గుప్పెడంత ముప్పు!

అదో బుజ్జి పక్షి. గుప్పెడంతే ఉంటుంది. కానీ ఇప్పుడు దాని పేరు చెబితే చాలు ఆఫ్రికా దేశాలు హడలిపోతున్నాయి. రైతులు బెంబేలెత్తుతున్నారు. పాలకులకేమో కంటి మీద కునుకు కరవవుతోంది.

Updated : 25 Jan 2023 06:51 IST

అదో బుజ్జి పక్షి. గుప్పెడంతే ఉంటుంది. కానీ ఇప్పుడు దాని పేరు చెబితే చాలు ఆఫ్రికా దేశాలు హడలిపోతున్నాయి. రైతులు బెంబేలెత్తుతున్నారు. పాలకులకేమో కంటి మీద కునుకు కరవవుతోంది. ముఖ్యంగా కెన్యా దేశమైతే ఆ బుల్లి పిట్టపై ఆగమేఘాల మీద యుద్ధమే ప్రకటించింది. ఓ చిన్న పక్షికే వీరంతా ఇలా ఎందుకు భీతిల్లిపోతున్నారు. దాని పైన ఏకంగా యుద్ధం ఎందుకు ప్రకటించారు. ఆ అల్పజీవిని ఎందుకు చంపేస్తున్నారు. అసలు ఆ పక్షి చేసిన, చేస్తున్న నేరం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చదివేయండి. మీకే తెలుస్తుంది. 

చ్చం మన దగ్గరి పిచ్చుక అంతే ఉంటుంది ఈ క్యూలియా పక్షి. ఎర్రటి ముక్కుతో చూడ్డానికి అందంగా ఉంటుంది. దీనికి ఆఫ్రికన్‌ నైటింగేల్‌ అనే పేరు కూడా ఉంది. అధికారికంగా మాత్రం రెడ్‌ బిల్ట్‌ క్యూలియా అంటారు. దీని బరువు కేవలం 15 నుంచి 26 గ్రాముల వరకు మాత్రమే ఉంటుంది. పొడవేమో 12 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఈ పక్షులు పెద్ద ఎత్తున సంతానోత్పత్తి చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 150కోట్లకు పైగా క్యూలియా పక్షులు ఉన్నట్లు అంచనా. ఇవి గుంపులుగుంపులుగా, వేగంగా ప్రయాణిస్తుంటాయి. మామూలుగా ఇవి గడ్డి విత్తనాలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటాయి. కానీ ఆఫ్రికాలోని తూర్పు దేశాలు కొన్ని పదేళ్లుగా తీవ్ర కరవుతో అల్లాడుతున్నాయి. చాలాకాలంగా కొనసాగుతున్న దుర్భిక్ష పరిస్థితుల వల్ల పచ్చికబయళ్లన్నీ ఎండిపోతున్నాయి. దీంతో క్యూలియా పక్షులకు సహజ ఆహారమైన గడ్డివిత్తనాలకు కొరత వచ్చింది. ఈ కారణంగా ఆ పక్షులు వరి, గోధుమ పంటల మీద దాడి చేస్తున్నాయి.

దండుగా దండయాత్ర!

ఒక్క క్యూలియా పక్షి రోజులో పదిగ్రాముల ఆహారాన్ని తింటుంది. ‘ఓస్‌ అంతేనా.. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? దాని పదిగ్రాములు దానికి వదిలేస్తే సరిపోతుందిగా’ అంటారేమో! అడుగు అడుగు కలిసి మహా ప్రయాణమైనట్లు... ఒక్కో క్యూలియా పక్షి తీసుకునే ఆహారాన్ని కలిపి లెక్కిస్తే టన్నులే అవుతుంది. ఈ పక్షుల వల్ల ఏటా ఒక్క కెన్యాలోనే దాదాపు 60 టన్నుల వరకు ధాన్యాన్ని నష్టపోతున్నట్లు అంచనా. అసలే కరవు... ఆపై ఈ క్యూలియా పక్షుల దాడితో కెన్యా, సోమాలియా, సుడాన్‌, ఇథియోపియా, ఎరిత్రియా వంటి ఆఫ్రికా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ పక్షులు ప్రధానంగా గోధుమలు, బార్లీ, వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న వంటి పంటలపై గుంపులు గుంపులుగా వచ్చి వాలిపోతాయి. అచ్చం మిడతల దండులా దండయాత్ర చేస్తాయి. వేలాది, లక్షలాది పక్షులు గుంపులు గుంపులుగా వస్తుంటే... చూడ్డానికి కూడా చాలా భయంగా ఉంటోందట. ఒక్కోసారి ఏనుగులు కూడా ఈ పక్షుల గుంపులను చూసి పరుగులు పెడుతున్నాయంటే, పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రభుత్వమే రంగంలోకి!

తమ పంటలను రక్షించుకోవడానికి క్రిమిసంహారకాలను వాడి ప్రజలు క్యూలియా పక్షులను మట్టుపెడుతున్నారు. కెన్యా ప్రభుత్వం కూడా స్వయంగా రంగంలోకి దిగి ఏకంగా 60 లక్షల పక్షులను అంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పురుగు మందులను పిచికారీ చేయడానికి పెద్దసంఖ్యలో డ్రోన్లను వినియోగిస్తోంది. ఇందుకోసం కోట్లరూపాయలను వెచ్చిస్తోంది. కానీ ఈ చర్యల వల్ల ఇతర పక్షులు చనిపోతున్నాయని, క్రిమిసంహారాకాలతో ప్రకృతికీ పెను విపత్తు వాటిల్లుతుందని, శాస్త్రవేత్తలు, పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్యూలియా పక్షులు ఇలా విజృంభించడానికి కరవు కాటకాలు, పర్యావరణ మార్పులే కారణమవుతున్నాయి. ప్రస్తుతానికైతే అవి అంతరించిపోయే స్థితిలో లేవు కానీ.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా అవసరమైన వాటికన్నా... ఎక్కువ సంఖ్యలో ఈ పక్షులను చంపితే మాత్రం పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వాపోతున్నారు. నేస్తాలూ... మొత్తానికి ఇవీ క్యూలియా పక్షి దండయాత్ర సంగతులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని