కొలనులోకి దూకి.. అమ్మను రక్షించి..

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి చిన్నపిల్లలకు నీళ్లంటే బోలెడు సరదా. మరికొందరికేమో విపరీతమైన భయం. ఎంత ఈత వచ్చినా, ఎంత నైపుణ్యమున్నా.. సమయస్ఫూర్తి కూడా ఎంతో ముఖ్యం.

Updated : 05 Sep 2022 00:30 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. మనలాంటి చిన్నపిల్లలకు నీళ్లంటే బోలెడు సరదా. మరికొందరికేమో విపరీతమైన భయం. ఎంత ఈత వచ్చినా, ఎంత నైపుణ్యమున్నా.. సమయస్ఫూర్తి కూడా ఎంతో ముఖ్యం. అందుకు ఉదాహరణే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంఘటన. అమ్మ మనకు జన్మనిస్తే.. ఆ అమ్మకే పునర్జన్మనిచ్చిన బాలుడి వివరాలే ఇవీ..

అమెరికాలోని ఒక్లాహామాకు చెందిన గెవెన్‌ కేనె అనే బాలుడికి పదేళ్లు. అతడు తన తల్లి, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల విహారయాత్రకు వెళ్లాడు. అందరూ అక్కడ సరదాగా గడుపుతుండగా.. కేనె వాళ్ల అమ్మ ఈత కొట్టేందుకు స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగింది. అయితే ఆమెకు మూర్ఛ వ్యాధి ఉండటంతో నీటిలో మునిగిపోసాగింది. ఇంతలో దూరం నుంచే తల్లిని చూసిన కేనె.. పరుగెత్తుకుంటూ వచ్చి పూల్‌లోకి దూకాడు.

తాతయ్య వచ్చే వరకూ..
నీటిలో మునిగిపోతున్న తల్లిని.. పదేళ్ల కేనె కాపాడటం తన శక్తికి మించిన భారమే. అయినా, ఎలాగోలా కష్టపడి తల్లిని స్విమ్మింగ్‌ పూల్‌ ఒడ్డు వరకూ లాక్కెళ్లాడు. బయటకు తీసుకెళ్లే శక్తి లేకపోవడంతో.. తల్లి తల భాగం వరకూ బయటకు తేలేలా పట్టుకొని, పూల్‌కు ఉండే నిచ్చెనను ఆసరాగా చేసుకొని సహాయం కోసం చూస్తుండిపోయాడు. ఇంతలో తాతయ్య పరుగెత్తుకుంటూ వచ్చి, నీటిలోకి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కావడం, దాన్ని ఎవరో సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లంతా వివిధ రకాల కామెంట్లతో ఆ బాలుడిని అభినందిస్తున్నారు. అంతేకాదు.. ఒక్లాహామా పోలీసులు సైతం కేనె ధైర్యాన్ని మెచ్చుకోవడంతోపాటు ఓ అవార్డునూ అందజేశారట. ఎంతో సాహసం చేసి, తల్లికే పునర్జన్మనిచ్చిన ఈ నేస్తం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని