NEET UG 2023 Results: ‘నీట్‌’ ఫలితాలు విడుదల.. ఏపీ విద్యార్థికి 720/720 మార్కులు

NEET 2023 Results: నీట్‌ యూజీ ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి 99.99 పర్సంటైల్‌ సాధించి సత్తా చాటాడు.

Updated : 13 Jun 2023 23:35 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్‌ యూజీ ఫలితాలు(NEET UG Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీకి చెందిన విద్యార్థి ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకుతో సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ ఇద్దరూ 720/720 మార్కులు సాధించి 99.99 పర్సంటైల్‌తో అదరగొట్టారు. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో ఏపీ విద్యార్థి వైఎల్‌ ప్రవధాన్‌ రెడ్డి రెండో ర్యాంకు సాధించగా.. ఎస్సీ కేటగిరీలో ఏపీకి చెందిన కె.యశశ్రీకి రెండో ర్యాంకు వచ్చింది. తెలంగాణకు చెందిన కె.జి.రఘురాం రెడ్డి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించాడు. NEETకు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు NTA తెలిపింది. ఈ ఏడాది నీట్‌కు దేశ వ్యాప్తంగా మొత్తం 11,45,976మంది అర్హత సాధించగా.. ఏపీ నుంచి 42,836, తెలంగాణ నుంచి  42,654మంది అభ్యర్థులు ఉన్నారు. 

నీట్ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో మే 7న నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌ 4న ప్రిలిమినరీ ఆన్షర్‌ కీని విడుదల చేసిన NTA.. దీనిపై జూన్‌ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న NTA అధికారులు తాజాగా తుది ఆన్సర్‌ కీతో పాటు ఫలితాలను విడుదల చేశారు.

అబ్బాయిలదే హవా

నీట్‌ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలే హవా చాటారు. టాప్‌ 50 అభ్యర్థుల్లో 40మంది అబ్బాయిలే ఉండగా.. 10మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిల్లో పంజాబ్‌కు చెందిన ప్రంజల్‌ అగర్వాల్‌ (4వ ర్యాంకు), అషికా అగర్వాల్‌ (11వ ర్యాంకు) 715 మార్కులతో టాపర్లుగా నిలిచారు. 

టాప్‌ 20 ర్యాంకర్లు వీరే..

  • ప్రభంజన్‌ జె (720 మార్కులు); బోరా వరుణ్‌ చక్రవర్తి (720)
  • కౌస్తవ్‌ బౌరి (716)
  • ప్రంజల్‌ అగర్వాల్‌ (175)
  • ధ్రువ్‌ అడ్వానీ (715)
  • సూర్య సిద్ధార్థ్‌ (715)
  • శ్రీనికేత్‌రవి (715)
  • స్వయం శక్తి త్రిపాఠి (715)
  • వరుణ్‌ ఎస్‌ (715)
  • పార్థ్‌ ఖండేవాల్‌ (715)
  • అషికా అగర్వాల్‌ (715)
  • సాయన్‌ ప్రధాన్‌ (715)
  • హర్షిత్‌ బన్సల్‌ (715)
  • శంకర్‌ కుమార్‌ (715)
  • కేసీ రఘురామ్‌ రెడ్డి (715)
  • శుభమ్‌ బన్సల్‌ (715)
  • భాస్కర్‌ కుమార్‌ 715)
  • దేవ్‌ భాటియా (715)
  • అర్నాబ్‌ పటి(715)
  • శశాంక్‌ సిన్హ (715)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని