మలివయసులోమందులతో జాగ్రత్త!

మందులతో జాగ్రత్త!వయసు మీద పడుతున్నకొద్దీ శరీరం మునుపటిలా పనిచేయదనే సంగతి తెలిసిందే. ఇది వేసుకునే మందులకూ వర్తిస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ అంత త్వరగా మందులను శోషించుకోలేకపోవచ్చు.

Updated : 29 Nov 2023 17:18 IST
 

మందులతో జాగ్రత్త!వయసు మీద పడుతున్నకొద్దీ శరీరం మునుపటిలా పనిచేయదనే సంగతి తెలిసిందే. ఇది వేసుకునే మందులకూ వర్తిస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ అంత త్వరగా మందులను శోషించుకోలేకపోవచ్చు. కాలేయ జబ్బులున్నట్టయితే రక్తంలో మందు నిల్వ ఉండిపోవచ్చు. లేదూ రక్తంలోకి నెమ్మదిగా చేరుకోవచ్చు. శరీరం వినియోగించుకోగా మిగిలిన మందులు కిడ్నీ జబ్బుల మూలంగా సరిగా బయటకు వెళ్లకపోవచ్చు. కాబట్టి మలి వయసులో మందుల వాడకంలో కాస్త జాగ్రత్త అవసరం.

నొప్పిని తగ్గించేవి

వృద్ధాప్యంలో రకరకాల సమస్యలకు వేర్వేరు మందులు వేసుకుంటుంటారు. వీటి పనితీరును ఐబూప్రొఫెన్‌, ఆస్ప్రిన్‌, నాప్రోక్జెన్‌ వంటి ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు ప్రభావితం చేయొచ్చు. ముఖ్యంగా రక్తాన్ని పలుచబరచే, గ్లూకోజు తగ్గించే, మూత్రం వచ్చేలా చేసే, రక్తపోటు తగ్గించే మందుల ప్రభావాన్ని తగ్గించొచ్చు. కిడ్నీలు, కాలేయం, గుండె, జీర్ణాశయం, పేగుల వంటి అవయవాల మీదా నొప్పి మందులు విపరీత చూపుతాయి.

కండరాలను వదులు చేసేవి

కండరాలు పట్టేయకుండా చూడటానికి సైక్లోబెంజప్రైన్‌, మెథోకార్బమోల్‌, క్యారిసోప్రోడోల్‌ వంటి మందులను డాక్టర్లు సూచిస్తుంటారు. వీటితో తికమక పడటం, తూలటం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. దీంతో కింద పడటం, దెబ్బలు తగలటం వంటి ముప్పులు పెరగొచ్చు.

మధుమేహ మందులు

దీర్ఘకాలం పనిచేసే క్లోర్‌ప్రొపమైడ్‌, గ్లైబురైడ్‌ వంటి సల్ఫోనైలూరియా రకం మందులు రక్తంలో గ్లూకోజు బాగా పడిపోయేలా (హైపోగ్లైసీమియా) చేయొచ్చు. దీంతో తికమక, వణుకు, చల్లటి చెమట్లు, ఆకలి, అలసట వంటివి తలెత్తొచ్చు. ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నా, ఎక్కువసేపు కొనసాగినా స్పృహ తప్పొచ్చు. సరైన సమయంలో స్పందించకపోతే ప్రాణాపాయానికీ దారితీయొచ్చు.

జలుబుకు వాడేవి

తుమ్ములు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలకు యాంటీహిస్టమిన్‌ మందులు వేసుకుంటుంటారు. ఇవి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి గానీ దుష్ప్రభావాలూ ఉంటాయి. వయసు మీరినవారికివి మరింత ఎక్కువ నిద్రమత్తు, తికమక కలిగించొచ్చు. దీంతో కింద పడే ప్రమాదముంది. కాబట్టి వీటిని వేసుకున్నప్పుడు బయటకు వెళ్లకపోవటం, వాహనాలు నడపకపోవటం మంచిది.

మూత్రం ఆపే మందులు

మూత్రం ఆపలేనివారికి, మూత్రాశయం అతిగా స్పందిచేవారికి, పార్కిన్సన్స్‌తో బాధపడేవారికి డాక్టర్లు యాంటీకొలెనెర్జిక్‌ మందులు సూచిస్తుంటారు. ఇవి తికమక, నోరు ఎండటం, చూపు మసక, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీయొచ్చు.

నిద్ర మాత్రలు

వృద్ధాప్యంలో నిద్ర పట్టకపోవటం తరచూ చూసేదే. కొందరు నిద్ర మాత్రలూ వాడుతుంటారు. అయితే ఇవి మేల్కొనేటప్పుడు ఇబ్బందులు కలిగించొచ్చు. లేచిన వెంటనే మత్తుగా, తూలుతున్నట్టు అనిపించొచ్చు. స్పష్టంగా ఆలోచించలేకపోవచ్చు. నిద్రమాత్రల్లో ప్రధానంగా ఉండే డైఫెనీడ్రమైన్‌ మందు నోరు తడారటం, చూపు మసక బారటం, మూత్రాశయ సమస్యలకూ దారితీస్తుంది.

ఆందోళన మందులు

మలివయసులో కొందరు ఆందోళన, దిగులు, నిరాశకు గురవుతుంటారు. ఇవి తగ్గటానికి డైజీపామ్‌, ఆల్ప్రజోలమ్‌, క్లోర్‌డయాజెపాగ్జైడ్‌ వంటి బెంజో డయాజెపైన్స్‌ రకం మందులను డాక్టర్లు సూచిస్తుంటారు. వీటిల్లో కొన్ని శరీరంలో ఎక్కువ సేపు ఉండిపోవచ్చు. మందులు వేసుకున్న మర్నాడు తికమక పడటం వంటివి తలెత్తొచ్చు. దీంతో కింద పడిపోయే ప్రమాదముంది.

మలబద్ధకం మందులు

వృద్ధుల్లో మలబద్ధకం పెద్ద సమస్య. చాలామంది దీంతో బాధపడుతుంటారు. వీరికి బైసకోడీల్‌ వంటి లాగ్జేటివ్‌ మందులు మేలు చేస్తాయి. అయితే వీటిని దీర్ఘకాలం తీసుకోవటం తగదు. అదేపనిగా వాడుతూ ఉంటే మలబద్ధకం అలాగే కొనసాగేలా చేయొచ్చు.

మిశ్రమ మందులు

సొంతంగా కొనుక్కొని వేసుకునే వాటిల్లో రెండు, మూడు మందులు కలిసి పోయి ఉండొచ్చు. ఉదాహరణకు- కొన్ని జలుబు మందుల్లో యాంటీహిస్టమిన్లు, ముక్కుదిబ్బడను తగ్గించే మందులు కలిసి ఉండొచ్చు. ఇవి తికమక, మత్తు, తూలటం వంటి వాటికి దారితీయొచ్చు. ఇవి రక్తపోటునూ పెంచొచ్చు. మూత్రం ఎక్కువగా వచ్చేలా చేయొచ్చు కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని