చేసిన పుణ్యం - Sunday Magazine
close

చేసిన పుణ్యం

వలివేటి నాగచంద్రావతి

మొహం మీద ఎవరో చరిచినట్లు చటుక్కున మెలకువ వచ్చింది. తెల్లవారుఝాము అయివుంటుంది. రాత్రంతా ఒకటే పులకరం. అందుకే గావును ఒళ్లంతా ఎలాగో ఉంది... ససి చెడినట్టు.
పక్కకి తిరగబోయాను. అటువైపు శరీరం నాదికానట్టు కదలలేదు. కంగారు పడ్డాను. ఎడమచేయి ఎత్తి కుడిచేతిమీద వేశాను. ఆ చేయి స్పర్శ తెలియలేదు. ఏమయింది నాకు? భయంతో గొంతులో తడి ఆరిపోతోంది. ఎవరినన్నా పిలవాలని ప్రయత్నించాను. మాట రాలేదు. దెబ్బతిన్న జంతువేదో కీచుమని అరిచినట్టు వికృతంగా వచ్చింది కేక నోటివెంట. నాకు కాలకృత్యాలు తీర్చుకోవలసిన అవసరం కనిపిస్తోంది. కానీ ఎలా? కదలలేను మెదలలేను నోరెత్తి అరవలేను. దేవుడా ఏమిటి నాకీ దుస్థితి!
క్షణాలు యుగాల్లా గడిచాయి. నా కోడళ్లిద్దరూ లేచినట్టున్నారు. వాళ్లవెంటే పిల్లలు. సందడి మొదలయింది. ఎంతో ప్రయత్నించి మంచం పక్క స్టూలుమీంచి నీళ్లచెంబూ గ్లాసూ కిందికి దొర్లించాను.
పిల్లలు పరిగెత్తుకొచ్చారు. వంకరపోయిన నా మొహం చూసి గావును- నడుస్తూ వెనక్కెళ్లిపోయారు. ఆ తరవాత కోడళ్లిద్దరూ గబగబా వచ్చారు కంగారు పడుతూ. వాళ్లు పెట్టిన కేకలకి నా కొడుకులిద్దరూ హడలిపోతూ వచ్చారు.
ఇక చెప్పడానికేముంది? అంబులెన్స్‌ వచ్చింది. ఆసుపత్రిలో చేర్చారు. అన్ని పరీక్షలూ చేసిన తదనంతరం డాక్టర్లు తేల్చినదేమంటే ‘పెరాలిసిస్‌స్ట్రోక్‌’ అని. నా అనుమానం నిజమయింది. నా నవనాడులూ కుంగిపోయాయి. పెద్దతనాన వచ్చే అన్ని జబ్బులకంటే ఇది అంటేనే నాకు చచ్చేంత భయం. భగవాన్‌ ఎందుకయ్యా ఇంత శిక్ష వేశావ్‌?
రోజులమీద తగ్గేది కాదు కాబట్టి వారంరోజుల ట్రీట్‌మెంట్‌ తరవాత డిశ్చార్జి చేసి అంబులెన్స్‌లోనే ఇంట్లో దింపేశారు.

 

*            *             *
 

ఇదేమిటి? నా పెద్దగదీ, పందిరి మంచం, ఇనప్పెట్టె, గోడకి పెద్ద అద్దం... అవన్నీ ఏమయ్యాయి. పాత సామాన్లు పడేసే మెట్లగదిలో, బొంతపరిచిన పాతనవారు మంచంమీద పడేశారా నన్ను? దేవుడా, ఎక్కడికి తెచ్చావయ్యా నాగతీ.
ఒక్కరోజు గడిచేటప్పటికి నా నిస్సహాయతా, ఇంట్లోవాళ్ల నిర్లక్ష్యం తెలుస్తోంది. తెల్లవారి పదిగంటలకి నా పెద్దకోడలు సునీత కాఫీకప్పుతో నా గదిలోకి వచ్చింది.
‘‘అయ్యో మీరింకా బ్రష్‌ చేసుకోలేదా?’’ అంది. లేపితేగానీ లేవనేనని తెలిసీ నాతో వెటకారమా? నోటితో అనలేక కళ్లురిమి చూశాను. లెక్కలేనట్టు వెళ్లిపోయి, నా రెండో కోడలు రేణుకని వెంటబెట్టుకొచ్చింది.
ఎంతో కష్టంమీద కాలకృత్యాలు ముగిశాయి. నాకు సాయం చేస్తున్నంతసేపూ వాళ్లమొహాల్లో అయిష్టం, వారికళ్లలో అసహ్యం తెలుస్తూనే ఉన్నాయి నాకు.
ఇప్పటివరకూ ఇంటా బయటా పెద్దపులిలా బతికాను. ఇకముందు రోజులెలా గడవబోతున్నాయో...

 

*            *             *

ఆరోజు ఆదివారం.
హాల్లో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. నేను తప్ప ఇంటిల్లిపాదీ చేరతారక్కడ. హాలుకి ఆనుకుని ఉన్న మెట్లకింది గదిలోనే నా నివాసం. వాళ్లు మాట్లాడుకునేవన్నీ దాదాపు నాకు వినపడుతూనే ఉన్నాయి. వినకూడదని వాళ్లు ప్రయత్నిస్తున్నట్టుగానూ లేదు. అది నేనంటే నిర్లక్ష్యమా? ఈవిడేమి చెయ్యగలదనే తెగింపా?
‘‘రోజుకొకరూ వారానికొకరూ అని మీరేమీ షిప్టులు వెయ్యక్కరలేదు. మీరేమన్నా అనుకోండి. మీ అమ్మగారికి సేవలు చేయటం నావల్లకాదు’’ పెద్దకోడలు సునీత కట్టె విరిచినట్టు చెబుతోంది. నిన్నమొన్నటిదాకా వానపాములా చడీచప్పుడు చేయకుండా ఉండేది. ఇప్పుడు తాచుపాములా బుస్సుమంటోంది.
‘‘నిజమేనండీ- ముఖ్యంగా ‘ఆ బెడ్‌పానూ’ అదీ... యాక్‌... ఈ నాలుగు రోజులూ పనిమనిషిని బతిమిలాడుకున్నాం. రేపట్నుంచీ ససేమిరా చేయనన్నది. మీరెవర్ని మాట్లాడుతారో మీ ఇష్టం. మేము మాత్రం చెయ్యమంతే’’ తోటికోడలుకి తోడు వెళ్లినట్టుంది రేణుక కూడా.
‘‘ఇద్దరికిద్దరూ అలాగంటే ఎలాగ? ఆవిడ మాకు అమ్మ. మీకూ తల్లితో సమానురాలు. పెద్దదన్న గౌరవమూ అభిమానమూ కాస్తయినా ఉండొద్దూ’’ అన్నాడు మా పెద్దవాడు రాఘవుడు. ఎలాగయినా వాడెప్పుడూ న్యాయంగా పెద్దరికంగా మాట్లాడుతాడు.
‘‘ఎలా ఉంటాయండీ అభిమానమూ మర్యాదానూ- నేను కాపురానికి వచ్చి పన్నెండేళ్లయింది. ఒక్కరోజు ప్రేమగా మాట్లాడిందా ఆవిడ... అధికారం చూపించడం ఆజ్ఞాపించడం తప్ప. ఏనాడో పెళ్లినాడు అలకపాన్పు మీద మీకిస్తానన్న స్కూటరు ఇవ్వలేదని మానాన్న చనిపోయినా ఇప్పటికీ దెప్పుతూనే ఉంది. జ్వరమొచ్చి వేలబడినా అయ్యో అనకపోగా, పనివేళకే రోగం గానీ కూటివేళకు ఏ రోగమూ ఉండదని చమత్కరిస్తుంది. అలాంటి ఆవిణ్ణా పాపమని జాలి చూపించాలి? మీ అంత విశాల హృదయం లేదు నాకు.’’ ఆ క్షణాన సునీత మొహం రాయిలా ఎంత బిగుసుకుందో నేను ఊహించగలను.
‘‘బాగా చెప్పావక్కా. ఆవిడ మనకేమి ఒరగబెట్టిందని సేవచేసి రుణం తీర్చుకోవాలంటారు? ఇప్పుడంటే రోగమొచ్చి మూలనపడింది గానీ మొన్నటివరకూ దిట్టంగానే ఉందిగా. చంటి పిల్లలతో సతమతమయిపోతున్నా కాస్తన్నా చెయ్యి సాయం చేసిందా, చంటిపిల్ల కక్కటిల్లిపోతున్నా చంకనేసుకుందా ఏనాడైనా. అదేమంటే పెంచడం చేతకానప్పుడు కనడమెందుకన్నది గుర్తున్నదా అక్కా’’ తోటికోడలికి తీసిపోలేదు రేణుక.
‘‘చాలు చాలు మీ పితూరీలు. ఒక్కచేత్తో మా అమ్మ మమ్మల్ని పెంచుకురాలేదా? ఇన్నేళ్లొచ్చి ఇప్పుడు కదా కాస్త విశ్రాంతి తీసుకుంటోందీ. అదికూడా ఓర్చుకోలేకపోతున్నారు మీరు.’’
‘‘అది కాదులే అన్నయ్యా. ఈ ఏడాది తన పొలంమీదొచ్చిన అయివేజుతో మంజులకి డైమండ్‌ నెక్లెస్‌ కొని పంపింది అమ్మ. అప్పట్నుంచీ వీళ్లకి పాపం కారం రాసుకున్నట్లు ఉన్నట్లుంది’’ మా చిన్నవాడు సారథి వేళాకోళంగా అన్నాడు.
రేణుక ఉందే, ముందే ఉడుకుబోతు. నిజం చెబితే నిష్ఠూరమన్నట్టు చిన్నవాడు సారథి మాటల్లో వేళాకోళానికి నిజంగానే మండుకొచ్చివుంటుంది రేణుకకి.
‘‘ఆవిడ సొత్తు మాకేమీ అక్కర్లేదు. కూతురికే పెట్టుకోమనండి, లేదా తననే బంగారం తొడుగు చేయించుకుని దిగేసుకోమనండి’’ కాగే నూనెలో నీళ్లబొట్టు పడినట్లు చిటపటలాడింది రేణుక.
‘‘అవునయ్యా, ఒళ్లుమంటే మాకు. ఈ ఇంటికి కోడళ్లుగా వచ్చినప్పటి నుంచీ ఆవిణ్ణి కూర్చోబెట్టి ఇంటి పనంతా నెత్తినేసుకున్నాం. ఆవిడ ఆజ్ఞాపించిన పనల్లా దాసీవాళ్లలా పూర్తి చేశాం. ఆవిడ అన్నవన్నీ పడ్డాం. కాళ్లు నొక్కీ తలనొక్కీ సేవ చేసిన వాళ్లం మేము.

ఏడాదికోసారి బంగారు పిట్టల్లే విమానం దిగొచ్చి, ‘మమ్మీ’ అని కావలించేసుకున్నందుకు కూతురికి రవ్వలహారం చేయిస్తుంది. లేకపోతే తనే పలకసర్లో, వంకీగాజులో చేయించుకుంటుంది. అంతే తప్ప చిన్న బంగారం పెట్టి మాకు ముక్కు పుడకన్నా చేయించిందా ఇప్పటివరకూ? పైగా మేమేమనుకుని పోతామో అని ‘ఇది స్త్రీ ధనం, నా అయివేజు’ అంటూ మావాళ్లు ఏమీ పెట్టలేదన్న సంగతి గుర్తుచేస్తూ ఉంటుంది. అటువంటి మనిషిని అయ్యో అనాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి’’ నా కోడళ్లిద్దరూ వంతులవారీగా ఇన్నేళ్లుగా కడుపులో దాచుకున్న ఆవేశమంతా వెళ్లగక్కారు.
‘‘ఇంతకీ ఏమంటారో చెప్పండి నసపెట్టక’’ ఔననలేకా కాదనలేకా ఇరుకున పడుతూ సంభాషణ మొదటికి తెచ్చాడు మా పెద్దవాడు.
‘‘అనేదేముంది? ఇలా మంచం పట్టిన వాళ్లకి సేవ చేసేందుకు మనుషుల్ని ఇంటికి పంపించే సంస్థలుంటాయట కనుక్కోండి.’’
‘‘మరి అందాకా?’’
‘‘మాకు తప్పుతుందా?’’
సభ ముగిసింది.

*            *             *

ఔరా నా కోడళ్లూ! అత్తయ్యగారూ అత్తయ్యగారూ అని ఎంత వినయం ఒలకబోసేవాళ్లు. లోపల ఇంత అక్కసు ఉందన్నమాట నామీద. హుఁ వెధవది కాలూ చెయ్యీ నోరూ కదపలేని రోగమొచ్చింది కానీ లేకపోతేనా- ఓ ఆట ఆడించి ఉండేదాన్ని కాదూ. కాసేపటిదాకా వాళ్లమీది కోపంతో మనసు భగభగలాడుతూనే ఉంది.
అరగంట తరవాత నా గదిలోకి వచ్చింది సునీత. తను కనబడగానే నా ఆగ్రహాన్ని పైకి ప్రకటించాలని చాలా అనిపించింది. కానీ ఏదో బెరుకు. వాళ్లని తప్పుపట్టగల హక్కు నాకేముందని? మొట్టమొదటిసారి వెనుకంజ వేశాను.
సునీత నాతల కొద్దిగా పైకెత్తి భోజనానికి ముందు వేయాల్సిన టాబ్లెట్‌ నా నోట్లో వేసింది. కాసిని మంచినీళ్లు తాగించింది. తువ్వాలుతో నా పెదాలు తుడిచింది. ఆ తరువాత రేణుక భోజనం వడ్డించిన ప్లేటు తీసుకువచ్చింది. ఒక్కొక్క ఆధరువూ కలిపి చెంచాతో తినిపించింది.
నా అవసరాలన్నీ టైం ప్రకారం తీరుస్తున్నారు. కానీ... ఆ పనుల్లో యాంత్రికత తప్ప ఆత్మీయ స్పర్శ లేదేం? కనీసం, ‘అత్తయ్యా, ఎక్కడా నొప్పి లేదుగదా’ అని ఆప్యాయంగా అడగొచ్చును కదా.
ఇదేమిటి? తనముందు కోడళ్లు గడగడలాడాలని కోరుకునే తను వాళ్ల కటాక్ష వీక్షణం కోసం పాకులాడుతోందా? ప్చ్‌, కానీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు, వాళ్ల మనసు విరిగేలాగా ప్రవర్తించి ఇప్పుడు నాలిక కొరుక్కుని ఏం ప్రయోజనం?
అవును. నిజమే, వాళ్లన్న మాటల్లో అబద్ధమేముంది? మా అమ్మలాగా, మా అత్తలాగా అత్తగారి హోదా వెలగబెట్టాలనుకున్నానే గానీ, ఆ వెధవ సంప్రదాయం తప్పించి తన కూతురిలానే కోడళ్లూ ఒక అమ్మ కన్నబిడ్డలే అన్న జ్ఞానంతో ఆదరించి ఉంటే ఈరోజు వాళ్లు నన్నిలా తిరస్కరించి ఉండేవారా? ముందునుంచీ ఎందుకిలా ఆలోచించలేకపోయాను? ఎలా అబ్బింది నాకు ఆ హిట్లరు గుణం?
నా భర్త తెలివిగలవాడే కానీ మేధకుడు. మంచికి మరో రూపం. అవసరమయినప్పుడు కూడా గట్టిగా మాట్లాడేవాడు కాదు. మెత్తగా ఉంటే మొట్ట బుద్ధవుతుందని సామెత. ఆ మెతకదనాన్ని అలుసుగా తీసుకుని అందరూ వాడుకునేవాళ్లే. అన్నదమ్ములు కూడా వలపక్షం చూపించేవాళ్లు. ఆ అన్యాయం చూసే నాకు జ్ఞానోదయమయింది. నా నోరు గట్టిదయితే తప్ప ఈ లోకంలో నెగ్గుకురాలేనని తెలిసొచ్చింది. అంతే, నా ప్రపంచం నా చేతిలో కొచ్చేసింది. ఉన్నన్ని రోజులూ నా భర్త కూడా నామాట జవదాటలేదు.
ఆయన పోతూ పోతూ నేనయితే ఆస్తిని దుర్వినియోగం కానివ్వననే నమ్మకంతో యావదాస్తినీ నాపేర రాసిపోయారు. మా పుట్టింటి వాళ్లిచ్చిన పొలం వేరే ఉంది నాకు. నావెనకున్న ఐశ్వర్యం, అరవై ఏళ్లొచ్చినా చెక్కు చెదరని ఆరోగ్యం, గట్టినోరూ ఎవ్వరికీ లొంగి ఉండనక్కర లేదన్న ఆత్మవిశ్వాసమిచ్చిందని నేననుకుంటే, అధికారం, అహంకారం పెరిగిందని మిగతా అందరూ అనుకుని ఉండవచ్చు. అది నిజం కూడా కావచ్చేమో... ఏమో కాదు అదే నిజం. మొన్నటివరకూ నా కొడుకులూ కోడళ్లని కూడా ఆ పొగరుతోనే నేను గీసిన గీత దాటనివ్వలేదు. కాలికింద నొక్కి ఉంచిన తేలు ఆ కాలు ఎత్తగానే చెడకుట్టినట్టు ఇప్పుడు కసి తీర్చుకునే సమయం చిక్కింది వాళ్లకు. చేజేతులా నేచేసుకున్న పాపానికి ఫలితమిది. అనుభవించాల్సిందే.

 

*            *             *
 

పదిహేను రోజుల్లో ఇద్దర్ని వెతుక్కొచ్చారు మావాళ్లు నా సేవకి. మొదట వచ్చినామెకి ఇరవయ్యో ఇరవైరెండో వయసుంటుంది. ఒంటూపిరిగా ఉంది. నాది కొంచెం స్థూలకాయం. కొంచెం లేపాల్సివచ్చినప్పుడల్లా ‘అక్కా అక్కా’ అని పెద్దగా కేకలు పెట్టేది. కోడళ్లిద్దరూ పరిగెత్తుకు వచ్చేవారు చేస్తున్న పని వదిలిపెట్టి. వాళ్లమీద సగం పని పడేసేది. వారం గడిచేటప్పటికి మావాళ్లకి నీరస మొచ్చింది. ‘ఇంకొకళ్లని చూడండి’ అనేశారు.
రెండో ఆవిడ వయసుకి పెద్దదైనా గట్టిగా ఉంది. కానీ ప్రతి పనికీ విసుక్కునేది. నాకింకా తిండి పుష్టి తగ్గలేదు. రోజుకి రెండుమూడుసార్లు బెడ్‌పాన్‌ అవసరం కలిగేది. అప్పుడల్లా శివతాండవం చేసేది. ఈవిడకు పప్పూ గట్రా పెట్టకండమ్మా అని మా కోడళ్లని కసిరేది. పైకి ఎవరూ వినకుండా నన్ను నానా తిట్లూ తిట్టేది. రాష్‌గా కాలూ చెయ్యీ లాగేసేది. ఓసారి మా పెద్దవాడు చూశాడట, మర్నాడే మంగళం పాడేశాడు.
సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.

*            *             *

‘‘అమ్మా’’ నా గది ముందు వచ్చి నిలబడిన ఆవిణ్ణి కళ్లెత్తి చూశాను. సన్నటి జరీ అంచు గులాబీరంగు నేత చీర, మెళ్లో రెండు పేటల గొలుసు. చేతులకి రెండు జతల బంగారు గాజులు. నమ్రతగా నిలబడిన ఆమెను చూడగానే ఎక్కడో చూసినట్టుందే అనిపించింది. ఆమె నా దగ్గరగా వస్తూ, ‘‘అమ్మా, నన్ను గుర్తుపట్టారా?’’ అంది. మళ్లీ తనే, ‘‘ఒకటా రెండా నలభై ఏళ్ల పైమాట. మరిచిపోవడం సహజమే’’ అంటూ దగ్గరకు వచ్చి వేలాడుతున్న నా చేతిని తన చేతిలోకి తీసుకుని, మృదువుగా వత్తుతూ, ‘‘నేను బుజ్జమ్మా, కస్తూరిని. మీరిక్కడున్నారని తెలిసి వెతుక్కుంటూ వచ్చా’’ అంటోంది చెమ్మగిల్లిన కళ్లతో.
బుజ్జమ్మ... మెరుపు మెరిసినట్లు జ్ఞప్తికొచ్చేసింది.
అవును. ఏనాటి కస్తూరి. నలభై రెండేళ్ల క్రితం మా అత్తగారి తిట్లకి బెదిరిపోతూ వచ్చీరానట్టు వాకిలి ఊడుస్తున్న నా ముందు నిలబడి, ‘అమ్మా పనికి మనిషి కావాలా అమ్మా? ఇంట్లో ఏ పనైనా చేయగలను. కాదనకమ్మా. ఇబ్బందుల్లో ఉన్నాను’ అంటోంది ఈ కస్తూరి చేతులు జోడించి దీనంగా.
నాకయితే ఆ క్షణాన- మొక్కుకున్న దేవుడు వెంటనే ప్రత్యక్షమై నీ కోరిక తీర్చేశాను పో అన్నట్టనిపించింది. కానీ ఇక్కడ నా పెత్తనమేముంది? అదృష్టవశాత్తూ మా అత్తగారా మాటలు విన్నారు. కిందనుంచీ పైదాకా చూశారు ఆ అమ్మాయిని. శుభ్రంగా ఉంది. సంతృప్తి పడినట్టనిపించింది. ‘‘చూడూ ఏ పనయినా చేస్తావుగా?’’ అన్నారు. తల గబగబా ఊగించిందా పిల్ల.
‘‘పద పదా ఇంకా నిలబడతావేం? పనిమనిషి రాక నూతి పళ్లెంలో మూడు రోజుల అంట్లు మూలుగుతున్నాయి. ముందవి తోమేయ్‌. పదిరూపాయలిస్తాను. చివర్న అంట్లు ఎక్కువయ్యాయమ్మా అని సణగకూడదు.’’ మా అత్తగారు తర్జని ఊపుతూ కచ్చితమని నిర్ధారించేశారు.
ఆ అమ్మాయి ఔననలేదు కాదనలేదు. తల వంచుకునే నా చేతిలో చీపురు లాక్కుంది. ఓ పక్క మా అత్తగారు, ‘ఆ పని కాదు నీకు చెప్పింది’ అని అరుస్తున్నా, ‘పర్లేదు లే అమ్మా’ అంటూనే చిటికెలో వాకిలి ఊడ్చి, నీళ్లు చల్లి, ముగ్గుపెట్టి, అలా చూస్తూ నిలబడిపోయిన నా మొహంలోకి చూసి నవ్వింది. అదే మా తొలి పరిచయం.
అలా మా ఇంట్లో అడుగుపెట్టిన కస్తూరి  కొన్నినాళ్లలోనే అందరి తల్లోనూ నాలుకయిపోయింది. ఏ చిన్న పనొచ్చినా కస్తూరీ కస్తూరీ జపమే. ఇందరి మధ్యన నేనంటే తనలో ప్రత్యేక స్థానముందని నాకు తెలుసు. మిగతా వారందరూ పిలిస్తేనే పరిగెడుతుంది. నేను పిలవకుండానే నా అవసరం తనకు తెలుసునన్నట్టు ప్రత్యక్షమవుతుంది చిత్రంగా.
నేను చేసిన తప్పులూ, పొరపాట్లూ తననెత్తిన వేసుకుని మా అత్తగారితో తిట్లు తినేది ఎన్నిసార్లో. నాకు సన్నజాజులంటే ఇష్టమని, వాళ్ల చుట్టుపక్కల ఇళ్లలో వెతికి వాళ్లని బతిమలాడి పందిరిమీది మొగ్గలన్నీ కోసి, గుత్తంగా మాలకట్టి మెట్టతామర ఆకులో చుట్టి పదిలంగా తెచ్చిపెట్టేది.
నాకు నెల తప్పింది. పుట్టింటిలోనూ అత్తవారింట్లోనూ సంతోషం, సంబరాలు. ఈ హడావిడిలో వారం రోజులపాటు కస్తూరి మిస్‌ కావటం తెలీలేదు. వారం తరవాత కనబడిన కస్తూరిలో జీవం లేదు. పాలిపోయింది. తనకి కూడా గర్భం వచ్చిందట. ‘మీ ఇద్దరినే పోషించలేక చస్తున్నాను, ఆ పిండానికి కూడా నేను పిండం పెట్టలేను’ అని నాటుమందుతో గర్భస్రావం చేయించిందట అత్తగారు. వలవల కన్నీరు కార్చింది కస్తూరి.
ఆ తరవాత రోజు ఎవరూ చూడనప్పుడు నాకాళ్ల మీద పడింది కస్తూరి. ‘‘బుజ్జమ్మా ఆ కాంట్రాక్టరు దగ్గర బ్రోకరుకి పదివేలు లంచమిస్తే పర్మినెంటుగా పని వేయిస్తానన్నాడటమ్మా. నామీద దయదలిచి ఆ పదివేలూ అప్పుగా ఇస్తివా నా చర్మం ఒలిచి నీకు చెప్పులు కుట్టిస్తానమ్మా’ అని.
అమ్మ అప్పుడప్పుడూ ఇచ్చే పైకం లోంచి పదివేలూ తీసిచ్చాను. దాని సంతోషం చెప్పనలవికాదు. ఆ తర్వాత రోజొచ్చి సంబరపడుతూ చెప్పింది. మగనికి పర్మినెంటు ఉద్యోగమయిందని. పది పదిహేను రోజుల్లో తీసుకున్న పదివేలూ వెనక్కిచ్చేసింది. నాలుగురోజులకొక కొత్త కబురు... అత్తగారిప్పుడు తనని నెత్తిమీద పెట్టుకుంటోందట. మగడు కొత్త బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తానంటున్నాడట. ‘‘నువ్వు నాకిచ్చింది డబ్బు కాదమ్మా, అదృష్టాన్ని. అది దేన్లో పెట్టినా బంగారమవుతోంది’’ అంది మురిసిపోతూ. ఓరోజన్నది, ‘‘నువ్వింక పనికి వెళ్లమాకు అన్నాడమ్మా మా ఆయన. మా బుజ్జమ్మ ఉన్నన్నాళ్లూ మానేసే ప్రసక్తే లేదు అని చెప్పేశానమ్మా’’ అంది.
నేను దానికేసి గాఢంగా చూశాను. ఏ జన్మ సంబంధమిది? దాని రెండు చేతులూ నా చెంపలకానించుకున్నాను.
నేను పురిటికి పుట్టింటికి వెళ్లే రోజొచ్చింది. నా తల్లో మూరెడు సన్నజాజి మాల తురిమి, ‘‘నేనెక్కడున్నా నీ కొడుకుని చూట్టానికి తప్పకుండా వస్తానమ్మా’’ అంది కళ్లనీళ్లతో.
అంతే. అప్పుడు చూసిన కస్తూరిని మళ్లీ ఇదే చూట్టం... ‘‘నిన్నిలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు బుజ్జమ్మా’’ అంది కస్తూరి ఏడుస్తూ. నేను బదులు ఇవ్వలేకపోయినా తనే ఏదో ఒకటి చెబుతూనే ఉంది సాయంత్రం దాకా.
వాళ్ల స్థితి ఇప్పుడు చాలా బాగా ఉన్నదట. కొడుకులిద్దరూ కూరగాయలూ, పళ్లూ విదేశాలకి ఎక్స్‌పోర్ట్‌ చేస్తారట. పెళ్లిళ్లు చేసుకున్నారట. బిల్డింగులు కట్టుకున్నారట. తనని దేవతలా చూసుకుంటారట. ‘‘బుజ్జమ్మా ఆరోజున దయతో నువ్విచ్చిన పదివేలేనమ్మా ఈ స్థితికి కారణం. అది నేనెప్పుడూ మరిచిపోనమ్మా’’ అంది కస్తూరి.
ఇంకో విచిత్రమేమంటే ఆ సాయంత్రం కొడుకులిద్దరూ వచ్చి రమ్మన్నా కదలలేదు కస్తూరి. ‘‘నా తల్లిని ఈ స్థితిలో వదిలేసి నేనెలా రాగలను?’’ అంది. నాతోనే ఉండిపోయింది.
ఆరునెలలు నాపని ఒక్కటి కూడా ఇంకొకర్ని చేయనీయలేదు. కాళ్లకూ చేతులకూ ఆయిల్‌ మర్దనాలూ, ఎక్సర్‌సైజులూ, రోజూ పుష్టిగా ఆహారం. నేను లేచి నిలబడిన రోజు కస్తూరి స్వీట్లు పంచిపెట్టింది. నేను ‘కస్తూరి’ అని నత్తిగా పలికిన రోజు గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టింది.
ఆరోజు నా కొడుకులనీ కోడళ్లనీ నా గదికి పిలిచాను. ఇనప్పెట్టె తాళాలు నా కొడుకులిద్దరి చేతిలోనూ పెట్టాను. నా నగలన్నీ తీసి కోడళ్లకి అందించాను. ‘ఏమిటమ్మా ఇదంతా?’ అన్నారు వాళ్లు.
‘ఇవేవీ నన్నాదుకోలేవని తెలిసిందిరా నాన్నా. చేసిన తప్పు దిద్దుకుంటున్నాను. ఇకనుంచీ మీ బిడ్డలతో పాటూ నేనూ మీ బిడ్డనే’ అన్నాను మనస్ఫూర్తిగా.
కస్తూరి కొడుకులు వచ్చారు తల్లిని తీసుకువెళ్లడానికి. ఇంటిల్లిపాదీ మా కస్తూరిని ఆశ్రునయనాలతో సాగనంపాము.
మా ఇంటి పక్కనుండే పంకజం అడుగుతోంది ఆశ్చర్యంగా ‘ఎవరావిడ?’ అని.
ఎవ్వరూ నోరువిప్పక ముందే చెప్పాను- ‘నేను చేసిన పుణ్యం’ అని.

Advertisement

Tags :

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న