TS Exam 2022: ఆహార భద్రత.. ఆర్థిక సుస్థిరత!

ప్రాచీనకాలం నుంచి ప్రజల జీవనానికి, ఉపాధికి ప్రధాన ఆధారం వ్యవసాయం. భిన్న నైసర్గిక స్వరూపాల మధ్య ప్రాంతాల వారీగా విభిన్న రీతుల్లో, వివిధ పద్ధతుల్లో సేద్యం సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతోంది.

Updated : 29 Jul 2022 03:18 IST

భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

ప్రాచీనకాలం నుంచి ప్రజల జీవనానికి, ఉపాధికి ప్రధాన ఆధారం వ్యవసాయం. భిన్న నైసర్గిక స్వరూపాల మధ్య ప్రాంతాల వారీగా విభిన్న రీతుల్లో, వివిధ పద్ధతుల్లో సేద్యం సాగుతోంది. సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతోంది. ఆహార భద్రతకు, ఆర్థిక సుస్థిరతకు ఆధునిక సాగు విధానాలు దోహదపడినప్పటికీ కొన్ని అనర్థాలకూ కారణమయ్యాయి. దాంతో సంప్రదాయ సేంద్రియ సేద్యం, ప్రకృతి వ్యవసాయంపై అందరికీ ఆసక్తి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధిలో వ్యవసాయరంగం పాత్ర, సాగు రకాలు తదితర అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

 


వ్యవసాయాభివృద్ధి - వ్యూహాలు - మార్పులు

భూమిని దున్ని పంటలు పండించడాన్ని వ్యవసాయం అంటారు. పంటల సాగుతో పాటు మొక్కలు పెంచడం, పశువుల పోషణ, కోళ్లు, చేపల పెంపకం లాంటివన్నీ వ్యవసాయంలో భాగమే. మానవుడు సంచార జీవనం నుంచి స్థిర నివాస జీవనం ప్రారంభించిన కాలం నుంచే సాగు మొదలైంది. నాటి నుంచే మానవుడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం ప్రారంభించాడు. సాంఘిక జీవనానికి వ్యవసాయం పునాది వంటిది. ప్రాంతం, శీతోష్ణస్థితి, భూసారం, నీటిపారుదల, సాంకేతిక పరిజ్ఞాన లభ్యత, యాంత్రీకరణ లాంటి అంశాలపై వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. పారిశ్రామిక విప్లవం వల్ల సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది హరిత  విప్లవానికి దారితీసింది. కానీ హరిత విప్లవం అధికంగా నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలకే పరిమితమైంది.

2020-21 భారత ఆర్థిక సర్వే ప్రకారం నేటికీ దేశ జనాభాలో 54.6 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జాతీయాదాయంలో 18.8% శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తోంది. భారత ప్రభుత్వం మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. 1966 - 69 మధ్య కాలంలో అనుసరించిన నూతన వ్యవసాయ వ్యూహం హరిత విప్లవ సాధనకు ఉపయోగపడింది. సాగు నీటిపారుదల సౌకర్యాలు అధికమై సాగు భూమి విస్తీర్ణం పెరిగింది. పంటల తీరులో మార్పు వచ్చి వాణిజ్య పంటల ప్రాధాన్యం పెరిగింది. వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు సంస్థాగత పరపతిని విస్తృతం చేశాయి.

ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం మూడు రకాలుగా దోహదపడుతుంది.

ఉత్పత్తి సహకారం: ప్రజలందరికీ ఆహార ధాన్యాలు సరఫరా చేయండంతో పాటు పారిశ్రామిక రంగానికి కావాల్సిన ముడి పదార్థాలను సమకూరుస్తుంది.

కారక సహకారం: అభివృద్ధి చెందిన వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగానికి అవసరమయ్యే శ్రమ, మూలధనాన్ని బదిలీ చేస్తుంది. అలాగే వ్యవసాయ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.

మార్కెట్‌ సహకారం: సరఫరా, డిమాండ్‌ పరస్పరం ఆధారపడటాన్నే మార్కెట్‌ సహకారం అంటారు. దేశీయ, విదేశీ మార్కెట్లకు ఉత్పత్తులను వ్యవసాయ రంగం సరఫరా చేస్తుంది. ఇతర రంగాల నుంచి కొన్ని ఉత్పత్తులు కొనుగోలు చేస్తుంది.


వ్యవసాయం - రకాలు

ప్రాంతీయ వ్యత్యాసాన్ని బట్టి వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు.

విస్తాపన వ్యవసాయం: దీన్ని స్థల మార్పిడి వ్యవసాయం అని కూడా అంటారు. ఇందులో అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంటలు సాగు చేస్తారు. విస్తాపన వ్యవసాయం పూర్తిగా మనిషి శ్రమతోనే నడుస్తుంది. నాలుగైదేళ్ల తర్వాత భూసారం తగ్గుతుంది. అప్పుడు ఆ భూమిని వదిలి వేరే చోట అడవిని చదును చేసి పంటలు పండిస్తారు. ప్రధానంగా ఆటవిక తెగల వారు ఇలాంటి సాగు చేస్తారు.

స్థిర వ్యవసాయం: ఒక చోట స్థిర నివాసం ఏర్పరచుకొని ఒకే భూమిలో వ్యవసాయం చేస్తుంటారు. భూసారం తగ్గినప్పుడు దాన్ని సారవంతం చేయడానికి కొంత భూభాగాన్ని బీడుగా ఉంచి కొన్నేళ్ల తర్వాత మళ్లీ సాగు చేస్తారు.

జీవనాధార వ్యవసాయం: ఈ వ్యవసాయం ప్రధాన ఉద్దేశం గృహ, ఆహార అవసరాల కోసం పంటలు పండించడం. ఈ విధానంలో ఎక్కువగా ఆహార పంటలే పండిస్తారు.

వాణిజ్య వ్యవసాయం: అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. ఉదా: అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, తెగులు నివారణ మందులను ఉపయోగిస్తారు. ఇందులో ఆదాయాన్ని ఆర్జించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది.

విస్తృత వ్యవసాయం: ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూమిలో అధిక పెట్టుబడితో సాగు చేయడాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. ఈ పద్ధతిలో ఎక్కువ మంది కూలీలతో పాటు యంత్రాలను ఉపయోగిస్తారు.

సాంద్ర వ్యవసాయం: తక్కువ విస్తీర్ణ భూమిలో ఆధునిక పద్ధతిలో సాగుచేసి ఎక్కువ దిగుబడి పొందడమే సాంద్ర వ్యవసాయం.

మెట్ట సేద్యం: సాధారణంగా సహజ వర్షపాతంపై మాత్రమే ఆధారపడే భూములను మెట్ట భూములు అంటారు. 50 నుంచి 120 సెంటీమీటర్ల వరకు వర్షపాతం లభించే భూములను మెట్ట భూములుగా పరిగణిస్తారు. వీటికి నీటిపారుదల సదుపాయం ఉండదు. భారతదేశంలో 94 మిలియన్‌ హెక్టార్ల మెట్టభూమి ఉంది. దేశంలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో 40 శాతం మెట్ట భూముల నుంచే లభిస్తోంది. వీటిలో పండే ప్రధాన పంటలు జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జ, కందులు, మినుములు, పెసలు, నువ్వులు, వేరుశనగ. దేశంలో సుమారు 120 మెట్టసాగు జిల్లాలు ఉన్నాయి. ఇందులో 91 జిల్లాలు మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నాయి.

సేంద్రియ వ్యవసాయం: రసాయన ఎరువులు, పురుగుమందులతో భూసారం క్షీణించింది. కొన్నాళ్లకు పంట దిగుబడులు పెరగకపోగా, అనర్థాలు ఎక్కువయ్యాయి. సాగు వ్యయం పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం ముందుకొచ్చింది. ఇందులో సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు ఉపయోగిస్తారు. వ్యవసాయ, పశు వ్యర్థాలు, రాలిన ఆకులు ఎరువులుగా వినియోగమవుతాయి. పంట మార్పిడి, అంతర పంటల సాగు ఉంటుంది. భూమిలో సూక్ష్మజీవులు, వానపాముల సంఖ్య పెరిగి భూసారం పెరుగుతుంది. సేద్యపు ఖర్చులు తగ్గి పంట దిగుబడులు పెరుగుతాయి.

* కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి 2015లో పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి.

ప్రకృతి వ్యవసాయం (జీరో బడ్జెట్‌ నేచురల్‌ ఫార్మింగ్‌): ప్రకృతి వ్యవసాయం భావనను తొలిసారిగా 1975లో జపాన్‌కు చెందిన రైతు ప్రవేశపెట్టాడు. భారతదేశంలో ఈ విధానానికి సుభాష్‌ పాలేకర్‌ విస్తృత ప్రచారం కల్పించారు. ఇది ‘జీరో బడ్జెట్‌’ అంటే ఖర్చు లేని వ్యవసాయం. విత్తనాలు, ఎరువులకు పెట్టుబడి అవసరం ఉండదు. విత్తనాలను రైతులే తమ పంట నుంచి తయారు చేసుకుంటారు. మట్టిలోని సూక్ష్మజీవులు, వానపాములే మొక్కల పెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎరువులు వాడే పనిలేదు. ప్రకృతిలో దొరికే వాటితోనే భూమికి బలాన్ని ఇవ్వవచ్చు. అందుకే ఈ సాగు పద్ధతిలో ఖర్చులు ఉండవు.

దేశీయ ఆవు పేడ, మూత్రంతో భూసారం పెంచే ద్రావణాలు (బీజామృతం, జీవామృతం) తయారుచేసుకొని భూమికి తిరిగి జవసత్వాలను అందించడం, రసాయనిక అవశేషాలు లేని ఆహారాన్ని పండించుకోవడం సుభాష్‌ పాలేకర్‌ పద్ధతిలోని ప్రత్యేకత. పొడిసున్నం, పొడిమట్టి, బెల్లం, బావి/బోరు/నది నీరును కూడా ఈ ద్రావణాల్లో కలుపుతారు. ‘భూమి అన్ని పోషకాలున్న అన్నపూర్ణ. పోషకాలను మొక్కల వేర్లు గ్రహించగలిగే రూపంలోకి మార్చేది సూక్ష్మజీవరాశి. వాటిని పెంపొందించే జీవామృతం, ఘనజీవామృతం ఇచ్చి వీలైన పద్ధతిలో మల్చింగ్‌ చేస్తే చాలు’ అంటారు పాలేకర్‌. పొలంలో పలు రకాల అంతర పంటలు వేయడం ద్వారా పంటల జీవ వైవిధ్యాన్ని పెంపొందించుకునే వీలుండటం ప్రకృతి వ్యవసాయంలోని మరో ప్రత్యేకత. పండ్ల తోటల సాళ్ల మధ్య అడుగులోతు వరకు కందకాలు తీయడం ద్వారా వాననీటి సంరక్షణ చేపట్టి కరవు పరిస్థితులను తట్టుకునేలా చేస్తారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 50 లక్షల మంది (2019-20 కేంద్ర బడ్జెట్‌ ఆధారం) రైతులు అప్పుల నుంచి విముక్తి పొందారని పాలేకర్‌ తెలిపారు. నాణ్యమైన, పోషక ఔషధ విలువలతో కూడిన సహజాహారం పండించే రైతులు తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించుకొని నేరుగా అమ్మితే వ్యవసాయ సంక్షోభం పరిష్కారమవుతుందన్నారు.

సుస్థిర వ్యవసాయం: నిలకడ కలిగిన వ్యవసాయాన్ని సుస్థిర వ్యవసాయం అంటారు. దీనిలో భాగంగా 2014-15లో జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌ (నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టయిన్‌బుల్‌ అగ్రికల్చర్‌ - ఎన్‌ఎంఎస్‌ఎ) అమల్లోకి వచ్చింది. వ్యవసాయాన్ని మరింత ఉత్పాదకతతో సుస్థిర కార్యకలాపంగా, లాభదాయకంగా, వాతావరణ ఒడిదొడుకులు తట్టుకునేలా అభివృద్ధి చేయడం ఈ మిషన్‌ లక్ష్యం. దీనికోసం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సంఘటిత సేద్యపు వ్యవస్థలను ప్రోత్సహిస్తారు. భూసారాన్ని, నేలలో తేమను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటారు. 12వ ప్రణాళిక (2012-17)లో ఏడు అంశాలను వ్యవసాయ శాఖ పథకాలు/కార్యక్రమాలు/మిషన్లలో అంతర్భాగం చేశారు. నీటి నిర్వహణ సామర్థ్యాలను పెంచే పద్ధతులు, వర్షాధార సాంకేతిక పద్ధతులను విస్తృతం చేయాలనేది ఈ మిషన్‌ లక్ష్యం.


ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ ప్రాధాన్యం

* స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం గణనీయ వాటా కలిగి ఉంది.

* అధిక ఉద్యోగితను కల్పిస్తుంది.

* పరిశ్రమలకు ముడిపదార్థాలను అందిస్తుంది

* పారిశ్రామిక వస్తువులకు గిరాకీ సృష్టిస్తుంది.

* మూలధన సమీకరణ చేస్తుంది.

* ఆహార భద్రతను కల్పిస్తుంది.

* ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది.

* నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు దోహదపడుతుంది.

* వ్యవసాయ ఎగుమతులు జరుగుతాయి.

* పండ్లు, కూరగాయలకు తగిన డిమాండ్‌ ఉంటుంది.

https://tinyurl.com/yeyypjy9


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు