ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కాకరతో!

మా ఇంట్లో ఎవ్వరికీ కాకరకాయ నచ్చదు. చేదుగా ఉంటుంది కనుక తినక్కర్లేదని నిర్ణయించేసుకున్నారు. కానీ కాకర మధుమేహాన్ని తగ్గిస్తుంది.

Updated : 21 Jan 2024 03:16 IST

మా ఇంట్లో ఎవ్వరికీ కాకరకాయ నచ్చదు. చేదుగా ఉంటుంది కనుక తినక్కర్లేదని నిర్ణయించేసుకున్నారు. కానీ కాకర మధుమేహాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ స్థాయి పెరగనివ్వదు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. అని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కానీ ఇంత మేలుచేసేదాన్ని వదిలేస్తే ఎలా? ఏదోలా తినిపించాల్సిందేనని నేనూ గట్టిగానే అనుకున్నాను. ఒకరోజు కాకర ముక్కల్ని ఎంచక్కా వేయిస్తే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినేశారు. ఎలాగంటారా.. కాకరకాయల్ని సన్నగా ఫింగర్‌చిప్స్‌లా వేలెడంత ముక్కలు కట్‌ చేసి నీళ్లల్లో వేశాను. కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మరసం జతచేశాను. తరిగేటప్పుడే గింజలు తీసేశాను. ఓ పాత్రలో కొంచెం బియ్యప్పిండి, కాస్త శనగపిండి, ఇంకాస్త మొక్కజొన్న పిండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు.. అన్నీ వేసి బాగా కలిపాను. నిమ్మరసంలో నానిన కాకర ముక్కల్ని మరీ గట్టిగా, మరీ జారుగా లేని ఆ మిశ్రమంలో  ముంచి తీసి, డీప్‌ ఫ్రై చేశాను. చెబితే నమ్మరేమో కానీ.. ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అంత రుచిగా ఉన్నాయి. ‘ఇవేంటి? భలే ఉన్నాయి.. ఇంకొన్ని కావాలి’ అంటూ తిన్నారు. లేని చేదును కూడా గుర్తుచేసుకుంటారని.. కాకర పేరు మాత్రం చెప్పలేదు. అప్పట్నుంచీ తరచూ కాకరకాయ చేస్తున్నా.. ఒక్కరూ గుర్తుపట్టలేదు. 

 సి.అరుణ, విజయవాడ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని