సబ్జా కలిపితే ఆరోగ్యం దర్జా!
వేడి, దాహం... నీరసం, నిస్సత్తువ వీటి నుంచి ఉపశమనం పొందాలన్నా.. అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా కాసిని సబ్జాగింజలు నానేయండి. పాలతో, రోజ్‌సిరప్‌తో.. నిమ్మకాయరసంతో పానీయాలు కలపండి. ఎండ, చెమట కారణంగా పోయిన పోషకాలని తిరిగి రాబట్టుకోండి...
కస్టర్డ్ ఫలూదా
కావాల్సినవి: పాలు- 2 కప్పులు(ఫుల్‌క్రీం మిల్క్), సబ్జా గింజలు- చెంచా, సేమియా- అర కప్పు, కస్టర్డ్ పౌడర్- రెండు చెంచాలు, తరిగిన పండ్ల ముక్కలు- రెండు కప్పులు, పంచదార- పావు కప్పు, రోజ్‌సిరప్- పావుకప్పు, ఐస్‌క్రీం- టాపింగ్‌కోసం, డ్రైఫ్రూట్స్ పలుకులు- 2 చెంచాలు, టూటీఫ్రూటీ- 2 చెంచాలు, చెర్రీస్- అలంకరణకు
తయారీ: సబ్జా గింజలని పావుగంట నానబెట్టి నీళ్లు వడకట్టుకోవాలి. స్టౌ వెలిగించి పాలు మరిగించుకుని, అందులో సేమియా వేసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. పంచదార కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొన్ని పచ్చి పాలల్లో కస్టర్డ్‌మిల్క్ పొడి వేసి ఉండల్లేకుండా కలిపి, పంచదార కలిపిన పాలల్లో వేసుకోవాలి. ఉండలు రానీయకుండా కలుపుతూ రెండు నిమిషాలు తర్వాత కట్టేయాలి. చల్లారాక ఫ్రిజ్‌లో ఉంచాలి. దానిమ్మ, అరటి, ద్రాక్ష, మామిడి వంటి పండ్ల ముక్కలని ఫలూదాలోకి ఎంచుకోవచ్చు. పొడవాటి గ్లాసుల్లో ముందు రోజ్‌సిరప్, తర్వాత సేమియా, ఆపై సబ్జాగింజలు, తర్వాత తరిగిన పండ్లముక్కలు, చివరిగా ఐస్‌క్రీం, టూటీఫ్రూటీ, డ్రైఫ్రూట్ పలుకులు, చెర్రీలు వేసుకుంటే ఫలూదా సిద్ధం.
పుచ్చకాయతో..
కావాల్సినవి: పుచ్చకాయ ముక్కలు- మూడు కప్పులు, సబ్జాగింజలు- చెంచా, పంచదార- నాలుగు చెంచాలు, నల్లుప్పు- అరచెంచా, జీలకర్ర- పావుచెంచా, నీళ్లు- పావుకప్పు, పుదీనా ఆకులు- ఐదు
తయారీ: సబ్జాగింజల్ని పదినిమిషాలు నానబెట్టి నీళ్లు వడకట్టుకోవాలి. మూడుకప్పుల పుచ్చకాయ ముక్కల్లో ఒక కప్పు ముక్కలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిగిలిన పుచ్చకాయ ముక్కలు, జీలకర్ర, నల్లుప్పు, పంచదార వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాసుల్లో పుచ్చకాయ రసం వేసుకుని కొద్దిగా పుచ్చకాయ ముక్కలు, నానబెట్టిన సబ్జాగింజలు, పుదీనా ఆకులు వేసుకుంటే ఈ పానీయం భలే రుచిగా ఉంటుంది.
రూఅఫ్జాతో...
కావాల్సినవి: సబ్జాగింజలు- రెండు చెంచాలు, ఐస్‌క్యూబ్స్- తగినన్ని, చల్లటి నీళ్లు- 2 గ్లాసులు, రూఅఫ్జా సిరప్- 6 చెంచాలు, నిమ్మరసం- 2 చెంచాలు, పుదీనా ఆకులు- ఆరు
తయారీ:సబ్జాగింజల్ని శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ గింజలు వేసి రెండుగంటలపాటు నానబెట్టుకుంటే చక్కగా ఉబ్బుతాయి. ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు, రూఅఫ్జా సిరప్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత.. సబ్జాగింజలు, నిమ్మరసం, పుదీనా ఆకులు, ఐస్‌క్యూబ్స్ వేస్తే రూఅఫ్జా, సబ్జా గింజల పానీయం సిద్ధం. ఎండ నుంచి ఉపశమనంతోపాటు పోషకాలూ అందుతాయి.
రోజ్‌మిల్క్‌తో
కావాల్సినవి: పాలు- అరలీటరు, రూఅఫ్జా- ఆరు చెంచాలు, పంచదార- రెండు చెంచాలు, టూటీఫ్రూటీ- మూడు చెంచాలు, క్యూబ్స్- కప్పు
తయారీ: ఒక గిన్నెలో సబ్జాగింజల్ని శుభ్రం చేసి పదినిమిషాలు నానబెట్టి, నీళ్లు వడకట్టుకోవాలి. మరొక గిన్నెలో పాలు కాచి చల్చార్చి పెట్టుకోవాలి. మిక్సీలో పంచదార, రూఅఫ్జా, ఐస్‌క్యూబ్స్, కాచి చల్లార్చిన పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాసులో ఒక చెంచా రోజ్‌సిరప్, బ్లెండ్ చేసి పెట్టుకున్న రోజ్‌మిల్క్, తగినన్ని సబ్జా గింజలు వేసి కలపాలి. పైన టూటీఫ్రూటీ ముక్కలు వేసుకుంటే రోజ్‌మిల్క్ సిద్ధం.
సబ్జా పాయసం
కావాల్సినవి: జీడిపప్పులు- అరకప్పు, సబ్జా గింజలు- రెండు చెంచాలు, పాలు- రెండు కప్పులు, పంచదార- మూడు చెంచాలు, బాదంపప్పులు- నాలుగు, యాలకులు- రెండు, నెయ్యి- చెంచా, జీడిపప్పు పలుకులు- చెంచా
తయారీ: సబ్జా గింజలని 20 నిమిషాలపాటు నానబెట్టుకుని.. నీళ్లు వడకట్టుకోవాలి. బాదం, జీడిపప్పులు, యాలకులు వీటిని దోరగా వేయించి మిక్సీలో పొడికొట్టుకోవాలి. పాలు మరిగించుకుని అందులో జీడిపప్పు పొడి వేసి ఉండకట్టకుండా బాగా కలుపుకోవాలి. దీనికి పంచదార కలిపి అది కరిగాక, సబ్జా గింజలు వేసుకుని నాలుగు నిమిషాలు ఉడకనిచ్చి, స్టౌ కట్టేయాలి. ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేసి వేడెక్కాక అందులో జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేగాక పాలను వేసుకుని కలిపితే సబ్జా పాయసం సిద్ధం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు