పసందైన విందు భోజనం

బంధుమిత్రులెవరైనా భోజనానికి వస్తుంటే.. ఏమేం వంటలు చేయాలి, ఏవైతే నచ్చుతాయి.. అని తర్జనభర్జన పడతాం. అన్ని సందేహాలతో అనేక కూరలూ, స్వీట్లూ చేసే బదులు ఈసారి వీటిని ప్రయత్నించి చూడండి. పసందైన విందుతో వారిని ఆశ్చర్యచకితుల్ని చేయండి.

Updated : 24 Mar 2024 00:35 IST

బంధుమిత్రులెవరైనా భోజనానికి వస్తుంటే.. ఏమేం వంటలు చేయాలి, ఏవైతే నచ్చుతాయి.. అని తర్జనభర్జన పడతాం. అన్ని సందేహాలతో అనేక కూరలూ, స్వీట్లూ చేసే బదులు ఈసారి వీటిని ప్రయత్నించి చూడండి. పసందైన విందుతో వారిని ఆశ్చర్యచకితుల్ని చేయండి.


చికెన్‌ పాప్స్‌

కావలసినవి: చికెన్‌ వింగ్స్‌ ముక్కలు - 20, మైదాపిండి - వంద గ్రాములు, మొక్కజొన్న పిండి - 50 గ్రాములు, పచ్చిమిర్చి ముక్కలు - చెంచా, నూనె - వేయించడానికి సరిపడా, వెల్లుల్లి తరుగు - అర టేబుల్‌స్పూన్‌, అల్లం ముద్ద, కారం, గరం మసాలా, సోంపు - చెంచా చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - రెండు చెంచాలు
తయారీ: చికెన్‌ వింగ్స్‌ ముక్కలను శుభ్రంచేసి, అందులో అల్లం ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి తరుగు వేయాలి. మైదాపిండిని జల్లించి.. గరం మసాలా, ఉప్పు, సోంపు, నిమ్మరసం వేసి కలపాలి. పిండి పొడిగా ఉందనిపిస్తే.. కొద్దిగా నీళ్లు జతచేసి కోటింగ్‌ పిండిలా తయారుచేయాలి. ఇందులో చికెన్‌ ముక్కలు వేసి 20 నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత కడాయిలో నూనె కాగనిచ్చి.. పిండి పట్టించిన చికెన్‌ ముక్కలను వేయించాలి. అవి బంగారు రంగులోకి మారడానికి ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. చక్కగా వేగి, కరకరలాడేలా తయారయ్యాక.. నూనెలోంచి దేవి, టిష్యూపేపర్‌ మీదికి తీస్తే.. రుచికరమైన చికెన్‌ పాప్స్‌ సిద్ధమైపోతాయి.


క్రిస్పీ పనీర్‌ ఫింగర్స్‌

కావలసినవి: పనీర్‌ - 200 గ్రాములు, మైదాపిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, మొక్కజొన్న పిండి - టేబుల్‌ స్పూన్‌, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద - అర చెంచా చొప్పున, మిక్స్‌డ్‌ హెర్బ్స్‌ - పావు చెంచా, బ్రెడ్‌ పొడి - పావు కప్పు, నూనె - వేయించడానికి సరిపడా
తయారీ: పనీర్‌ను పొడుగ్గా ముక్కలు కోసుకోవాలి. వాటి మీద కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, మిక్స్‌డ్‌ హెర్బ్స్‌ వేసి.. ముక్కలు తునగకుండా కలియ తిప్పాలి. ఇలా పొడులన్నీ పట్టించిన తర్వాత ఒక పావు గంట పక్కనుంచాలి. మరో పాత్రలో మైదాపిండి, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి.. కొన్ని నీళ్లతో ఉండలు కట్టకుండా చిక్కగా కలపాలి. మసాలా పట్టించిన పనీర్‌ ముక్కలను మొదట ఈ మిశ్రమంలో, తర్వాత బ్రెడ్‌ పొడిలో ముంచి తీసి, కాగుతున్న నూనెలో వేయించాలి. అంతే.. బంగారురంగులో కరకరలాడే పనీర్‌ ఫింగర్స్‌ సిద్ధం.


నారింజ రసం

కావలసినవి: నారింజ పండ్లు - 2, నెయ్యి - 2 చెంచాలు, నూనె - టేబుల్‌ స్పూన్‌, ధనియాలు, శనగపప్పు, మిరియాలు, జీలకర్ర - టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఎండు మిర్చి - 4, పచ్చిమిర్చి - 3, టొమాటో ముక్కలు - అర కప్పు, ఉడికించిన కందిపప్పు - అర కప్పు, ఆవాలు - చెంచా, మిరియాల పొడి, జీలకర్ర పొడి - చెంచా చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - చెంచా, వెల్లుల్లి రెబ్బలు - రెండు, కరివేపాకు - 6 రెబ్బలు, పసుపు - అర చెంచా, ఇంగువ - పావు చెంచా, కొత్తిమీర తరుగు - పావు కప్పు
తయారీ: నారింజ పండ్లు రసం తీసి పక్కనుంచాలి. మందపాటి గిన్నెలో చెంచా నెయ్యి వేసి.. శనగపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, రెండు ఎండుమిరపకాయలను వేయించి చల్లారాక గ్రైండ్‌ చేయాలి. అదే పాత్రలో మిగిలిన నెయ్యి, టొమాటో ముక్కలు, 2 కరివేపాకు రెబ్బలు వేసి వేయించాలి. అవి కాస్త మగ్గిన తర్వాత తగినన్ని నీళ్లు, గ్రైండ్‌ చేసిన పౌడరు, కొత్తిమీర తరుగు, ఉప్పు, మెత్తగా మెదిపిన కందిపప్పు జతచేసి ఉడికించాలి. చివర్లో నారింజ రసం, నిమ్మరసం వేసి దించేయాలి. కడాయిలో ఆవాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇంగువ, రెండు కరివేపాకు రెబ్బలతో తాలింపు వేసి రసంలో కలిపితే సరిపోతుంది.


కోకోనట్‌ ఐస్‌క్రీం

కావలసినవి: కొబ్బరి పాలు, కొబ్బరి నీళ్లు - కప్పు చొప్పున, తాజా కొబ్బరి తురుము - 2 కప్పులు, క్రీమ్‌ - ఒకటిన్నర కప్పు, లేత కొబ్బరి ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు, పంచదార పొడి - 5 టేబుల్‌ స్పూన్లు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అర కప్పు
తయారీ: ముందుగా క్రీమ్‌ను ఒక పాత్రలో వేసి గిలకొట్టాలి. కొబ్బరి తురుములో కొబ్బరి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్‌ చేసి, క్రీమ్‌లో కలపాలి. దీనికి పంచదార పొడి, కండెన్స్‌డ్‌ మిల్క్‌, కొబ్బరి పాలు, లేత కొబ్బరి ముక్కలు జతచేసి, కలియ తిప్పాలి. ఈ పాత్రకు మూత బిగించి, ఆరు నుంచి ఎనిమిది గంటలు ఫ్రీజర్‌లో ఉంచితే సరి.. అమోఘమైన రుచితో కోకోనట్‌ ఐస్‌క్రీం తయారైపోతుంది.


క్యాబేజ్‌ థోరన్‌

కావలసినవి: క్యాబేజ్‌ - పావు కిలో, క్యారెట్‌ - 1, తాజా కొబ్బరి తురుము - వంద గ్రాములు, ఉల్లిపాయ - 1, జీడిపప్పు - పావు కప్పు, ఆలివ్‌ నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి - 3 చొప్పున, మిరియాల పొడి - ముప్పావు చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - అర చెంచా, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర - చెంచా చొప్పున, అల్లం - అంగుళం ముక్క, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - పావు కప్పు
తయారీ: క్యాబేజ్‌, క్యారెట్‌, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిలను సన్నగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె కాగనిచ్చి ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపటలాడుతుండగా.. ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లి, అల్లం తరుగులను వేయాలి. అవి దోరగా వేగాక.. క్యారెట్‌ ముక్కలు, జీడిపప్పు వేయాలి. రెండు నిమిషాల తర్వాత మిరియాల పొడి, క్యాబేజ్‌ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు వేసి, మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. క్యాబేజ్‌ మెత్తబడ్డాక.. కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసి..కొన్ని క్షణాలుంచి దించేస్తే సరిపోతుంది.


మామిడి కొబ్బరి పచ్చడి

కావలసినవి: పచ్చి మామిడికాయ ముక్కలు - పావు కప్పు, తాజా కొబ్బరి తురుము - కప్పు, పచ్చిమిర్చి - నాలుగు,కొత్తిమీర తరుగు - చారెడు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర - టేబుల్‌ స్పూన్‌ చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - రెండు, ఇంగువ - అర చెంచా, కరివేపాకు రెబ్బలు - నాలుగు
తయారీ: పచ్చి మామిడికాయ ముక్కలు, కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీ జార్‌లో వేసి కొన్ని నీళ్లతో గ్రైండ్‌ చేసి, పక్కన ఉంచాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేయాలి. ఆవాలు చిటపటమంటున్నప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు రెబ్బలు వేయాలి. ఇంగువ వాసన ఘుమాయిస్తుండగా స్టవ్వు కట్టేసి.. ఈ తాలింపును పచ్చడిలో వేసి కలపాలి. అంతే.. ఆహా అనిపించే మామిడి కొబ్బరి పచ్చడి తయారైపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని