కాస్త తీయగా... కాస్త పుల్లగా!

కొందరికి పులుపంటే ప్రాణం...  కొందరికి తీపంటే అభిమానం...  ఈ రెండూ కలిస్తే మామూలు కాంబినేషన్‌ కాదు... అదిరిపోవాల్సిందే! అందుకే ఈసారికి ఈ కట్టామీఠా రుచులని ఓసారి పలకరించండి...

Published : 24 Jul 2022 01:35 IST

కొందరికి పులుపంటే ప్రాణం...  కొందరికి తీపంటే అభిమానం...  ఈ రెండూ కలిస్తే మామూలు కాంబినేషన్‌ కాదు... అదిరిపోవాల్సిందే! అందుకే ఈసారికి ఈ కట్టామీఠా రుచులని ఓసారి పలకరించండి...


కట్టామీఠా చికెన్‌

కావాల్సినవి: చికెన్‌- అరకిలో, ఉప్పు- తగినంత, మిరియాలపొడి- తగినంత, మొక్కజొన్నపిండి- అరకప్పు, గుడ్లు- రెండు, నూనె- తగినంత

సాస్‌కోసం: నూనె- చెంచా, సన్నగా తురుమిన వెల్లుల్లి పలుకులు- అరచెంచా, కాప్సికమ్‌- ఒకటి(ముక్కలు చేసి పెట్టుకోవాలి), వెనిగర్‌ - పావుకప్పు, సోయాసాస్‌- చెంచా, టమాటా కెచప్‌- పావుకప్పు, పంచార- పావుకప్పు కన్నా కొద్దిగా ఎక్కువ. అలంకరణకోసం: వేయించిన నువ్వులు- రెండు చెంచాలు

తయారీ: శుభ్రం చేసిన చికెన్‌లో ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి... ఆపై మొక్కజొన్న పిండి కూడా కలుపుకోవాలి. ఒక గిన్నెలో గుడ్లను వేసి బాగా గిలక్కొట్టి సిద్ధం చేసి పెట్టుకోవాలి. పాన్‌లో తగినంత నూనె తీసుకుని వేడెక్కాక... అందులో మొక్కజొన్న పిండిలో అద్దిన చికెన్‌ ముక్కలని ఒక్కోదాన్ని తీసుకుని గుడ్డుసొనలో ముంచి నూనెలో దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పాత్రలో కొద్దిగా నూనె తీసుకుని వేడెక్కాక.. అందులో వెల్లుల్లి పలుకులు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత వెనిగర్‌, సోయాసాస్‌, కెచప్‌, పంచదార ఒకదాని తర్వాత ఒకటి వేసి దగ్గరగా వచ్చేంతవరకూ ఆగాలి. అప్పుడు వేయించిన చికెన్‌, నువ్వులు, ఉల్లికాడలు వేసుకుని నిమిషంపాటు కలిపితే కట్టామీఠా చికెన్‌ సిద్ధం.


కాకరకాయ పుల్లబెల్ల కూర

కావాల్సినవి: కాకరకాయలు- అర కిలో, చింతపండు గుజ్జు- రెండు చెంచాలు, బెల్లం- రెండు చెంచాలు, కరివేపాకు రెబ్బ- ఒకటి, సెనగపప్పు- ఒకటిన్నర చెంచా, మినప్పప్పు- చెంచా, ఆవాలు- చిన్నచెంచా, జీలకర్ర- చిన్నచెంచా, పసుపు- తగినంత, కారం- చెంచాన్నర, ఉప్పు, నూనె- తగినంత, ఎండుమిరపకాయలు- రెండు, వేయించిన నువ్వుల పొడి- రెండు చెంచాలు

తయారీ: కాకరకాయల్ని శుభ్రం చేసి చిన్నముక్కలుగా చేసుకొని అందులోని గింజల్ని తీసేయాలి. తర్వాత దానిలోని చేదు పోవడానికి కొద్దిగా చింతపండు వేసుకుని ఉడికించుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని... అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని పచ్చి లేకుండా వేయించుకోవాలి. అవన్నీ చిటపటలాడుతున్న సమయానికి రెండు చెంచాల చింతపండు గుజ్జు... రెండు చెంచాల బెల్లం వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అవి ఉడుకుతున్నప్పుడు అందులో కాకరకాయ ముక్కలు వేసి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఉడికి దించేటప్పుడు నువ్వుల పొడి వేసుకుంటే పుల్లగా, తీయగా ఉండే కాకరకాయ కూర సిద్ధం.


క్యాబేజీతో

కావాల్సినవి: సన్నగా తరిగిన క్యాబేజీ- రెండున్నర కప్పులు, పచ్చిమిర్చి- మూడు, ఎండుమిర్చి- మూడు, నూనె- రెండు చెంచాలు, ఆవాలు- పావుచెంచా, సెనగపప్పు- చెంచా, మినప్పప్పు- చెంచా, వేయించిన పల్లీలు- రెండు చెంచాలు, చింతపండు రెండు చెంచాలు, బెల్లం- రెండున్నర చెంచాలు, ఆవపిండి- చెంచా, ఉప్పు- రుచికి తగినంత, పసుపు, ఇంగువ, కరివేపాకు- తగినంత

తయారీ: ముందుగా క్యాబేజీ తురుముని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి... నీళ్లు వార్చుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకుని వేడెక్కాక అందులో ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఉడికించిన క్యాబేజీ వేసి కలుపుకోవాలి. తర్వాత చింతపండుగుజ్జు, ఉప్పు వేసుకోవాలి. ఆపై బెల్లం వేసి బాగా కలిపి మూతపెట్టి ఐదునిమిషాలపాటు ఉడికించుకోవాలి. కూరని దింపాక ఆవపొడి లేదా ఆవపేస్ట్‌ని వేసి కలుపుకోవాలి. ఆవ సువాసనతో ఘుమఘుమలాడే కట్టామీఠా క్యాబేజీ సిద్ధం.  


చివడా

కావాల్సినవి: అటుకులు- రెండు కప్పులు, నూనె- చెంచా, ఇంగువ- పావుచెంచా, ఆవాలు- చిన్నచెంచా, పచ్చిమిర్చి- ఐదు, కరివేపాకు- రెండు రెబ్బలు, ఎండు కొబ్బరి ముక్కలు- పావుకప్పు, వేయించిన పల్లీలు- అరకప్పు, పుట్నాల పప్పు- అరకప్పు, పసుపు- అరచెంచా, ఉప్పు- రుచికి తగినంత, చాట్‌మసాలా- చెంచా, పంచదార- చెంచా

తయారీ: నాన్‌స్టిక్‌ కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఇంగువ, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాలపప్పు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అటుకులు వేసుకుని అవి కరకరలాడే వరకూ వేయించుకోవాలి. చివరిగా చాట్‌మసాలా... పంచదార పొడి వేసుకుంటే రుచికరమైన అటుకులు సిద్ధం.


పంపర పనస సలాడ్‌

కావాల్సినవి: దళసరిగా ఉండే తొక్కలని తీసేసి వేరుచేసిన ముత్యాలు- రెండు కప్పులు, పంచదార- మూడు చెంచాలు, ఉప్పు- రుచికి తగినంత, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు- చెంచా, ఆవనూనె- పావుచెంచా, చాట్‌మసాలా- పావుచెంచా  

తయారీ: ఒక పాత్రలో పంపర పనసకాయ ముత్యాలు, పంచదార, ఉప్పు, మిర్చిముక్కలు, చాట్‌మసాలా, చివరిగా ఆవనూనె వేసుకుని అన్నీ సమంగా కలిసేటట్టు చూస్తే చాట్‌ సిద్ధం. ఈ కాయ పుల్లగా ఉంటే తినలేక పక్కన పెట్టేస్తుంటారు. ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. కోల్‌కత్తాలాంటి చోట్ల స్ట్రీట్‌ఫుడ్‌గా ఇష్టంగా తింటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని