పండుగ వేళ ప్రత్యేక విందు

సంక్రాంతి మనందరికీ ఇష్టమైన పండుగ. స్కూళ్లకు సెలవులిస్తారు కనుక.. పిల్లలకు మరీ సంబరం. కొత్త బియ్యంతో అరిసెలు, పాయసం ఎటూ చేస్తారనుకోండి.. వాటికి ఈ ప్రత్యేక వంటలు జోడించారంటే చిన్నారుల ఆనందానికి మాటలుండవ్.

Updated : 14 Jan 2024 04:09 IST

 

సంక్రాంతి మనందరికీ ఇష్టమైన పండుగ. స్కూళ్లకు సెలవులిస్తారు కనుక.. పిల్లలకు మరీ సంబరం. కొత్త బియ్యంతో అరిసెలు, పాయసం ఎటూ చేస్తారనుకోండి.. వాటికి ఈ ప్రత్యేక వంటలు జోడించారంటే చిన్నారుల ఆనందానికి మాటలుండవ్.


 గుమ్మడికాయ పుడ్డింగ్‌

కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు - 4 కప్పులు, నెయ్యి - 4 టేబుల్‌ స్పూన్లు, చిక్కటి పాలు, పంచదార - ముప్పావు కప్పు చొప్పున, యాలకుల పొడి - పావు చెంచా, కుంకుమ పువ్వు - కొద్దిగా, బాదం, పిస్తా, కిస్‌మిస్‌, జీడిపప్పులు - అన్నీ కలిపి అర కప్పు
తయారీ: బాదం, పిస్తా, కిస్‌మిస్‌, జీడిపప్పులను నేతిలో వేయించి పక్కన ఉంచాలి. అడుగు భాగం మందంగా ఉన్న గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి, గుమ్మడికాయ ముక్కలను మూడు నిమిషాలు వేయించాలి. పచ్చి వాసన పోయాక.. పాలు పోసి ఉడికించాలి. ఆరేడు నిమిషాల తర్వాత ముక్కలను పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. అందులో పంచదార వేసి, రెండు నిమిషాల పాటు కలియ తిప్పుతూనే ఉండాలి. దగ్గరగా అయ్యాక మిగిలిన నెయ్యి, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్‌, కుంకుమ పువ్వు వేసి ఇంకో నిమిషం ఉంచి, దించేయాలి. అంతే.. రుచికరమైన గుమ్మడికాయ పుడ్డింగ్‌ రెడీ. దీన్ని ‘గిల్‌ ఎ ఫిర్‌దౌస్‌’ అని కూడా అంటారు. అంటే స్వర్గంలో చిన్న తునక అని అర్థం. బాగుంది కదూ!


బెల్లం గారెలు

కావలసినవి: మినప్పప్పు - పావు కిలో, బెల్లం - అర కప్పు, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: మినప్పప్పును ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయం నీళ్లు తీసేసి తగినంత ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాత్రలో కొన్ని నీళ్లు, బెల్లం వేసి చిక్కటి పాకం తయారు చేయాలి. రుబ్బిన పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని, గారెలు చేసి.. కాగుతున్న నూనెలో వేయించాలి. బంగారు రంగులోకి మారగానే తీసి, బెల్లం పాకంలో వేయాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. తీపి ఇష్టపడేవారికి ఈ తియ్యటి గారెలు చాలా నచ్చుతాయి.


చనా ఓట్స్‌ ఫలాఫెల్‌

కావలసినవి: కాబూలీ శనగలు - ఒక కప్పు, ఓట్స్‌ - కప్పున్నర, మైదాపిండి - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం ముద్ద - చెంచా, మిరియాల పొడి, జీలకర్ర పొడి - అర చెంచా చొప్పున, కొత్తిమీర తరుగు - చారెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించేందుకు సరిపడా
తయారీ: శనగలు ముందు రాత్రి నానబెట్టి, మర్నాడు ఉదయం మెత్తగా ఉడికించాలి. చల్లారాక ఫుడ్‌ ప్రాసెసర్‌లో వేసి.. ఓట్స్‌, మైదాపిండి, అల్లం ముద్ద, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బ్లెండ్‌ చేయాలి. ఈ మిశ్రమంతో చిన్న ఉండలు చేసి.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చేవరకూ వేయిస్తే సరిపోతుంది. నోరూరించే చనా ఓట్స్‌ ఫలాఫెల్‌ సిద్ధం. ఇవి పల్లీ లేదా పుదీనా పచ్చడితో మరింత రుచిగా ఉంటాయి.


హరాభరా కబాబ్‌

కావలసినవి: శనగపిండి - పావు కప్పు, బంగాళదుంపలు - మూడు, బచ్చలి తరుగు - రెండు కప్పులు, పచ్చి బఠాణీలు - అర కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - అంగుళం ముక్క, ఛాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ పౌడర్‌ - చెంచా చొప్పున, గరం మసాలా - పావు చెంచా, నూనె, ఉప్పు - తగినంత, జీడిపప్పు - చారెడు
తయారీ: కడిగిన బచ్చలికూరను రెండు నిమిషాలు వేడి నీళ్లలో ఉంచి, తీసి చల్లటి నీళ్లలో వేయాలి. నిమిషం తర్వాత నీళ్లు వడకట్టేసి.. సన్నగా తరిగి పక్కనుంచాలి. శనగపిండిని తక్కువ సెగ మీద కాస్త వేయించి.. మంచి వాసన రాగానే దించేయాలి. బంగాళదుంపలు, పచ్చి బఠాణీలను ఉడికించు కోవాలి. అల్లం, పచ్చిమిర్చిలను కచ్చాపచ్చా దంచాలి. ఒక పాత్రలో బచ్చలి తరుగు, పొట్టు తీసిన బంగాళదుంపలు, ఉడికించిన బఠాణీలు, అల్లం మిర్చి ముద్ద వేసి పప్పుగుత్తితో మెదపాలి. అందులో శనగపిండి, ఛాట్‌ మసాలా, ఆమ్‌చూర్‌ పౌడర్‌, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో వడల్లా చేసి, ఒక్కో దాని మీద జీడిపప్పులు గుచ్చినట్లుగా పెట్టాలి. పెనం మీద కాస్త నూనె వేసి వీటిని వేయించాలి. అంతే.. ఘుమఘుమలాడే హరాభరా కబాబ్‌ రెడీ.


అప్రికాట్‌ హల్వా

కావలసినవి: డ్రై అప్రికాట్స్‌ - 30, పంచదార - 3 చెంచాలు, బాదం, పిస్తా పలుకులు - చారెడు, నెయ్యి - 2 చెంచాలు, కుంకుమ పువ్వు - కొద్దిగా
తయారీ: డ్రై అప్రికాట్స్‌ను కడిగి రెండున్నర కప్పుల నీళ్లలో నానబెట్టాలి. ఐదు గంటల తర్వాత వాటిని నీళ్లలోంచి తీసి, చేత్తో మెదుపుతూ గింజలు వేరుచేయాలి. వాటిని తిరిగి అదే నీళ్లలో వేసి, సన్న సెగ మీద సుమారుగా అరగంట ఉడికించాలి. మధ్యమధ్యలో కలియ తిప్పుతుండాలి. అందులో పంచదార వేసి ఇంకో ఐదారు నిమిషాలు ఉడికించాలి. అప్రికాట్స్‌ గింజలను పగలకొట్టి.. ఆ పప్పులు, బాదం, పిస్తా పలుకులు, కుంకుమ పువ్వు, నెయ్యి వేసి.. ఒక నిమిషం ఉంచి దించేస్తే సరిపోతుంది. తక్కువ పదార్థాలతో తేలిగ్గా తయారయ్యే తియ్యటి అప్రికాట్‌ హల్వా తిని ఆనందించడమే తరువాయి. ఇది ఖుబానీ హల్వాగానూ ప్రసిద్ధమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని