ప్రేమగా పేపరోనీ పిజ్జా

ప్రేమ.. ఎంత అద్భుతం కదూ! మనల్ని ఇష్టపడేవాళ్లు చుట్టూ ఉంటేనే కబుర్లూ కాలక్షేపాలూ.. ఉల్లాసాలూ ఉత్సాహాలూ.. ఆ ఇష్టమైన వాళ్లకి నచ్చేవి వండి వడ్డించడం మన్‌పసందుగా ఉంటుంది.

Updated : 11 Feb 2024 04:03 IST

ప్రేమ.. ఎంత అద్భుతం కదూ! మనల్ని ఇష్టపడేవాళ్లు చుట్టూ ఉంటేనే కబుర్లూ కాలక్షేపాలూ.. ఉల్లాసాలూ ఉత్సాహాలూ.. ఆ ఇష్టమైన వాళ్లకి నచ్చేవి వండి వడ్డించడం మన్‌పసందుగా ఉంటుంది. ఈ ప్రేమికుల రోజున వీటిల్లో ఏవైనా చేసి.. కలిసి సంతోషంగా ఆరగించండి!


 దమ్‌ ఆలూ లఖనవీ

 కావలసినవి: బేబీ పొటాటోస్‌ - అర కిలో, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, పనీర్‌ తరుగు - 100 గ్రాములు చొప్పున, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం, క్రీమ్‌, పసుపు - చెంచా చొప్పున, ఉప్పు - తగినంత, మెంతి ఆకుల పొడి, గరం మసాలా, ధనియాల పొడి - ఒకటిన్నర చెంచా చొప్పున, జీడిపప్పు పేస్టు - 2 చెంచాలు, మిరియాల పొడి - పావు చెంచా, దాల్చినచెక్క - అంగుళం ముక్క, లవంగాలు - 4, యాలకులు - 3, నెయ్యి - 4 చెంచాలు, వెన్న - టేబుల్‌ స్పూన్‌, ఉల్లి తరుగు, టొమాటో గుజ్జు - కప్పున్నర చొప్పున, పెరుగు - అర కప్పు
తయారీ: కడాయిలో కొంత నెయ్యి వేసి బేబీ పొటాటోస్‌ను డీప్‌ ఫ్రై చేయాలి. చల్లారిన తర్వాత ఉడికించి మెదిపిన బంగాళ దుంపలు, పనీర్‌ తరుగు వేసి కలిపి.. పక్కనుంచాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో మిగిలిన నెయ్యి వేసి దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, ఉల్లి తరుగులు వేయాలి. అవి వేగాక.. టొమాటో గుజ్జు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మగ్గనివ్వాలి. క్రీమ్‌, వెన్న, గరం మసాలా, కారం, ఉప్పు, మెంతి ఆకుల పొడి, జీడిపప్పు పేస్టు, మిరియాల పొడి, పెరుగు జతచేసి కలియబెట్టాలి. అందులో వేయించి పనీర్‌ కలిపిన బంగాళ దుంపలు వేసి సన్న సెగ మీద ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే ఘుమఘుమలాడే ‘దమ్‌ ఆలూ లఖనవీ’ సిద్ధం.


నర్గిసీ కోఫ్తా’

కావలసినవి: బంగాళదుంపలు - 2, పనీర్‌ - 200 గ్రాములు, బ్రెడ్‌ - రెండు  స్లైసులు, కారం - అర చెంచా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి - చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - పావు చెంచా, నిమ్మరసం - అర చెంచా, శనగపిండి - కొద్దిగా, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: బంగాళదుంపలు ఉడికించి, పొట్టు తీసి మెత్తగా మెదపాలి. అందులో పచ్చి మిర్చి ముక్కలు, కాస్త ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కలిపి.. నిమ్మకాయంత ఉండలుగా చేయాలి. బ్రెడ్‌ అంచులు తీసేసి, తురిమిన పనీర్‌లో వేయాలి. అందులో కారం, కొద్దిగా ఉప్పు వేసి బ్లెండర్‌తో మెత్తగా చేయాలి. దీన్ని చిన్న భాగాలుగా చేసుకుని.. అరచేయంత రొట్టెలా పరచి.. మధ్యలో బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి, అంచులు కప్పేయాలి. వీటిని కాగుతున్న నూనెలో వేయించాలి. అంతే.. నోరూరించే ‘నర్గిసీ కోఫ్తా’ రెడీ.]మ్‌


పేపరోనీ పిజ్జా

కావలసినవి: క్రీమ్‌ చీజ్‌ - పావు కిలో, సోర్‌ క్రీమ్‌ - అర కప్పు, ఓరెగానో - ముప్పావు చెంచా, మినీ పేపరోనీ స్లైసులు - పావు కప్పు, రెడ్‌ పెప్పర్‌ ఫ్లేక్స్‌ - చిటికెడు, గార్లిక్‌ పౌడర్‌ - పావు చెంచా, మోజరెలా చీజ్‌ - ముప్పావు కప్పు, పరమేసన్‌ చీజ్‌ - అర కప్పు, పిజ్జా సాస్‌ - పావు కప్పు, ఉప్పు - తగినంత
తయారీ: అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకూ వేడి చేయాలి. అవెన్‌ సేఫ్‌ పాత్రలో క్రీమ్‌ చీజ్‌, సోర్‌ క్రీమ్‌, ఓరెగానో, రెడ్‌ పెప్పర్‌ ఫ్లేక్స్‌, గార్లిక్‌ పౌడర్‌, ఉప్పు, మోజరెలా, పరమేసన్‌ చీజ్‌ల్లో కొంత భాగం వేసి కలపాలి. దాని మీద పేపరోనీ స్లైసులు వేసి వాటి మీద పిజ్జా సాస్‌ను పొరలా వేయాలి. దాని మీద మిగిలిన చీజ్‌లు వేసి.. 16 నుంచి 20 నిమిషాలు బేక్‌ చేస్తే సరిపోతుంది.


స్ట్రాబెర్రీ టార్ట్‌

కావలసినవి: మైదాపిండి - కప్పున్నర, వెన్న - రెండు చెంచాలు, పాలు - కప్పు, పంచదార పొడి - అర కప్పు, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - చెంచా, ఫ్రెష్‌ క్రీమ్‌ - కప్పు, స్ట్రాబెర్రీ జామ్‌ - కప్పు, తాజా స్ట్రాబెర్రీ పండ్ల ముక్కలు - 3 కప్పులు
తయారీ: మైదాపిండిలో వెన్న వేసి ఉండలు కట్టకుండా కలపాలి. అందులో పాలు పోసి బాగా మర్దించాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత భాగాలుగా తీసుకోవాలి. ఒక్కో ముద్దను ఒక్కో మౌల్డ్‌లో ఉంచి.. లోపల ఒక పొర పరచినట్లు చేయాలి. వీటిని అవెన్‌ సేఫ్‌ ట్రేలో 15 నుంచి 20 నిమిషాలు బేక్‌ చేయాలి. ఫ్రెష్‌ క్రీమ్‌లో పంచదార పొడి వేసి కలపాలి. మైదాతో తయారైన చిట్టి బౌల్స్‌లో మొదట స్ట్రాబెర్రీ ఫిల్లింగ్‌, తర్వాత పంచదార పొడి, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కలిపిన క్రీమ్‌ను లేయర్స్‌లా వేయాలి. దాని మీద తాజా స్ట్రాబెర్రీ పండ్ల ముక్కలను అమర్చి.. మధ్యలో ఇంకాస్త క్రీమ్‌ వేస్తే సరి.. నోరూరించే స్ట్రాబెర్రీ టార్ట్‌ తయారైనట్లే.


చాకో లావా కేక్‌

కావలసినవి: డార్క్‌ చాక్లెట్‌ - 120 గ్రాములు, నెయ్యి - 110 గ్రాములు, పంచదార - పావు కప్పు, మైదాపిండి - ఒక టేబుల్‌ స్పూన్‌, గుడ్లు - 4, ఐసింగ్‌ షుగర్‌ - చెంచా, చెర్రీ లేదా స్ట్రాబెర్రీ పండ్లు, పుదీనా ఆకులు - అలంకరించేందుకు
తయారీ: అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి మరిగించాలి. దానిలో మరో చిన్న పాత్రను అమర్చాలి. అందులో డార్క్‌ చాక్లెట్‌, నెయ్యి వేయాలి. వేడినీళ్ల నుంచి వచ్చే సెగకు చాక్లెట్‌ కరుగుతుంది. అది కాస్త చిక్కగా అయ్యాక స్టవ్వు కట్టేసి, చల్లారనివ్వాలి. అవెన్‌ ప్రూఫ్‌ కప్స్‌ను తీసుకుని, లోపల వెన్న రాయాలి. దాని మీద మైదాపిండి చల్లాలి. ఒక చిన్న పాత్రలో నాలుగు గుడ్లు పగలకొట్టి బీట్‌ చేయాలి. అందులో పావు కప్పు పంచదార వేసి మళ్లీ బీట్‌ చేయాలి. చాక్లెట్‌ సిరప్‌, మైదాపిండి జతచేసి ఇంకోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని వెన్న గ్రీజ్‌ చేసిన కప్స్‌లో వేయాలి. ఫిల్లింగ్‌ మరీ నిండకుండా కొంత వెలితిగానే ఉండాలి. అవెన్‌ను 230 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ప్రీ హీట్‌ చేసి.. 8 నిమిషాలు బేక్‌ చేయాలి. తర్వాత.. కాస్త ఐసింగ్‌ షుగర్‌ చల్లి, చెర్రీ లేదా స్ట్రాబెర్రీ పండు, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేయాలి. అంతే.. నోరూరించే ‘చాకో లావా కేక్‌’ ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని