Published : 03 May 2022 00:42 IST

సీసా తెచ్చిన సందేశం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ప్రపంచ యుద్ధాల సమయంలో నావికులు తమకు ఏదైనా అపాయం ఎదురైనప్పుడో, ఏదైనా చెప్పాలనుకున్నప్పుడో ‘సీసా సందేశాలు’ పంపేవారని పుస్తకాల్లో చదువుకొనే ఉంటారు. కొన్ని సినిమాల్లోనూ ఇలాంటివి చూసుంటారు. అచ్చంగా అలాంటి ఓ సంఘటనే ఇటీవల వైరల్‌గా మారింది. అదేంటో గబగబా చదివేయండి మరి.

హమస్‌ దేశంలోని అట్లాంటిక్‌ మహాసముద్ర తీరంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా.. కాలికి ఒక సీసా తగిలిందట. దారిలో ఉండటంతో, ఎవరికైనా తగులుతుందేమోనని తీసి పక్కకు పెడుతుండగా.. అందులో ఏదో ఉన్నట్లు గమనించిందట. ఎంతో ఆసక్తితో సీసా తెరిచి చూస్తే.. ఒక డ్రాయింగ్‌తోపాటు లేఖ, దానిపైన ఒక విద్యార్థి చిత్రం కూడా కనిపించింది. ఆ లెటర్‌లో ఉన్న వివరాల ఆధారంగా అది ఎక్కడి నుంచి వచ్చిందో, సముద్రంలోకి ఎవరు వేశారో వారికి సమాచారం అందించిందామె.  

పాఠశాల పిల్లలంతా కలిసి..

అమెరికాలో బ్రాక్‌పోర్ట్‌ అనే ఒక చిన్న ప్రాంతం ఉంది. 2011లో అక్కడి స్కూల్‌లో ఓ యాక్టివిటీలో భాగంగా విద్యార్థులు రాసిన సందేశాన్నీ, గీసిన బొమ్మలతోపాటు వారి చిత్రాన్నీ గాజు సీసాల్లో పెట్టి.. జాగ్రత్తగా మూతలు బిగించీ.. ఓ ఉపాధ్యాయుడి సలహాతో అట్లాంటిక్‌ మహాసముద్రంలో విసిరేశారట. అయితే, వాటిలో జారెడ్‌ అనే విద్యార్థికి చెందిన సీసా సముద్ర జలాల్లో దాదాపు 1000 మైళ్లకు పైగా దూరం ప్రయాణించి.. బహమస్‌ తీరానికి చేరిందట.

మెయిల్‌ చేయడంతో..

సముద్ర తీరంలో సీసాను గమనించిన ఆ మహిళ.. అందులోని వివరాల ఆధారంగా బ్రాక్‌పోర్ట్‌ పాఠశాల ఉపాధ్యాయుడికి ఈ-మెయిల్‌ చేసింది. అది చూసిన అతను ఈ విషయాన్నంతటినీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ‘సీసా సందేశం’ వార్త క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఆ స్కూల్‌ సైతం తమ ట్విటర్‌ ఖాతాలో సంబంధిత ఫొటోలతోపాటు వివరాలను అప్‌లోడ్‌ చేయడంతో.. ఆ మారుమూల బడికి యమా క్రేజ్‌ వచ్చిందట.

మొదట నమ్మలేదట..

‘సీసా దొరికింది సరే.. మరి ఇంతకీ ఈ విషయం.. బొమ్మ, లేఖతోపాటు దాన్ని సముద్రంలోకి విసిరేసిన అప్పటి విద్యార్థి జారెడ్‌కు తెలిసిందా?’ అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది కదా నేస్తాలూ.. ఆ ఉపాధ్యాయుడే ప్రస్తుతం వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న జారెడ్‌కు ఈ విషయం చెబితే.. అతడు మొదట నమ్మలేదట. తరవాత ఫొటోలతోపాటు సోషల్‌ మీడియా వార్తలను షేర్‌ చేస్తే.. వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాడట. ఎంతోమంది విద్యార్థులు తమ సీసాలను సముద్రంలోకి విసిరేసినా.. తనది మాత్రమే దొరకడంతో జారెడ్‌ తెగ సంబరపడ్డాడు. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజంగా భలే సంఘటన కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని