కేశ సౌందర్యానికి..

వెంట్రుకల ఆరోగ్యానికి సమతులాహారమే కీలకం. ప్రొటీన్‌, విటమిన్లు.. ఐరన్‌, జింక్‌ వంటి ఖనిజాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వెంట్రుకలు పెరగటానికి విటమిన్‌ బి7 (బయోటిన్‌) చాలా ముఖ్యం.

Updated : 06 Jun 2023 05:29 IST

వెంట్రుకల ఆరోగ్యానికి సమతులాహారమే కీలకం. ప్రొటీన్‌, విటమిన్లు.. ఐరన్‌, జింక్‌ వంటి ఖనిజాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వెంట్రుకలు పెరగటానికి విటమిన్‌ బి7 (బయోటిన్‌) చాలా ముఖ్యం. గుడ్లు, చేపలు, కాలేయం, తవుడుతో కూడిన ధాన్యాలు, గింజపప్పులు, విత్తనాలు, పెరుగు వంటి వాటితో ఇవి లభిస్తాయి. రోజూ గుప్పెడు మొలకలు తిన్నా మేలే. వీటిల్లోని అమైనో ఆమ్లాలు వెంట్రుకలు పెరగటానికి తోడ్పడతాయి. ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు వెంట్రుకల ఆరోగ్యానికి చికిత్స అవసరమవ్వచ్చు. ఇలాంటి సమయాల్లో సహజ పదార్థాలతో చేసుకునే పేస్టులు బాగా ఉపయోగపడతాయి.

*పొడి, చిట్లిన వెంట్రుకలకు- ఒక గుడ్డు, చెంచాడు కొబ్బరి నూనె, కొద్దిగా నిమ్మరసం, చెంచా గ్లిజరిన్‌ బాగా కలిపి జుట్టుకు పట్టించుకోవాలి. తలకు ప్లాస్టిక్‌ షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. గంట తర్వాత కడిగేయాలి.

* చుండ్రు, మాడు ఇన్‌ఫెక్షన్‌కు- మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. మర్నాడు మెత్తగా రుబ్బి, మాడుకు పట్టించుకోవాలి. గంట తర్వాత నీటితో కడుక్కోవాలి. మెంతులను నానబెట్టిన నీటితో అయినా కడుక్కోవచ్చు.

* జిడ్డు వెంట్రుకలకు- మూడు చెంచాల షీకాకాయ పొడికి కొద్దిగా ముల్తానీ మట్టి లేదా శనగపిండి, గుడ్డు లేదా పెరుగు కలిపి ముద్దలా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి. ఇది వెంట్రుకలను శుభ్రం చేయటమే కాదు పోషకాలనూ అందిస్తుంది. జుట్టును మృదువుగానూ చేస్తుంది.

* కళ తప్పితే- వెంట్రుకలు నిగనిగలాడటానికి గోరింటాకు ముద్ద ఉపయోగపడుతుంది. జుట్టు నిగనిగలాడేందుకు కలబంద గుజ్జూ మేలు చేస్తుంది. దీన్ని తలకు పట్టించి, అరగంట తర్వాత కడిగేయాలి.

* జిడ్డు, చుండ్రుకు- గోరింట పొడికి 4 చెంచాల నిమ్మరసం, 4 చెంచాల కాఫీ, 2 గుడ్లు, తగినంత తేనీరు (వాడిన తేయాకును తిరిగి నీటిలో మరిగించి తేనీరు తయారు చేసుకోవచ్చు) కలిపి ముద్దగా చేయాలి. దీన్ని తలకు పట్టించి గంట తర్వాత నీటితో కడిగేయాలి. ఒకవేళ గుడ్లు వద్దనుకుంటే ఇంకాస్త ఎక్కువ తేనీరు కలపాలి.

* పొడి జుట్టు పోషణకు- పండిన అరటిపండు గుజ్జుకు 2 గుడ్లు, నిమ్మరసం కలిపి చిలకాలి. దీన్ని తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని