వృద్ధి విధానాన్ని నిర్దేశించే విస్తరణ!

జనాభా వృద్ధి చెందే తీరుతోపాటు, అది విస్తరించే విధానం కూడా దేశంలో ప్రాంతాల వారీ ప్రగతిపై ప్రభావాన్ని చూపుతుంది. మౌలిక వసతులు, నిరుద్యోగం, వనరుల వినియోగం, పట్టణీకరణ తదితర ఎన్నో అంశాల్లో అనుకూల, ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి.

Published : 31 May 2023 00:13 IST

ఇండియన్‌ జాగ్రఫీ

జనాభా వృద్ధి చెందే తీరుతోపాటు, అది విస్తరించే విధానం కూడా దేశంలో ప్రాంతాల వారీ ప్రగతిపై ప్రభావాన్ని చూపుతుంది. మౌలిక వసతులు, నిరుద్యోగం, వనరుల వినియోగం, పట్టణీకరణ తదితర ఎన్నో అంశాల్లో అనుకూల, ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. గత యాభై ఏళ్లలో ప్రపంచ జనాభా మూడు రెట్లు పెరిగితే, మన దేశ జనాభా నాలుగు రెట్లు ఎక్కువైంది. ఇక్కడ జనాభా విస్తరణ భిన్నంగా, అసమానంగా ఉంది.  మైదాన ప్రాంతాలు, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నచోట అధికంగా ఉంటే, పారిశ్రామికంగా వెనుకబడిన, నిస్సార భూములున్న ప్రాంతాల్లో తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో  దేశంలో జనసాంద్రత వివరాలు, అధిక జనాభా వల్ల తలెత్తే సమస్యలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.

జనాభా వ్యాప్తి

ప్రస్తుత భారతదేశ జనాభా 142.86 కోట్లు (ఏప్రిల్‌ 2023 నాటికి) అని అంచనా. చైనాను దాటి ప్రపంచంలో మొదటి స్థానానికి మన దేశం చేరింది. అయితే దేశమంతటా జనాభా ఒకే రీతిలో లేదు. 3.28 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల దేశ వైశాల్యంలో అసమానంగా విస్తరించి లేదా వ్యాపించి ఉంది. సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక వైవిధ్యాలతో నిండి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌ (19.9 కోట్లు), అత్యల్ప జనాభా ఉన్న రాష్ట్రం సిక్కిం (50 లక్షలు). కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో 60 వేల మంది ఉన్నారు.

* ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు, మహారాష్ట్ర, బిహార్‌, పశ్చిమ్‌ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అధిక జనాభా ఉంది. దేశం మొత్తంలో సగం జనాభా పై ఏడు రాష్ట్రాల్లోనే ఉంది. మొత్తం జనాభాలో 1/4వ వంతు వాటా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రాలదే.

* భౌగోళికంగా పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్‌లో జనాభా తక్కువగానే ఉంది. దేశ జనాభాలో ఈ రాష్ట్రం వాటా 5.67% మాత్రమే. భౌగోళికంగా పెద్ద రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల కంటే ఉత్తర్‌ప్రదేశ్‌లోనే జనాభా అధికం. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ.

* దేశ భౌగోళిక విస్తరణలో 9.86 శాతం ఉన్న బిహార్‌ జనాభాలో 9.29% మాత్రమే ఆక్రమించింది. జమ్ము-కశ్మీర్‌ విస్తీర్ణం దేశంలో 6.76% ఉండగా అక్కడున్న జనాభా 1% మాత్రమే. అరుణాచల్‌ ప్రదేశ్‌ భౌగోళిక విస్తరణ 2.55% కాగా, జనాభా 0.11% ఉంది. ఈ విధంగా జనాభా అసమాన విస్తరణకు భౌగోళిక కారణాలైన పర్వత, కొండ ప్రాంతాలు, తీవ్ర శీతోష్ణస్థితి పరిస్థితులు, ఖనిజ వనరులు, నీటి లభ్యత. వీటితో పాటు సాంఘిక, ఆర్థిక, చారిత్రక కారణాలు ఉన్నాయి. వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు, రవాణా సౌకర్యాలు, పారిశ్రామికీకరణ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో అధిక జనాభా, జనసాంద్రత ఉంది.

జనసాంద్రత: ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో విస్తరించి ఉన్న జనాభాను జనసాంద్రత అంటారు. 2011 లెక్కల ప్రకారం 1106 మందితో బిహార్‌ మొదటి స్థానంలో ఉండగా, 1028 మందితో పశ్చిమ్‌బెంగాల్‌ రెండో స్థానంలో ఉంది. 17 మందితో అరుణాచల్‌ ప్రదేశ్‌లో అతి తక్కువ జనసాంద్రత నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌ (9,252) మొదటి స్థానంలో, అండమాన్‌-నికోబార్‌ దీవులు (46) చివరి స్థానాల్లో ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీ జనసాంద్రత అత్యధికంగా 11,297 ఉంది. దేశ సగటు జనసాంద్రత 2001లో 325 ఉండగా, 2011లో 382కు చేరింది. దశాబ్ద కాలంలో జనసాంద్రత చ.కి.మీ.కు 57 పెరిగింది.

* అత్యల్ప జనసాంద్రత ప్రాంతాలు: ఒక చ.కి.మీ.కు 100 మంది కంటే తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు - అరుణాచల్‌ ప్రదేశ్‌ (17), మిజోరాం (52), అండమాన్‌ - నికోబార్‌ (46), సిక్కిం (86) మొదలైనవి.

* అల్ప జనసాంద్రత ప్రాంతాలు: ఒక చ.కి.మీ.కు 101 నుంచి 250 మందితో ఉన్న ప్రాంతాలు. మేఘాలయ (103), మణిపుర్‌ (122), హిమాచల్‌ ప్రదేశ్‌ (123), నాగాలాండ్‌ (119), ఛత్తీస్‌గఢ్‌ (189), ఉత్తరాఖండ్‌ (189), రాజస్థాన్‌ (201), మధ్యప్రదేశ్‌ (236). ఇక్కడ ప్రధానంగా కొండ ప్రాంతం, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండటమే కారణం. రాజస్థాన్‌లో ఎడారి ప్రాంతం, నీటివనరులు లేకపోవడం ఒక కారణం.

* మాధ్యమిక జనసాంద్రత ప్రాంతాలు: ఒక చ.కి.మీ.కు 251-500 మందితో కూడిన ప్రాంతాలు. భారతదేశ జనసాంద్రత (382) కూడా ఈ వర్గీకరణలోనే ఉంటుంది. గుజరాత్‌ (308), కర్ణాటక (319), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (308), త్రిపుర (350), మహారాష్ట్ర (365), ఒడిశా (269), గోవా (394), అస్సాం (397), ఝార్ఖండ్‌ (414) ఈ జాబితాలో ఉన్న రాష్ట్రాలు. ఇవన్నీ వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా కొంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు.

* అధిక జనసాంద్రత ప్రాంతాలు: ఒక చ.కి.మీ.కు 501-1000 మంది జనాభా ఉన్న ప్రాంతాలు. ఉత్తర్‌ప్రదేశ్‌ (828), కేరళ (859), దాద్రానగర్‌ హవేలీ (698), హరియాణా (573), తమిళనాడు (555), పంజాబ్‌ (550) ఈ జాబితాలో ఉన్నాయి. పంజాబ్‌, హరియాణా వ్యవసాయ పరంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు. తమిళనాడులోనూ వ్యవసాయాధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గంగా మైదాన ప్రాంతంలో అనాదిగా జరిగిన వ్యవసాయ అభివృద్ధి కూడా ఇక్కడి అధిక జనాభాకు ప్రధాన కారణం.

* అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు: ఈ ప్రాంతంలో ఒక చ.కి.మీ.కు వెయ్యి మంది కంటే ఎక్కువ జనాభా నివసిస్తుంటారు. దిల్లీ (11,297), పశ్చిమ బెంగాల్‌ (1029), బిహార్‌ (1102), లక్షద్వీప్‌ (2013), డామన్‌ డయ్యూ (2169), పుదుచ్చేరి (2548), చండీగఢ్‌ (9252) మొదలైనవి. 2011 లెక్కల ప్రకారం ప్రాంతాలవారీగా జనసాంద్రతను పరిశీలిస్తే దేశ తూర్పు భాగంలో అత్యధికంగా (625), ఈశాన్య ప్రాంతంలో అత్యల్పంగా (176) ఉంది. ఉత్తర ప్రాంతంలో (267), పశ్చిమ ప్రాంతంలో (344), దక్షిణ ప్రాంతంలో (397) జనసాంద్రత ఉంది.

* 14 సంవత్సరాల్లోపు వయసున్న జనాభా దేశంలో 30.75%. 15-59 సంవత్సరాల్లోపు అంటే పనిచేసే వయసున్నవారు 60.29%. 60 ఏళ్లు పైబడినవారు 8.57% ఉన్నారు. 0-6 సంవత్సరాల్లోపు శిశు జనాభా మొత్తం దేశ జనాభాలో 13.1% ఉంది. శిశు జనాభా అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్రల్లో; అతి తక్కువగా సిక్కింలో ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో దిల్లీలో అత్యధికంగా, లక్షద్వీప్‌లలో అత్యల్పంగా ఉంది.

స్త్రీ - పురుష నిష్పత్తి: 1901 నుంచి 2011 వరకు స్త్రీ-పురుష లింగ నిష్పత్తి క్రమంగా తగ్గుతోంది. 2011 లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి వెయ్యి మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. అత్యధిక స్త్రీ-పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రాలు కేరళ (1084), తమిళనాడు (995). అత్యల్ప లింగ నిష్పత్తి హరియాణా (877), జమ్ము-కశ్మీర్‌ (883)లో ఉంది.

* అత్యధిక లింగ నిష్పత్తి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి (1038), లక్షదీవులు (946); అత్యల్పంగా ఉన్న ప్రాంతాలు డామన్‌ డయ్యూ (618), దాద్రానగర్‌ హవేలీ (775).

* దేశ అక్షరాస్యత 74.04 శాతం. అక్షరాస్యతలో ముందున్న రాష్ట్రాలు కేరళ (93.91%), మిజోరం (91.58%); వెనుకబడిన రాష్ట్రాలు బిహార్‌ (63.82%), అరుణాచల్‌ ప్రదేశ్‌ (66.95%).

జనాభా పరివర్తన సిద్ధాంతం: జనాభా పరివర్తన సిద్ధాంతాన్ని అనుసరించి జనన, మరణాల రేట్లను నాలుగు స్థాయుల్లో వర్గీకరిస్తారు.

* మొదటి స్థాయి: ఈ స్థాయిలో జనన, మరణ రేట్లు  ఎక్కువగా ఉంటాయి. కారణం నిరక్షరాస్యత, సాంఘిక మూఢనమ్మకాలు, ఆచారాలు, పౌష్టికాహార లోపం, ఆరోగ్య వసతులు లేకపోవడం, జనాభా పరిమితి తక్కువగా ఉండటం. వెనకబడిన దేశాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

* రెండో స్థాయి: జనన రేటు ఎక్కువగా ఉంటుంది. మరణ రేటు అకస్మాత్తుగా తగ్గిపోయి జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం ఆదాయం పెరగడం, ఆహార ధాన్యాలు సమృద్ధిగా లభించడం, ఆరోగ్య వసతుల కల్పన మొదలైనవి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ స్థాయి కనిపిస్తుంది.

* మూడో స్థాయి: తగ్గుతున్న జనన, మరణాల రేటును ఈ స్థాయిలో గమనించవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపిస్తుంది.

* నాలుగో స్థాయి: ఈ స్థాయిలో జనన, మరణాల రేటు చాలా తక్కువ స్థితికి చేరుకుంటుంది. ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, పారిశ్రామికీకరణ, ఉద్యోగ, ఉపాధి కల్పనలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణాలు.

జనాభా సమస్యలు

జనాభా పెరుగుదలతో సాధారణంగా చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి.

* మన దేశంలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ జనాభా వేగంగా పెరుగుతూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో (1951) 36.1 కోట్లుగా ఉన్న జనాభా ప్రస్తుతం 142 కోట్లకు పెరిగింది. అర్ధ శతాబ్దపు స్వల్ప కాలంలో ప్రపంచ జనాభా మూడు రెట్లు పెరిగితే, మన దేశ జనాభా నాలుగు రెట్లు పెరిగింది.

* జనాభా దేశమంతటా ఒకే రకంగా లేకుండా అసమానంగా విస్తరించి ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ వంటి ప్రాంతాల్లో అధికంగా; ఈశాన్య రాష్ట్రాలు, కొండలు, ఎడారి ప్రాంతాల్లో అతి తక్కువగా ఉంది. అధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో నివాస కొరత ఏర్పడుతుంది. * జనాభా పెరిగిన స్థాయిలో ఉపాధి కల్పన పెరగకపోవడంతో నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుంది. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కోట్లాది నిరుద్యోగులున్నారు. * ఆకలి - పౌష్టికాహార లోపం ఎక్కువవుతుంది. జనాభా పెరిగే స్థాయిలో ఆహారధాన్యాలు, పోషకాహారం ఉత్పత్తి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 107 దేశాల్లో భారత్‌ 97వ స్థానంలో నిలిచింది. 30.3 స్కోరుతో తీవ్ర ఆకలి కేటగిరీలో ఉంది (10 లోపు ఉంటే తక్కువ ఆకలి అని, 50 కంటే ఎక్కువ ఉంటే భయంకరమైన ఆకలిని ప్రతిబింబిస్తుంది). * జనాభా కారణంగా తలెత్తే పేదరికం మరో తీవ్రమైన సమస్య. 2010లో వాద్వా కమిటీ దేశంలో 20 కోట్ల మంది పేదలున్నట్లు అంచనా వేసింది. * దేశంలో ఎక్కువమంది పేద రైతులున్నారు. వీరికి ఆధునిక పనిముట్లు, ఎరువులు, పురుగుమందులు వాడే స్తోమత లేక ఉత్పాదకత తక్కువగా ఉంటోంది. ఫలితంగా జనాభా పెరిగే స్థాయిలో పంటల ఉత్పత్తి ఉండటం లేదు. * వ్యవసాయ రంగం కంటే, పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ దేశంలోని యువతకు ఉపాధి కల్పించలేకపోయింది. ఆర్థిక పరిమితులు, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం పారిశ్రామిక వృద్ధికి అవరోధాలు. * మన దేశంలో మతాలు, సంప్రదాయాలు, సనాతన ధర్మం మొదలైనవి జనాభా నియంత్రణకు అవరోధాలుగా ఉన్నాయి. వీటిలో కొన్ని అంశాలు కొత్త సాంకేతికత, వినూత్న ఆలోచనలను స్వీకరించకుండా అడ్డుకుంటున్నాయి. * వేగంగా పెరుగుతున్న జనాభా మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా తక్కువ జీవన ప్రమాణాలు నమోదవుతున్నాయి. ఇవేకాక పర్యావరణం, సహజ వనరులపై భారం ఎక్కువై పర్యావరణ అసమతౌల్యం, తరచుగా సమ్మెలు, బంద్‌లు, నేరాలు, తీవ్రవాదం  వంటి సమస్యలు పెరుగుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు