ఏపీ పోలీసు శాఖలో కొలువుకు సిద్ధమేనా?

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీకి నగారా మోగింది. 6100 కానిస్టేబుల్‌ (3,580 సివిల్‌, 2,520 ఏపీఎస్పీ), 411 ఎస్సై (315 సివిల్‌, 96 రిజర్వ్‌) పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 04 Dec 2022 20:54 IST

6511 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల    

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు ఉద్యోగాల భర్తీకి నగారా మోగింది. 6100 కానిస్టేబుల్‌ (3,580 సివిల్‌, 2,520 ఏపీఎస్పీ), 411 ఎస్సై (315 సివిల్‌, 96 రిజర్వ్‌) పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు, మెయిన్‌ పరీక్షల్లో చూపిన ప్రతిభతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

కీలకమైన ప్రాథమిక (ప్రిలిమినరీ) రాతపరీక్ష... కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు 2023 జనవరి 22న, ఎస్‌ఐ ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న జరగబోతోంది. కానిస్టేబుల్స్‌, ఎస్‌ఐ అభ్యర్థులకు ఒకటి రెండు అంశాలు మినహా ప్రిలిమ్స్‌ సిలబస్‌ పూర్తిగా ఒకేవిధంగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 6- 7 లక్షల మంది అభ్యర్థులు కానిస్టేబుల్‌ పరీక్షకూ, 2 లక్షల నుంచి 2.75 లక్షల మంది అభ్యర్థులు ఎస్‌ఐ పరీక్షకూ పోటీ పడవచ్చునని ప్రాథమిక అంచనా.

ప్రిలిమ్స్‌కు సమయం తక్కువగా ఉన్నందున మొత్తం సిలబస్‌ను పూర్తిచేయడం కష్టం. సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగించటం ముఖ్యం. ఇది అర్హత పరీక్ష మాత్రమే కాబట్టి సిలబస్‌ అంశాలను పరిపూర్ణంగా చదివితే తేలిగ్గానే నెగ్గవచ్చు. ఎక్కువ మార్కులు సులువుగా వచ్చే సబ్జెక్టులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.    
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నియామకాలకు జరిగే ప్రిలిమినరీ టెస్ట్‌లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఇస్తారు. అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ స్టడీస్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కానిస్టేబుల్స్‌ పరీక్ష సిలబస్‌, ఎస్‌.ఐ. పరీక్ష సిలబస్‌ దాదాపు ఒకటే.

జనరల్‌ స్టడీస్‌ అంశాలు పరిశీలిస్తే...

చరిత్ర: భారతదేశ చరిత్ర- సంస్కృతి నుంచి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన జైనులు, బౌద్ధులు, సింధు నాగరికత, గుప్తులు, మౌర్యులు మొదలైనవి ముఖ్యమైన అంశాలు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో దిల్లీ సుల్తానులు, విజయనగర సామ్రాజ్యం, భక్తి, సూఫీ ఉద్యమాలు, మొగలులు తదితర అంశాలు చదవాలి. ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు, బ్రిటిష్‌ సామ్రాజ్య విస్తరణ, జాతీయోద్యమం ప్రాముఖ్య అంశాలు. భారతదేశ చరిత్రలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర అధ్యయనం చేయాలి.

జాగ్రఫీ: భారతదేశ భౌగోళిక వ్యవస్థలో శీతోష్ణస్థితి, నదులు, అడవులు, వ్యవసాయం, ఖనిజ వనరులు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, జనాభా మొదలైన అంశాలు ప్రధానమైనవి. దీనిలో దేశ, రాష్ట్ర అంశాలను పట్టిక రూపంలో తయారుచేసుకుంటే సన్నద్ధత సులభంగా ఉంటుంది.

పాలిటీ: రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, కేంద్ర, రాష్ట్ర పాలన వ్యవస్థలు, ఐరాస, అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్నికలు మొదలైన అంశాలు చదవాలి.

ఆర్థికశాస్త్రం: ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలు, ఆర్థిక కమిషన్‌లు, బడ్జెట్‌, జనాభా వృద్ధి రేటు మొదలైనవి ముఖ్యమైనవి.

జనరల్‌ సైన్స్‌: మానవ నిర్మాణం, వ్యాధులు, రక్తవర్గాలు, విటమిన్లు, ఉపగ్రహాలు, రక్షణ వ్యవస్థలోని యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, పరిశోధనలపై ప్రశ్నలు అడగవచ్చు.

అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌: అరిథ్‌మెటిక్‌లో 25, రీజనింగ్‌లో 30 టాపిక్స్‌ ఉంటాయి.

అరిథ్‌మెటిక్‌: సంఖ్యలు- వాటి ధర్మాలు, స్థాన విలువ, ముఖ విలువ, భాజనీయత సూత్రాలపై పట్టు సాధించాలి. బారువడ్డీలో వడ్డీ, కాలం, వడ్డీ రేటు, అసలులో ఏదో ఒకటి లెక్కించాలి. 3 నెలలూ, 6 నెలలూ, ఏడాదికి చక్రవడ్డీని లెక్కించడం, బారువడ్డీ, చక్రవడ్డీల మధ్య సంబంధంపై ప్రశ్నలను సాధన చేయాలి. నిష్పత్తి అనుపాతంలో మిశ్రమ నిష్పత్తి, వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి, విలోమ నిష్పత్తి, రెండు నిష్పత్తులకు ఒక సంఖ్య కలపడం లేదా తీసివేయడం, సగటు, లాభనష్టాలు, శాతంలో పెరిగిన తగ్గిన శాతం మొదలైనవి సాధన చేయాలి. పని, వేతనం, దూరం- కాలం, సాపేక్ష వేగం తదితర ప్రశ్నలు అడగవచ్చు. భాగస్వామ్యం, క.సా.గు, గ.సా.భా వైశాల్యాలు, ఘన పరిమాణాలు మొదలైనవి ముఖ్యమైనవి.

రీజనింగ్‌: దిక్కులు, కోడింగ్స్‌, ర్యాంకింగ్‌, పోలిక, భిన్న పరీక్షలు, గణిత ప్రక్రియలు, లాజికల్‌ వెన్‌ చిత్రాలు, పాచికలు, దర్పణ (అద్దం) ప్రతిబింబాలు, నీటి ప్రతిబింబాలు, శ్రేణులు, పోలిక పరీక్ష, భిన్న పరీక్ష మొదలైనవి ముఖ్యం. లాజికల్‌ రీజనింగ్‌లో ప్రకటనలు, ఊహాగానాలు, తీర్మానాలు, తర్కవాదం చదవాలి.
ఎస్‌.ఐ. (ఏపీ) ప్రిలిమినరీ పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి.

1. అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌/ మెంటల్‌ ఎబిలిటీ: 100 మార్కులు

2. జనరల్‌ స్టడీస్‌: 100 మార్కులు

రెండు పేపర్లలో అర్హత సాధిస్తేనే రెండో దశ అయిన ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌ (పీఈటీ)కి అనుమతి లభిస్తుంది. సమయం తక్కువ ఉంది కాబట్టి ఏ రోజు చదివింది ఆ రోజు రివిజన్‌ చేసుకుంటూ మాదిరి ప్రశ్నలను సాధన చేయాలి. గతంలో అడిగిన ప్రశ్నల సరళి చూసుకొని పొరపాట్లను అధిగమిస్తే అర్హత చాలా సులువు.


యూనిట్‌ వారీగా సివిల్‌ కానిస్టేబుల్‌ ఖాళీలు

1. శ్రీకాకుళం- 100

2. విజయనగరం- 134

3. విశాఖపట్నం సిటీ- 187

4. విశాఖపట్నం రూరల్‌- 159

5. తూర్పు గోదావరి- 298

6. రాజమహేంద్రవరం అర్బన్‌-83

7. పశ్చిమ గోదావరి- 204

8. కృష్ణా- 150

9. విజయవాడ సిటీ- 250

10. గుంటూరు రూరల్‌- 300

11. గుంటూరు అర్బన్‌- 80

12. ప్రకాశం- 205

13. నెల్లూరు- 160

14. కర్నూలు- 285

15. వై.ఎస్‌.ఆర్‌. కడప- 325

16. అనంతపురం- 310

17. చిత్తూరు- 240

18. తిరుపతి అర్బన్‌- 110

కానిస్టేబుల్‌ అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: కనీసం 18 నుంచి 32 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

సివిల్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/ లాంగ్‌జంప్‌ ఈవెంట్లు ఉంటాయి.

ఏపీఎస్‌పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్‌జంప్‌ ఈవెంట్లు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి.

కానిస్టేబుల్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28.12.2022

ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 22.01.2023


బెటాలియన్‌ వారీగా ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఖాళీలు

1. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల- 630

2. రాజమహేంద్రవరం- 630

3. ప్రకాశం జిల్లా మద్దిపాడు- 630

4. చిత్తూరు- 630


ఎస్సై

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: కనీసం 21 నుంచి 27 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌లో భాగంగా సివిల్‌ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు/ లాంగ్‌జంప్‌ ఈవెంట్లు ఉంటాయి.

ఏపీఎస్‌పీ రిజర్వ్‌ ఎస్సై అభ్యర్థులకు 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్‌జంప్‌ ఈవెంట్లు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.

ఎస్సై దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022

దరఖాస్తుకు చివరి తేదీ: 18.01.2023

ప్రిలిమినరీ పరీక్ష తేది: 19.02.2023

వెబ్‌సైట్‌: https://slprb.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని