శనగలతో సూపర్‌ వంటలు!

తెల్లటి కాబూలీ శనగలు.. గోధుమ రంగు దేశీ శనగలు.. వేటికవే మహా రుచి. నానబెట్టి మొలకలొచ్చాక తిన్నా, ఉడికించి గుగ్గిళ్లు తిన్నా మంచి పోషకాహారం.

Published : 18 Feb 2024 00:04 IST

తెల్లటి కాబూలీ శనగలు.. గోధుమ రంగు దేశీ శనగలు.. వేటికవే మహా రుచి. నానబెట్టి మొలకలొచ్చాక తిన్నా, ఉడికించి గుగ్గిళ్లు తిన్నా మంచి పోషకాహారం. ఇక శనగలతో చేసే వంటలైతే వహ్వా అనిపిస్తాయి. వాటిల్లో మీ కోసం కొన్ని..


కొబ్బరితో కూర

కావలసినవి: శనగలు - 2 కప్పులు, ఉల్లి తరుగు - అర కప్పు, టొమాటో గుజ్జు, బచ్చలికూర తరుగు, కొబ్బరి కోరు - కప్పు చొప్పున, కొబ్బరి పాలు - అర కప్పు, ఆలివ్‌ నూనె - 1 టేబుల్‌ స్పూన్‌, బిర్యానీ ఆకు - 1, జీలకర్ర - చెంచా, అల్లం వెల్లుల్లి ముద్ద - చెంచా, ధనియాల పొడి, కారం, గరం మసాలా చెంచా చొప్పున, పసుపు - పావు చెంచా, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒకటిన్నర చెంచా, కొత్తిమీర తరుగు - అర కప్పు

తయారీ: ముందు రాత్రి నానబెట్టిన శనగలను ఆ నీళ్లు తీసేసి, కడిగి ఉడికించాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నూనె కాగాక.. బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగులను లేత గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి. అందులో టొమాటో గుజ్జు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు వేయాలి. రెండు నిమిషాలు వేయించి.. ఉడికిన శనగలు, కొబ్బరి పాలు, బచ్చలికూర తరుగు, అర కప్పు నీళ్లు జతచేసి ఉడికించాలి. ఆరేడు నిమిషాల తర్వాత కొబ్బరి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి.. ఒక నిమిషం ఉంచి దించేయాలి. అన్నం, రొట్టెలు, క్వినోవా.. ఎందులోకైనా సూపర్‌గా ఉంటుందీ కూర.


హమ్మస్‌ తాహినీ

కావలసినవి: ఉడికించిన శనగలు - కప్పున్నర, నువ్వులు - ముప్పావు కప్పు, ఆలివ్‌ నూనె - 4 టేబుల్‌ స్పూన్లు నిమ్మరసం - 2 టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - 2, ఉప్పు - తగినంత, రెడ్‌ పెప్పర్‌ ఫ్లేక్స్‌ - అర చెంచా, కొత్తిమీర తరుగు - చారెడు, సన్నగా తరిగిన ఉల్లి, టొమాటో, కీరదోస ముక్కలు అన్నీ కలిపి అర కప్పు, పిటా బ్రెడ్‌ - 150 గ్రాములు

తయారీ: ముందుగా నువ్వులను వేయించాలి. వాటికి రెండు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ నూనె జతచేసి రుబ్బి, తాహినీ తయారుచేసుకోవాలి. పిటా బ్రెడ్‌ను కాస్త వేడి చేయాలి. మిక్సీ జార్‌లో ఉడికించిన శనగలు, కొన్ని నీళ్లు, మిగిలిన ఆలివ్‌ నూనె, నిమ్మరసం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, తాహినీ వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులోకి తీసి.. రెడ్‌ పెప్పర్‌ ఫ్లేక్స్‌, కొత్తిమీర తరుగు, ఉల్లి, టొమాటో, కీరదోస ముక్కలతో గార్నిష్‌ చేసి.. పిటా బ్రెడ్‌తో సర్వ్‌ చేయాలి.


ఫలాఫెల్‌

కావలసినవి: శనగలు - 2 కప్పులు, శనగపిండి లేదా మైదా - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - అర కప్పు, వెల్లుల్లి తరుగు - చెంచా, ధనియాల పొడి - 2 చెంచాలు, జీలకర్ర - ఒకటిన్నర చెంచా, మిరియాల పొడి - చెంచా, కారం - అర చెంచా, ఉప్పు - తగినంత, పచ్చిమిర్చి ముద్ద - అర చెంచా, కొత్తిమీర తరుగు - అర కప్పు, నూనె - వేయించేందుకు సరిపడా

తయారీ: శనగలు కడిగి 12 గంటలు నానబెట్టాలి. వీటికి కాస్త గాలి తగలాలి కనుక మూత పెట్టకుండా శుభ్రమైన వస్త్రాన్ని కప్పాలి. ఆ నీళ్లు తీసేసి కడిగి మిక్సీ జార్‌లోకి తీయాలి. అందులో శనగ లేదా మైదాపిండి, ఉల్లి, వెల్లుల్లి తరుగు, ధనియాల పొడి, జీలకర్ర, మిరియాల పొడి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, కొత్తిమీర తరుగు వేసి కాస్త బరకగా ఉండేలా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని నిమ్మకాయంత ఉండలు చేసి కాగుతున్న నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొబ్బరి పచ్చడితో మరింత కమ్మగా ఉంటాయి.


పంజాబీ ఛోలే

కావలసినవి: శనగలు - 2 కప్పులు, టొమాటో గుజ్జు - రెండున్నర కప్పులు, ఉల్లి తరుగు - కప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా, యాలకులు - 5, బిర్యానీ ఆకులు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క, మిరియాలు - పావు చెంచా, లవంగాలు - 4, ఉప్పు - తగినంత, ఛోలే మసాలా - 3 చెంచాలు, గరం మసాలా - పావు చెంచా, కారం - అర చెంచా, కొత్తిమీర తరుగు - అర కప్పు, జీలకర్ర పొడి - ఒకటిన్నర చెంచా, సన్నగా తరిగిన అల్లం - పావు చెంచా, మెంతి ఆకుల పొడి - అర చెంచా, నూనె - 2 చెంచాలు, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌

తయారీ: శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టి, ఆ నీళ్లు తీసేయాలి. వాటికి ఐదు కప్పుల నీళ్లు, ఉప్పు జతచేసి కుక్కర్‌లో ఐదు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించాలి. కడాయిలో నూనె వేడయ్యాక బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు వేయాలి. మంచి వాసన వస్తుండగా అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లి తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకూ వేగనివ్వాలి. అందులో  టొమాటో గుజ్జు వేసి ఉడికించాలి. మధ్యలో అడుగంటకుండా కలియబెడుతుండాలి. పావు గంట తర్వాత ఛోలే మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఉడికించిన శనగలు, కప్పు నీళ్లు జతచేసి ఇంకో ఆరేడు నిమిషాలు ఉడికించాలి. నీళ్లు ఇగిరి, చక్కగా ఉడికిందనుకున్నాక.. నెయ్యి, అల్లం తరుగు, గరం మసాలా, మెంతి ఆకుల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలియబెట్టి దించేయాలి. అంతే.. ఘుమఘుమలాడే పంజాబీ ఛోలే తిని ఆనందించడమే తరువాయి.


చనా పులావ్‌

కావలసినవి: శనగలు - 2 కప్పులు, బాస్మతి బియ్యం - కప్పున్నర, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 4, వెల్లుల్లి రెబ్బలు - 4, అల్లం ముద్ద - చెంచా, దాల్చినచెక్క - అంగుళం ముక్క, బిర్యానీ ఆకులు - 2, మిరియాలు - అర చెంచా, బ్లాక్‌ కార్డమం - 1, లవంగాలు - 5, జీలకర్ర - టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - చారెడు

తయారీ: శనగలు ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో నూనె కాగాక.. ఉల్లితరుగును వేయించాలి. అది కాస్త వేగాక.. దాల్చినచెక్క, బిర్యానీ ఆకులు, మిరియాలు, బ్లాక్‌ కార్డమం, లవంగాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముద్ద వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. అందులో 8 కప్పుల నీళ్లు, శనగలు వేసి కలియ తిప్పి.. సెగ పెంచాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగిన బియ్యం, ఉప్పు వేసి మీడియం సెగ మీద ఉడికించాలి. దించే ముందు నెయ్యి, కొత్తిమీర వేయాలి. అంతే.. ఆహా అనిపించే రుచీ, పరిమళాలతో ‘చనా పులావ్‌’ తయారైపోతుంది. కీర దోస రైతాతో తింటే అదుర్స్‌ అనాల్సిందే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు