లడ్డూ అంటే రాజస్థానే!

సాయంత్రం పూట అలా ఏ పానీపూరీనో, చాట్‌నో తినడానికి వెళ్తే మనకి ఎక్కువగా పలకరించేవి రాజస్థాన్‌ తోపుడు బళ్లే. నిజానికి రాజస్థాన్‌ స్వచ్ఛమైన నేతితో చేసిన మిఠాయిలకు ప్రసిద్ధి అని తెలుసా? ఘేవర్‌, మావా, ఇమ్మర్తి, దిల్‌కుషార్‌లాంటివి రాజస్థాన్‌ ప్రత్యేకం..

Published : 11 Jun 2023 00:47 IST

సాయంత్రం పూట అలా ఏ పానీపూరీనో, చాట్‌నో తినడానికి వెళ్తే మనకి ఎక్కువగా పలకరించేవి రాజస్థాన్‌ తోపుడు బళ్లే. నిజానికి రాజస్థాన్‌ స్వచ్ఛమైన నేతితో చేసిన మిఠాయిలకు ప్రసిద్ధి అని తెలుసా? ఘేవర్‌, మావా, ఇమ్మర్తి, దిల్‌కుషార్‌లాంటివి రాజస్థాన్‌ ప్రత్యేకం..

ఘేవర్‌: సన్నని చిల్లులతో జల్లెడలా కనిపిస్తుంది. చూడగానే దీన్ని ఎలా చేస్తారా అనిపించేలా ఉంటుంది. రాబోయే తీజ్‌, రక్షాబంధన్ల ప్రత్యేకంగా ఈ ఘేవర్‌ని తయారుచేస్తారు. పైన పాలతో చేసిన రబ్డీ వేస్తే రుచి మహాద్భుతంగా ఉంటుంది. అందుకే ఒకప్పుడు రాజస్థాన్‌కే పరిమితం అయిన ఈ వంటకం ఇప్పుడు దాదాపు అన్ని నగరాల్లోనూ దొరుకుతుంది.

లప్సీ: పాలు, గోధుమలు, నెయ్యి, బెల్లంతో చేసే ఈ వంటకాన్ని పురాతన కాలం నుంచీ దేవతలకి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఆటాలప్సీ, గులాబీలప్సీ, బాదంలప్సీ ఇలా అనేకరకాలుగా వండుతారు. పండగలప్పుడు ప్రముఖంగా కనిపించే వంటకం ఇది. దీపావళినాడు పెసరపప్పుతో చేసిన మూంగ్‌దాల్‌ లప్సీని వండటం స్థానిక ఆచారం. దంచిన మొక్కజొన్నలతో చేసిన జాజరియా లప్సీని ఒకసారి తింటే మరిచిపోలేరట.

పంజీరి: కృష్ణుడికి నైవేద్యంగా వండే ఆయుర్వేద వంటకం ఇది. ఐదు ఔషదాలతో వండే వంటకం కాబట్టి దీనిని పంజీరి అంటారు. ప్రధానంగా శొంఠి, మిరియాలతో చేస్తారు. కృష్ణాష్టమి నాడు దేవకీ, యశోదల కోసం ప్రత్యేకంగా వండుతారట.

మోతీచూర్‌ లడ్డు: లడ్డూల రుచి చూడాలంటే రాజస్థాన్‌లోనే చూడాలి. అవును మనం తినే మోతీచూర్‌లడ్డూ, బేసన్‌ లడ్డూలు అక్కడి నుంచి వచ్చినవే. అవేనా మార్వారి లడ్డూ, మిల్లెట్‌ లడ్డూసహా ఏం తినాలన్నా రాజస్థాన్‌ వెళ్లాల్సిందే.

ఇవేకాదు గుజియా, సూత్రాఫేణి, చుర్మా, గుడ్‌గట్టా, మావాకచోరి, మోహన్‌తార, బూందిలాంటి మనకు తెలియని తీపి మిఠాయిల రుచుల కథలు అక్కడ చాలానే ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని