సంపూర్ణ ఆరోగ్య సంరక్షకాలు!

శరీరంలో పెరుగుదల ఎలా జరుగుతుంది? జీవక్రియలు సక్రమంగా సాగేందుకు సాయపడే శక్తి ఏమిటి? గాయాలు ఏవిధంగా మానతాయి? వ్యాధులు తగ్గడానికి దోహదపడేవి ఏవి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం పోషకాలు. ఇవి వివిధ పదార్థాల్లో రకరకాలుగా లభిస్తాయి.

Updated : 04 Jul 2022 01:23 IST

జనరల్‌స్టడీస్‌ బయాలజీ  

శరీరంలో పెరుగుదల ఎలా జరుగుతుంది? జీవక్రియలు సక్రమంగా సాగేందుకు సాయపడే శక్తి ఏమిటి? గాయాలు ఏవిధంగా మానతాయి? వ్యాధులు తగ్గడానికి దోహదపడేవి ఏవి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం పోషకాలు. ఇవి వివిధ పదార్థాల్లో రకరకాలుగా లభిస్తాయి. శరీరానికి అవసరమైనంత అందితే సంపూర్ణ ఆరోగ్యం. లోపిస్తే వ్యాధులు కలుగుతాయి. ఈ అంశాలపై పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.


పోషక పదార్థాలు

న శరీరంలో అనేక పనులు, జీవక్రియలు జరగడానికి పోషకాలు అవసరమవుతాయి. ఇవి శరీరానికి తినే ఆహారం ద్వారా లభ్యమవుతాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో ఉండే పదార్థాలను పోషక పదార్థాలు అంటారు. శరీర పెరుగుదలకు, జీవక్రియలు సక్రమంగా జరగడానికి, గాయాలు మానడానికి, కణాల మరమ్మతుకు, వ్యాధినిరోధక శక్తి పెంపొందడానికి  పోషకాలు అవసరం. శరీరానికి అవసరమయ్యే పరిమాణం ఆధారంగా పోషక పదార్థాలను రెండు రకాలుగా విభజించవచ్చు.

1) స్థూల పోషక పదార్థాలు  
2) సూక్ష్మ పోషక పదార్థాలు

స్థూల పోషక పదార్థాలు: శరీరానికి ఎక్కువ మొత్తంలో అంటే రోజూ కొన్ని గ్రాముల నుంచి ఒక కిలో వరకు అవసరమయ్యే పదార్థాలను స్థూల పోషక పదార్థాలు అంటారు.
ఉదా: కార్బోహైడ్రేట్‌లు, లిపిడ్‌లు, ప్రొటీన్‌లు

సూక్ష్మ పోషక పదార్థాలు: శరీరానికి తక్కువ మొత్తంలో అంటే రోజూ కొన్ని మైక్రోగ్రాముల నుంచి మిల్లీగ్రాముల వరకు అవసరమయ్యే పోషక పదార్థాలను సూక్ష్మ పోషక పదార్థాలు అంటారు.
ఉదా: విటమిన్లు, ఖనిజ లవణాలు


విటమిన్లు

వి సూక్ష్మపోషక పదార్థాలు. ఎలాంటి శక్తిని ఇవ్వవు. కొన్ని ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియలకు ఉపయోగపడతాయి. జంతువులు విటమిన్‌లను తయారు చేసుకోవు. మొక్కల కణాలు, కొన్నిరకాల సూక్ష్మజీవులు విటమిన్‌లను తయారు చేసుకుంటాయి. కాసిమర్‌ ఫంక్‌ అనే శాస్త్రవేత్త విటమిన్‌ అనే పేరు పెట్టి వాటిని వర్గీకరించారు. బి1 విటమిన్‌ను పరిశుద్ధ స్థితిలో వేరుచేశారు. అందుకే ఆయనను విటమిన్‌ల శాస్త్ర పిత అంటారు. విటమిన్‌లను ఎ, బి, సి, డి, ఇ, కె గా వర్గీకరించారు.

* కరిగే విధానాన్ని బట్టి విటమిన్లు రెండు రకాలు.

1) నీటిలో కరిగేవి - ఉదా: బి, సి విటమిన్లు.
2) కొవ్వులో కరిగేవి - ఉదా: ఎ, డి, ఇ, కె విటమిన్లు.

* శరీరంలో విటమిన్లు నిల్వ ఉండే విధానాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు.

1) శరీరంలో నిల్వ ఉండేవి: మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు ఎక్కువగా ఉంటే శరీరం ఉపయోగించుకున్న తర్వాత మిగిలినవి శరీరంలో నిల్వ ఉంటాయి. ఇవి కాలేయంలో నిల్వ ఉంటాయి.
ఉదా: ఎ, డి, బి12 విటమిన్లు

2) మన శరీరంలో నిల్వ ఉండనివి: ఆహారంలో ఇవి ఎక్కువగా ఉంటే శరీరం ఉపయోగించుకోగా మిగిలినవి మూత్రం ద్వారా బయటకు విడుదలవుతాయి.
ఉదా: బి, సి విటమిన్లు


వర్గీకరణ

విటమిన్‌ - ఎ: దీని రసాయనిక నామం రెటినాల్‌. విటమిన్‌ - ఎ కంటిలో ఉన్న లాక్రిమల్‌ గ్రంథుల (అశ్రు గ్రంథులు) పనితీరుకు అవసరం. ఇది ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది. కాబట్టి దీన్ని యాంటీ ఇన్‌ఫెక్టివ్‌ విటమిన్‌ అంటారు. విటమిన్‌ ఆఫ్‌ గ్రోత్‌ అని కూడా అంటారు.

లోపం వల్ల కలిగే వ్యాధులు: రేచీకటి  (నిక్టలోపియా)

* గ్జిరాఫ్తాల్మియా (డ్రై ఐస్‌)

* కెరాటో మలేసియా. ఈ వ్యాధిలో కార్నియా విచ్ఛిన్నమై అంధత్వం కలుగుతుంది. ఈ రకమైన అంధత్వాన్ని పోషకాహార అంధత్వం అంటారు.

* బిటాట్‌ స్పాట్స్‌. ఈ వ్యాధిలో కంటిలోని కన్‌జెక్టివాలో కెరాటిన్‌ జమకూడుతుంది.

* గరుకు చర్మం

లభించే ఆహార పదార్థాలు: షార్క్‌ చేప నూనె, గుడ్డు, పాలు, వెన్న లాంటి వాటిలో విటమిన్‌ - ఎ నేరుగా ఉంటుంది. క్యారెట్‌, టొమాటో, బొప్పాయి లాంటి వాటిలో కెరోటిన్‌ (బీటా కెరోటిన్‌) రూపంలో ఉంటుంది. బీటా కెరోటిన్‌ కాలేయంలో కెరోటినేజ్‌ ఎంజైమ్‌ సహాయంతో విటమిన్‌ - ఎ గా మారుతుంది. దీన్ని విటమిన్‌ - ఎ పూర్వగామి (Provitamin-A) అంటారు.

విటమిన్‌ బి: దీన్ని బి1, బి2, బి3, బి6, బి12, పాంటోథెనిక్‌, ఫోలిక్‌ ఆమ్లాలు, బయోటిన్‌ లాంటి రకాలుగా విభజించారు. వీటన్నింటినీ కలిపి బి - కాంప్లెక్స్‌ విటమిన్లు అంటారు.

బి1 విటమిన్‌: దీని రసాయనిక నామం థయామిన్‌. ఈ విటమిన్‌ లోపం వల్ల మానవుడిలో బెరి-బెరి వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిని తిరిగి తడి బెరిబెరి, పొడి బెరిబెరి, ఇన్‌ఫాంట్‌ బెరిబెరి (చిన్నపిల్లల్లో కలిగే బెరిబెరి)గా విభజించవచ్చు. ఈ విటమిన్‌ లోపం వల్ల పక్షుల్లో పాలిన్యూరైటిస్‌ అనే వ్యాధి కలుగుతుంది.

* ఈ విటమిన్‌ ధాన్యాల పై పొర, మాంసం, గుడ్డు, కూరగాయలు, తవుడు లాంటి వాటిలో ఉంటుంది. పూర్తిగా గోధుమలతో చేసిన ఆహార పదార్థాల్లో బి1 విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. దీన్ని యాంటీ బెరిబెరి ఫ్యాక్టర్‌, యాంటీ  న్యూరిటిక్‌ ఫ్యాక్టర్‌ అంటారు.

విటమిన్‌ బి2: దీని రసాయన నామం రైబోఫ్లేవిన్‌. ఈ విటమిన్‌ను లాక్టోఫ్లేవిన్‌, హెపటోఫ్లేవిన్‌, ఓవోఫ్లేవిన్‌, ఎల్లో ఎంజైమ్‌, విటమిన్‌ - జి లాంటి పేర్లతో పిలుస్తారు. ఇది పాలు, మాంసం, ఆకుకూరలు, కాలేయం, గుడ్డులో లభిస్తుంది.

లోపం వల్ల  కలిగే వ్యాధులు: ‌

* కీలోసిస్‌ - ఈ వ్యాధివల్ల నోటి మూలలు పగులుతాయి.

* గ్లాసైటిస్‌ - ఈ వ్యాధిలో నాలుకపై పొక్కులు ఏర్పడి ఎరుపు రంగులోకి మారుతుంది.‌

* సెబోరిక్‌ డెర్మటైటిస్‌ - ఈ వ్యాధిలో ముఖం, ముక్కు, పై పెదవి, ఇతర ప్రాంతాల్లో చర్మం సొరచేప చర్మంలా గరుకుగా మారుతుంది.

విటమిన్‌ బి3: దీని రసాయన నామం నియాసిన్‌. ఈ విటమిన్‌ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లగ్రా. ఈ వ్యాధిలో చర్మం గరుకుగా మారుతుంది. పెల్లగ్రాను 3-డి వ్యాధి అంటారు. నియాసిన్‌ మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. విటమిన్‌ బి3 లోపం వల్ల కుక్కల్లో నల్ల నాలుక వ్యాధి వస్తుంది.

* ఇది ధాన్యాలు, ఆకుకూరలు, బఠానీ, చిక్కుడు, టొమాటో లాంటి వాటిలో లభిస్తుంది. నియాసిన్‌ను యాంటీపెల్లగ్రా విటమిన్‌ అంటారు.

విటమిన్‌ బి6: దీని రసాయన నామం పైరిడాక్సిన్‌. ఈ విటమిన్‌ లోపం వల్ల డెర్మటైటిస్‌, డయేరియా, రక్తహీనత, మానసిక వ్యాకులత, మణికట్టు నొప్పి లాంటి వ్యాధులు వస్తాయి.

* ఈ విటమిన్‌ ధాన్యాలు, ఆకుకూరలు, గుడ్డు, కాలేయం లాంటి ఆహార పదార్థాల్లో లభిస్తుంది.

విటమిన్‌ బి12: దీని రసాయన నామం సైనకోబాలమైన్‌. ఈ విటమిన్‌లో కోబాల్ట్‌ మూలకం అంతర్భాగంగా ఉంటుంది. జంతువుల్లో ఇది మిథైల్‌ కోబాలమైన్‌ రూపంలో ఉండి కాలేయంలో నిల్వ ఉంటుంది. ఈ విటమిన్‌ ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, అభివృద్ధికి ఉపయోగపడుతుంది. బి12 లోపం వల్ల పెరినీషియస్‌ ఎనీమియా వ్యాధి కలుగుతుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని