రియల్‌లో రిటైల్‌ విస్తరణ

రియల్‌ ఎస్టేట్‌లో రిటైల్‌, మాల్స్‌ నిర్మాణాలు ఏటా పెరుగుతున్నాయి. కొవిడ్‌ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. తిరిగి కోలుకుని ఈ రంగం పూర్వ స్థాయికి చేరుకుంది.

Updated : 21 Oct 2023 02:13 IST

రియల్‌ ఎస్టేట్‌లో రిటైల్‌, మాల్స్‌ నిర్మాణాలు ఏటా పెరుగుతున్నాయి. కొవిడ్‌ సమయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. తిరిగి కోలుకుని ఈ రంగం పూర్వ స్థాయికి చేరుకుంది. దీంతో రిటైల్‌ లీజింగ్‌లోనూ వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు హైదరాబాద్‌లో 0.49 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌ జరిగింది. వార్షిక వృద్ధి 145 శాతం నమోదైంది. దేశవ్యాప్తంగా 46 శాతం వృద్ధి రికార్డయింది.

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో షాపింగ్‌ తీరుతెన్నుల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకు తగ్గట్టుగా రిటైల్‌ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఇందుకోసం అనువైన వాణిజ్య, మాల్స్‌ కోసం వెతుకులాట మొదలైంది. సిటీలో కొన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తై లీజింగ్‌ కోసం ఎదురుచూస్తున్న వాణిజ్య భవనాలు ఉండగా.. కొత్తగా మరిన్ని నిర్మాణంలో ఉన్నాయి. షాపింగ్‌, వినోదం, ఆహారం అన్నీ ఒకచోట ఉన్నవాటికి డిమాండ్‌ పెరుగుతోంది. రిటైల్‌ లీజింగ్‌లో 34 శాతం వస్త్ర దుకాణాలు, 17 శాతం డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌, 13 శాతం ఆహారం, 11 శాతం వినోదం, 6 శాతం ఎలక్ట్రానిక్‌ షోరూం వాటా కల్గి ఉన్నాయని సీబీఆర్‌ఈ తాజా నివేదిక వెల్లడించింది.

కొత్త మార్కెట్లు అభివృద్ధి..

రిటైల్‌కు సంబంధించి నగరంలో కొత్త ప్రాంతాల్లో లీజింగ్‌ కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయి. కొత్తగా ఆ ప్రాంతంలో మార్కెట్‌ వృద్ధి చెందడం, ముందుగానే ఒప్పందాల ప్రకారం నిర్మాణాలు జరుగుతుండటంతో ఎక్కువ ఖాళీలు ఉండట్లేదు.  ప్రధాన నగరంలోని అబిడ్స్‌, కోఠి, బేగంపేట, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కేపీహెచ్‌బీ, చందానగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఏఎస్‌రావునగర్‌, హబ్సిగూడ, కొండాపూర్‌ ప్రాంతాలను శివార్లకు విస్తరించింది. ఆయా ప్రాంతాల్లో జనావాసాలు పెరగడంతో కొత్తగా వస్త్ర, వాహన షోరూంలు, సూపర్‌ మార్కెట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇలా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో లీజింగ్‌ ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే పెద్ద మార్కెట్లుగా ఉన్న ప్రాంతాల్లో మాల్స్‌ వస్తున్నాయి. ఈ తరహాలో ప్రాంతాన్ని బట్టి రిటైల్‌ కార్యకలాపాలు కొనసాగతున్నాయి. గత ఏడాది హైదరాబాద్‌లో 0.20 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలోనే లీజింగ్‌ జరగ్గా ఈసారి అది 0.49కి పెరిగింది.

 ఐదో స్థానంలో ఉన్నాం..

గృహ, కార్యాలయాలతో పాటు రిటైల్‌లోనూ బెంగళూరు నగరం అగ్రభాగాన ఉంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దేశంలోనే అత్యధికంగా 1.4 మిలియన్‌ చ.అ.విస్తీర్ణంలో లీజింగ్‌ కార్యకలాపాలు జరిగాయి. ఆ తర్వాత దిల్లీ (0.9 మి.చ.అ.), పుణె 0.6 మి.చ.అ., చెన్నై 0.5 మి.చ.అ. విస్తీర్ణం లీజింగ్‌ జరిగింది. వీటి తర్వాత ఐదో స్థానంలో హైదరాబాద్‌ ఉంది. అహ్మదాబాద్‌, కోల్‌కతా చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని