దీపావళి వేళ పిండివంటల మేళా

మన పండుగలన్నీ ఆహ్లాదాన్ని పంచేవే. ముఖ్యంగా దీపావళి మరీ మరీ ప్రత్యేకమైంది. ఆకాశంలో చుక్కలు.. నేల మీద రాలినట్లు.. దీపాలు వెలుగులు చిందిస్తుంటే.. అంతులేని ఆనందానికి సంకేతంగా టపాసుల మోత హోరెత్తిస్తుంది

Published : 12 Nov 2023 01:46 IST

మన పండుగలన్నీ ఆహ్లాదాన్ని పంచేవే. ముఖ్యంగా దీపావళి మరీ మరీ ప్రత్యేకమైంది. ఆకాశంలో చుక్కలు.. నేల మీద రాలినట్లు.. దీపాలు వెలుగులు చిందిస్తుంటే.. అంతులేని ఆనందానికి సంకేతంగా టపాసుల మోత హోరెత్తిస్తుంది. ఆ సందడికి ఈ వంటల ఘుమాయింపులు తోడైతే.. ఇక చెప్పేదేముంది.. సంతోషాల వెల్లువే!


పైనాపిల్‌ రైస్చ్‌

కావలసినవి: బియ్యం - 4 కప్పులు, సోయా సాస్‌ - 3 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాల పొడి - చెంచా చొప్పున, శొంఠి పొడి - అర చెంచా, లవంగాలు - 6, యాలకులు - 2, దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క, బిర్యానీ ఆకులు - 2, పచ్చిమిర్చి - 4, పచ్చి బఠాణీలు - కప్పు, బీన్స్‌, టొమాటో, క్యారెట్‌, బంగాళదుంప ముక్కలు - అర కప్పు చొప్పున, అనాస ముక్కలు - ఒకటిన్నర కప్పు, జీడిపప్పు - అర కప్పు, నిమ్మరసం - చెంచా, పుదీనా, కొత్తిమీర తరుగు - చారెడు చొప్పున, అల్లం - అంగుళం సైజు ముక్క, నెయ్యి - 3 చెంచాలు, ఉప్పు - తగినంత
తయారీ: కూరగాయలు కడిగి ముక్కలుగా కోసుకోవాలి. కుక్కర్‌లో నెయ్యి వేసి.. యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాల పొడి, శొంఠి పొడి, అల్లం-మిర్చి ముద్ద, బిర్యానీ ఆకులు, జీడిపప్పు, పుదీనా, బఠాణీలు, కూరగాయల ముక్కలు, అనాస ముక్కలు.. ఒక్కొక్కటిగా వేయాలి. అవి వేగాక.. 8 కప్పుల నీళ్లు, కడిగిన బియ్యం, ఉప్పు వేసి మూత పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చిన తర్వాత దించేసి.. నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేస్తే సరిపోతుంది.  


చమ్‌ చమ్‌ మీఠా

కావలసినవి: చిక్కటి పాలు - 5 కప్పులు, చమ్‌ చమ్‌ మీఠావి
ుల్క్‌ పౌడర్‌ - అర కప్పు, కొబ్బరి తురుము - అర కప్పు, మైదా పిండి - పావు కప్పు, పంచదార - ఒకటిన్నర కప్పు, నెయ్యి, కుంకుమపువ్వు పాలు, నిమ్మరసం - 2 చెంచాలు చొప్పున, పంచదార పొడి - టేబుల్‌ స్పూన్‌, టూటీ ఫ్రూటీ - పావు కప్పు, యాలకుల పొడి - అర చెంచా
తయారీ: అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో పాలను మరిగించి నిమ్మరసం వేయాలి. విరిగిన పాలను పల్చని వస్త్రంతో వడకట్టాలి. నీళ్లు తీసేసి పక్కనుంచాలి. అరగంట తర్వాత అందులో మైదా పిండి వేసి బాగా కలపాలి. దాన్ని చిన్న ఉండలుగా తీసుకుని కోలగా వచ్చేట్లు ఒత్తుకోవాలి. మరో పాత్రలో పంచదార పాకం పట్టాలి. అందులో యాలకుల పొడి వేసి.. సన్న సెగ మీద ఉంచాలి. అందులో చమ్‌ చమ్‌లు వేసి.. మూత పెట్టి పావుగంట ఉడికించాలి. కడాయిలో నెయ్యి, పావు కప్పు పాలు, పాల పొడి వేసి తిప్పాలి. కొంచెం గట్టిగా అయ్యాక కుంకుమపువ్వు పాలు, పంచదార పొడి వేసి కలియ తిప్పుతూ ముద్దలా అయ్యాక దించేయాలి. చల్లగా అయ్యాక చమ్‌ చమ్‌లను ఒక్కొక్కటీ తీసుకుని, మధ్యలో కోసినట్లు చేసి- అందులో ఈ మిశ్రమాన్ని ఉంచి, సమంగా సర్దాలి. వాటిని కొబ్బరి తురుములో రోల్‌ చేసి, టూటీ ఫ్రూటీ పలుకులు అద్దితే సరి.. చక్కటి చమ్‌ చమ్‌ మీఠా తయార్‌.


నిప్పట్టు

 

కావలసినవి: పల్లీలు, శనగపప్పు - అర కప్పు చొప్పున, బియ్యప్పిండి - 2 కప్పులు, మైదాపిండి - అర కప్పు, ఉప్మా రవ్వ - పావు కప్పు, వేడి నూనె - 3 టేబుల్‌ స్పూన్లు, కారం, ఉప్పు, జీలకర్ర - చెంచా చొప్పున, నువ్వులు - 2 చెంచాలు, కరివేపాకు - 2 రెబ్బలు, ఇంగువ - చిటికెడు, నూనె - తగినంత
తయారీ: ముందుగా పల్లీలు, శనగ పప్పులను వేయించి.. చల్లారాక కచ్చాపచ్చా దంచుకోవాలి. ఆ పొడిని ఒక పెద్ద పాత్రలోకి తీసుకుని.. బియ్యప్పిండి, మైదాపిండి, రవ్వ, కొన్ని నీళ్లు, కారం, నువ్వులు, జీలకర్ర, తుంచిన కరివేపాకు, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత వేడి నూనె వేసి మళ్లీ కలపాలి. మెత్తగా, చేతికి అంటుకోకుండా తయారైన మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని.. పాలిథిన్‌ పేపరు మీద ఒత్తుకోవాలి. అన్నీ ఒకే మందంలో, సైజులో ఉండేలా చూడాలి. నూనె కాగిన తర్వాత.. నిప్పట్లను రెండు వైపులా బంగారు రంగు వచ్చేదాకా వేయించాలి.


రోజ్‌ కోకోనట్‌ బర్ఫీ

కావలసినవి: కొబ్బరి తురుము - 3 కప్పులు, పంచదార - 2 కప్పులు, పాలు - అర కప్పు, పాలపొడి - అర కప్పు, రోజ్‌ సిరప్‌ - పావు కప్పు, నెయ్యి 2 చెంచాలు, యాలకుల పొడి - అర చెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు - చారెడు
తయారీ: కొబ్బరి తురుమును ఒక పాత్రలోకి తీసుకుని పాలు, రోజ్‌ సిరప్‌లు వేసి బాగా కలపాలి. చివర్లో నెయ్యి, యాలకుల పొడి వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పü˘్లంలో వేసి సమంగా సర్ది, డ్రైఫ్రూట్స్‌ పలుకులు చల్లాలి. కొంచెం అదిమినట్లు చేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ఓ అరగంట తర్వాత ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఇలా సులువుగా తయారైపోతుందన్నమాట రోజ్‌ కోకోనట్‌ బర్ఫీ.


సందేశ్‌

కావలసినవి: చిక్కటి పాలు - 2 లీటర్లు, పంచదార పొడి - అర కప్పు, నిమ్మరసం - 2 చెంచాలు, యాలకుల పొడి - అర చెంచా, టూటీ ఫ్రూటీ - పావు కప్పు, బాదం, పిస్తా పలుకులు - చారెడు చొప్పున, ఫుడ్‌ కలర్‌ - నచ్చిన రంగు
తయారీ: ముందుగా పాలను మరిగించి, అందులో నిమ్మరసం వేయాలి. విరిగిన పాలను వడకట్టాలి. కొన్ని చల్లటి నీళ్లు పోసి ఇంకోసారి వడకడితే.. పనీర్‌ మరింత మెత్తగా అవడమే కాకుండా.. నిమ్మ వాసన కూడా పోతుంది. అరగంట తర్వాత ఇంకోసారి కలపాలి. లేదంటే బాల్స్‌ చేయడం కష్టమవుతుంది. అందులో పంచదార పొడి, యాలకుల పొడి, ఫుడ్‌ కలర్‌ వేసి.. కడాయిలో కలియ తిప్పుతూ వేయించి, దించేయాలి. మిశ్రమం చల్లారాక.. చిన్న ఉండలుగా తీసుకుని.. సందేశ్‌లు చేసుకోవాలి. పిండిని పైన కొంచెం లోనికి నొక్కి.. టూటీ ఫ్రూటీ, బాదం, పిస్తా పలుకులు అద్దితే సరి.. నోరూరించే సందేశ్‌లు సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని