SSC GD Constable: 24 నుంచి కానిస్టేబుల్‌ (జీడీ) శారీరక సామర్థ్య పరీక్షలు.. అడ్మిట్‌ కార్డులు విడుదల

సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ (జీడీ) ఉద్యోగాలకు దేహ దారుఢ్య పరీక్షలను ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, దీనికి సంబంధించిన అడ్మిట్‌ కార్డులను విడుదల చేశారు.

Published : 19 Apr 2023 20:13 IST

దిల్లీ: దేశంలోని వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్‌ (జీడీ) రైఫిల్‌మ్యాన్‌/సిఫాయి పోస్టుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) గతేడాది నవంబర్‌లో భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.  పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) తాజాగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ/ పీఈటీలను ఏప్రిల్‌ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి  శారీరక సామర్థ్య/ ప్రమాణ పరీక్షలు దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌ శిక్షణ కేంద్రాల్లో జరుగనున్నాయి. ఈ-అడ్మిట్ కార్డులను సైతం డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులో ఉంచారు. అడ్మిట్ కార్డు లేకుండా శారీరక సామర్థ్య పరీక్షలకు అభ్యర్థులను అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. తుది ఫలితాల అనంతరం రిజర్వేషన్‌ను బట్టి ఆయా సాయుధ బలగాల్లో ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు.

అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని