సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు

సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్‌ చేశారన్న కారణంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వీర్‌ బహదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది.

Published : 28 Apr 2024 06:28 IST

జౌన్‌పుర్‌: సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్‌ చేశారన్న కారణంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని వీర్‌ బహదూర్‌ సింగ్‌ పుర్వాంచల్‌ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. బుధవారం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కమిటీలో డా. అశితోష్‌ గుప్తా, డా.వినయ్‌ వర్మలు తప్పుడు మూల్యాంకనానికి పాల్పడ్డారని నిర్ధారణ అయినట్లుగా వర్సిటీ ఉపకులపతి వందనా సింగ్‌ తెలిపారు. దీంతో వీరిద్దరిని విధుల నుంచి తప్పించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. సమాధాన పత్రాల్లో జై శ్రీరాం పేర్లు రాసినట్లు గుర్తించిన నలుగురు ప్రథమ సంవత్సర విద్యార్థుల నుంచి ఆచార్యులు డబ్బులు తీసుకున్నారా? లేదా అన్న విషయమై దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. విశ్వవిద్యాలయంలో డీ ఫార్మసి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పు సమాధానాలు రాసినప్పటికీ ఉత్తీర్ణులయ్యారని తెలుసుకున్న ఓ పూర్వ విద్యార్థి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని