TS Exams 2022: పద్ధతులు మార్చి.. దిగుబడులు పెంచి!

నేలలను మారుస్తూ చేసే పోడు పద్ధతి నుంచి యంత్రాలతో ఏక కాలంలో వేల ఎకరాలను సాగు చేసే స్థితిని దాటి కార్పొరేట్‌ ఫార్మింగ్‌ వరకు వ్యవసాయం విస్తరించింది. భిన్న శీతోష్ణస్థితులకు తగినట్లుగా ఆహార, వాణిజ్య, తోట పంటలు పండిస్తున్నారు.

Updated : 23 Aug 2022 06:09 IST

జనరల్‌ స్టడీస్‌ - ఇండియన్‌ జాగ్రఫీ

నేలలను మారుస్తూ చేసే పోడు పద్ధతి నుంచి యంత్రాలతో ఏక కాలంలో వేల ఎకరాలను సాగు చేసే స్థితిని దాటి కార్పొరేట్‌ ఫార్మింగ్‌ వరకు వ్యవసాయం విస్తరించింది. భిన్న శీతోష్ణస్థితులకు తగినట్లుగా ఆహార, వాణిజ్య, తోట పంటలు పండిస్తున్నారు. హరిత విప్లవాలతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఆ పద్ధతులతోపాటు ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పంటలు పండుతున్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి.


సాగు విధానాలు

భారతదేశంలో సగానికిపైగా కుటుంబాలకు ఇప్పటికీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలే జీవనాధారం. వివిధ శీతోష్ణస్థితుల వల్ల అనేక రకాల పంటల   ఉత్పత్తికి ఇక్కడ అనుకూల వాతావరణం ఉంది. 1900 సంవత్సరానికి పూర్వం మన దేశంలో వ్యవ సాయం పురాతన పద్ధతుల్లో జరిగేది. 1908లో పుణె వద్ద వ్యవసాయ కళాశాల స్థాపించారు. 1937 నాటికే ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ఏర్పడినప్పటికీ పరిశోధనలు, వ్యవసాయ విద్య ప్రగతి ఆశాజనకంగా సాగలేదు. స్వాతంత్య్రానంతరం మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయ ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. తర్వాత హరిత విప్లవంలో భాగంగా దిగుమతి చేసుకున్న అధిక దిగుబడినిచ్చే వంగడాలను దేశీయ మొక్కలతో సంకరీకరణ (క్రాస్‌) చేసి, కొత్త వంగడాలను తయారు చేశారు. వాటికున్న రోగనిరోధక శక్తి వల్ల ప్రాంతీయ శీతోష్ణస్థితులను తట్టుకొని అధిక దిగుబడులిచ్చాయి.


రకరకాలుగా సేద్యం

పోడు వ్యవసాయం: దీన్నే విస్తాపన వ్యవసాయం అంటారు. ఇది అతి ప్రాచీన విధానం. ఒక ప్రాంతంలోని చెట్లను నరికి, చదును చేసి వ్యవసాయం చేస్తారు. భూసారం తగ్గిపోతే మరో ప్రదేశానికి   మారతారు. ఈ విధానం ఎక్కువగా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది.

సాంద్ర వ్యవసాయం: జనసంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పురుగు మందులు, రసాయన ఎరువులు వాడుతూ సాగు చేసే పద్ధతి సాంద్ర వ్యవసాయం.

వాణిజ్య వ్యవసాయం: ఈ పద్ధతిలో అధిక దిగుబడి వంగడాలు, ఆధునిక పనిముట్లు ఉపయోగిస్తారు. ఎక్కువగా ఎగుమతి ఆధారిత పంటలు పండిస్తారు.

విస్తృత వ్యవసాయం: కొన్ని వందల వేల ఎకరాల్లో యంత్రాలను ఉపయోగించి సాగు చేస్తారు. అమెరికాలో ఎక్కువగా ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు.

మిశ్రమ వ్యవసాయం: వ్యవసాయంతోపాటు పశుపోషణ, చేపల పెంపకం, కోళ్ల పెంపకం మొదలైనవి ఈ పద్ధతిలో జరుగుతాయి.

సహకార వ్యవసాయం: రైతులు అందరూ సామూహికంగా చేసే వ్యవసాయం ఇది. రష్యాలో దీన్ని కోల్‌కోజ్‌లు అంటారు.

తోటల పెంపకం: కొబ్బరి, మామిడి, బత్తాయి, జీడిమామిడి, రబ్బరు, కాఫీ, టీ మొదలైన వాటిని తోటల పెంపకంలో భాగంగా సాగుచేస్తారు.

ఒప్పంద వ్యవసాయం: దీన్నే కాంట్రాక్టు ఫార్మింగ్‌ అంటారు. పెద్దపెద్ద కార్పొరేటు కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకుని వ్యవసాయం చేస్తాయి.


ప్రధాన పంటలు

భారతదేశంలో ప్రధానంగా మూడు రకాల పంటలు పండిస్తారు. అవి 1) ఆహార పంటలు 2) వాణిజ్య పంటలు 3) తోట పంటలు.

ఆహార పంటలు: వరి, గోధుమ, జొన్న, సజ్జ, కొర్రలు, రాగులు, బార్లీ ఆహార ధాన్యాలు. పెసలు, కందులు, శనగలు ఇంకా ఇతర పప్పుధాన్యాలు కూడా ఉన్నాయి.

వరి: ఈ పంటను పండించడంలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇది మన ముఖ్య ఆహారపంట. దేశంలో సాగయ్యే భూమిలో  1/4వ వంతులో వరి పండుతోంది. వడ్ల ఉత్పత్తి 1951లో 20.58 మిలియన్‌ టన్నులు ఉండగా, 2020-21 నాటికి 120 మి. టన్నులుగా నమోదైంది.

గోధుమ: వరి తరువాత గోధుమ ప్రధానమైనది. అది ద్వితీయ ఆహార పంటగా ఉంది. ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉంది. 1951లో ఉత్పత్తి 6.46 మిలియన్‌ టన్నులు, 1980లో 36.31 మి.టన్నులు, 2020-21 నాటికి 107.6 మి.టన్నులుగా ఉంది.

చిరుధాన్యాలు: వర్షపాతం తక్కువ ఉన్న రాష్టాల్లో (మెట్టపైర్లుగా) ఈ పంటలు అధికం. తక్కువ సారవంతమైన నేలల్లో వీటిని పండిస్తారు.

పప్పుధాన్యాలు: కందులు, శనగలు, పెసలు, మినుములు ప్రధానమైనవి. వీటిలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. 1950-51లో 8.41 మిలియన్‌ టన్నులున్న మన పప్పుధాన్యాల ఉత్పత్తి, 2020-21 నాటికి 25 మిలియన్‌ టన్నులకు పెరిగింది.

నూనె గింజలు: వాణిజ్య పంటల్లో నూనెగింజలకు ప్రముఖ స్థానం ఉంది. ఇందులో భాగంగా వేరుసెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, ఆముదం, సోయా పండిస్తారు. నూనెగింజల ఉత్పత్తి 1950-51లో 5.16 మి.టన్నులు కాగా 2020-21కి ముందస్తు అంచనాల ప్రకారం 36.57 మి.టన్నులుగా ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది.

వాణిజ్య పంటలు: వీటిలో ప్రధానమైనవి పత్తి, చెరకు, జనుము, పొగాకు, మిరప, తేయాకు, కాఫీ, రబ్బరు, కొబ్బరి, మిరియాలు మొదలైనవి.

పత్తి: వాణిజ్య పంటల్లో పత్తి ప్రథమ స్థానంలో ఉంది.  పంట విస్తీర్ణంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. కానీ ఉత్పత్తిలో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. నీటి పారుదల ఉన్న శుష్క ప్రాంతాల్లో పండించవచ్చు.

చెరకు: చెరకు అధికంగా పండించే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో, బ్రెజిల్‌ మొదటి స్థానంలో ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఈ పంటను విరివిగా పండిస్తారు.

జనుము: ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైన పంట.  డెల్టా, సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ఖరీఫ్‌ పంటగా పండిస్తారు.

పొగాకు: క్రీ.శ.1508లో పోర్చుగీసు వారు పొగాకును భారతదేశానికి తీసుకొచ్చారు. పొగాకులో నాణ్యమైన  వర్జీనియా రకం గుంటూరు జిల్లాలో పండుతుంది.

మిరప: ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పండిస్తారు.

తోటపంటలు: కాఫీ, తేయాకు, రబ్బరు, మామిడి, జీడిమామిడి తదితరాలు.

తేయాకు: దీని సాగుకు కొండ, వాలు ప్రాంతాలు   అనుకూలం. తేయాకు ఉత్పత్తిలో భారత్‌ గతంలో అగ్రస్థానంలో ఉండగా, 2020-21 లెక్కల ప్రకారం రెండో స్థానానికి మారింది. మొదటి స్థానంలో చైనా ఉంది.

కాఫీ: ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారత్‌ 7వ స్థానంలో, బ్రెజిల్‌ మొదటిస్థానంలో ఉన్నాయి. కాఫీ పంటను  సాధారణంగా కొండవాలు ప్రాంతాల్లో సాగు చేస్తారు.

రబ్బరు: ఎక్కువగా కేరళలో పండిస్తారు. ఒండ్రు,  సున్నపురాతి నేలలు అనుకూలం.


హరిత విప్లవం

దేశంలో 60వ దశకంలో వ్యవసాయాభివృద్ధికి ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. వ్యవసాయ యాంత్రికీకరణ చేశారు. క్రిమిసంహారక మందులను అధిక మొత్తంలో ఉపయోగించారు. ఇందుకోసం ప్రభుత్వం ఇంటెన్సివ్‌ అగ్రికల్చర్‌ డిస్ట్రిక్ట్‌ పోగ్రాం  (ఐఏడీపీ) ప్రారంభించింది. 1960-61లో 7 జిల్లాల్లో నూతన సాంకేతిక అభివృద్ధి వినియోగాన్ని ఒక పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రవేశపెట్టింది. అనంతరం 1966లో అధిక దిగుబడినిచ్చే వంగడాలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. అమెరికా వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారి డాక్టర్‌  విలియమ్‌ గాడ్‌ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఒకేసారి వచ్చిన ఈ మార్పును గ్రీన్‌ రెవల్యూషన్‌ అన్నారు. భారతదేశంలో హరితవిప్లవం సాధనలో ముఖ్యపాత్ర వహించిన శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం కేవలం అయిదు పంటలకే పరిమితమైంది. అవి గోధుమ, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ.

రెండో హరిత విప్లవం: 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రెండో హరితవిప్లవాన్ని ప్రారంభించారు. విత్తనాభివృద్దికి బయోటెక్నాలజీ తదితర కొత్త సాంకేతిక పద్ధతులు పాటించడం లాంటివి ఇందులో భాగంగా ఉన్నాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని