయ్యా, మామగారూ పెద్దవాళ్ళయిపోయారు. పిల్లలను కూడా చూసుకోవాలి కదా’’ అన్నాను. నా గొంతు నాకే బలహీనంగా అబద్ధంగా వినిపిస్తోంది.

‘‘నువ్వు ఉద్యోగంలో చేరి ఇవన్నీ చేయలేవా? ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళకు ఇంటి బాధ్యతలు లేవా? ఏం మీ ఆయన కుటుంబ బాధ్యతలు చూడలేడా? నీకు ఉద్యోగం చేయడం ఇష్టమని నాకు తెలుసు. నిన్ను గడప దాటనీయడం అత్తామావయ్యలకు ఇష్టం ఉండదు. దీనికోసం నన్ను బూచిగా చూపిస్తారు. వాళ్ళ దృష్టిలో కోడలు లేదా భార్య అంటే పిల్లల్ని కనే యంత్రం, జీతం భత్యం లేని పని మనిషి.’’

ఇవన్నీ వాస్తవాలని నాకూ తెలుసు. అందుకే విషయాన్ని దారి మళ్ళించడానికి అడిగాను. ‘‘మీ అత్తగారు నీ దగ్గరే ఉందట. శరత్‌కి నువ్వు అక్కర్లేదు కానీ, వాళ్ళమ్మకి నువ్వు సేవ చేయాలా?’’ నాలో ఉన్న సంకుచిత మనస్తత్వం బయటకు వచ్చింది.

‘‘సమస్య నాకూ శరత్‌కీ మధ్య. మధ్యలో వాళ్ళమ్మ ఏం చేస్తుంది? ఆవిడ కూడా దగాపడిన ఆడదే. మా మామగారు ఉన్నన్నాళ్ళూ తాగి, ఆవిడ ఒళ్ళు హూనం చేసేవాడు. నానా కష్టాలుపడి శరత్‌ను చదివించుకుంది. శరత్‌ వెళ్ళిపోతూ వాళ్ళమ్మని తనతో వచ్చేయమన్నాడు. కానీ, ఆవిడ మాత్రం కుదరదు పొమ్మంది. కోడల్నీ మనవరాల్నీ వదిలి రానని కుండబద్దలు కొట్టేసింది. ఆవిడ నాకు మంచి స్నేహితురాలు. తనని వదలడం నాకూ ఇష్టం లేదు.’’ ‘‘బాగుందక్కా నీ వరస. భర్త శత్రువు, అత్తగారు స్నేహితురాలు’’ నవ్వుతూ అన్నాను.

‘‘శరత్‌ నాకు శత్రువు కాదు. అతని సిద్ధాంతాలు వేరు, నా ఆదర్శాలు వేరు. అతను చెడ్డవాడు కాదు. కానీ నరనరానా పురుషాధిక్యం జీర్ణించుకున్న సగటు మగాడు. దానికి పోరాటం తప్పదు. రాజీపడుతూ బతకడం నావల్ల కాదు.’’

‘‘నీ కూతుర్ని కూడా ఇలానే పెంచుతున్నావా? అదే... నీలాగ ఆలోచించడం, బతకడం?’’

‘‘నాలాగా ఆలోచించడం, నాలాగా బతకడం తప్పంటావా?’’

‘‘తప్పు కాదక్కా, నాలాంటివాళ్ళకి నీలా ఆలోచించడానికే ధైర్యం లేదు, ఇక నీలా బతకడం కూడానా ఈ బతుక్కి’’ అన్నాను నిట్టూరుస్తూ. అక్కడితో మా మాటలు ఆగిపోయాయి. ఇదంతా ఎప్పుడో ఆరేడేళ్ళ కిందట జరిగిన సంభాషణ.

నా కూతురు ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, మా ఆయన్ని ఒప్పించి ఈమధ్యే తనని మా అక్క ఇంటికి పంపించాను. ఓ వారం రోజులు మాత్రమే జానూ వాళ్ళింట్లో ఉంది. గంధపు చెట్ల మధ్య నుంచి వెళ్ళినా, మనల్ని ఆ సువాసన ఆవహించినట్లు, మా అక్కని కలిసిన తర్వాత నా కూతురి దృక్పథం పూర్తిగా మారిపోయింది. ఈ మార్పు మా ఇంట్లో ఎవరికీ రుచించడం లేదు. ఎందుకో నాకు మాత్రం కొత్త జాహ్నవి బాగా నచ్చుతోంది. అక్క ఎలా ఉందో, నేనెలా ఉంటే బాగుణ్ణని అనుకున్నానో తను అలానే ఉంది. నా కూతురిలో నేను కాస్తయినా దొరుకుతానేమోనని ఆశగా వెతుక్కుంటున్నాను.

‘‘గీతా, పక్కింటి పిన్నిగారొచ్చారు... కాస్త కాఫీ కలుపు’’ అన్న అత్తగారి మాటల్తో ఆలోచనల నుంచి బయటపడ్డాను.

‘‘అబ్బ, నీ కోడలు ఎంత బాగుంటుందో, తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది’’ కాఫీ ఇచ్చిన కృతజ్ఞతను నేర్పుగా ప్రదర్శిస్తోంది పక్కింటామె.

‘‘అందుకే నా కొడుక్కి దీన్ని చేసుకున్నాను. ఇది ఆ పెద్దదానిలా కాదు. నలుపైనా దానికెంత పొగరోనమ్మా’’ మళ్లీ మా అత్తగారు అక్కమీద విషం చిమ్ముతోంది.

‘నేనూ నల్లగా పుట్టి ఉంటే బాగుండేదేమో!’ అనుకోకుండా ఉండలేకపోయాను.

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న