బార్లీతో దధ్యోదనం!

వేసవి తాపాన్ని తగ్గించేవాటిలో బార్లీ ఒకటి. బార్లీ నీళ్లు ఎంత మంచివో తెలుసు కదా! ఈ గింజలతో దధ్యోదనం కూడా చేసుకోవచ్చు.

Published : 24 Mar 2024 00:04 IST

వేసవి తాపాన్ని తగ్గించేవాటిలో బార్లీ ఒకటి. బార్లీ నీళ్లు ఎంత మంచివో తెలుసు కదా! ఈ గింజలతో దధ్యోదనం కూడా చేసుకోవచ్చు. ఎలాగంటారా.. కప్పు బార్లీ గింజలను ముందురోజు రాత్రి నానబెట్టి, మర్నాడు ఉదయం ఆ నీళ్లు తీసేయాలి. అందులో మూడు కప్పుల నీళ్లు పోసి విడిగా లేదా కుక్కర్‌లో అన్నం వండాలి. చల్లారిన తర్వాత తగినంత ఉప్పు, రెండు కప్పుల పెరుగు, కప్పుడు కాచి చల్లార్చిన పాలు జతచేసి బాగా కలపాలి. కడాయిలో నూనె కాగనిచ్చి, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపటలాడుతుండగా.. కచ్చాపచ్చా దంచిన మిరియాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి.. కమ్మని వాసన వచ్చేవరకూ వేయించి, దించేయాలి. పాలు, పెరుగు కలిపిన బార్లీ అన్నంలో ఈ తాలింపు వేసి కలియ తిప్పి, కొత్తిమీర తరుగు వేస్తే సరి.. బార్లీ దధ్యోదనం సిద్ధం. కావాలనుకుంటే కిస్‌మిస్‌, బాదంపప్పు, జీడిపప్పులు కూడా వేయొచ్చు. అలాగే తీపి ఇష్టపడేవారు దానిమ్మ గింజలు, ద్రాక్ష తదితర పండ్లను జోడించవచ్చు. ఇదెంతో రుచిగానూ ఉంటుంది, ఆరోగ్యకరం కూడా.

అంబటి అనిత, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని