ఏమి రుచిలే..హల్వా!

హల్వా... శీతాకాలం వంట్లో చురుకు పుట్టించే ఆహారం. సహజమైన ఇమ్యూన్‌ బూస్టర్‌. ఇక ఈ వంటకాన్ని పోషకాలు కూడా జతైతే రుచీ, ఆరోగ్యం రెండూ సొంతం చేసుకోవచ్చు...

Updated : 13 Nov 2022 04:03 IST

హల్వా... శీతాకాలం వంట్లో చురుకు పుట్టించే ఆహారం. సహజమైన ఇమ్యూన్‌ బూస్టర్‌. ఇక ఈ వంటకాన్ని పోషకాలు కూడా జతైతే రుచీ, ఆరోగ్యం రెండూ సొంతం చేసుకోవచ్చు...

హల్వాకి రుచితెచ్చే నెయ్యి, ఎండుఫలలు, పండ్లు వంటివన్నీ మంచి కొవ్వులను కలిగి ఉంటాయి. ఈ కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు, ఇన్‌ఫెక్షన్లని దూరం చేయడంలో ఇవి సహకరిస్తాయి. జీవక్రియల వేగాన్ని పెంచి చురుగ్గా ఉండేట్టు చేస్తాయి.
 


పెసరపప్పు హల్వా

కావాల్సినవి: పెసరపప్పు- కప్పు, నెయ్యి- పది చెంచాలు, యాలకులు- నాలుగు, బాదం పప్పులు- ఆరు(సన్నగా పలుకుల్లా తరిగి పెట్టుకోవాలి), ఎండుద్రాక్షలు- చెంచా, క్రీం మిల్క్‌- కప్పు, నీళ్లు- రెండు కప్పులు, పంచదార- ఒకటిన్నర కప్పు
తయారీ: పెసరపప్పుని రాత్రే నానబెట్టుకుని... తెల్లారాక మిక్సీలో పావుకప్పు నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. స్టౌ వెలిగించి నాన్‌స్టిక్‌ కడాయిలో నెయ్యి వేసి వేడెక్కాక పెసరపిండిని వేసి తక్కువ మంట మీద పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. పచ్చివాసన పోయి, మెత్తగా అయ్యేవరకూ ఉంచాలి. మొదట్లో మెత్తగా అనిపించినా... తర్వాత పొడిపొడిగా రవ్వలా మారి నెయ్యి నుంచి వేరవుతుంది. పెసరపప్పు ఉడుకుతున్నప్పుడే మరొక పాత్రలో పాలు, నీళ్లు, పంచదార వేసుకుని మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలను పెసరపప్పు మిశ్రమంలో వేసుకోవాలి. మళ్లీ నెయ్యి వేరయ్యేంత వరకూ చిన్న మంట మీదే ఉడికించుకోవాలి. చివరగా బాదం  పలుకులు వేసి రెండు నిమిషాలాగి దింపేయాలి.


ఆపిల్‌ కొబ్బరి హల్వా..


 

కావాల్సినవి: పచ్చి కొబ్బరి తురుము- కప్పు, ఆపిల్‌- ఒకటి, డ్రైఫ్రూట్స్‌- గుప్పెడు, చిక్కని పాలు- కప్పు, చక్కెర పావు కప్పు, నెయ్యి- మూడు చెంచాలు.
తయారీ: ముందుగా ఆపిల్‌ తొక్క తీసి సన్నగా తురుముకోవాలి. లేదంటే ఆపిల్‌ని గుజ్జుగా చేసిపెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి అందులో పాలుపోసి బాగా మరిగించాలి. ఇందులో పంచదార, యాపిల్‌ గుజ్జు వేసి కలిపి పదినిమిషాల పాటు ఉడికించాలి. ఈ మిశ్రమం దగ్గర పడేలోపు మరో పొయ్యి మీద బాణలీ పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ వేయించి పెట్టుకోవాలి. ఈలోగా దగ్గర పడ్డ ఆపిల్‌ మిశ్రమానికి కొబ్బరి తురుమూ యాలకుల పొడి కూడా చేర్చి మరో ఐదు నిమిషాలపాటు ఉడికించుకోవాలి. పంచదార వద్దనుకుంటే చివర్లో తేనె కలిపినా చాలు. చివర్లో డ్రైఫ్రూట్స్‌ పలుకులు చల్లుకోవాలి. తక్షణ శక్తికి చక్కటి ఆహారం.


ఖర్జూర హల్వా!

కావాల్సినవి: ఖర్జూరాలు- రెండు కప్పులు, కొబ్బరిపాలు- ఒక కప్పు, పాలు- రెండు కప్పులు, నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు, బాదం పప్పులు- పది
తయారీ: ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. కాసేపాగి వాటిని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండి...వెడల్పుగా ఉన్న పాత్రలో ఖర్జూర మిశ్రమం, కొబ్బరి పాలు, పాలు వేసి దగ్గరగా అయ్యే వరకూ తిప్పుతూ ఉండాలి. ఇందుకు ఆరేడు నిమిషాల సమయం పడుతుంది. అప్పుడు ఇందులో నెయ్యి, బాదం పలుకులూ వేయాలి. ఆపై స్టౌ నుంచి దింపేసి చల్లారనిచ్చి వడ్డిస్తే సరి. రక్తహీనతతో బాధపడేవారికి చక్కటి ఔషధం. రుచి అమోఘం.


చైనా గ్రాస్‌

కావాల్సినవి: చైనా గ్రాస్‌- 10 గ్రా, పాలు- అర లీటర్‌, చక్కెర- అర కప్పు, బాదం పప్పు- పావు కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, నెయ్యి- కొద్దిగా, ముక్కలు చేసిన డ్రైఫ్రూట్స్‌- చెంచా
తయారీ: చైనా గ్రాస్‌ను పది నిమిషాలపాటు నీళ్లలో నానబెట్టాలి. స్టవ్‌మీద మందపాటి గిన్నె పెట్టి పాలు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు చక్కెరతో పాటు బాదం గింజల్ని పొడిచేసి అందులో వేయాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇలా ఆ మిశ్రమం దగ్గరగా అయ్యేవరకూ చేయాలి. తర్వాత యాలకుల పొడి, మెదిపిన చైనా గ్రాస్‌ వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంటపై కలుపుతూ ఉడికించి దించేయాలి. చైనా గ్రాస్‌ దొరక్కపోతే అగర్‌అగర్‌ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెకు కొద్దిగా నెయ్యి రాసి చల్లారిన మిశ్రమాన్ని దాంట్లో వేయాలి. పైన డ్రైఫ్రూట్స్‌ ముక్కలు వేసి 4-5 గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. గట్టిపడిన మిశ్రమాన్ని ముక్కలుగా కోసుకుంటే చల్లచల్లని చైనా గ్రాస్‌ హల్వా సిద్ధం. దీనికి ఫుడ్‌కలర్‌ చేర్చితే చూడ్డానికి బాగుంటుంది. పోషక విలువలూ అపారమే.


బూడిద గుమ్మడి హల్వా

కావాల్సినవి: బూడిద గుమ్మడి - రెండు కప్పులు(చెక్కుతీసి తురిమింది), నెయ్యి- కప్పు, జీడిపప్పులు- పది, చక్కెర కప్పు, యాలకుల పొడి- అరచెంచా, దోసగింజలు- చెంచా
తయారీ: గుమ్మడి తురుముని కాటన్‌ వస్త్రంలో మూట కట్టి అదనపు నీళ్లు బయటకు పోయేలా చూసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకుని నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో బూడిద గుమ్మడికాయ తురుమువేసి ఐదారు నిమిషాలు వేయించాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి కూడా వేసి గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. హల్వా బాణలి మధ్యకు చేరుకొని ముద్దలాగా తయారవుతుంది. అప్పుడు వేయించిన జీడిపప్పులు, దోసగింజలు చల్లి దింపేయాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని