విలాసానికి తగ్గేదేలే..

హైదరాబాద్‌లో విలాసవంతమైన ప్రాజెక్ట్‌ల పరంపర కొనసాగుతోంది. 2024లోనూ తగ్గేదేలే అంటున్నాయి నిర్మాణ సంస్థలు. ఈ ఏడాది ఆరంభంలోనే వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను బిల్డర్లు ప్రారంభించారు

Published : 10 Feb 2024 02:31 IST

ఆధునిక హంగులతో ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులు

హైదరాబాద్‌లో విలాసవంతమైన ప్రాజెక్ట్‌ల పరంపర కొనసాగుతోంది. 2024లోనూ తగ్గేదేలే అంటున్నాయి నిర్మాణ సంస్థలు. ఈ ఏడాది ఆరంభంలోనే వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రాజెక్ట్‌లను బిల్డర్లు ప్రారంభించారు. వీటిలో విక్రయాలు సైతం బడ్జెట్‌ ఇళ్లతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. సిటీలో కొవిడ్‌ అనంతరం కోకాపేట, తెల్లాపూర్‌, నార్సింగి, నానక్‌రాంగూడ, మంచిరేవుల, రాయదుర్గం, ఖాజాగూడ, కొండాపూర్‌, నల్లగండ్ల, కొల్లూరు, సాతంరాయి, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, కొంపల్లి ప్రాంతాల్లో విలాసవంతమైన ఆకాశహర్మ్యాల ప్రాజెక్ట్‌లు పెద్ద సంఖ్యలో మొదలయ్యాయి. వీటి నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు 59 అంతస్తుల వరకు హెచ్‌ఎండీఏ అనుమతి ఇచ్చింది. ఒక సంస్థ 50వ అంతస్తు స్లాబు కూడా పూర్తిచేసింది. వేగంగా నిర్మాణాలు సాగుతున్నాయి. కోకాపేటలో ఒక సంస్థ 62 అంతస్తుల నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈనాడు, హైదరాబాద్‌


అంతస్తులు పెంచుకుంటూ...

 • 2021లో పుప్పాలగూడలో ఒక సంస్థ 48, మరో సంస్థ 55 అంతస్తులకు అనుమతి తీసుకున్నాయి. కోకాపేటలో 58 అంతస్తులకు కూడా హెచ్‌ఎండీ అనుమతి ఇచ్చింది.
 • 2022లో మరిన్ని సంస్థలు యాభై అంతకంటే ఎక్కువ అంతస్తులకు అనుమతి కావాలని ముందుకొచ్చాయి. శేరిలింగంపల్లిలో 50, కోకాపేటలో 50, పుప్పాలగూడలో 52,  కోకాపేటలోనే 54కు ఒక సంస్థ, మరొకటి 57 అంతస్తులు నిర్మిస్తామంటే హెచ్‌ఎండీఏ అనుమతి మంజూరు చేసింది.
 •  2023లో పుప్పాలగూడలో 59 అంతస్తులకు అనుమతి తీసుకున్నారు.
 •  2024లో పర్యావరణ కమిటీ లేకపోవడంతో ఆకాశహర్మ్యాల అనుమతులు ఆలస్యం అవుతున్నాయి. అభివృద్ధి మొత్తం ఐటీ కారిడార్‌ చుట్టుపక్కలే కేంద్రీకృతం కావడంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా అనుమతులను తాత్కాలికంగా నిలుపుదల చేసింది. అపరిమిత ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌పైన పరిశ్రమ వర్గాల్లో ఏకాభిప్రాయం కొరవడటం కూడా సందిగ్ధతకు కారణం అవుతోంది. వీటిపై స్పష్టత వచ్చాక సర్కారు ముందడుగు వేసే అవకాశం ఉంది.
 • ఈ ఏడాది ప్రారంభించినవి కూడా గతంలో అనుమతులు తీసుకున్న ప్రాజెక్ట్‌లు కావడం విశేషం. మరికొన్ని సంస్థలూ ప్రీమియం ప్రాజెక్ట్‌లను ప్రారంభించబోతున్నాయి. ః రెండువేల చ.అ.పైనే ఫ్లాట్ల విస్తీర్ణం ఉంటోంది. రూ.రెండుకోట్లకు పైగా ధరలు పలుకుతున్నాయి. విస్తీర్ణం పెరిగేకొద్దీ ఆ దామాషాలో ధరలు ఉంటాయి.  

  ప్రవాసుల విడిదిగా...  

 • విలాసవంతమైన నివాసాలను ఉన్నత ఉద్యోగులు, వైద్యులు, వ్యాపారులు, వృత్తినిపుణులు ఎంపిక చేసుకుంటున్నారు. సిటీలోని విల్లాల ధరలు పెరగడంతో హంగులుండే ఆకాశహర్మ్యాల వైపు మొగ్గుతున్నట్లు క్రెడాయ్‌ తెలంగాణ ఉపాధ్యక్షుడు బి.పాండురంగారెడ్డి అన్నారు.
 •  తమ స్వీయ అవసరాల కోసమే కాదు పెట్టుబడి దృష్ట్యా చాలామంది కొనుగోలు చేస్తున్నారు. మంచి అద్దె రాబడులు వస్తుండటంతో ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున వీటిలో పెట్టుబడులు పెట్టారు.
 •  ఎన్‌ఆర్‌ఐలు సెలవుల్లో వచ్చినప్పుడు అక్కడి జీవనశైలికి ఏ మాత్రం తగ్గని విధంగా ఉండే ఈ తరహా ఇళ్లలో గడిపేందుకు వెకేషన్‌ హోమ్‌గా ఉపయోగించుకొంటున్నారు. కొంతమంది పూర్తిగా స్వదేశం వచ్చి స్థిరపడే ఆలోచన ఉన్నవారు ఇలాంటి వాటిలో కొంటున్నారు.
 •  యూఎస్‌కి వెళ్లిన మనవాళ్లలో చాలామంది ఉద్యోగాల వేటలో ఉన్నారు. మరికొంత మంది కొలువులు అటుఇటూ అన్నట్లుగా ఉన్నాయి. ఈ ప్రభావం మున్ముందు పరిశ్రమపై ఎలా ఉండబోతుందనే ఆందోళనలూ ఉన్నాయి.
 •  దేశవ్యాప్తంగా ప్రవాస భారతీయుల పెట్టుబడుల వృద్ధి అంతక్రితం ఏడాదితో పోలిస్తే గత ఏడాది 35 శాతం పెరిగాయి. ఈ సంవత్సరం అదే స్థాయిలో ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది.
 •  ప్రవాస భారతీయులు విలాసవంతమైన ఇళ్లపై పెట్టుబడులు పెట్టడానికి మరో కారణం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ తరహా ఇళ్లకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి కావాల్సినప్పుడు తక్కువ వ్యవధిలోనే విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు అని అంటున్నారు. ఈ కారణంగానూ ఎక్కువ మంది ఎన్‌ఆర్‌ఐలు ఆకర్షితులవుతున్నారని విశ్లేషిస్తున్నారు.

  దేశవ్యాప్తంగా ఇదే పోకడ..

గత ఏడాది దేశవ్యాప్తంగా విలాసవంతమైన ప్రాజెక్ట్‌ల హవా కొనసాగింది. ప్రధాన నగరాల్లో 2లక్షల యూనిట్లను ప్రారంభిస్తే వాటిలో 35 శాతం విలాసవంతమైన ఇళ్లే ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటూ బెంగళూరు, దిల్లీ, ముంబయిలో వీటికి మంచి డిమాండ్‌ కన్పించింది.


అంతర్జాతీయ ప్రమాణాలతో..

ఆకాశహర్మ్యాల నిర్మాణాలను మనవాళ్లు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. గతంలో దుబాయ్‌, ఇతర ప్రాంతాల్లో పనిచేసిన నిపుణులను నియమించుకుని కడుతున్నారు. ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇవన్నీ కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని