అర్ధనారీశ్వరుడికి అనాస కేసరి

మనందరికీ ఇష్టమైన మహా శివరాత్రి వచ్చేసింది. పరమేశ్వరుడికి అరటి, ద్రాక్ష మొదలైన పండ్లతోపాటు ఇంకేం నైవేద్యం సమర్పించాలా అని ఆలోచిస్తున్నారా? అయితే వీటిని ప్రయత్నించండి.

Published : 03 Mar 2024 00:26 IST

నందరికీ ఇష్టమైన మహా శివరాత్రి వచ్చేసింది. పరమేశ్వరుడికి అరటి, ద్రాక్ష మొదలైన పండ్లతోపాటు ఇంకేం నైవేద్యం సమర్పించాలా అని ఆలోచిస్తున్నారా? అయితే వీటిని ప్రయత్నించండి. పూజ పూర్తయ్యాక ప్రసాదంగా సేవించి ఆనందించండి!


అంజీర్‌ బర్ఫీ

కావలసినవి: అంజీర్‌ - 12, ఖర్జూరపండ్లు - 15, నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు, బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు - అన్నీ కలిపి అర కప్పు, యాలకుల పొడి - పావు చెంచా
తయారీ: అంజీర్‌, ఖర్జూరాలను కడిగి, మూడు గంటలు విడివిడిగా నానబెట్టాలి. ఈ రెండిట్లో తియ్యదనం ఉంటుంది కనుక పంచదార వేయాల్సిన అవసరం లేదు. ముందుగా అంజీర్‌ను గ్రైండ్‌ చేయాలి. ఖర్జూర పండ్లలో గింజలు తీసేసి.. వాటిని కూడా గ్రైండ్‌ చేయాలి. కడాయిలో నెయ్యి కాగాక.. బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు, పండ్ల గుజ్జు, యాలకుల పొడి వేసి కలియ తిప్పుతూ వేయించాలి. అందులో ఉన్న తేమ ఆవిరైపోతుంది. చిక్కబడి, మంచి సువాసన వస్తున్నప్పుడు దించేయాలి. వెడల్పయిన పళ్లెంలో నెయ్యి రాసి.. పండ్ల మిశ్రమాన్ని సమంగా సర్దాలి. నచ్చిన ఆకృతిలో కట్‌ చేసుకుంటే.. అంజీర్‌ బర్ఫీ సిద్ధం.


అనాస కేసరి

కావలసినవి: ఉప్మారవ్వ, పంచదార - అర కప్పు చొప్పున, అనాస ముక్కలు - కప్పు,  నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు, జీడిపప్పు - 16, కిస్‌మిస్‌ - చారెడు, యాలకుల పొడి - పావు చెంచా, కుంకుమ పువ్వు - కాస్త, పసుపు రంగు ఫుడ్‌ కలర్‌ - రెండు చుక్కలు, పైనాపిల్‌ ఎసెన్స్‌ - కొద్దిగా
తయారీ: మందపాటి పాత్రలో అనాస ముక్కలు, పంచదార వేసి కప్పున్నర నీళ్లతో ఉడికించాలి. పంచదార కరిగి, ముక్కలు మెత్తగా అయ్యాక కుంకుమ పువ్వు, ఫుడ్‌ కలర్‌, పైనాపిల్‌ ఎసెన్స్‌ వేసి కలియతిప్పి.. నిమిషం తర్వాత దించేయాలి. కడాయిలో నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, ఉప్మారవ్వ, యాలకుల పొడి వేసి వేయించాలి. బంగారు రంగులోకి మారగానే కిస్‌మిస్‌, పైనాపిల్‌ మిశ్రమం జతచేయాలి. ఉండలు కట్టకుండా కలియ తిప్పుతూ ఉడికించి, నాలుగు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే.. చక్కటి, చిక్కటి పైనాపిల్‌ కేసరి రెడీ.


గసగసాల మిఠాయి

కావలసినవి: గసగసాలు - కప్పు, పంచదార - ముప్పావు కప్పు (తీపి ఎక్కువ తినేవారు ఇంకో రెండు చెంచాలు ఎక్కువ వేసుకోవచ్చు) చిక్కటి పాలు - రెండు కప్పులు, నెయ్యి - 3 చెంచాలు, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు - అన్నీ కలిపి అర కప్పు
తయారీ: గసగసాలను కొంచెం గ్రైండ్‌ చేయాలి. అంటే మరీ మెత్తగా లేదా మరీ బరకగా ఉండకూడదు. అందులో కప్పు పాలు పోసి ఇంకోసారి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో ఒక స్పూన్‌ నెయ్యి వేసి బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను లేత గోధుమ రంగు వచ్చేవరకూ వేయించి తీయాలి. అదే కడాయిలో గసగసాల మిశ్రమం, ఇంకో కప్పు పాలు, పంచదార వేసి.. ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. మిగిలిన రెండు చెంచాల నెయ్యి కూడా వేసి సన్న సెగ మీద అడుగంటకుండా తిప్పుతూ ఉడికించాలి. చిక్కబడిన తర్వాత వేయించిన డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేసి.. కొన్ని క్షణాలుంచి దించేయాలి. అంతే.. వహ్వా అనిపించే గసగసాల మిఠాయి పరమేశ్వరుడికి సమర్పించేందుకు సిద్ధం.


బాదం హల్వా

కావలసినవి: బాదంపప్పు - అర కిలో, పంచదార - కప్పున్నర, పాలు - రెండు కప్పులు, నెయ్యి - అర కప్పు, యాలకుల పొడి - పావు చెంచా, కుంకుమపువ్వు - కొద్దిగా, ఫుడ్‌ కలర్‌ - రెండు చుక్కలు
తయారీ: ముందుగా అర కప్పు పాలలో కుంకుమపువ్వు వేసి మరిగించి శాఫ్రన్‌ మిల్క్‌ చేసి పక్కనుంచుకోవాలి. బాదంపప్పు రెండు గంటలు నానబెట్టి, ఒక నిమిషం వేడి నీళ్లలో వేసి తీస్తే.. పొట్టు తీయడం తేలికవుతుంది. ఆ పప్పులకు కొన్ని పాలు జతచేసి గ్రైండ్‌ చేయాలి. కడాయిలో కాస్త నెయ్యి, బాదం మిశ్రమం వేసి సన్న సెగ మీద కలియబెడుతూ ఉడికించాలి. అందులో మిగిలిన పాలు, నెయ్యి, పంచదార, యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసి అడుగంటకుండా తిప్పుతూ ఉడికించాలి. చివర్లో శాఫ్రన్‌ మిల్క్‌ జతచేసి ఇంకో నిమిషం ఉంచి, దించేస్తే.. వారెవా అనిపించే బాదం హల్వా తయారైపోతుంది.


ఆరెంజ్‌ సందేశ్‌

కావలసినవి: పాలు - లీటరు, పంచదార పొడి - కప్పు, నిమ్మరసం - చెంచా, పాల పొడి - 3 టేబుల్‌ స్పూన్లు, నారింజపండ్ల జ్యూస్‌, నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, డ్రెైఫ్రూట్స్‌ పలుకులు - అలంకరించేందుకు
తయారీ: ఒక పాత్రలో పాలు పోసి మరిగించాలి. చిక్కగా అయ్యాక నిమ్మరసం జతచేసి, ఇంకో రెండు నిమిషాలుంచి దించేయాలి. ఈ విరిగిన పాలను వడపోసి, శుభ్రమైన పల్చని వస్త్రంలోకి తీస్తే.. నీరు మొత్తం పోయి, పనీర్‌ తయారవుతుంది. అందులో పంచదార వేసి మెత్తగా అయ్యేలా బాగా కలపాలి. నాన్‌ స్టిక్‌ ప్యాన్‌లో నారింజపండ్ల జ్యూస్‌, పాల పొడి వేసి ఒక నిమిషం పాటు కలియ తిప్పుతుండాలి. అందులో పనీర్‌ మిశ్రమం వేసి అడుగంటకుండా తిప్పుతూ సన్న సెగ మీద ఏడెనిమిది నిమిషాలుంచి, దించేయాలి. చల్లారిన తర్వాత చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఒక్కో సందేశ్‌ మధ్యలో డ్రెైఫ్రూట్స్‌ పలుకులు అలంకరిస్తే సరిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు