పూడికలకు మ్యాంగనీస్‌ కళ్లెం!

రక్తనాళాల్లో పూడికలు ముదరకుండా స్టాటిన్‌ మందులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఇవి ఒకసారి పూడికలు ఏర్పడిన తర్వాత వాటిని నిర్మూలించలేవు.

Updated : 09 Jan 2024 15:57 IST

క్తనాళాల్లో పూడికలు ముదరకుండా స్టాటిన్‌ మందులు బాగా ఉపయోగపడతాయి. కానీ ఇవి ఒకసారి పూడికలు ఏర్పడిన తర్వాత వాటిని నిర్మూలించలేవు. మరెలా? ఇందుకోసం శాస్త్రవేత్తలు ఓ సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. అదీ మనం తినే చాలా ఆహార పదార్థాల్లో ఉండే పోషకంతోనే. అదేంటో తెలుసా? మ్యాంగనీసు. ఇదో లోహ మూలకం. కోఎంజైమ్‌గా పనిచేస్తూ పిండి పదార్థం, కొవ్వు జీవక్రియల్లో పాలు పంచుకుంటుంది. నాడులు, మెదడు సరిగా పనిచేయటానికీ తోడ్పడుతుంది. అనుసంధాన కణజాలం, పునరుత్పాదక హార్మోన్లు, ఎముకల వంటివి ఏర్పడటానికీ దోహదం చేస్తుంది. తవుడుతో కూడిన ధాన్యాలు, గింజపప్పులు, ఆకు కూరలు, మిరియాలు, కాఫీ, టీ వంటి రకరకాల పదార్థాల్లో మ్యాంగనీసు ఉంటుంది. ఇది లోపిస్తే కండరాల బలహీనత, సంతానలేమి, ఎముకలు సరిగా ఏర్పడకపోవటం, మూర్ఛ వంటి సమస్యలకు దారితీస్తుంది. దీని ప్రయోజనాల గురించి చైనా పరిశోధకులు మరో కొత్త విషయాన్ని గుర్తించారు. పూడికలకు కారణమయ్యే రక్తంలోని కొవ్వు మోతాదులను తగ్గించటమే కాకుండా రక్తనాళాల గోడల నుంచి పూడికలనూ తొలగిస్తున్నట్టు కనుగొన్నారు. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటి కొవ్వులను లైపోప్రొటీన్లు మోసుకెళ్తాయి. ఇవి రక్తంలోకి చేరటానికి కాప్‌2 అనే ప్రొటీన్‌ సముదాయం అవసరం. ఇది పనిచేయటానికి రసాయనాలు కచ్చితమైన మోతాదులో ఉండాలి. మ్యాంగనీసు సరిగ్గా ఇక్కడే దెబ్బకొడుతోంది. ఇది కాప్‌2కు అంటుకుపోయి, రసాయనాల తీరును అస్తవ్యస్తం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఎలుకలను నోటి ద్వారా నిర్ణీత మోతాదులో మ్యాంగనీసు ఇచ్చి పరిశీలించగా.. రక్తంలో కొవ్వు మోతాదులు తగ్గినట్టు, అప్పటికే ఏర్పడిన పూడికలూ తొలగినట్టు తేలింది. మనుషుల్లోనూ ఇలాగే పనిచేస్తున్నట్టు రుజువైతే పూడికల నిర్మూలనకు కొత్త చికిత్స అందుబాటులోకి వచ్చినట్టేనని భావిస్తున్నారు. గుండెజబ్బుకు పూడికలే ప్రధాన కారణంగా నిలుస్తున్న నేపథ్యలో ఇది కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం మందులతో పూడికల వృద్ధిని నిలువరించటానికి, వాటిని నియంత్రణలో ఉంచటానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఇక ఏకంగా పూడికలను తొలగించే పద్ధతి.. అదీ అందుబాటులో ఉన్న పోషకంతోనే సాధ్యమైతే అంతకన్నా మంచి విషయం ఇంకేం కావాలి?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని