UPSC CSE Result 2022: సివిల్స్‌లో మెరిసిన కపుల్‌.. ఆ ఇంట ఆనందం ‘డబుల్‌’!

UPSC CSE 2022 Results: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ తుది ఫలితాల్లో కేరళకు చెందిన భార్యాభర్తలిద్దరూ విజేతలుగా నిలిచి రికార్డు సృష్టించారు.

Updated : 24 May 2023 21:09 IST

తిరువనంతపురం: యూపీఎస్సీ(UPSC) నిన్న విడుదల చేసిన సివిల్‌ సర్వీసెస్‌ 2022 తుది ఫలితాల్లో(CSE 2022 final Result) కేరళకు చెందిన జంట అరుదైన ఘనత సాధించింది. భార్యా భర్తలిద్దరూ సివిల్స్‌లో ర్యాంకులు సాధించి అదరగొట్టారు.  దంపతులిద్దరికీ ర్యాంకులు రావడంతో ఆ ఇంట రెట్టింపు ఆనందం వెల్లివిరిసింది.  వివరాల్లోకి వెళ్తే.. సివిల్‌ సర్వీసెస్‌కు యూపీఎస్సీ ఎంపిక చేసిన 933 మందిలో కేరళకు చెందిన మాళవిక జి నాయర్‌, డా ఎం.నందగోపన్‌ సత్తా చాటారు. 28 ఏళ్ల మాళవికకు 172వ ర్యాంకు రాగా.. ఆమె భర్త నందగోపన్‌(30)కు 233వ ర్యాంకుతో మెరిశారు.  వీరిద్దరికీ 2020లోనే వివాహం జరిగింది.

మాళవిక ఈ ఏడాది ఐదో ప్రయత్నంలో 172వ ర్యాంకును సాధించగా.. ఆమె  భర్త ఆరో ప్రయత్నం (చివరి)లో విజేతగా నిలిచారు. బిట్స్‌-గోవాలో విద్యనభ్యసించిన మాళవిక 2020లోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మంగళూరులో ఆదాయ పన్ను సహాయ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె తండ్రి కేరళ ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌లో డీజీఎంగా పనిచేసి రిటైర్‌ కాగా.. తల్లి గైనకాలజిస్ట్‌.  ఇకపోతే, నందగోపన్‌ తల్లి కొజెంచేరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్‌ వైద్యురాలు కాగా.. తండ్రి IOBలో  చీఫ్‌ మేనేజర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. నందగోపన్‌ ప్రస్తుతం పథనంథిట్ట జిల్లాలో మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌లో పనిచేస్తున్నారు. నందగోపన్‌ మలయాళం లిటరేచర్‌ను ఆప్షనల్‌గా ఎంచుకోగా.. మాళవిక మాత్రం సోషియాలజీని ఎంచుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని