అంచనాలు పెరిగాయ్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పురోగమనంపై పరిశ్రమ వర్గాలు పూర్తి ఆశాభావంతో ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో.. మౌలిక వసతుల కల్పనకు సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో స్థిరాస్తి రంగం డిమాండ్‌ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

Updated : 16 Mar 2024 04:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ పురోగమనంపై పరిశ్రమ వర్గాలు పూర్తి ఆశాభావంతో ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో.. మౌలిక వసతుల కల్పనకు సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో స్థిరాస్తి రంగం డిమాండ్‌ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్‌ను దేశంలోని ఇతర నగరాలతో కాకుండా అంతర్జాతీయ నగరాలతో పోటీపడేలా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో ప్రస్తుత పాలకులు ఉన్నారు. ఇందుకోసం 2050 మెగా మాస్టర్‌ ప్లాన్‌ తీసుకురాబోతున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను కలిపి ఏకీకృత గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌ వంటి ఆలోచనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇవన్నీ అమల్లోకి వస్తే నగరం అంతటా భారీ వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌ను బెంగళూరుకు బదులుగా సింగపూర్‌, ముంబయికి బదులుగా షాంఘై, చెన్నైకి బదులుగా దుబాయ్‌ వంటి నగరాలతో పోల్చాలని.. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రహదారులు, నీటి సరఫరా, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుందని స్థిరాస్తి సంఘాలు సూచిస్తున్నాయి.

మూసీతో పర్యాటక, పెట్టుబడుల ఆకర్షణ..

నగరం కొన్నేళ్లుగా శివార్లలో విస్తరిస్తూ వెళుతోంది. అభివృద్ధి మొత్తం అక్కడే ఎక్కువగా జరుగుతోంది. ప్రధాన నగరం స్తబ్దుగా ఉంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ సుందరీకరణతో నగరం నడిబొడ్డున సిటీ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈస్ట్‌, వెస్ట్‌ కారిడార్‌ అనుసంధానంతో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటూ పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణకు దోహదం చేస్తుంది. నగరం అంతర్జాతీయ స్థాయిని అందుకునేందుకు అందివచ్చిన అవకాశమిది. దీంతో మూసీకి ఇరువైపుల గృహ నిర్మాణాలకు మరింత డిమాండ్‌ పెరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆవాసాలు ఉన్నా.. రీ డెవలప్‌మెంట్‌కు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నిర్మాణంలో పలు ప్రాజెక్ట్‌లు..

సిటీలో గృహ నిర్మాణానికి డిమాండ్‌ మున్ముందు ఉంటుందని చెప్పడానికి మరిన్ని కారణాలను పరిశ్రమ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో నిర్మాణంలో ఉన్న బిజినెస్‌ పార్క్‌లు.. 35-38 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి కాబోతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రణాళికలకు తోడు కార్యాలయాల విస్తరణతో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల మార్కెట్‌ నెమ్మదించినా.. రాబోయే రెండేళ్లలో మళ్లీ బూమ్‌ వస్తుందని భావిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇళ్ల డిమాండ్‌ను పెంచడానికి దోహదం చేసేవే అని చెబుతున్నారు.

ప్లాటింగ్‌లోనూ కదలిక..

గృహ, వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మెరుగ్గానే ఉన్నా.. కొంతకాలంగా ప్లాటింగ్‌ మార్కెట్‌ నెమ్మదించింది. సర్కారు వంద రోజుల పాలన.. ప్రభుత్వం పోకడ, వారి ఆలోచనలపై స్పష్టత రావడంతో వెంచర్లలో స్థలాల విక్రయాల్లో కదలిక మొదలైంది. తక్షణం ఇల్లు కొనేంత బడ్జెట్‌ లేనివారు భవిష్యత్తు అవసరాల కోసం స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. రహదారుల విస్తరణ జరుగుతున్న మార్గాల్లోని లేఅవుట్లపై కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని