పారిన రామన్న పథకం!

రామాపురంలో శివరాజు ఓ ఆయుర్వేద వైద్యుడు. హస్తవాసి బాగుండటంతో చుట్టుపక్కల ఊర్ల నుంచి నిత్యం చాలా మంది రోగులు చికిత్స కోసం శివరాజు దగ్గరకు వచ్చేవారు. మొదట్లో సరైన వైద్యం చేసిన అతనికి రోగుల తాకిడి ఎక్కువయ్యే సరికి తినడానికి కూడా తీరిక లభించేది కాదు. శివరాజుకు పేరుతో పాటు అహం కూడా పెరిగింది. త్వరగా ధనవంతుడిని కావాలనే అత్యాశ కలిగింది. వైద్యం కోసం వచ్చేవారి దగ్గర అప్పులు చేయడం మొదలు పెట్టాడు. ఎవరైనా అప్పు ఇవ్వకుంటే వైద్యం చేయకుండా ఇబ్బంది పెట్టేవాడు.

Published : 10 May 2021 00:50 IST

రామాపురంలో శివరాజు ఓ ఆయుర్వేద వైద్యుడు. హస్తవాసి బాగుండటంతో చుట్టుపక్కల ఊర్ల నుంచి నిత్యం చాలా మంది రోగులు చికిత్స కోసం శివరాజు దగ్గరకు వచ్చేవారు. మొదట్లో సరైన వైద్యం చేసిన అతనికి రోగుల తాకిడి ఎక్కువయ్యే సరికి తినడానికి కూడా తీరిక లభించేది కాదు.
శివరాజుకు పేరుతో పాటు అహం కూడా పెరిగింది. త్వరగా ధనవంతుడిని కావాలనే అత్యాశ కలిగింది. వైద్యం కోసం వచ్చేవారి దగ్గర అప్పులు చేయడం మొదలు పెట్టాడు. ఎవరైనా అప్పు ఇవ్వకుంటే వైద్యం చేయకుండా ఇబ్బంది పెట్టేవాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ అతనికి చేబదులు కానీ, అప్పు కానీ ఇచ్చేవారు.
రోగుల దగ్గర తీసుకున్న ధనంతో పొరుగూరిలో పొలాలు కొని ఎవరికీ తెలియకుండా వ్యాపారమూ ప్రారంభించాడు. రోజులు మారాయి. కొత్త వైద్యులు వచ్చారు. శివరాజు ప్రాముఖ్యం తగ్గింది. ప్రజలు ఆయన్ను తమ ధనం తమకు తిరిగి ఇవ్వమని అడిగారు. తీసుకున్న సొమ్ము ఇవ్వడం ఇష్టం లేని శివరాజు రోజుకో అబద్ధంతో కాలం గడిపాడు.
శివరాజుపై అప్పులవారు తమ ధనం ఇవ్వమని ఒత్తిడి పెంచారు. అతను కొన్ని రోజులు వైద్యశాల మూసేసి తప్పించుకు తిరిగాడు. శివరాజు భార్య పరమగయ్యాళి. ఇంటికొచ్చి ఎవరైనా బాకీ చెల్లించమని అడిగితే నానా రభస చేసేది. ఇక తమ వల్ల కాక అప్పులు ఇచ్చినవారు మరికొన్ని రోజులు వేచి చూశారు.
శివరాజు అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చేవాడు. సూర్యోదయానికి ముందే ఎవరికీ కనబడకుండా పారిపోయేవాడు. కొందరు కాపుకాసి పట్టుకుని నిలదీస్తే, వారి ముందే భార్యాభర్తలు గొడవ పడ్డట్లు నాటకాలాడేవాళ్లు. శివరాజు అబద్ధాలు ఆడుతున్నాడని తెలిసినా ప్రజలు ఏమీ చేయలేని నిస్సహాయులుగా మిగిలిపోయారు. అందరూ కలిసి న్యాయాధికారికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అబద్ధాలు ఆడటంలో ఆరితేరిన శివరాజు ఓ పథకం పన్నాడు. రాజ వైద్యశాలలో ఆయుర్వేద వైద్యుడిగా ఉద్యోగం వచ్చిందని అందరినీ నమ్మించాడు.
శివరాజు బంధుమిత్రులకు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్న ప్రజల్లో కొందరు భయపడ్డారు. మరికొందరేమో తామెందుకు శత్రుత్వం కొని తెచ్చుకోవడం అని వెనకడుగు వేశారు. రోజూ రాజ వైద్యశాలకు వెళ్తున్నట్లు నటించి, ఎక్కడెక్కడో తిరిగి ఏ రాత్రికో ఇంటికి వచ్చేవాడు. మళ్లీ అప్పులు చేయడం ప్రారంభించాడు.
శివరాజుకు అప్పు ఇచ్చి దివాళా తీసిన రామన్నకు ఆ ఉద్యోగం నిజమైనదేనా? అని మొదటి నుంచీ అనుమానం ఉండేది. కానీ రాజ వైద్యశాలకు వెళ్లి విచారణ చేసేంత పలుకుబడి లేదు. అబద్ధాలతో పొద్దు గడుపుతున్న శివరాజుకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్నాడు. బాధితులందరినీ ఏకం చేశాడు.
రాజ వైద్యుడు శివరాజు ఉత్తమ వైద్యుడని, వైద్యశాలలో వందల మంది ప్రాణాలు రక్షించాడని, అతనికి తమ ఊరి తరఫున ఘనంగా సన్మానం చేస్తామని, రాజుగారు వీలు చేసుకుని తమ ఊరికి రావాలని.. మహారాజుకు రామన్న ఉత్తరం రాశాడు. మహారాజు దృష్టి శివరాజుపై పడింది. అతన్ని రాజదర్బారుకు ఆహ్వానించాలని ఆరోగ్యమంత్రిని ఆదేశించాడు.
ఆరోగ్యమంత్రి విచారణలో అసలు శివరాజు అనే రాజవైద్యుడే లేడని తేలింది. రామాపురం వెళ్లి ఆరా తీయగా అతడు రాజవైద్యుడని  ఊరంతా చెప్పారు. భటులు శివరాజును బంధించి మహారాజు ముందు నిలబెట్టారు. అతడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని పొలాలను జప్తు చేసి, ఊరివారి దగ్గర తీసుకున్న అప్పును న్యాయాధికారులు చెల్లించారు. నిత్యం అబద్ధాలతో సహవాసం చేసిన శివరాజు చివరికి చెరసాల పాలయ్యాడు. రామన్న తన పథకం పారిందని సంతోషించాడు.

- దుర్గమ్‌ భైతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని