పూర్ణం సమర్పయామి!

శ్రావణమాసం వచ్చేసింది. పూజలు, పిండివంటలు, బంధుమిత్రుల సందడితో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది కదూ! అందులోనూ ఈసారి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం.

Updated : 27 Aug 2023 12:43 IST

శ్రావణమాసం వచ్చేసింది. పూజలు, పిండివంటలు, బంధుమిత్రుల సందడితో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది కదూ! అందులోనూ ఈసారి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. అమ్మవారికి పాయసం, పులిహోర, గారెల్లాంటి నైవేద్యంతో పాటు కొంచెం ప్రత్యేకంగా ఈ ఐదు రకాల పూర్ణాల్లో మీకు నచ్చినవి ప్రయత్నించండి.. దేవీ అనుగ్రహం పొందండి..

అలసందల పూర్ణం

కావలసినవి: మినపగుండ్లు, అలసందలు, బెల్లం - 1 కప్పు చొప్పున, బియ్యం - ఒకటిన్నర కప్పు, పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు, యాలకుల పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె
తయారీ: బియ్యం, మినపగుండ్లు నాలుగు గంటల పాటు నానబెట్టి రుబ్బాలి. ఉప్పు వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలసందలు కూడా నాలుగు గంటలు నానబెట్టి 2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్‌లో నాలుగు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. నీళ్లుంటే తీసేసి బెల్లం తురుము వేసి గ్రైండ్‌ చేయాలి. అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో నెయ్యివేసి బెల్లం, అలసందల మిశ్రమాన్ని చిన్నమంట మీద ఉండ కట్టకుండా ఉడికించాలి. నాలుగు నిమిషాల తర్వాత పచ్చికొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి గట్టిపడిన తర్వాత దించాలి. చల్లారాక చిన్న ఉండలుగా చేసి పిండిలో ముంచి, మంచి రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.


పెసరపప్పు పూర్ణం

కావలసినవి: పెసరపప్పు, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, మినపగుండ్లు - ఒక కప్పు చొప్పున, బియ్యం - ఒకటిన్నర కప్పు, ఉప్పు - చిటికెడు, యాలకుల పొడి - కొద్దిగా, నెయ్యి - చెంచా, నూనె
తయారీ: ముందుగా బియ్యం, మినపగుండ్లు నాలుగు గంటలు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పెట్టుకోవాలి. నానబెట్టిన పెసర పప్పును కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఇడ్లీల్లా వేసి ఆవిరి మీద ఉడికించాలి. కుక్కర్‌ చల్లారాక ఇడ్లీలు తీసి మెదపాలి. బెల్లంలో కప్పు నీరు పోసి తీగ పాకం పట్టుకోవాలి. మెత్తగా చేసుకున్న పెసర ఇడ్లీ పిండిని పాకంలో వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి కూడా వేసి పూర్ణంపిండి గట్టిపడిన తర్వాత దించాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి, పిండిలో ముంచి కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.


బజ్జీ పూర్ణం

కావలసినవి: శనగపిండి - 2 కప్పులు, బియ్యప్పిండి - పావుకప్పు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి - చెంచా చొప్పున, కొత్తిమీర - కొద్దిగా, శనగపప్పు, బెల్లం - 1 కప్పు చొప్పున, యాలకుల పొడి - చిటికెడు, కరివేపాకు - 2 రెబ్బలు, నూనె.
తయారీ: శనగపిండిలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చిన్నగా తరిగిన కరివేపాకు వేసి, బజ్జీ పిండిలా కలపాలి. శనగపప్పులో రెండు కప్పుల నీళ్లు పోసి గంట నానబెట్టి, కుక్కర్‌లో 4 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. నీరు వడబోసి పప్పును విడిగా తీసుకోవాలి. చల్లారాక కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్‌ చేయాలి. అదే కుక్కర్‌లో పప్పులో బెల్లం వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ఇందులో యాలకుల పొడి వేసి గట్టిపడుతున్నప్పుడు నెయ్యి వేసి దించాలి. చల్లారాక ఉండలుగా చుట్టి, బజ్జీపిండిలో ముంచి వేయించాలి.


శనగపప్పు పూర్ణం

కావలసినవి: శనగపప్పు, మినపగుండ్లు, బెల్లం - 1 కప్పు చొప్పున, బియ్యం - ఒకటింబావు కప్పు, ఉప్పు - తగినంత, నెయ్యి - చెంచా, యాలకుల పొడి - చిటికెడు, నూనె - వేగడానికి సరిపడా
తయారీ: మినపగుండ్లు, బియ్యం, శనగపప్పులను విడివిడిగా నానబెట్టాలి. 4 గంటల తర్వాత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి 2 గంటలు పక్కన ఉంచాలి.
శనగపప్పును కుక్కర్‌లో 4 విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించి, నీరు వడకట్టాలి. చల్లారాక పప్పు గుత్తితో మెదపాలి లేదా మిక్సీలో బరకగా వచ్చేట్టు గ్రైండ్‌ చేసుకోవాలి. అదే కుక్కర్‌లో పప్పుతో పాటు బెల్లం వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. ఇందులో యాలకుల పొడి వేసి, పిండి గట్టి పడుతున్నప్పుడు నెయ్యి వేసి దించాలి. చల్లారాక మనకు కావలసిన సైజులో ఉండలు చుట్టి, తయారుచేసుకున్న పిండిలో ముంచి కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.


కేసరి పూర్ణం

కావలసినవి: మినపగుండ్లు, బొంబాయి రవ్వ, బెల్లం - 1 కప్పు చొప్పున, బియ్యం - ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి - చిటికెడు, పచ్చ కర్పూరం - కొద్దిగా, ఉప్పు, నూనె
తయారీ: నాలుగు గంటల పాటు బియ్యం, మినపగుండ్లు నానబెట్టి రుబ్బి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి ఉప్మా రవ్వను సన్న సెగ మీద కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. బెల్లం కరిగించి వడపోసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో 2 కప్పుల నీళ్లు పోసి మరుగుతున్నప్పుడు వేయించిన ఉప్మా రవ్వ, కరిగించిన బెల్లం వేసి చిన్న మంట మీద ఉడికించాలి. రవ్వ దగ్గరపడ్డాక యాలకుల పొడి, పచ్చకర్పూరం, నెయ్యి వేసి దించాలి. రవ్వ కేసరి చల్లబడ్డాక చిన్న ఉండలుగా చేసుకొని పిండిలో ముంచి బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.

కల్యాణి శాస్త్రుల, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని