భాయి.. మిఠాయి..

అన్నా చెల్లెలు.. అక్కా తమ్ముడు.. ఎంత అందమైన అనుబంధం కదూ! ఊహ తెలిసింది మొదలు ఆటపాటలతో, అల్లరి చేష్టలతో, కబుర్లూ కాలక్షేపాలతో గడిచిపోతుంది.

Updated : 27 Aug 2023 06:09 IST

(ఆగస్టు 30 రాఖీ పౌర్ణమి)

అన్నా చెల్లెలు.. అక్కా తమ్ముడు.. ఎంత అందమైన అనుబంధం కదూ! ఊహ తెలిసింది మొదలు ఆటపాటలతో, అల్లరి చేష్టలతో, కబుర్లూ కాలక్షేపాలతో గడిచిపోతుంది. పెళ్లిళ్లయ్యి ఎవరి దారిన వారెళ్లినా.. ఆ ప్రేమ అంతే తియ్యందనం పంచుతుంది. కొండంత ఆలంబన అందిస్తుంది. రాఖీ వేళ మీకిష్టమైన సోదరుల కోసం ఈ మధుర మిఠాయిలు..


మటర్‌ బర్ఫీ

కావలసినవి.. పచ్చి బఠాణీలు - పావుకిలో, పాలపొడి, జీడిపప్పు పొడి, ఎండుకొబ్బరి పొడి - కప్పు చొప్పున, పంచదార - 2 కప్పులు, నెయ్యి - అరకప్పు, బాదం పలుకులు - చెంచా తయారీ.. పచ్చి బఠాణీలను ఉడికించి.. చల్లారాక నీళ్లు తీసేసి గ్రైండ్‌ చేయాలి. ఒక పాత్రలో నెయ్యి వేసి బఠాణీ గుజ్జును వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో పంచదార తీగ పాకం తయారుచేసి.. అందులో వేయించిన బఠాణీ పేస్టు వేసి, సన్న సెగ మీద ఉడికిస్తూ తర్వాత పాలపొడి వేయాలి. ఉండ కట్టకుండా కలియ తిప్పుతుండాలి. దగ్గరపడిన తర్వాత ఎండుకొబ్బరి పొడి, జీడిపప్పు పొడి వేయాలి. పాత్రకు అంటుకోకుండా ఉన్నప్పుడు దించేయాలి. పళ్లెంలో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని సమంగా సర్ది, పైన బాదం పలుకులు వేయాలి. చల్లారాక ముక్కలుగా చేసుకోవడమే.


కాజు కలశ్‌

కావలసినవి.. జీడిపప్పు - 2 కప్పులు, పంచదార - కప్పు, కుంకుమ పువ్వు - కొద్దిగా,  నెయ్యి - అరకప్పు తయారీ.. జీడిపప్పును గ్రైండ్‌ చేసి పక్కన ఉంచుకోవాలి. కొన్ని నీళ్లు పోసి పంచదారను తీగ పాకం పట్టాలి. అందులో జీడిపప్పు పొడి వేసి కలియతిప్పుతూ సన్న సెగ మీద గట్టిపడేలా చేసి, చివర్లో కుంకుమ పువ్వు వేయాలి. స్టవ్వు కట్టేసి చల్లారాక మిశ్రమం మరింత మృదువుగా అయ్యేట్లు కలపాలి. చిన్న ఉండలుగా చేసి, ఒక్కో దాన్నీ కలశంలా చేయాలి. పిండి ఎండినట్లయితే కొద్దిగా నెయ్యి జోడించవచ్చు. కలశం మధ్యలో బాదంపప్పు, పిస్తాలు అలంకరిస్తే రుచితో పాటు అద్వితీయమైన అందం వస్తుంది. పూజలు, వేడుకల్లాంటి సందర్భాల్లో ఈ కలశాకృతి మిఠాయి ప్రత్యేకంగా ఉంటుంది.


కోకోనట్‌ బర్ఫీ

కావలసినవి.. కొబ్బరికోరు - 3 కప్పులు, పంచదార - 2 కప్పులు, పాలు - అరకప్పు, మలై క్రీమ్‌ - 2 చెంచాలు, యాలకుల పొడి - పావు చెంచా, డ్రై ఫ్రూట్స్‌ పలుకులు - కొద్దిగా తయారీ.. కొబ్బరికోరు, పాలు, పంచదారలను అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో వేసి కలియ తిప్పుతూ సన్న సెగ మీద ఉడికించాలి. దగ్గరపడ్డాక మలై క్రీమ్‌ వేయాలి. పాత్రకు అతుక్కోకుండా ఉందంటే చక్కగా తయారైనట్లు. అప్పుడు యాలకుల పొడి వేసి, అర నిమిషం ఉంచి దించేయాలి. ఒక ట్రేలో నెయ్యి రాసి మిశ్రమాన్ని సమంగా పరిచినట్లు సర్దాలి. పదినిమిషాల తర్వాత  డ్రై ఫ్రూట్స్‌ పలుకులు పైన అద్ది, నచ్చిన ఆకృతిలో ముక్కలుగా చేసుకోవాలి. కేవలం అరగంటలో తయారయ్యే ఈ కోకోనట్‌ బర్ఫీ అద్భుత రుచితో ఆకట్టుకుంటుంది.


బాదం పేడా

కావలసినవి.. బాదంపప్పు - రెండు కప్పులు, పంచదార - కప్పు, పాలపొడి, నెయ్యి - అరకప్పు చొప్పున, కుంకుమ పువ్వు - కొద్దిగా తయారీ.. బాదంపప్పు రెండు నిమిషాలు ఉడికించాలి. పొట్టు తీసి మిక్సీ జార్‌లో వేసి, అరకప్పు పంచదార, రెండు చెంచాల నీళ్లు, కుంకుమ పువ్వు జతచేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో వేసి అరకప్పు పాల పొడి, చెంచా నెయ్యి వేసి కలియతిప్పుతూ దగ్గరపడేలా చేయాలి. చల్లారాక.. చిన్న ఉండలుగా తీసుకుని పేడాల్లా చేయాలి. వాటి మధ్యలో బాదంపప్పు అలంకరిస్తే సరి.. మధురమైన బాదం పేడా రెడీ.


డ్రై ఫ్రూట్స్‌ మోదక్‌

కావలసినవి.. అంజీర - 10, గింజలు లేని ఖర్జూరపండ్లు - 20, బాదంపప్పు - కప్పు, వాల్‌నట్స్‌, పల్లీలు, ఎండు కొబ్బరికోరు - పావుకప్పు చొప్పున,  జీడిపప్పు - 15, పిస్తా - పది, నువ్వులు, గసగసాలు - చెంచా చొప్పున, నెయ్యి - తగినంత, యాలకుల పొడి - పావు చెంచా తయారీ.. అంజీర, ఖర్జూర పండ్లను రెండు గంటలు నానబెట్టాలి. బాదంపప్పు, పిస్తా, వాల్‌నట్స్‌, పల్లీలు, జీడిపప్పులను కచ్చాపచ్చా దంచి కడాయిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు, గసగసాలు వేయించి అవి కాస్త వేగాక, ఎండు కొబ్బరికోరు వేసి వేయించాలి. నానబెట్టిన డ్రైఫ్రూట్స్ర్‌ను గ్రైండ్‌ చేసి, నేతిలో వేయించాలి. అందులో తక్కినవి వేసి సన్నసెగ మీద కలియ తిప్పుతూ నాలుగు నిమిషాలు ఉంచాలి. చివర్లో యాలకుల పొడి వేసి దించేయాలి. మోదకాలు చేసే అచ్చులో (మౌల్డ్‌) నెయ్యి రాసి ఈ మిశ్రమం ఉంచి నొక్కి తీస్తే సరి.. నోరూరించే డ్రై ఫ్రూట్స్‌ మోదక్‌లు సిద్ధం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని