వేడి ఆవిర్లకు కొత్త చికిత్స!

ముట్లుడిగినవారిలో సుమారు 80% మంది వేడి ఆవిర్ల వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వీరికి హార్మోన్‌ భర్తీ చికిత్సలు మేలు చేస్తాయి. కాకపోతే దీన్ని అందరికీ ఇవ్వటం కుదరదు.

Published : 13 Jun 2023 00:56 IST

ముట్లుడిగినవారిలో సుమారు 80% మంది వేడి ఆవిర్ల వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వీరికి హార్మోన్‌ భర్తీ చికిత్సలు మేలు చేస్తాయి. కాకపోతే దీన్ని అందరికీ ఇవ్వటం కుదరదు. ఇలాంటి ఇబ్బందిని అధిగమించటానికి అమెరికా ఎఫ్‌డీఏ తాజాగా ఫీజోలినెటాంట్‌ అనే మందు వాడకానికి అనుమతి ఇచ్చింది. ఇది నూరోకినైన్‌ 3 రిసెప్టర్‌ యాంటగోనిస్ట్‌ రకం మందు. నాడుల పనితీరు మీద ప్రభావం చూపటం ద్వారా వేడి ఆవిర్ల వంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. హార్మోన్ల భర్తీ చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాగలదని భావిస్తున్నారు. ఫీజోలినెటాంట్‌ సామర్థ్యం, సురక్షిత మీద 52 వారాల పాటు ప్రయోగ పరీక్షలు నిర్వహించిన అనంతరం వాడకానికి అనుమతించారు. మాత్ర రూపంలో ఉండే దీన్ని రోజుకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. రోజూ ఒకే సమయానికి మాత్ర వేసుకోవాలి. ఆ వేళకు మరచిపోతే వీలైనంత త్వరగా వేసుకోవాలి. మర్నాడు రోజూ వేసుకునే సమయానికే తీసుకోవాలి. ఒక మాదిరి నుంచి తీవ్రంగా వేడి ఆవిర్లు వచ్చేవారికిది బాగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు. అయితే దీంతో కడుపు నొప్పి, విరేచనాలు, నిద్రలేమి, నడుం నొప్పి వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. కాలేయ ఎంజైమ్‌ల మోతాదులూ పెరిగే అవకాశముంది. కాబట్టి మందు వాడటానికి ముందే రక్త పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. మందు వేసుకోవటం మొదలెట్టిన తర్వాతా తొలి 9 నెలల్లో ప్రతి మూడు నెలలకోసారి రక్తపరీక్ష చేయించుకోవాలి. కాలేయం గట్టిపడటం, కిడ్నీ దెబ్బతినటం, కిడ్నీ వైఫల్యం గలవారికిది నిషిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని