నూనె పీల్చని జొన్న మురుకులు

మురుకులు ఎంతో మంది ఎన్నోరకాలుగా చేస్తారు. బియ్యప్పిండి, మినప్పిండి, పెసర పిండి.. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. వేటికవే బాగుంటాయి.

Updated : 12 Nov 2023 04:02 IST

మురుకులు ఎంతో మంది ఎన్నోరకాలుగా చేస్తారు. బియ్యప్పిండి, మినప్పిండి, పెసర పిండి.. ఇలా చాలా వెరైటీలు ఉన్నాయి. వేటికవే బాగుంటాయి. జొన్నపిండి ఇంకా మంచిది కదా అని.. నేనలా ప్రయత్నించి చూశాను. చక్కగా కుదిరాయి. చాలా సులువు కూడా. ఎలా చేయాలంటే.. జొన్న పిండిలో నువ్వులు, వేరుశనగ పొడి, వాము, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, రెండు చెంచాల వెన్న వేసి.. కొన్ని నీళ్లతో పిండి కలిపి.. కాగుతున్న నూనెలో మురుకులు ఒత్తుకోవాలి. ఇవి రుచిగానూ ఉంటాయి, నూనె కూడా ఎక్కువ పీల్చవు. మూడు కప్పుల జొన్నపిండికి- అర కప్పు నువ్వులు, ఒక కప్పు వేరుశనగ గుళ్లు, ఒక టేబుల్‌ స్పూన్‌ వాము, మూడు పచ్చిమిర్చి అవసరమౌతాయి. వేరుశనగ గుళ్లను వేయించి పొట్టు తీసి, గ్రైండ్‌ చేయాలి. పిల్లలు చిప్స్‌ లాంటి స్నాక్స్‌ తింటే.. వాటిల్లో ఉండే ప్రిజర్వేటివ్స్‌ వల్ల జబ్బులపాలవుతారు. ఇలాంటి చిరుతిళ్లు పెడితే ఆరోగ్యంగా, పుష్టిగా ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారికి ఇవెంతో ఉపశమనం కలిగిస్తాయి. మా పిల్లలూ, మనవరాళ్లే కాదు.. వాళ్ల స్నేహితులు కూడా నేను చేసే ఇలాంటి చిరుతిళ్లు ఇంకా కావాలంటూ ఇష్టంగా తింటుంటే.. నేను కూడా సంతోషంగా మళ్లీ మళ్లీ చేస్తుంటాను. ఈ జొన్న మురుకులు మీరూ ఒకసారి చేసి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని