TS Exam 2022: అనేక రాయితీలు.. అనుకూల విధానాలు!

ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా పరిశ్రమలను స్థాపించాలి. కొత్త కొత్త ఆవిష్కరణలు జరపాలి. ఆ లక్ష్యాల సాధనకే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నూతన పారిశ్రామిక విధానాలను ప్రవేశపెడుతుంటాయి. తెలంగాణలోనూ ప్రధానంగా ఇంజినీరింగ్‌,

Updated : 29 Jul 2022 03:23 IST

తెలంగాణ భూగోళశాస్త్రం

ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నా పరిశ్రమలను స్థాపించాలి. కొత్త కొత్త ఆవిష్కరణలు జరపాలి. ఆ లక్ష్యాల సాధనకే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నూతన పారిశ్రామిక విధానాలను ప్రవేశపెడుతుంటాయి. తెలంగాణలోనూ ప్రధానంగా ఇంజినీరింగ్‌, ఔషధ ఆధారిత సంస్థలు ఎన్నో ఏర్పాటయ్యాయి. కొత్త వాటికీ వేగంగా అనుమతులు ఇస్తూ, అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నారు. వాటిలో ముఖ్యమైన పరిశ్రమలు, ఉత్పత్తులు, ఇతర వివరాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం తెలుసుకోవాలి.


మౌలిక పరిశ్రమలు నూతన ఆవిష్కరణలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్త పారిశ్రామిక విధానాలను అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో అభివృద్ధి చేశారు. ఒక అంతర్గత అనుసంధాన వ్యవస్థను సృష్టించడానికి టీఎస్‌-ఐపాస్‌ను ఏర్పాటు చేసి, దేశంలో మొదటిసారి ఏకగవాక్ష విధానంలో అనేక ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తున్నారు.

ఇంజినీరింగ్‌ ఆధారితం
తెలంగాణలో ఏర్పాటైన ఇంజినీరింగ్‌ ఆధారిత పరిశ్రమలు, జిల్లాలు, ఉత్పత్తుల వివరాలు (వీటిలో కొన్ని మూతపడ్డాయి).

* హిందుస్థాన్‌ మెషిన్‌ టూల్స్‌ (హెచ్‌ఎమ్‌టీ) - మేడ్చల్‌ - గడియారాలు, బల్బులు, బోర్‌వీల్‌ సామగ్రి తయారయ్యేవి.

* భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌) - సంగారెడ్డి - టర్బైన్లు, జనరేటర్లు, సర్క్యూట్‌ బ్రేకర్ల తయారీ.

* హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) - మేడ్చల్‌ - విమానాలకు సంబంధించిన విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్‌ పనిముట్లు.

* హిందుస్థాన్‌ కేబుల్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎల్‌) - మేడ్చల్‌ -  కేబుల్‌ వైర్లను తయారుచేస్తారు. దీని ప్రధాన కార్యాలయం పశ్చిమ్‌బెంగాల్‌లోని రూప్‌నారాయణపూర్‌లో ఉంది.

* ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ - మేడ్చల్‌ - టీవీ, పరమ్‌ కంప్యూటర్లు, ఈవీఎమ్‌, వీవీప్యాట్‌, కమ్యూనికేషన్‌ పరికరాలు.

* భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) - రంగారెడ్డి - క్షిపణులు/ రాకెట్ల తయారీ

* మిశ్రమ ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) - రంగారెడ్డి - లోహ ధాతువు, రాగి, జింక్‌ తయారీ పరిశ్రమలు

* ప్రాగాటూల్స్‌ - హైదరాబాద్‌ - రక్షణ విభాగానికి సంబంధించిన ప్రత్యేక విడిభాగాల తయారీ సంస్థ

* ఆల్విన్‌ - రంగారెడ్డి - రిఫ్రిజిరేటర్లు, చేతి గడియారాలు, బ్యాలెట్‌ బాక్సుల తయారీ

* ఎలక్ట్రోలక్స్‌ శాఖ - హైదరాబాద్‌ - గ్యాస్‌ సిలిండర్‌, ఉక్కు, ఫర్నిచర్‌, రిఫ్రిజిరేటర్లు

* భారజల ప్లాంట్‌ - భద్రాద్రి కొత్తగూడెంలోని మణుగూర్‌లో ఉంది. అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి, డ్యూటీరియం ఆక్సైడ్‌ ్బదీ2వ్శీను తయారు చేస్తుంది.

* న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ఎఫ్‌సీ) - హైదరాబాద్‌ - ఇది యురేనియం ఖనిజాన్ని శుభ్రపరిచే సంస్థ.

ఔషధ ప్రాధాన్యం

తెలంగాణలో ఔషధ ఆధారిత పరిశ్రమలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్‌ను భారతదేశపు బల్క్‌డ్రగ్‌, వ్యాక్సిన్‌ రాజధాని అంటారు.

* 1967లో హైదరాబాద్‌లోని బాలానగర్‌/ కూకట్‌పల్లి కేంద్రంగా ఇండియన్‌ డ్రగ్స్‌ ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌ను స్థాపించారు. 2007, అక్టోబరు 19న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఐపీఈఆర్‌)ను స్థాపించారు.

* శాంతా బయోటెక్‌ను 1993లో మేడ్చల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ తొలిసారి భారతదేశంలో హెపటైటిస్‌ - బి టీకాను విడుదల చేసింది.

* రెడ్డీస్‌ ల్యాబొరేటరీని 1984లో హైదరాబాద్‌లో స్థాపించారు. ఇది న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన మొదటి భారతీయ ఔషధ కంపెనీ.

* జీనోమ్‌ వ్యాలీని శామీర్‌పేటలో 1999లో స్థాపించారు. దేశంలో అతిపెద్ద మొదటి ప్రపంచ స్థాయి బయోటెక్‌ పార్కు సమూహమిది. ఇక్కడ జీవవైవిధ్యపరమైన పరిశోధన, ఉత్పాదకాలపై శిక్షణ ఇస్తారు.

* బయోటెక్‌ పార్కు - శామీర్‌పేట తుర్కపల్లి వద్ద షాపూర్‌జీ పల్లోంజీ బయోటెక్‌ పార్కును స్థాపించారు.

* దేశంలో అతిపెద్ద వైద్యపరికరాల తయారీ పార్కు సుల్తాన్‌పూర్‌లో (పటాన్‌ చెరు, సంగారెడ్డి జిల్లా), దేశంలో మొదటి ప్రభుత్వ ప్రయివేటు లాజిస్టిక్‌ పార్కు మంగలపల్లిలో (ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా), సమీకృత జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం అమీన్‌పూర్‌లో ఉన్నాయి.

భారత్‌ బయోటెక్‌: దీన్ని 1996లో తుర్కపల్లి వద్ద స్థాపించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్‌ఆర్‌) సహకారంతో కొవాగ్జిన్‌ టీకాను ఈ సంస్థ తయారు చేసింది.

కుటీర పరిశ్రమలు: వృత్తి కళాకారులు తమ ఇళ్లలో ఏర్పాటు చేసుకునే చేతి వృత్తుల పరిశ్రమను కుటీర పరిశ్రమలంటారు. ఉదా: కుమ్మరి, చేనేత, పెయింటింగ్‌, ఖాదీ, క్రాప్ట్స్‌.

భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌-జీఐ): ప్రత్యేకమైన కళతో వ్యక్తులు తయారు చేసిన వస్తువుల నాణ్యత, శైలిని గుర్తించి, ఆ ప్రాంతానికి భౌగోళిక గుర్తింపును ఇస్తారు. ఈ భౌగోళిక గుర్తింపును మేధోసంపత్తి హక్కు (ఐపీఆర్‌ఎస్‌)ల్లో భాగంగా పరిగణిస్తారు. ఈ జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ చట్టాన్ని 1999లో చేసినప్పటికీ, 2003, సెప్టెంబరు 15 నుంచి అమలవుతోంది.  ‘డార్జిలింగ్‌ టీ’ దేశంలో తొలి జీఐ ట్యాగ్‌ను పొందింది. తెలంగాణ రాష్ట్రంలో 2004 నుంచి 2020 మధ్య 15 వస్తువులకు జీఐ ట్యాగింగ్‌ లభించింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం జీఐ ట్యాగ్‌ కోసం చపాట మిరప, నిజామాబాద్‌ పసుపు, సీతాఫలం, కందిపప్పులను రిజిస్ట్రేషన్‌ చేసింది.


నూతన పారిశ్రామిక విధానం

టీఎస్‌-ఐపాస్‌: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతుల స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం-2014. దేశంలోనే మొదటిసారి ఏకగవాక్ష విధానం ద్వారా సేవలను అందించడం లక్ష్యం.

టీ-ప్రైడ్‌: తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ర్యాపిడ్‌ ఇంక్యుబేషన్‌ ఆఫ్‌ దళిత్‌ ఆంత్రప్రెన్యూర్స్‌. దీన్ని దళిత పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఐటీఈసీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌. ఇందులో దేశవ్యాప్తంగా ఈ-గవర్నెన్స్‌లో మార్గదర్శకంగా నిలిచిన తొలి రాష్ట్రం తెలంగాణ.

ఐటీఐఆర్‌: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌. ఇందులో భారత ప్రభుత్వం సాయంతో హైదరాబాద్‌ కేంద్రంగా భారీ పెట్టుబడులు, భారీ ఉద్యోగ అవకాశాలు సృష్టించడం.

టీ-హబ్‌: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో సాంకేతిక స్టార్టప్‌లను వృద్ధి చేయడం ద్వారా సేవలందిస్తుంది.

టీ-స్కాన్‌: తెలంగాణ సెక్రటేరియట్‌ క్యాంపస్‌ ఏరియా నెట్‌వర్క్‌. ఇందులో డేటా పోర్ట్‌ ద్వారా ప్రతి పని ప్రదేశం పరస్పరం అనుసంధానమవుతాయి.

శాఫ్‌ నెట్‌: ఒక భూతల కేంద్రం (ఎర్త్‌ స్టేషన్‌) ద్వారా ఇన్సాట్‌ 3బి ఉపగ్రహ సేవలతో కేఈ బ్యాండ్‌ వాడుతున్నారు. ఈ ఎర్త్‌ స్టేషన్‌కు అయిదు వీడియో ఛానళ్లు, ఒక డేటా ఛానల్‌ సామర్థ్యం ఉంటుంది.

టాస్క్‌: తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌. పట్టభద్రులైన నిరుద్యోగ యువత నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి సమస్యలను పరిష్కరించడం కోసం ఈ అకాడమీ ఏర్పాటైంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని