ఇది తాజ్‌మహల్‌ కాదోచ్‌!

పెద్ద డోమ్‌తో చూడ్డానికి ఈ నిర్మాణం కాస్త తాజ్‌మహల్‌లా ఉంది కదూ! కానీ కాదు. మరి ఇంతకీ ఇదేంటి? దీని పేరేంటి? ఇది ఎక్కడుంది? దీన్ని ఎవరు.. ఎందుకు.. ఎప్పుడు నిర్మించారు?.

Updated : 25 Dec 2022 01:04 IST

పెద్ద డోమ్‌తో చూడ్డానికి ఈ నిర్మాణం కాస్త తాజ్‌మహల్‌లా ఉంది కదూ! కానీ కాదు. మరి ఇంతకీ ఇదేంటి? దీని పేరేంటి? ఇది ఎక్కడుంది? దీన్ని ఎవరు.. ఎందుకు.. ఎప్పుడు నిర్మించారు?.. ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పటికే మీ చిట్టి బుర్రల్లోకి వచ్చి ఉంటాయి కదూ!  నేస్తాలూ... మరింకేం ఈ కథనం చదివేయండి. అసలు విషయం ఏంటో మీకే  తెలుస్తుంది.

దీని పేరు గోల్‌ గుంబజ్‌. కొందరు దీన్ని గోల్‌ గుంబద్‌ అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో ఉంది. 17వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. తాజ్‌మహల్‌లానే ఇది కూడా ఓ సమాధి. ఇక్కడ మహ్మద్‌ అదిల్‌ షా, అతని బంధువుల సమాధులున్నాయి. దీని నిర్మాణం 17వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైంది. కానీ విచిత్రం ఏంటంటే దీన్ని పూర్తిగా కట్టలేదు. మధ్యలోనే వదిలేశారు.

పే...ద్ద గుమ్మటం!

ఈ గోల్‌ గుంబజ్‌ తన పెద్ద డోమ్‌ (గుమ్మటం) వల్ల ప్రసిద్ధి చెందింది. ఇండో- ఇస్లామిక్‌ పద్ధతుల్లో దీని నిర్మాణం సాగింది. 2014లో దీన్ని యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది. మహ్మద్‌ అదిల్‌ షా హయాంలో 1627లో దీని నిర్మాణం ప్రారంభమైంది. 1656 వరకు కొనసాగింది. అదిల్‌ షా మరణం వల్ల దీని నిర్మాణం ఆగిపోయి ఉండవచ్చు అని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

అద్భుత నిర్మాణం!

గోల్‌ గుంబజ్‌ నిజంగా అద్భుత నిర్మాణం. ఎందుకంటే అంత పెద్ద గుమ్మటానికి మధ్యలో టవర్లలాంటి నిర్మాణాలేమీ ఉండవు. చివర్లలోనే ఉంటాయి. అసలు అప్పట్లో ఇంత పెద్ద డోమ్‌ను నిర్మించడం నిజంగా అద్భుతమే. ఈ కట్టడం లోపల దాదాపు 41 మీటర్ల వైశాల్యంలో గుమ్మటం ఉంటుంది. ఎత్తేమో దాదాపు 60 మీటర్లు ఉంటుంది. ఇది ఇటుకలు, సున్నంతో నిర్మించిన కట్టడం. గోల్‌ గుంబజ్‌లో ఏ చిన్న శబ్దం చేసినా అది పెద్దగా ప్రతిధ్వనిస్తుంది. ఆఖరుకు గుసగుసగా మాట్లాడినా సరే.. అది అందరికీ వినిపిస్తుంది. అందుకే దీన్ని ‘గుసగుసల గ్యాలరీ’ అని పిలుస్తారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ గోల్‌ గుంబజ్‌ విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని