Published : 19 Jan 2023 00:40 IST

ఈ బుడత.. పరుగుల చిరుత!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. బడిలోనో, ఇంటి దగ్గరో నిర్వహించే ఆటలపోటీల్లో గెలిస్తేనే బోలెడు సంబరపడిపోతాం. దాని గురించి తెలిసిన వాళ్లకూ, కనిపించిన వారందరికీ గొప్పగా చెప్పుకొంటాం. మరి అలాంటిది.. ‘ఏకంగా మినీ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే?’ - ఇంకేమైనా ఉందా.. ప్రస్తుతం ఓ నేస్తం అలాంటి సంతోషంలోనే మునిగితేలుతున్నాడు. ఆ వివరాలేంటో చదివేయండి మరి..
ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరికి చెందిన రుద్ర ప్రసాద్‌కు ఆరు సంవత్సరాలు. స్థానిక కేంద్రియ విద్యాలయంలో ఒకటో తరగతి చదువుతున్న ఈ నేస్తం.. ఇటీవల నిర్వహించిన మినీ మారథాన్‌లో ఏకధాటిగా 16 కిలోమీటర్లు పరుగెత్తి, సునాయాసంగా గమ్యాన్ని చేరుకున్నాడు. దాంతో ప్రతి ఒక్కరూ రుద్రను బుదియా సింగ్‌తో పోలుస్తున్నారు.

మూడేళ్ల నుంచే సాధన..

రుద్రకు చిన్నప్పటి నుంచే పరుగెత్తడం అలవాటు. మూడు సంవత్సరాలున్నప్పటి నుంచే పరుగు సాధన ప్రారంభించాడు. ప్రస్తుతం నిత్యం ఆరు కిలోమీటర్లు పరుగెత్తుతాడట. పురుషుల హాకీ ప్రపంచకప్‌ - 2023 పోటీల సందర్భంగా మల్కన్‌గిరిలో ఇటీవల మినీ మారథాన్‌ను నిర్వహించారు. ఈ పోటీలో రుద్ర పాల్గొనాలని అనుకున్నాడు. కానీ, అందుకు అధికారులు మొదట అభ్యంతరం తెలిపారు. తర్వాత అతడి ప్రతిభను స్వయంగా పరిశీలించాక.. పోటీలకు అనుమతించారు. అయితే.. అందరి అంచనాలను మించుతూ, దాదాపు 200 మంది పాల్గొన్న ఈ మారథాన్‌ను అతి తక్కువ వ్యవధిలో పూర్తి చేశాడు రుద్ర. అంతేకాదు.. అందరితోనూ శెభాష్‌ అనిపించుకుంటున్నాడు.

తాతే కోచ్‌..

మన రుద్రకు వాళ్ల తాతయ్యే కోచ్‌ అట. ఆయన ఆ రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగి. తన మనవడిని బుదియా సింగ్‌ తరహాలో ఛాంపియన్‌గా నిలపాలన్న లక్ష్యంతో ఆయనే రోజూ రుద్రతో సాధన చేయిస్తున్నారు. ఇంతకీ ఈ బుదియా సింగ్‌ ఎవరంటే.. అయిదేళ్ల వయసులోనే ‘వరల్డ్‌ యంగెస్ట్‌ మారథాన్‌ రన్నర్‌’గా రికార్డు సృష్టించిన వ్యక్తి. 2006లో ఒడిశాకే చెందిన బుదియా సింగ్‌కు అయిదేళ్ల వయసున్నప్పుడు 65 కిలోమీటర్ల మారథాన్‌ను కేవలం ఏడు గంటల రెండు నిమిషాల వ్యవధిలోనే పూర్తి చేశాడు. ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ తన పేరు నమోదు చేసుకున్నాడు. భవిష్యత్తులో 42 కిలోమీటర్ల మారëమారథాన్‌లో పాల్గొని, రికార్డు సృష్టించాలనేది తన లక్ష్యమని చెబుతున్నాడు రుద్ర. అంత దూరం పరుగెత్తడమంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్‌.. మరి అంతటి ఘనత సాధించిన ఈ నేస్తానికి మనమూ అభినందనలు చెప్పేద్దామా.!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని