పిజ్జా పరోటా తిన్నారా..!

పని సులువు, రుచి సూపర్‌ అనిపించేవాటిల్లో పరోటాలు ముందుంటాయి. అందుకే నెలకోసారైనా ఆలూ పరోటా చేసేస్తాం. ఇంకొంచెం ప్రత్యేకంగా, మరింత నోరూరేలా ఉండాలంటే ఈ స్పెషల్స్‌ ప్రయత్నించండి!

Updated : 21 Jan 2024 03:18 IST

పని సులువు, రుచి సూపర్‌ అనిపించేవాటిల్లో పరోటాలు ముందుంటాయి. అందుకే నెలకోసారైనా ఆలూ పరోటా చేసేస్తాం. ఇంకొంచెం ప్రత్యేకంగా, మరింత నోరూరేలా ఉండాలంటే ఈ స్పెషల్స్‌ ప్రయత్నించండి!


మెక్సికన్‌

కావలసినవి

గోధుమపిండి - కప్పున్నర, రాజ్‌మా గింజలు - అర కప్పు, ఆలివ్స్‌ - 4, చీజ్‌ తరుగు - అర కప్పు, జీలకర్ర - పావు చెంచా, పచ్చిమిర్చి - 2, వెల్లుల్లి రెబ్బలు - 5, ఉల్లి తరుగు - అర కప్పు, టొమాటో ముక్కలు - టేబుల్‌ స్పూన్‌, ఉప్పు, నూనె - తగినంత, కారం - పావు చెంచా, ఒరెగానో ఫ్లేక్స్‌ - కొద్దిగా

తయారీ

రాజ్‌మా గింజలను నానబెట్టి కుక్కర్‌లో ఉడికించాలి. ఐదు విజిల్స్‌ వచ్చాక దించి, గింజల్లో నీళ్లు తీసేయాలి. ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, చెంచా నూనె, కొన్ని నీళ్లు వేసి పిండి కలిపి, పక్కనుంచాలి. కడాయిలో కాస్త నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలను వేయించాలి. అవి వేగాక.. ఉల్లి, మిర్చి, టొమాటో ముక్కలను జతచేయాలి. అందులో ఉప్పు, ఒరెగానో ఫ్లేక్స్‌, ఉడికించిన రాజ్‌మా, ఆలివ్స్‌ వేసి, పప్పుగుత్తితో మెత్తగా మెదిపి, ఉడికించాలి. దగ్గరగా అయ్యాక.. స్టవ్వు కట్టేసి.. చీజ్‌ తరుగు కలపాలి. చల్లారాక.. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేయాలి. గోధుమపిండిని పెద్ద నిమ్మకాయంత భాగాలు చేయాలి. ఒక్కో దాన్నీ చిన్న రొట్టెగా చేసి, మధ్యలో రాజ్‌మా మిశ్రమం ఉంచి, అంచులు కలిపేయాలి. దాన్ని చపాతీలా ఒత్తుకుని కాల్చుకుంటే సరిపోతుంది. మిగిలినవీ ఇలాగే చేసుకోవాలి. అంతే.. రుచికర మైన మెక్సికన్‌ పరోటా తయారై
పోతుంది.


మల్టీ గ్రెయిన్‌

కావలసినవి

గోధుమపిండి - కప్పు, రాగిపిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్‌, శనగపిండి - 1 టేబుల్‌స్పూన్‌ చొప్పున, కొత్తిమీర తరుగు - చారెడు, ఉప్పు, నెయ్యి - తగినంత

తయారీ

ఒక పాత్రలో గోధుమపిండి, రాగిపిండి, మొక్కజొన్న పిండి, ఓట్స్‌, శనగపిండి, కొత్తిమీర తరుగు, కాస్త ఉప్పు, చెంచా నెయ్యి, తగినన్ని నీళ్లతో మెత్తగా అయ్యేలా కలపాలి. పాత్ర మీద మూత పెట్టి అరగంట పక్కనుంచాలి. పిండిని చిన్న ఉండలుగా తీసుకుని, మందంగా పరిచి, కాస్త నెయ్యి రాయాలి. దాన్ని మడిచి.. మందమైన రొట్టెల్లా ఒత్తుకోవాలి. కాలిన పెనం మీద చెంచా నెయ్యి వేసి బంగారు రంగు వచ్చే వరకూ కాల్చుకోవాలి. అంతే.. మల్టీ గ్రెయిన్‌ పరోటాలు పొరలు పొరలుగా వచ్చి ఎంతో రుచిగా ఉంటాయి.


మిక్స్‌ వెజ్‌

కావలసినవి

గోధమపిండి - రెండున్నర కప్పులు, క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌, బచ్చలికూర - 100 గ్రాముల చొప్పున, బంగాళదుంపలు - రెండు, లేత బీన్స్‌ - పది, పచ్చి బఠాణీలు - పావు కప్పు, పచ్చిమిర్చి-అల్లం ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి - చెంచా చొప్పున, కారం, గరం మసాలా - అర చెంచా చొప్పున, పసుపు, ఇంగువ - పావు చెంచా చొప్పున, నెయ్యి - టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర తరుగు - చారెడు, ఉప్పు, నూనె - తగినంత

తయారీ

బంగాళదుంపలు ఉడికించి, పొట్టు తీయాలి. క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌, బీన్స్‌లు తరిగి, బఠాణీలతో కలిపి ఉడికించాలి. చల్లారాక పప్పుగుత్తితో మెదపాలి. అందులో బచ్చలికూర, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి-అల్లం ముద్ద, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, ఇంగువ వేసి కలపాలి. దీనికి గోధుమ పిండి, నెయ్యి జతచేసి.. మళ్లీ కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని.. పొడి పిండి చల్లుతూ పరోటాలు ఒత్తుకుని కాల్చుకుంటే సరిపోతుంది. ఘుమఘుమలాడే మిక్స్‌ వెజ్‌ పరోటాలు సిద్ధం.


పనీర్‌

కావలసినవి

గోధుమపిండి - పావు కిలో, నెయ్యి - చెంచా, ఉప్పు - తగినంత, పనీర్‌ - 200 గ్రాములు, పచ్చి మిర్చి - 2, కారం, గరం మసాలా, ఆమ్‌చూర్‌ పౌడర్‌ - అర చెంచా చొప్పున, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ

గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి.. తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా కలపాలి. మెత్తగా అయ్యేందుకు మళ్లీ మళ్లీ కలపాలి. దాన్ని శుభ్రమైన వస్త్రంలో చుట్టి అరగంట పక్కనుంచాలి. ఈలోగా పనీర్‌ను తరిగి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, ఆమ్‌చూర్‌ పౌడర్‌లను జతచేసి, బాగా కలపాలి. నానిన గోధుమపిండిని బాల్స్‌గా తీసుకుని, పొడి పిండి చల్లి మందమైన రొట్టెలు చేయాలి. ఒక దాని మీద కొంత స్టఫింగ్‌ పరిచి, రెండో రొట్టెను దాని మీద పెట్టి అంచులను కలిపేయాలి. కాస్త పొడి పిండి చల్లి.. చపాతీ కర్రతో స్టఫింగ్‌ బయటకు రాకుండా జాగ్రత్తగా రోల్‌ చేయాలి. పెనం వేడయ్యాక.. కాస్త నూనె వేసి పరోటాను రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకూ కాల్చుకోవాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. నూనెకు బదులు నెయ్యి వాడితే మరింత టేస్టీగా ఉంటాయి.


పిజ్జా పరోటా

కావలసినవి

గోధుమపిండి - రెండున్నర కప్పులు, చీజ్‌ తరుగు - కప్పున్నర, ఉల్లి తరుగు - ముప్పావు కప్పు, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు - 100 గ్రాముల చొప్పున, ఆలివ్‌ పండ్లు - ఐదు, మిర్చి - రెండు, పిజ్జా సాస్‌ - అర కప్పు, చిల్లీ ఫ్లేక్స్‌ - 1 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర - చారెడు, మిక్స్‌డ్‌ హెర్బ్స్‌ (పుదీనా, ఒరెగానో, సేజ్‌, థైమ్‌, రోజ్‌మేరీ) - రెండు చెంచాలు, ఉప్పు,     నూనె - తగినంత

తయారీ

గోధుమపిండిలో తగినంత ఉప్పు, రెండు చెంచాల నూనె, కొన్ని నీళ్లు వేసి బాగా కలపాలి. ఎంత ఎక్కువ కలిపితే.. అంత మెత్తగా తయారవుతుంది. దాన్ని ఒక వస్త్రంలో చుట్టి 20 నిమిషాలు పక్కనుంచాలి. మరో పాత్రలో చీజ్‌, కాస్త ఉప్పు, ఉల్లి, మిర్చి తరుగు, ఎరుపు, ఆకుపచ్చ క్యాప్సికం ముక్కలు, ఆలివ్‌ పండ్లు,  కలిపి స్టఫింగ్‌ తయారుచేసి ఉంచాలి. చపాతీ పిండిని చిన్న ఉండలుగా తీసుకోవాలి. ఒక్కో ఉండను మందమైన చపాతీలా చేసి.. కాస్త పిజ్జా సాస్‌  స్ప్రెడ్‌ చేయాలి. దాని మీద చెంచా స్టఫింగ్‌, చిల్లీ ఫ్లేక్స్‌, మిక్స్‌డ్‌ హెర్బ్స్‌ వేసి.. అంచులను దగ్గరకు చేసి కప్పేయాలి. దీన్ని మళ్లీ చపాతీలా ఒత్తుకుని.. పెనం మీద కాస్త నూనె వేసి కాల్చుకోవాలి. ఈ పిజ్జా పరోటా రుచిని వర్ణించడానికి మాటలు సరిపోవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని