భారత విద్యార్థులకు బ్రిటిష్‌ కౌన్సిల్‌ స్కాలర్‌షిప్స్‌

బ్రిటిష్‌ కౌన్సిల్‌ యూకేలో వివిధ కోర్సులు చేసే భారత విద్యార్థులకు ‘గ్రేట్‌ బ్రిటన్‌ క్యాంపెయిన్‌’లో భాగంగా కొన్ని రకాల స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ పీజీ చదివే భారత విద్యార్థులకు 20 స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది.

Published : 05 Apr 2022 00:46 IST

బ్రిటిష్‌ కౌన్సిల్‌ యూకేలో వివిధ కోర్సులు చేసే భారత విద్యార్థులకు ‘గ్రేట్‌ బ్రిటన్‌ క్యాంపెయిన్‌’లో భాగంగా కొన్ని రకాల స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. 2022-23 విద్యా సంవత్సరానికిగానూ పీజీ చదివే భారత విద్యార్థులకు 20 స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది. ఇవి అక్కడి 16 ప్రధాన వర్సిటీల్లో చదివేవారి కోసం ఉద్దేశించినవి. బిజినెస్‌, హ్యుమానిటీస్‌, ఫైనాన్స్‌, సైకాలజీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, డిజైన్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, మ్యూజిక్‌ కోర్సులు చేసేవారికి తొలి ప్రాధాన్యం. అలాగే లా అండ్‌ జస్టిస్‌ చదివే వారికోసం విడిగా 7 స్కాలర్‌షిప్‌లు ఇవ్వనుంది. హ్యుమన్‌ రైట్స్‌, క్రిమినల్‌ జస్టిస్‌, కమర్షియల్‌ లా సబ్జెక్టులు చదివే వారికి ఈ అవకాశం ఉంటుంది. ఒక్కో స్కాలర్‌షిప్‌ విలువ దాదాపు 10 వేల పౌండ్లు (రూ.10 లక్షలు). ట్యూషన్‌ ఫీజుగా అందించే ఈ స్కాలర్‌షిప్‌తో ఏడాది ప్రోగ్రాంను ఎంచక్కా పూర్తి చేయొచ్చు. అలాగే ‘యూనివర్సిటీ ఆఫ్‌ లీడ్‌’లో ఫుల్‌టైం ఎంఏ చదివేవారికి 3 స్కాలర్‌షిప్‌లను ప్రకటించగా, మరో మూడింటిని ‘యూనివర్సిటీ ఆఫ్‌ స్టెర్లింగ్‌’లో ఎమ్మెస్సీ ఆన్‌లైన్‌ లేదా పార్ట్‌టైంలో చదివేవారి కోసం ఇస్తోంది. ఈ కోర్సు చదివే సమయంలో పూర్తిగా రెండు వారాలు యూనివర్సిటీ రెసిడెస్సీలో ఉండొచ్చు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌లో పీజీ చేసేందుకు ప్రైమరీ, సెకండరీ పాఠశాలల నుంచి వచ్చే భారత్‌కు చెందిన ఇంగ్లిష్‌ టీచర్లకు ప్రత్యేకంగా రెండు స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది.
అర్హత: అభ్యర్థి తప్పకుండా భారత సంతతికి చెందినవారై ఉండాలి. అకడమిక్‌ స్కోరు ప్రామాణికం. ఇంగ్లిష్‌ నైపుణ్యం అవసరం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో; ఇతర వివరాలకు వెబ్‌సైట్‌: www.britishcouncil.in/study-uk/scholarships/great-scholarships


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని