TS Exams 2022: గ్రూపు- 1, 2ల సన్నద్ధత... ఏక కాలంలోనా? వేర్వేరుగానా?

త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండింటికీ కలిపి ఒకేసారి సన్నద్ధం కావాలా? ఒకదాని తర్వాత మరో దానికి ప్రిపరేషన్‌ కొనసాగించాలా?... ఉద్యోగ నియామక పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అధిక శాతం అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్న సందేహమిది....

Updated : 19 Apr 2022 05:55 IST

త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పరిస్థితుల్లో రెండింటికీ కలిపి ఒకేసారి సన్నద్ధం కావాలా? ఒకదాని తర్వాత మరో దానికి ప్రిపరేషన్‌ కొనసాగించాలా?... ఉద్యోగ నియామక పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అధిక శాతం అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్న సందేహమిది.

న్నద్ధత విషయంలో అభ్యర్థులను కలవరపెడుతున్న ప్రశ్ననే పలువురు పోటీ పరీక్షల నిపుణుల వద్ద ‘ఈనాడు’ ఉంచింది. ఒకేసారి సన్నద్ధం కావొచ్చనీ, కాకపోతే తమ శక్తి సామర్ధ్యాలను సరిగా అంచనా వేసుకోవడం ముఖ్యమనీ బోధన నిపుణులు స్పష్టంచేస్తున్నారు. అందుకే చాలాచోట్ల గ్రూపు-1, 2కు కలిపే కోచింగ్‌ తరగతులు జరుపుతున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం ఒకదాని తర్వాత మరో దానికి సన్నద్ధమైతేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.


ఒత్తిడికి గురికాకుండా..  

- నూతనకంటి వెంకట్‌, పోటీ పరీక్షల నిపుణులు

సిలబస్‌ ఒకటే అయినందున శాస్త్రీయపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా రెండిటికీ సన్నద్ధం కావడానికి అవకాశం ఎక్కువ. అయితే అభ్యర్థి తన శక్తి సామర్థ్యాలను నిజాయతీగా అంచనా వేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గ్రూపు-1లో విశ్లేషణ సామర్ధ్యం, విస్తృత అవగాహన, సబ్జెక్టుపై పట్టు, రాత సాధన తప్పనిసరి. గ్రూపు-2 ఆబ్జెక్టివ్‌ విధానం కాబట్టి మెమరీ టెక్నిక్‌లు, సమాచార సేకరణ, పునశ్చరణ, నిరంతరం నమూనా పరీక్షలను రాయడం అవసరం. దీన్ని గమనంలో ఉంచుకొని అయోమయానికి గురికాకుండా...ఒత్తిడికి లోనుకాకుండా సన్నద్ధమవుతామా?అని ఎవరికివారు నిజాయతీగా అంచనా వేసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.


అదనంగా కష్టపడితే చాలు

- శ్రీకాంత్‌ విన్నకోట, అనలాగ్‌ ఐఏఎస్‌ అకాడమీ

రెండు పరీక్షల పాఠ్య ప్రణాళిక ఒకటే అయినా... గ్రూపు-1లో ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. అదే గ్రూపు-2లో నేరుగా జవాబు ఉండే ప్రశ్నలిస్తారు. కొంచెం అదనంగా కష్టపడితే ఒకేసారి గ్రూపు-1తోపాటు గ్రూపు-2 సన్నద్ధత కూడా పూర్తవుతుంది.


అయోమయానికి దారితీయొచ్చు

- కృష్ణ ప్రదీప్‌, ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ

గ్రూపు-1 ప్రిలిమ్స్‌, గ్రూప్‌-2 సిలబస్‌ దాదాపు ఒకటే. సన్నద్ధత మాత్రం తేడా ఉంటుంది. గ్రూపు-1లో బహుళ ఐచ్ఛిక ప్రశ్నలతో కూడిన ప్రిలిమినరీతోపాటు వ్యాసరూప ప్రశ్నలతో ప్రధాన పరీక్ష (మెయిన్‌) ఉంటుంది.

అదే గ్రూపు-2లో మెయిన్‌ ఉండదు. గ్రూపు-1లో 150 మార్కులతో ఒకటే ఆబ్జెక్టివ్‌ పేపర్‌ ఉంటుంది. ఇంకా మెయిన్‌లో ఆంగ్లంతోపాటు మరో ఆరు పేపర్లు రాయాలి. అంటే విస్తృతంగా చదవాలి....రాయడం సాధన చేయాలి. అదే గ్రూపు-2లో ఒక్కో పేపర్‌ 150 మార్కుల చొప్పున నాలుగు పరీక్షలు రాయాలి. అంతవరకు బాగానే ఉన్నా గ్రూపు-1 ప్రిలిమినరీలో కాన్సెఫ్ట్‌ ఆధారంగా, కొంచెం సంక్లిష్టంగా, గందరగోళంలో పడేసేలా ప్రశ్నలు ఇస్తారు.

గ్రూపు-2లో మాత్రం జ్ఞాపకశక్తిని పరీక్షించే...వాస్తవాల ఆధారంగా ప్రశ్నలుంటాయి. ఇక్కడ సిలబస్‌కు పరిమితి ఉంటుంది. అందువల్ల రెండిటికీ ఒకేసారి సన్నద్ధమవ్వడం అయోమయానికి దారితీస్తుంది. విజయావకాశాలను దెబ్బతీయొచ్చు. అందుకే వేర్వేరుగా సన్నద్ధం కావడం మంచిది.


గత అనుభవాలను బట్టి...

- దుంపల మల్లేశ్వరిరెడ్డి, లా ఎక్స్‌లెన్స్‌ ఐఏఎస్‌ అకాడమీ.

సిలబస్‌ ఒకటే అయినందున గ్రూపు-1కు చదివితే గ్రూపు-2 కూడా రాయగలుగుతారు. కాకపోతే గ్రూపు-1 ప్రిలిమినరీ కంటే గ్రూపు-2 పరీక్షలు (అంతా ఆబ్జెక్టివ్‌ విధానం) కష్టం. గ్రూపు-1లో 1: 50 నిష్పత్తి చొప్పున మెయిన్‌ పరీక్షకు అర్హత కల్పిస్తారని అనుకుందాం. తెలంగాణ గ్రూపు-1లో 503 ఖాళీలకు నోటిఫికేషన్‌ రానున్నందున 25,150 మంది మెయిన్‌ పరీక్ష రాయడానికి వీలవుతుంది. అంటే ఇక్కడ ఆ పరీక్షే అంతిమం అవుతుంది. అదే గ్రూపు-2లో మెయిన్‌ పరీక్ష ఉండదు. ఈసారి ఇంట ర్వ్యూలు కూడా తొలగించారు. అంటే ఒకే ఒక పరీక్ష...అదే అంతిమం. ఎన్ని ఖాళీలుంటే అంత మందిని ఎంపిక చేస్తారు. గ్రూపు-1లో నియామక పత్రం చేతిలో పెట్టేవరకూ సందిగ్ధత ఉంటుందని గత అనుభవాలను బట్టి అర్థమవుతోంది. అందుకే రెండు పరీక్షలకూ సన్నద్ధం కావాలని శిక్షణకు వచ్చే అభ్యర్థులకు చెబుతున్నా.  

- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని