రికార్డుకెక్కిన ఏటీఎం!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఖర్చుల కోసమో, ప్రయాణాల్లో అవసరానికో డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్తుంటారు కదా! ఈ ఏటీఎంలలోనూ కొన్నింటికి రికార్డులు ఉంటాయి.

Published : 30 Oct 2022 00:04 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఖర్చుల కోసమో, ప్రయాణాల్లో అవసరానికో డబ్బులు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్తుంటారు కదా! ఈ ఏటీఎంలలోనూ కొన్నింటికి రికార్డులు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటిదే. ఇంతకీ ఆ ఏటీఎం ప్రత్యేకత ఏంటో, ఎక్కడుందో తెలుసుకుందామా..

పాకిస్థాన్‌లోని ఖుంజెరాబ్‌ పాస్‌ బోర్డర్‌లో ఉన్న ఏటీఎం ‘ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న ఏటీఎం’గా రికార్డు సృష్టించింది. ఇది భూభాగానికి 4,693 మీటర్ల ఎగువన, పాకిస్థాన్‌-చైనా సరిహద్దులో ఉంది. దీన్ని 2016లో నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాకిస్థాన్‌ ఏర్పాటు చేసింది. అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఏటీఎంగా ఇది ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ చోటు దక్కించుకుంది.

సౌర, పవన విద్యుత్తుతో..

దట్టంగా మంచు కురిసే పర్వత శ్రేణుల మధ్య ఏర్పాటైన ఈ ఏటీఎం.. పాకిస్థాన్‌-చైనా బోర్డర్‌లో పహరా కాసే సైనికులతోపాటు స్థానికంగా నివసించే వారికి చాలా ఉపయోగపడుతోందట. ఈ ఏటీఎంలో డబ్బులు తీసుకోవడంతోపాటు బిల్లుల చెల్లింపులు, క్యాష్‌ డిపాజిట్‌ కూడా చేసుకోవచ్చు. ఇది అందుబాటులోకి వచ్చాక.. ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మరీ బందోబస్తు నిర్వహించే సైనికులు తమ వేతనాన్ని ఇళ్లకు పంపడం సులువైందట. మరో విషయం ఏంటంటే.. ఈ ఏటీఎంకు విద్యుత్తు సరఫరా కూడా అవసరం లేదు. కేవలం సౌర, పవన(విండ్‌) విద్యుత్తుతో పనిచేస్తుంది. ఇందులో డబ్బులు అయిపోయినా, ఏదైనా సమస్య వచ్చినా.. 85 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకు శాఖ నుంచి సిబ్బంది రావాల్సి ఉంటుంది. అలాగని.. ఈ ఏటీఎంని తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్‌.. దీని ద్వారా ప్రతి నెలా దాదాపు రూ.30 లక్షల వరకూ లావాదేవీలు జరుగుతున్నాయట.

పర్యాటక ప్రదేశంగా..

గిన్నిస్‌ బుక్‌లో స్థానం సాధించిన ఈ ఏటీఎం.. క్రమంగా ఓ పర్యాటక ప్రదేశంగానూ మారిపోయింది. సమీప ప్రాంతాలతోపాటు ఇతర దేశాల పర్యాటకులు, సాహసికులు కేవలం ఈ ఏటీఎంను చూసేందుకే ఇక్కడి వరకూ వస్తుంటారట. దీని దగ్గర ఫొటోలు దిగి మరీ సంబరపడిపోతుంటారు. కొన్ని స్కూళ్లు కూడా మంచు అంతగా కురవని సమయాల్లో.. తమ విద్యార్థులను పిక్నిక్‌లో భాగంగా ఇక్కడికి తీసుకొస్తారు. మంచు తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాలప్పుడు మినహా ప్రతిరోజూ ఇది పనిచేస్తూనే ఉంటుందట. కొన్నిసార్లు ఏ సమస్యా లేకపోయినా.. బ్యాంకు సిబ్బంది రెండున్నర గంటలు ప్రయాణించి మరీ ఈ ఏటీఎం పనితీరును పరిశీలిస్తూ ఉంటారట. మొత్తానికి ఇవీ.. ఈ ఏటీఎం విశేషాలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని