పూర్వజన్మ సంస్కారం

పండరీపురానికి దగ్గర్లో ఉన్న మహారాష్ట్రలోని మంగళవేద గ్రామంలో శ్యామ అనే వేశ్య ప్రసవించింది. ఆ చిన్నారి పేరు కన్హో. ఆమె చాలా అందంగా ఉండేది. చక్కగా పాటలు పాడేది. నృత్యం కూడా బాగా చేసేది.

Published : 07 Dec 2023 00:15 IST

పండరీపురానికి దగ్గర్లో ఉన్న మహారాష్ట్రలోని మంగళవేద గ్రామంలో శ్యామ అనే వేశ్య ప్రసవించింది. ఆ చిన్నారి పేరు కన్హో. ఆమె చాలా అందంగా ఉండేది. చక్కగా పాటలు పాడేది. నృత్యం కూడా బాగా చేసేది. కూతురికి తనలాంటి జీవితం వద్దని పుట్టింటికి పంపింది శ్యామ. ఊహ తెలిసింది మొదలు పాండురంగణ్ణి ఆరాధిస్తూ ఇహలోక సుఖసౌఖ్యాలకు దూరంగా జీవిస్తున్న కన్హోని  ‘బురదలో పుట్టిన కమలం’ అంటూ అంతా మెచ్చుకునేవాళ్లు. యుక్త వయసు వచ్చిన ఆమె, ఒకసారి తల్లి వద్దకు రాగా.. ఊరి పెద్ద సదాశివ చూశాడు. ఆ అందం చూసి చలించిపోయి.. ‘ఈరోజు నుంచి కన్హో నాదే’ అన్నాడు శ్యామతో. విషయం తెలిసిన కన్హో తక్షణం పండరీపురం వెళ్లిపోయింది. భక్తితో కీర్తనలు ఆలపిస్తూ గడపసాగింది.

ఆమె ఉనికి తెలుసుకున్న సదాశివ అక్కడికి వెళ్లాడు. బీదర్‌ నవాబు సాయంతో కన్హోని బంధించే ప్రయత్నం చేశాడు. రాజభటులు ఆలయంలో ప్రవేశించడంతో.. కన్హో పాండురంగ స్వామిని ఆర్తితో వేడుకుంది. అంతే.. భీమానది ఉప్పొంగి, అందర్నీ నీటిలో ముంచేసింది. కన్హో పాండురంగనిలో లీనమైంది. ఆ ప్రదేశంలో తరటీ అనే చెట్టు వెలసింది. కన్హోయే అలా వృక్షంగా మారిందనే నమ్మకంతో గుడి కట్టి పూజలు చేయసాగారు. అదీ భక్త కన్హో కథ. చోరుడి పుత్రుడు చౌర్యమే చేస్తాడు అనుకోవడం లోక రివాజు. కానీ అది నిజం కాదు. తల్లిదండ్రులు చేసిన తప్పులను పిల్లలకు అంటగట్టి.. వారి మీద అలా ముద్ర వేయడం సబబు కాదని ఈ ఉదంతం తెలియజేసింది. పూర్వ జన్మ సంస్కారాలను బట్టి ఈ జన్మలో గుణాలు రూపొందుతాయంటారు ఆధ్యాత్మికవేత్తలు. కన్హో అందుకు నిదర్శనం.

అచ్యుతుని రాజ్యశ్రీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని